31.01.2013 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామం 32వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: భూత భవ్య భవన్నాధః పవనః పావనో నలః
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ||
తాత్పర్యం: పరమాత్మను భూతము, భవిష్యత్తు, వర్తమానము అను మూడు కాలములకు అధిపతిగా, పరిశుధ్ధి చేయు వాయువుగా, పరిశుధ్ధి చేయువానిగా, అగ్నిగా, అన్నిటికన్నా మిక్కిలి నిర్మలమైన వానిగా, మన్మధుని సృష్టించిన వానిగా, మరియూ నశింపచేయువానిగా, అందరిచే కోరబడువానిగా, అన్ని కోరికల రూపము తానేయైనవానిగా ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4వ. అధ్యాయము
పనికిమాలిన పరనింద:
మధురదాస్ అనే భక్తుడు తరచూ షిరిడీ వచ్చి బాబాను దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి షిరిడీ వచ్చినపుడు అక్కడ హోటలు నడుపుతున్న సగుణమేరు నాయక్ వద్ద బస చేశాడు.
సగుణ హోటలులో యాత్రికులందరూ భోజనాలు చేస్తూ ఉండేవారు. అక్కడ వారిద్దరూ కలిసి ఇతరుల లోని లోపాల గురించి వారి వ్యవహారాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. తరువాత మధుర్ దాస్ శ్రీసాయిబాబా వద్దకు వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. "సగుణ ఏమంటున్నాడు" అని బాబా అడిగారు. మధుర్ కి తాను చేసిన సంభాషణ వెంటనే గుర్తుకు వచ్చింది. తను చేసిన తప్పు శ్రీసాయిబాబాకు తెలిసిందని అర్ధమయింది. ఇతరులలోని దోషాలను వేలెత్తి చూపడం, నిందారోపణ ఇవేమీ బాబాకు య్హిష్టముండదని మాధుర్ కి గుర్తుకు వచ్చింది. మనకి యితరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదని బాబా మధుర్ కి గుర్తు చేస్తూ, మనకి ఏదయితే ప్రాప్తమో అదే మనవద్ద ఉంటుంది, యితరులకి ఏది ప్రాప్తమో అదే వారి వద్ద ఉంటుందని ఈ విధంగా తెలియచేశారు.
స్వప్నంలో వైద్యం:
శాంతాబాయి బాబా భక్తురాలు. శాంతాబాయి యొక్క ఎడమ చేతివేళ్ళు కురుపులు వేసి పురుగులు పట్టి భరింపలేని బాధ పడుతూ ఉండేది. ఆమెను ఈ బాధనుండి తప్పించడానికి శ్రీసాయిబాబా ఒకసారి ఆమెకు స్వప్నంలో కనపడి నెప్పిగా ఉన్న చేతికి, వేళ్ళకి దికామలీ - ఒక విధమయిన మూలిక (కాంబీ గమ్ ) రాయమని చెప్పారు. తనకి స్వప్నంలో శ్రీసాయిబాబా యిచ్చిన ఈ సలహాకి సంతోషించి ఆయన చెప్పినట్లే చేసింది. ఆమె ఆ కాంబీ గమ్ ను చేతికి రాసిన కొద్ది క్షణాలలోనే నొప్పి, వాపు తగ్గిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం సెప్టెంబరు 1, 1918,న షిరిడీకి వచ్చిన వుత్తరంలో తెలియచేయబడింది.
ఊదీ చికిత్స:
బొంబాయి వాస్తవ్యుడయి నారాయణ్ గోపీనాధ్ డిగెకి ప్రేవులలో నొప్పిగా ఉండేది.రోజు రోజుకీ నొప్పి ఎక్కువ కాసాగింది. అతని స్నేహితుడు శ్రీసాయిబాబా భక్తుడు. అతను నారాయణ్ ని షిరిడీ వెళ్ళమని సలహా య్హిచ్చాడు. తనకు వచ్చిన సమస్యను బాబాకు వివరించమని ఆయన నయం చేస్తారని చెప్పాడు. కాని తన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటంవల్ల తాను షిరిడీ వరకు ప్రయాణం చేయలేనని చెప్పాడు. ఏమయినప్పటికీ శ్రీసాయిబాబా అనుగ్రహం వల్ల తనకు ఫూర్తిగా నయమవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. తనకు నయమవుతే షిరిడీ వచ్చి శ్రీసాయిబాబాను దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేస్తానని మొక్కుకొన్నాడు.
అతని స్నేహితుడు ఊదీ ఇచ్చి ప్రతీరోజు దానిని నుదిటికి రాసుకోమని చెప్పాడు. నారాయణ్ అతను చెప్పినట్లే చేశాడు. మరుసటి రోజే అతని బాధ నయమయింది. వారం రోజులలోనే అతని బాధ పూర్తిగా నయమయి పూర్తి ఆరోగ్యం చేకూరింది. అతను షిరిడీ వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించుకోవడానికి బయలుదేరాడు.
మరొక సంఘటనలో జోషీ యొక్క కుమార్తె చాలా సంవత్సరాలనుండి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ ఉండేది. ఒకరోజున ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా అయి చావుకు దగ్గరలో ఉంది. ఆమె తల్లి బాబాను ఆర్తితో ప్రార్ధించి ఊదీనిచ్చింది. వెంటనే ఆమె ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది కాని పూర్తి ఆరోగ్యం చేకూరలేదు. ఒకరోజు జోషి తన భార్యతోకూడా కుమార్తెను తీసుకుని షిరిడీ వచ్చాడు. చాలా కాలంపాటు అనారోగ్యంగా ఉండటం వల్ల జోషి కుమార్తె బలహీనంగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉంది. తల్లిదండ్రులు ఆమెను ఎత్తుకుని ద్వారకామాయిలోని బాబా వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆయన ఆమె నుదుటిమీద ఊదీని రాసి ఆశీర్వదించారు. మూడు రోజులలో ఆమె పూర్తిగా కోలుకొని తనకు తానే ఎవరి సహాయం లేకుండా నడవగలిగింది. అదే ఊదీయొక్క అద్భుతమయిన శక్తి.
సాయి దిద్దిన కాపురం:
ఈసంఘటన 1913వ.సంవత్సరంలో జరిగింది. దహనుకు చెందిన శ్రీజీ.కే. వైద్య ఒకసారి శ్రీసాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. అతను శ్రీసాయిబాబాతో సంతోషంగా గడిపాడు. షిరిడీనుంచి తిరిగి వచ్చిన తరువాత తన అన్నగారయిన ఆత్మారాం ని కూడా షిరిడీ వెళ్ళమని సలహా యిచ్చాడు. తన తమ్ముడు చెప్పినమీదట ఆత్మారాం కూడా షిరిడీ వచ్చి శ్రీసాయిబాబాను దర్శించుకున్నాడు. అప్పుడు అతని వయస్సు 42 సంవత్సరాలు. సుమారు 38 సం.ఉన్న అతని భార్య, యిద్దరిమధ్య ఉన్న కొన్ని మస్ప్రర్ధలవల్ల అతనిని విడిచి పుట్టింటిలోనే ఉండసాగింది. భర్త దగ్గరకు రాలేదు. వివాహము అయిందన్న మాటేగాని వారు కలిసి కాపురం చేసింది లేదు, ఇక కాపురం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇరువైపుల పెద్దలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె తనభర్త వద్దకు తిరిగి వెళ్ళటానికి ససేమిరా నిరాకరించింది.ఆత్మారాం షిరిడీ వచ్చి బాబా ఊదీ ప్రసాదం తీసుకున్న సమయంలోనే పుట్టింటిలో ఉన్న ఆయన భార్యకు ఏదో ప్రేరణ కలిగి వెంటనే అత్తవారింటికి వెళ్ళింది. తన మరిదితో (జీ.కే.వైద్య) నిజానికి ఇదే నాల్లు, పుట్టింటిలో ఎక్కువ కాలం ఉండటం భావ్యం కాదని చెప్పింది. హటాత్తుగా ఆమెలో వచ్చిన ఈ మార్పుకి వైద్య ఆశ్చర్యపోయారు. ఆతరువాత ఆత్మారాం దంపతులు ఎటువంటి పొరపొచ్చాలు లేకుడా పిల్లాపాపలతో హాయిగా కాపురం చేశారు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment