01.02.2013 శుక్రవారము
ఓం సాయిశ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 33వ. శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజి దనింతజిత్ ||
తాత్పర్యము: పరమాత్మను యుగముల ప్రారంభకునిగా, ధర్మములతో కూడిన కాలచక్రమును నిర్వహించువానిగా, మాయయొక్క అనేక రూపములుగా మరియు ఆ మాయను అధిష్టించి యున్నవానిగా, సృష్టియందలి సమస్తము తినివేయువానిగా, వ్యక్తము మరియు అవ్యక్తముగానున్న అదృశ్య రూపునిగా సృష్టియందలి సమస్తమును తన వేయి మార్గములలో అనేకమైన విధానములతో జయించువానిగా ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 5వ. అధ్యాయము
నాబిడ్డలను నేనుకాక మరెవరు కాపాడతారు
1914 వ.సం.లో శ్రీ ఎన్.బీ.నాచ్నే దహనులో ట్రెజరీ మాస్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. అక్కడ శ్రీ ఫాన్సే కూడా ఉద్యోగి. ఫాన్సేకు మతి స్థిమితం లేదు.
ఒకసారి శ్రీనాచ్నే తన వంటగదిలో ఉన్న శ్రీసాయిబాబా పటం ముందు పూజ చేసుకుంటున్నారు. హటాత్తుగా అతనికి పెద్ద శబ్దం వినపడింది. వెను తిరిగి చూసేటప్పటికి వంటగది గుమ్మం వద్ద ఫాన్సే నిలబడి ఉండటం చూశాడు. అతను వేగంగా నాచ్నే మీదకు దూకి అతని గొంతును గట్టిగా పట్టుకుని నొక్కుతూ కొరకడానికి ప్రయత్నించాడు. నాచ్నే ఏదో విధంగా పూజకు ఉపయోగించే ఉధ్ధరిణి తీసుకుని నాచ్నే నోటిలో గుచ్చాడు. ఫాన్సే వెంటనే నోరు మూసుకుని అతని వేళ్ళని కొరకడం మొదలు పెట్టాడు. ఫాన్సే నాచ్నే మెడను గట్టిగా పట్టుకోవడం వల్ల అతని గోళ్ళు గట్టిగా గొంతులో దిగబడి విపరీతంగా రక్తం కారసాగింది. ఈదాడికి నాచ్నే స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేటప్పటికి తన చుట్టు తన తల్లి, తమ్ముడు. డాక్టర్ ఉండటం చూశాడు. సరైన సమయానికి తన తల్లి, తమ్ముడు వచ్చి ఆ పిచ్చివానినుండి రక్షించారని తెలిసింది. కొద్ది రోజుల తరువాత అతను షిరిడీ వెళ్ళాడు. అతను మధ్యాహ్న్నం ద్వారకామాయికి వెళ్ళినపుడు శ్రీసాయిబాబా నాచ్నే వైపు చూపుతూ, తన దగ్గర కూర్చున్న అన్నా చించణీకర్ తో ఇలా అన్నారు. "నేనొక్క క్షణం ఆలశ్యం చేసి ఉంటే ఆపిచ్చివాడు యితనిని చంపేసి ఉండేవాడు. అతని మెడను బాగా బలంగా బిగించి పట్టుకున్నపుడు నేనక్కడకు వెళ్ళి అతనిని చావునుంచి తప్పించి రక్షించాను. నాబిడ్డలను నేని రక్షించకపోతే మరెవరు రక్షిస్తారు.
అతి తెలివి:
నా పొరుగున ఉండే ఆనందరావు కృష్ణ చౌబాల్ తన తల్లితో నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి అతను తన తల్లితో కూడా నాతో షిరిడీ వచ్చాడు. అతని తల్లి చదువుకున్నది, తెలివైనది. ఆమె శ్రీసాయిబాబాకు 8 అణాలు దక్షిణ యిద్దామనుకుంది. ఆవిడ తన కొడుకుని ఒక రూపాయికి చిల్లర తెమ్మని చెప్పింది. అతను ఒక 50 పైసల నాణెం, రెండు 25 పైసల నాణాలు తెచ్చి తల్లికిచ్చాడు. ఆవిడ శ్రీసాయిబాబాను దర్శించుకుని 25 పైసల నాణెం మాత్రమే దక్షిణగా యిచ్చి తిరిగి వెళ్ళబోయింది.. శ్రీ సాయిబాబా ఆమెను వెనుకకు పిలిచి ఆవిడ అనుకున్న ప్రకారం మరొక 25 పై.అడిగారు. " మిగిలిన నాలుగు అణాలు నాకు యివ్వకుండా ఎందుకమ్మా ఈ బీద బ్రాహ్మడిని మోసం చేస్తావు" అన్నారు బాబా. ఇది వినగానే ఆమె తాను చేసిన పనికి సిగ్గుపడి మిగిలిన దానిని దక్షిణగా సమర్పించుకొంది.
షిరిడీమాఝే పండరీపూర్:
శంకరరావు తల్లి ఒకసారి షిరిడీ వెళ్ళి అక్కడినుండి పండరీపూర్ ఇంకా మిగతా పుణ్యక్షేత్రాల యాత్రలకు వెడదామని నిర్ణయించుకుంది. ఆమె తాను అనుకున్న ప్రకారం మొదట షిరిడీ వెళ్ళింది. ఆమె శ్రీసాయిబాబా దర్శనం చేసుకొన్న తరువాత బాబా ఆమెకు ఊదీనిచ్చి యింటికి తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పారు. అప్పుడామె పండరీపురం యింకా మిగతా యాత్రా స్థలాలకు వెళ్ళడం మానుకొంది. షిరిడీయే పండరీపూర్ అని భావించింది. యింటికి చేరుకున్న తరువాత అందరికీ ఊదీ పంచుదామని సామానులు విప్పగా అది కనపడలేదు. ఊదీకి బదులుగా పండరీపూర్ లో విగ్రహాన్ని దర్శించుకున్నపుడు ఇవ్వబడే బుక్కా (వివిధ రకాలతో తయారుచేయబడే పరిమళ భరితమైన పౌడరు) కనిపించింది. ఈమార్పుకు ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె షిరిడీనే పండరీపూర్ గా భావించినందు వల్ల ఆమెకు పండరీపూర్ ప్రసాదమే లభించింది.
మాటిచ్చి అశ్రధ్ధ చూపకు:
1915 స.వ.లో నేను, నాభార్య, నాబావమరిది శంకరరావు అందరమూ కలిసి షిరిడికి బయలుదేరాము. దారిలో మాకు బాసిన్ లో వెటరినరీ శానిటరీ ఆఫీసరుగా పని చేస్తున్న వాసుదేవ సీతారాం సామంత్ కలిసారు.
మేము షిరిడీ వెడుతున్నామని తెలిసి ఆయన నాచేతికి రెండణాలు యిచ్చి దానితో కొబ్బరికాయ, అగరువత్తులు, కర్పూరం కొని తన తరఫున శ్రీసాయిబాబాకు సమర్పించమని చెప్పారు. సరేనని నేను పైకం తీసుకున్నాను. బాబాను దర్శించుకున్న తరువాత షిరిడీనుండి తిరుగు ప్రయాణమయి బాబావద్ద శెలవు తీసుకోవడానికి వెళ్ళినపుడు బాబా నాతో "మంచిది, వెళ్ళేటప్పుడు చితలీ మీదుగా వెళ్ళు అని , రెండణాలు గురించి కొబ్బరికాయ, అగరువత్తులు కర్పూరం గురించి అడిగి అవి యివ్వకుండా ఈ పేద బ్రాహ్మడిని ఎందుకు మోసం చేస్తావు" అన్నారు. అప్పుడు నాకా రెండణాల విషయం గుర్తుకు వచ్చి వెంటనే వెళ్ళి ఆరెండణాలతో కొబ్బరికాయ, అగరువత్తులు, కర్పూరం కొని బాబాకు సమర్పించాను. అప్పుడు బాబా నేను వెళ్ళడానికి అనుమతిస్తూ "వెళ్ళిరా ! కాని, ఏదయినా ఒక పని చేస్తానని వప్పుకుంటే శ్రధ్ధగా చెయ్యి. లేకపోతే అసలు మాట ఇవ్వనేవద్దు" అన్నారు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment