22.01.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామం 26 వ.శ్లోకం
శ్లోకం: సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృ డ్విశ్వ భుగ్విభుః
సత్కృతస్త్కృత స్సాధుర్జహ్నుర్నారాయణోనరః ||
భగవంతుని అనుగ్రహించువానిగా, వరములు యిచ్చువానిగా, సృష్టికర్తగా, సృష్టిని పాలించువానిగా, మరియు తనలోనికి స్వీకరించువానిగా, లేక లయము చేయువానిగా, మంచిని కలిగించుట ద్వారా గౌరవింపబడువానిగా, జహ్నువు, నారాయణుడు, నరుడు మరియు ప్రశాంతులైన మహర్షులుగా, ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 3
కాకా సాహెబ్ దీక్షిత్ :
శ్రీ హరి సీతారాం దీక్షిత్ (కాకాసాహెబ్ దీక్షిత్) 1864 సంవత్సరం మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వా తాలూకాలో బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్యంతా కూడా ఖాండ్వాలోనూ, హింగన్ ఘాట్ లోనూ జరిగింది. తరువాత ఆయన ముంబాయిలోని ఆల్ఫ్స్ టన్ కాలేజీలో చేరి 19 సంవత్సరముల పిన్న వసులోనే ఎల్.ఎల్.బీ. పట్టా పొందారు.
ఆ తరువాత ఆయన 21 సం.వయసులోనే న్యాయవాది పరీక్షలో విజయం సాధించి లిటిల్ అండ్ కంపెనీలో న్యాయవాదిగా చేరారు. తరువాత తనే స్వంతంగా న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. తన చురుకైన మేధాశక్తి, తెలివితేటలతో ఎంతో ధనాన్ని ఆర్జించారు. తను సంపాదించిన ధనంతో లోనావాలాలో స్వంతంగా ఒక బంగళా కట్టుకున్నారు. ఆయనకు ఆంగ్ల భాషలోనూ అలాగే, సంస్కృతంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన రామాయణం, మహాభారతం, యోగ వాసిష్ట్యం, మరియు జ్ఞానేశ్వరి చదువుతూ ఉండేవారు.
కాలికి గాయం:
ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ 1906 వ.సంవత్సరంలో లండన్ వెళ్ళారు. అక్కడ వేగంగా వెడుతూన్న రైలు ఎక్కడానికి ప్రయత్నించినపుడు పట్టుతప్పి ప్లాట్ ఫారం మీద పడిపోయారు. కాలు బెణికి బాగా గాయమయింది. ఈకారణంవల్లే ఆయన సరిగా నడవలేకపోయేవారు. లండన్ లో చాలా రకాలయిన వైద్యాలు చేయించారు. ఆపరేషన్ కూడా జరిగింది. అయినా గాని ఆయన జీవితాంతం వరకూ కుంటుతూనే నడవాల్సి వచ్చింద్. ఈ కాలి కుంటితనమే ఆయన అస్థిరమైన మనసుని స్థిరముగా ఉంచింది. ఆయన కుంటితనమే ఆయనను షిరిడీలో కాలు మోపేలా చేసింది.
మానవుడికి ఏదైనా అనర్ధం జరిగినపుడే ప్రతీదానిమీద అయిష్టత ఏర్పడుతుంది. కాని ఒక్కొక్కప్పుడు అటువంటి అనర్ధాలే ఎంతో ఉపయోగపడతాయి. కాకాసాహెబ్ తన కుంటికాలితో భారత దేశానికి తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు సాయిబాబా గురించి తెలియదు. 1909 సంవత్సరంలో సెలవులు గడపడానికి లోనావాలాలో ఉన్న తన బంగళాకు వెళ్ళారు. అక్కడ తన పూర్వపు సహాధ్యాయి అయిన నానాసాహెబ్ చందోర్కర్ ని కలుసుకొన్నారు. చదువు పూర్తయిన తరువాత నానాసాహెబ్ చందోర్కర్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కాకా సాహెబ్ దీక్షిత్ స్వంతంగా న్యాయవాది వృత్తిని చేపట్టారు. చాలా సంవత్సరాల తరువాత యిద్దరూ లోనావాలాలో కలుసుకున్నారు.
కాకాసెహెబ్ తన కాలిగురించి నానా సాహెబ్ కి వివరంగా అంతా చెప్పారు.
"మందులన్నీ కూడా పనిచేయడం మానివేసినపుడు భగవంతుని ప్రార్ధించే ప్రార్ధనలే పని చేస్తాయి" అని
నానాసాహెబ్ అన్నారు.
అందుకు కాకాసాహెబ్ "నానా, నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తాను. కాని, ఈరోజుల్లో నిజమయిన యోగిపుంగవులు అరుదుగా ఉంటారు. ఒకవేళ అటువంటివారిని కలుసుకోవడానికి అనుకోకుండా అవకాశం వచ్చి విజయం సాధించినా చివరికి పశ్చాత్తాప పడటానికి మాత్రమే.
(ఇక్కడ పాఠకులకి ఒక అనుమానం రావచ్చు. నిజమైన సాధువుని /సత్పురుషుని కలుసుకొంటే పశ్చాత్తాపం పడటమేమిటి అని. ఇక్కడ నేననుకునేది ఏమిటంటే ఒక వేళ మనం నిజమైన సాధువునే కలుసుకున్నామని భావిస్తాము. చివరికి ఆయన నిజమైన సాధువు కాడని తెలిసిన తరువాత మనము పశ్చాత్తాప పడవలసివస్తుందని కాకా సాహెబ్ భావం అయి ఉండవచ్చు) (దీనికి పాఠకులు ఏమంటారు? నాభావం కరక్టేనా? ఇద్దరిని అడిగాను. వారుకూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు)
నానా సాహెబ్ ఇలా జబాబిచ్చారు. "ఒక విషయం చెప్పనీ నన్ను. అపుడు నువ్వే నిజంగా నన్ను నమ్ముతావు. నేనొక గురు మహరాజ్ కి శిష్యుడిని. ఆయన పేరు సాయిబాబా. ఆయన కోపర్ గావ్ దగ్గరనున్న చిన్న గ్రామమయిన షిరిడీలో ఉంటారు. నువ్వు ఆయన శరణు పొందు. నీకాలి కుంటితనం నయమవుతుంది. నీయొక్క మనస్సుయొక్క అస్థిరత్వం తొలగిపోతుంది. నా ఆలోచనలని, అభిప్రాయాలని నీకు చెప్పాను. నాగురుమహరాజ్ ఎపుడు చెపుతూ ఉంటారు -- "పిచ్చుక కాలికి దారం కట్టి ఎటువంటి శ్రమ లేకుండానే దానిని మనవద్దకు లాగవచ్చు". అదే విధంగా ఈ ప్రపంచంలో నాభక్తులు ఏమూలనున్నా సరే వారిని నావద్దకు రప్పించుకొంటాను. ఎవరికయితే అదృష్టం లేదో వారికి షిరిడీనుంచి పిలుపు రాదు."
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment