18.01.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కొన్ని పనుల వత్తిడి వల్ల మన బ్లాగులో ప్రచురణకు కొంత అంతరాయం కలిగింది. ఈ రోజు శ్రీ విష్ణుసహస్రనామములోని రెండు శ్లోకాలు, తాత్పర్యము అందిస్తాను. రెండు రోజులలో కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాను.అది పూర్తయేలోపులో శ్రీసాయితో మధురక్షణాలు అనువాదం కూడా చేసి వాటిని కూడా ప్రచురిస్తాను.
శ్రీ విష్ణుసహస్రనామం 23వ.శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: గురుర్గురుతమో ధామ స్సత్య స్సత్య పరాక్రమః
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పత్తిరుదారధీః
తాత్పర్యము: పరమాత్మ ఉపదేశికునిగాను, మరియు ఉపదేశికులందరికి గురువుగను, వెలుగు తనమార్గమైన వానిగను, సత్యముగా వెలుగు వానిగను, అట్టి సత్యముగనే లోకములన్నియు ఆక్రమించువానిగను, రెప్పపాటుగా నున్నవానిగను, మరియు అట్టి రెప్పపాటు తానే అయిన వానిగను, మాలను ధరించిన వానిగను, వాక్కునకు అధిపతిగను, తనంత తాను వ్యక్తమగు బుద్దిగా తెలియబడుచున్నాడు.
23వ. శ్లోకం: గురుబ్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరం బ్రహ్మా తస్మైశ్రీ గురవేనమః
తాత్పర్యము: అని గురువునుద్దేశించి చేసిన ప్రార్ధన పూర్తిగా అర్ధవంతమే. కాని కేవలము గురువును గౌరవించుటకు చెప్పినది గాదు. యిది గురువును "ఉపాసన" చేయవలసిన విధానము. సమస్త సృష్టిని పుట్టించువాడు, నడుపువాడు, మరల లయము చేయువాడు, గురువే. అట్టి గురువే అన్నిటికి అతీతమయిన పరబ్రహ్మగ నున్నాడు. ఆయనను శరణు పొందుచున్నాను అని ధ్యానము చేయవలెను. ఇట్టి ధ్యానమును మనస్సులో నిరంతరము ధారణ చేయు మనిషి ఇక చదువవలసిన వేదాంత గ్రంధములుండవు. సకల పురాణ గ్రంధములు, వేదములు, ఉపనిషత్తులు, జీవుని ఇచ్చటకు తీసుకుని వచ్చి విడచును. అటుపైని శిష్యుని పురోగమనమును గురువు స్వయముగా నిర్ణయించును. అట్టి నిర్ణయము కూడా శిష్యునికి తెలియవలసిన అవసరము లేదు. ఆ తరువాత గురువు ఆజ్ఞపై ఏ గ్రంధము చదివిననూ శిష్యుని అనుక్షణము గురువు యొక్క సాన్నిద్యమును అనుభవించుచునే యుండును. సకల జీవుల రూపమున గురువే కనుపించును. దీనిని గూర్చి వివేకానందుడు "నిజమయిన శిష్యుడు" అను తన ఉపన్న్యాసమున వివరించెను. శిష్యునికి యిట్టి ఆత్మ సంస్కారము కలిగి నిజమైన శరణాగతి పొందువరకు గురువు వేచియుండును. శిష్యుని హృదయమునందున్న పరమాత్మయే గురువుగా శిష్యుని వద్దకు వచ్చుచున్నాడు. గురువుయొక్క శరీరము వేరైనను పని చేయుచున్నది శిష్యునిలోనున్న గురువను పరమాత్మే.
మన దేహము, ప్రాణము, మనస్సు, యింద్రియములు మున్నగువన్నియునూ పరమాత్మ యను వెలుగునుండి వచ్చినవే గనుక, తిరిగి భగవంతుని చేరుటకు యివియే మనకు సాధనములగును. అట్లు సాధనయను సంకల్పము గూడా, పరమాత్మనుండి జీవులయందు ప్రసరించు కిరణము. కనుక పరమాత్మయే మరల జీవునికి మార్గమగుచున్నాడు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment