20.01.2013 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుంచి కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ ప్రారంభిస్తున్నాను. బాబా ఆ కాలంలో ఉన్నప్పటి సంఘటనలు ఆయన చేసిన లీలను చదివి బాబాతో ఇప్పుడు మీరున్నట్లుగా అనుభూతిని స్వంతం చేసుకోండి.
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 24వ.శ్లోకం,తాత్పర్యం
శ్లోకం: అగ్రణీర్గ్రామణీ శ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః
సహస్ర మూర్ధా విశ్వాత్మా సస్తాక్షస్సహస్రపాత్ ||
తాత్పర్యము: పరమాత్మను, మొదటగానుండు వానిగానూ, జీవులను నడుపువానిగానూ, సంపదలకధిపతిగానూ, న్యాయమే తన రూపమైనవానిగా, నాయకునిగా, ప్రశాంతముగా వీచువాయువుగా, వేయి శిరస్సులు గలవానిగా, వేయి కన్నులు గలవానిగా, మరియూ వేయిపాదములు గలవానిగా, యింకనూ విశ్వమే తన ఆత్మయైనవానిగా, విశ్వమునకు ఆత్మయైనవానిగా ధ్యానము చేయుము.
ఓం శ్రీ సాయిరాం
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
కాకాసాహెబ్
డైరీ
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ శ్రీమతి హెతాల్ పాటిల్ రావత్ గారి బ్లాగులో ఆంగ్లంలో ప్రచురింపబడింది. దీనికి తెలుగు అనువాదం చేసుకోవడానికి ఆమె దయతో అంగీకరించారు. వారికి నాకృతజ్ఞతలు తెలుపుకొంటు, బాబా వారు ఆమెకు ఆమె కుటుంబానికంతటికి శుభాశీస్సులు అనుగ్రహించమని కోరుకొంటున్నాను.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 1
పరిచయం:
శ్రీ షిరిడీ సాయిబాబావారి
నామమే శాంతిని పొందగోరేవారి హృదయాలకు ఎంతో శాంతిని కలుగజేస్తుంది. ఆయన కర్మ భూమి షిరిడీ. బాబా సశరీరంగా షిరిడీలో 60 సంవత్సరములపాటు జీవించారు.
ఈ కాలంలో శ్రీమాధవరావు దేశ్ పాండే, (శ్యామా), శ్రీమహల్సాపతి,
శ్రీ గోవిందరావు ధబోల్కర్ (హేమాడ్ పంత్) శ్రీ
నానాసాహెబ్ చందోర్కర్, శ్రీ బీ.వీ..దేవ్,
శ్రీ హరి సీతారాం దీక్షిత్ (కాకా సాహెబ్
దీక్షిత్), శ్రీ జీ.ఎల్. కపర్ధే
లాంటి భక్తులు, యింకా ఎంతోమంది భక్తులు
శ్రీసాయి మహరాజ్ తో ఆధ్యాత్మిక
అనుబంధాన్ని పెంపొంధించుకున్నారు. మొదటి యిద్దరూ తప్ప మిగతావారందరూ కూడా
విద్యావంతులు. సంఘంలో మంచి పేరు
ప్రతిష్టలు కలిగి తమ తమ వృత్తులలో చక్కగా రాణించి ధనవంతులయ్యారు. శ్రీసాయి మహరాజ్ చిరిగిన బట్టలు ధరించినప్పటికీ, పడిపోతున్న మసీదులో నివసించుతున్నప్పటికీ, శ్రీసాయిబాబాతో వారి మధ్య ఉన్న బంధం సముద్రపు లోతు ఎంతగా
ఉంటుందో అంత గాఢంగా పెనవేసుకు పోయింది.
విజ్ఞానదాయకమైన తమ మాటలతో ఎంతోమంది చరిత్రను వ్రాశారు. ఈనాటి భక్తులకి ఈ చరిత్ర ద్వారా ఎన్నో విషయాలను
తెలుకుకోవడానికి సహాయకారి అయింది.
షిరిడీలో జరిగే చాలా సంఘటనలను క్రోడీకరించి "శ్రీసాయి సత్చరిత్ర"
పేరుతో శ్రీ షిరిడీసాయి బాబావారి జీవిత చరిత్రను వ్రాసే బాధ్యత శ్రీహేమాడ్ పంత్ కు
యివ్వబడింది. శ్రీ హేమాడ్ పంత్ ఈ
కార్యబారాన్ని ఎంతో భక్తిశ్రధ్ధలతో నిర్వహించారు.
ఆయన వ్రాసిన సత్ చరిత్ర
ఈనాడు సాయి భక్తులందరికీ ప్రముఖ పారాయణ గ్రంధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
శ్రీసాయిబాబా గారు
జీవించి ఉన్న కాలంలో జరిగిన దైవిక సంఘటనలన్నిటినీ సేకరించి శ్రీ హరిసీతారాం దీక్షిత్
(కాకా సాహెబ్ దీక్షిత్) యొక్క "కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ" నేడు మనకు
లభించిన విలువైన సంపద. సాయిబాబా, దీక్షిత్ని ప్రేమతో "లంగ్డాకాకా అని పిలుస్తూ
ఉండేవారు. కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వారి
ఆజ్ఞలను ఎంతో విధేయతగా అమలు పరుస్తూ ఉండేవారు.
కాకా సాహెబ్ దీక్షిత్:
శ్రీసాయిబాబాను సన్నిహితంగా సేవించిన భక్తులలో యిద్దరు మాత్రమే బాబాతో తమకు గల అనుభవాలను గురించి డైరీ వ్రాసుకున్నారు. వారు శ్రీ జీ.ఎస్. ఖపర్దే, శ్రీకాకాసాహెబ్ దీక్షిత్. ఖపర్దేగారి షిరిడీ డైరీ చాలా మంది సాయి భక్తులకు సుపరిచితమే. శ్రీఖపర్దే ఆంగ్లంలో వ్రాసుకున్నా, డైరీని మొదట శ్రీ బీ.వీ.నరసిం హస్వామిగారు ప్రచురించారు. తరువాత అది సాయిలీల పత్రికలో 1985-86 మధ్య కాలంలో ధారావాహికంగా ప్రచురింపబడి ఇపుడు షిరిడీసాయి సంస్థానం వారి వద్ద పుస్తక రూపంలో లబిస్తుంది. కాని, కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ మాత్రం చాలామంది సాయి భక్తులకు ముఖ్యంగా తెలుగువారికి అలభ్యంగానే ఉంది. శ్రీ దీక్షిత్ తన డైరీని మరాఠీ భాషలో వ్రాసుకొన్నారు. ఆడైరీలో తాను 1909 లో బాబాను దర్శించినది లగాయతు బాబా మహాసమాధి చెందేంతవరకు, ఆతరువాత 1926 లో ఆయన మరణించేముందు దాకా కూడా తాను చూచిన, విన్న బాబాలీలలను వ్రాసుకొన్నారు. ఆడైరీయొక్క ఆంగ్లానువాదం మద్రాసునుండి చాలాకాలం క్రితం ప్రచురింపబడింది. కాని, ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావడంలేదు. బాబాను ప్రత్యక్షంగా సేవించిన ఎస్.పీ.అవస్తే గారివద్దనుండి ఆపుస్తకం ఒక ప్రతి పూనాకు చెందిన శ్రీ ఎస్.ఏ.ఎం.గాడ్గే అనే సాయిభక్తునికి లభించింది. అక్కడక్కడ చెదలు తిని మొదట, చివర రెండు పేజీలు పూర్తిగా చిరిగిపోయివున్న ఆపుస్తకాన్ని 1977లో శ్రీ గాడ్గే శ్రీసాయిలీల ఎడిటర్ దృష్టికి తీసుకొని వచ్చారు. చిత్రమేమిటంటే శ్రీషిరిడీ సాయి సంస్థానం వారి అనుమతితో ఆడైరీని ఆగ్లంలోనికి అనువదించి ప్రచురిస్తునట్లుగా ఆపుస్తకం ఉపోద్ఘాతంలో అనువాదకుడు వ్రాసి వున్నా ఆపుస్తకం మరొక ప్రతి సంస్థానం గ్రంధాలయములో కాని, మరెక్కడా గాని లభించలేదు. మొదట, చివర పేజీలు చిరిగిపోయి ఉండటం వల్ల ప్రచురణ కర్తకు సంబంధించిన వివరాలు తెలియలేదు. సుమారు 160 పేజీలు ఉన్న ఆడైరీలో 121 వివిధ సంఘటనలు, బాబా లీలలు గురించి వ్రాయబడి ఉంది. అవి ఎంతో ఆసక్తిదాయకమైనవే కాక శ్రీసాయి చరిత్రను గురించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోనికి తెస్తాయి.
(ఇంకావుంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment