31.12.2012 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మన అందరికి కూడా శ్రీ సాయినాధులవారు ఆయురారోగ్య సుఖసంపత్తులను ఇవ్వమని కోరుకుంటూ, ఈ రోజు శ్రీ సాయితో మధురక్షణాలు 12వ.భాగం అందిస్తున్నాను. 15 రోజులుగా వీలు కుదరక, లాప్ టాప్ కూడా లేకపోవడంతో ప్రచురణకు చాలా ఆలస్యం కలిగింది.
ఇక చదవండి .........
శ్రీసాయితో మధుర క్షణాలు - 12
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి -1వ.భాగం
భారత దేశమంతటే కాక ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రదేశాలలో కూడా "ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి" అనే నామం వ్యాప్తి చెందడానికి కారకులు సాయి భక్తులయిన శ్రీ దూబగుంట శంకరయ్యగారు. బాబాతో ఆయనకు అసంఖ్యాకమయిన అనుభవాలున్నాయి. వీటిలో చాలా అనుభవాలను శంకరయ్యగారు తనే స్వయంగా రాశారు. సాయి లీల పత్రికతో సహా ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఒక మాధ్యమం ద్వారా సాయిబాబా యొక్క ఉనికి తెలియడం ఒక అంతుపట్టని విషయం. కాని, సాయే స్వయంగా ఎదురయినప్పుడు, జరిగిన సంఘటన మీద సందేహం కలుగుతుంది.ఒక సంతోషకరమైన అనుభవం కలిగినపుడు భగవంతుడు సృష్టించిన మాయ తొలగిపోతేనే గాని, ఎవరూ స్పృహలోకి రారు. సాయినాధులవారు భక్తుల కోర్కెలని, లక్ష్యాలని సద్గుణాలని ముందుగానే గ్రహించగలరు.ఎవరయితే ఆయన సహాయాన్ని కోరతారో వారి యందు ఆయన యొక్క ప్రేమ ఆసాధారణంగాను, ఉత్తమంగాను ఉంటుంది.
శంకరయ్యగారు తన జీవితంలో జరిగిన మహత్తరయిన సంఘటనని ఎంతో ఆనందంతో గుర్తుకు తెచ్చుకొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో బాబా ఫొటో పెట్టడానికి ఒక వినతి ప్రత్రం రైల్వే అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆవిషయం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకొనేందుకు, విజయవాడకు చెందిన శ్రీ ఎం.ఎల్.ఎన్.ప్రసాద్ గారితో కలిసి ఆయన 1985 వ.సంవత్సరం ఆగస్టులో సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. అప్పట్లో విజయవాడ స్టెల్లా కాలేజీ దగ్గరలో ఉన్న సాయిమందిర్ లో అఖండ సాయినామ సప్తాహం (49 రోజులపాటు నిరంతరాయంగా సాయినామ జపం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జరిగింది. దానిలో శ్రీప్రసాద్ గారు చాలా చురుకుగా పాల్గొంటున్నారు.
దీని గురంచి చర్చ జరుగుతున్నపుడు కార్యక్రమ నిర్వాహకుల మీద కొంతమంది సాయి భక్తులు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని శ్రీ ప్రసాద్ గారు చర్చించారు. (కార్యక్రమ నిర్వాహకులలో శ్రీ శంకరయ్యగారు కూడా ఒకరు)
ఇటువంటి అస్పష్టమయిన భావన కల్గిన సంఘటనలకు కూడా నిజాయితీపరుడయిన వ్యక్తి హృదయం బాగా గాయపడుతుంది. శ్రీ శంకరయ్యగారి లక్ష్యం సాయి నామాన్ని నలుదిశలా వ్యాపింపచేసి అందరిలోను భక్తిని పెంపొందించడం. అటువంటి అపవాదుకు ఆయన కొంచెం వెనుకకు తగ్గారు. ఈ నామ జప కార్యక్రమానికి సుముఖంగా లేనివారితో తిరగవద్దని శ్రీ ప్రసాద్ గారు శంకరయ్యగారికి సలహా యిచ్చారు. ఈ విధమైన ధోరణి ఇటువంటి కార్యక్రమ ఉద్దేశ్యం మీద కూడా సందేహాలను రేకెత్తించింది. ఇదంతా విన్న తరువాత శ్రీశంకరయ్య గారు చాలా అశాంతికి గురయ్యి రైలు క్రింద పడి ఆత్మ హత్య చేసుకుందామనుకున్నారు. వికలమైన మనసుతో ఆయన సికిందరాబాదులోని ఆల్ఫా హోటల్ ప్రాంతంలో తిరుగుతూ, తన ఆఫీసుకు వెళ్ళడానికై తన కంపెనీ బస్సు కోసం (బాలానగర్ - ఐడీపీఎల్) ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనలన్ని ఇంకా శ్రీప్రసాద్ తో జరిగిన సంభాషణల మీదే తిరుగుతున్నాయి. మనుషులు యిటువంటి అసత్యమైన పుకార్లని ఎట్లా పుట్టిస్తారోననీ, అలాంటివి జరుగుతుంటే బాబా ఎలా అనుమతిస్తున్నారోననీ ఆలోచిస్తున్నారు. బాబాకు సర్వం తెలుసు. కాని తన భక్తునియొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరయితే చిత్త శుధ్ధితో ఆయన సహాయం కోరతారో వారికి బాబా సహాయం లభిస్తుంది.
శ్రీ శంకరయ్య మనసు దేనిగురించీ ఆలోచించని స్థితిలో ఉంది, కాని ఆ వ్యాఖ్యలని ఆయన అవమానకరంగా భావించారు. ఎవరయినా మనకు చేసిన చిన్న అపకారం అది మనలని బాధించినపుడు, ఎప్పుడొ ఒకప్పుడు వారు పశ్చాత్తాపం చెందుతారు. అది ఒక్కొక్కసారి మన మంచికే జరిగి అంతమవుతుంది. ఇక్కడ జరిగిన సహాయం ఎంతో విలువైనదీ, వర్ణించనలవికానిది. ఆయన మనసు అటువంటి స్థితిలో ఉండగా, అకస్మాత్తుగా గళ్ళలుంగీ, పైన భుజం మీద మురికిగా ఉన్న తువ్వాలు ధరించి, జోలి (సంచీ) చేతిలో గ్లాసుతో, పొడవుగా ఉన్న ఒక ఫకిరు అకస్మాత్తుగా ఆయనను సమీపించాడు. ఆ ఫకీరును చూడగానే శంకరయ్య తన జేబులోనుంచి పావలా కాసు తీసి అతని గ్లాసులో వేశారు. ఆసక్తికరమయిన సంభాషణ వారిద్దరి మధ్య ఇలా జరిగింది.
(ఫకీరు హిందీలో మాట్లాడారు)
ఫకీర్ : ఓ! ఈ పావలా దేనికి?
శంకరయ్య:: దయచేసి తీసుకో. నువ్వు ఎక్కడనించి వస్తున్నావు?
ఫ: నా మందిరం నుండి
శం: నీ మందిరం ఎక్కడ వుంది?
ఫ: అన్ని చోట్లా ఉంది
శం: బాబావారి కార్యక్రమం జరగబోతోంది, కాని కొంతమంది దుర్మార్గపు పనులను సృష్టిస్తున్నారు.
ఫ : హాని కలిగించే పనులు ఏమీ జరగవు. అంతా సవ్యంగానే జరుగుతుంది
శం : నువ్వు ఎప్పుడయినా షిరిడీ వెళ్ళావా?
ఫ: షిరిడీ వెళ్ళడానికి ఆలోచించాలా? మన్మాడ్ మీదుగా వెళ్ళు. కోపర్ గావ్ నుంచి 9 కి.మీ.
శం: నేను చాలా సార్లు వెళ్ళాను. అందుచేత నాకు బాగా తెలుసు. నేను నిన్ను అడుగుతున్నాను.
ఫ: (ఇక సంబాషణ కొనసాగించడానికి యిష్టం లేక) నామందిరానికి వెళ్ళాలి. సమయం ఆసన్నమయింది.
శంకరయ్య తన జేబులోనుంచి ఒక కార్డు తీశారు. దాని మీద ఒకవైపు బాబా ఫొటో మరొకవైపు కార్యక్రమాల వివరాలు (తెలుగులో) ఉన్నాయి. ఫకీరు అసలు దానివైపు చూడకుండానే , నాకు తెలుగు తెలీదు అంటు అక్కడినుండి నిష్క్రమించారు.
బస్సు ఎక్కినతరువాత విచిత్రంగా జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి తిరిగి గుర్తుకు తెచ్చుకొన్నారు. తాను కలుసుకొన్న ఫకీరు సాయిబాబా అయి ఉండవచ్చనిపించింది. తనకు జరిగిన అనుభవాన్ని ఆయన ప్రసాద్ గారికి వివరించి చెప్పారు. ప్రసాద్ గారు చాలా ఆనంద పడ్డారు.
అదే రోజు సాయంత్రం శివనేశన్ స్వామీజీ గారికి, దత్తఘడ్, కల్లూర్ కి అత్యంత సన్నిహితులయిన ప్రియనాధ్ గుప్తాజీగారు శంకరయ్యగారిని చూడటానికి వచ్చారు. ఆయన కూడా, వచ్చినది సాయిబాబా తప్ప మరెవరూ కాదని నిర్ధారించి చెప్పారు. ఆయన మన్మాడ్ అనే పదానికి అర్ధం వివరించి చెప్పారు.
మన్మాడ్ అనగా 'మన్ (మనస్సు) 'మర్ (చంపు) అని అర్ధం. అనగా దాని అర్ధం ఎవరయినా షిరిడీని దర్శించుకోవడమంటే వారు నిష్కళంకమయిన భక్తితో తమ మనస్సును చంపుకోవడమే. (ఇక్కడ మనసును చం పుకోవడమంటే మనసులో ఎటువంటి కోరికలు లేకుండా ఉండుట) (కోపర్గావ్ లో కోపర్ అనగా స్వచ్చమయిన కొబ్బరికాయ.) 9 మైళ్ళు అనగా నవ విధ భక్తి. ఫకీరు సంభాషణ ప్రారంభించేముందే తాను బిచ్చగాడిని కానని సూచన ప్రాయంగా తెలియ చేసినప్పటికీ, శంకరయ్య గారు ఆయనే బాబా అని గుర్తించలేకపోయారు.
ఈ సంఘటన జరగడానికి ముందే, నిర్ణయించుకున్న ప్రకారం శంకరయ్యగారు మరునాడు షిరిడీ వెళ్ళారు. ఎప్పటిలాగే ఆయన ఎక్కువ సమయం శివనేశన్ స్వామీజీతో గడిపారు. మధ్యాహ్న ఆరతి పూర్తయిన తరువాత శివనేశన్ స్వామీజీగారు, ద్వారకామాయిలో గుఱ్ఱం విగ్రహం వద్ద సగం వరకు కాలిన అగరువత్తులను ఏరుతున్నారు. అలా ఏరుతూ స్వామీజీ "మన్మాడ్ అంటే నీమనసును చంపుకోమని అర్ధం" అని వివరించి చెప్పారు స్వామీజీ నోట మాట రాలేదు. తను క్రిందటి రోజు జరిగిన విషయమేమీ ఆయనతో చెప్పలేదు.
(ఆఖరి భాగం రేపు)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment