02.02.2013 శనివారము
ఓం సాయి శ్రీసాయి
జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 34వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం:
ఇష్టో విశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధ కృత్కర్తా
విశ్వబాహుర్మహీధరః ||
తాత్పర్యము: పరమాత్మను,
నీయొక్క యిష్టా యిష్టములుగా మరియు విశిష్టులకు
యిష్టమైన వానిగా, శిరోజములు లేక కిరణములు
ఖండింపబడినవానిగా, మానవుని యింద్రునిగా
మార్చగలిగిన నహుషునిగా, వృషభముగా,
క్రోధమును సృష్టించి సంహ రించువానిగా, అందరికి హస్తము వంటి వానిగా, మరియు భూమిని భరించువానిగా, ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ
- 6వ.అధ్యాయం
బాబా అడిగిన పైకం వెనుక
పరమార్ధం
ఒకసారి నేను (కాకాసాహెబ్
దీక్షిత్) షిరిడీలో ఉండగా శంకరరావు కూడా అక్కడికి వచ్చాడు. శ్రీసాయిబాబా అతనిని 16 రూపాయలు దక్షిణ అడిగారు.
అతని వద్ద అంత పైకం లేదు. కాని ఈ విషయం అతను బాబాకు చెప్పలేదు. బాబా స్వయంగా దక్షిణ అడిగినా తాను
యివ్వలేకపోయానని చాలా బాధపడి బసకు తిరిగి వచ్చాడు. ఈ విషయం గురించే ఆలోచిస్తూ తన
ఊరికి తిరిగి వచ్చాడు. మరొకసారి అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నపుడు బాబా 32 రూపాయలు దక్షిణ అడిగారు. ఈ సారి కూడా తను బాబాకు దక్షిణ ఇవ్వలేకపోయినందుకు
చాలా బాధపడ్డాడు. ఈ విషయం నాకు చెప్పాడు.
నేను నవ్వి,, "శ్రీసాయిబాబా
పైకం గురించి అడిగినపుడు నీదగ్గిర లేదని చెప్పవచ్చు కదా. మౌనంగా ఎందుకు
వున్నావు" అన్నాను. ఈ సారి కనక బాబా దక్షిణ అడిగితే అదే
చెబుతాను అన్నాడు శంకరరావు .
మేమిద్దరం కలిసి మసీదుకు
వెళ్ళినపుడు శ్రీసాయిబాబా శంకరరావుని 64 రూపాయలు దక్షిణ అడిగారు. "అంత
డబ్బు మాదగ్గిర ఎలా ఉంటుంది బాబా" అని అన్నాము మేమిద్దరం. "మీవద్ద లేకపోతే అందరినీ అడిగి తీసుకు
రండి" అన్నారు బాబా.
ఇది జరిగిన కొన్ని
రోజులకి బాబాకు బాగా అనారోగ్యం చేసింది. శ్రీసాయిబాబా
ఆరోగ్యం కోసం భక్తులు నామ సప్తాహం అన్నదానం నిర్వహించారు. ఆసందర్భంగా దభోల్కర్ భార్య, వామన్ బాల కృష్ణారావు చందాలు వసూలుకు
బయలుదేరాలనుకున్నారు. వామనరావు
ఆకార్యాన్ని తన తమ్ముడయిన శంకరరావుకు అప్పగించి ఆవిషయం నాకు కూడా చెప్పాడు. ఆ తరువాత మేము చందాలు వసూలు చేశాము. చందాలన్నీ వసూలయిన తరువాత లెక్కపెట్టగా చందాల ద్వారా వచ్చిన మొత్తం సరిగా 64 రూపాయలు ఉంది.
కొద్ది రోజుల క్రితం బాబా సరిగ్గా అదే మొత్తం అందరి దగ్గరా వసూలు చేయమని
చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాము.
ఆపద్భాందవుడు:
31.03.1995 న నాచ్నే అతని
సహోద్యోగి మోరేశ్వర్ పాన్సీ ఒక ప్రభుత్వ సంబంధమయిన పని ముగించుకుని యింటికి తిరిగి
వస్తున్నారు. వారు వచ్చే దారి చాలా
దట్టమయిన అడవి. ఆదారిలో ఒక్క ఎద్దులబండి
మాత్రమే ప్రయాణ సాధనం. వారు తాన్ షెట్
ప్రాంతానికి చేరుకునేటప్పటికి అర్ధరాత్రయింది.
ఆ అడవిలో పులులు తిరుగుతూ ఉంటాయి.
హటాత్తుగా ఎడ్లబండి వెనుకకు నడవటం మొదలుపెట్టింది. ఎద్దులు అలా ఎందుకని వెనుకకు నడుస్తున్నాయో
మాకు ఆశ్చర్యం వేసింది. ఎంత ఆలోచించినా మాకు మొదట కారణం తెలీలేదు. మేము వెళ్ళే రోడ్డు బాగా ఎత్తుగా ఉన్న రోడ్డు.
ఒకవైపు లోయ, మరొక వేపు కొండలు
ఉన్నాయి. ఎడ్లబండి యింకాస్త వెనుకకు
వెళ్ళినట్లయితే అందరూ లోయలోకి పడిపోతారు.
అపుడు పానే ఎదుటికి వేలూ
చూపిస్తూ అటు చూడమన్నాడు. ఎదురుగా ఒక పెద్ద పులి మాకేసే చూస్తూ కనపడింది. ఆపులి
రోడ్డుకు ఒక ప్రక్కనున్న కొండలలోంచి వచ్చింది.
ఎద్దులు కనక భయంతో బెదిరి కొద్దిగా ప్రక్కకు తప్పుకుంటే బండి తలక్రిందులై
లోయలో పడిపోతే మరణమే. ఒకవేళ బండి దిగి బండి
పడిపోకుండా ఆపుదామన్నా పులి వచ్చి దాడి చేస్తుంది.
పాన్సే బండి దిగి,
బండి వెనుకకు దొర్లిపోకుండా చక్రాల కింద రాయి
పెట్టి ఆపుదామనుకున్నాడు. అతను మరొక వైపు
నుంచి బండి దిగాడు. యింకా బండిలోనే
కూర్చున్న నాచ్నే గట్టిగా అరుస్తూ, జయజయ సాయిబాబా
పరుగున వచ్చి మమ్మాదుకోవయ్యా" అని అరిచాడు.
అప్పుడా పెద్దపులి లేచి రోడ్డుకు కుడివైపునుండి దూకి వారివైపే చూస్తూ బండి
ప్రక్కనుంచి వెళ్ళిపోయింది. పులి
వెళ్ళిపోగానే ఎద్దులు పరుగు లంకించుకోవడం వల్ల ప్రమాదం నుండి బయట పడ్డారు. సద్గురు నామస్మరణే వారిని కాపాడింది.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment