08.02.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ అందించలేకపోయాను. ఈ రోజు 7వ.అధ్యాయం చదవండి. శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, తాత్పర్యం తరువాత ప్రచురిస్తాను.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 7వ. అధ్యాయము
మహిమ మందులో లేదు.
ఒకసారి మాధవరావు దేశ్ పాండే (శ్యామా)మొలలు పెరిగి విపరీతంగా బాధపడుతున్నాడు. అతను శ్రీసాయిబాబా వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. "మధ్యాహ్న్నం నేను మందు యిస్తాను" అన్నారు బాబా. తన ప్రియమైన భక్తుని బాధను నివారించడానికి బాబా స్వయంగా సోనాముఖి ఆకు కషాయం తయారు చేసి, ఆకషాయాన్ని శ్యామాను వెంటనే త్రాగమని చెప్పారు. ఆమందు తీసుకోగానే నొప్పి తగ్గిపోయి మొలలు తగ్గిపోయాయి.
రెండు సంవత్సరాల తరువాత శ్యామాకు మరలా మొలలు పెరిగి బాధ పెట్టసాగాయి. అంతకు ముందు శ్రీసాయి యిచ్చిన సోనాముఖి కషాయంతో తగ్గడం గుర్తుకు వచ్చి, బాబాకు చెప్పకుండా తానే యింట్లో స్వయంగా ఆమందు తయారు చేసుకొని తీసుకున్నాడు. కాని, ఈ సారి బాధ తగ్గకపోగా మరింత ఎక్కువయింది. శ్యామా బాధ భరించలేక బాబా వద్దకు వెళ్ళి తన బాధను గురించి చెప్పాడు. శ్రీసాయిబాబా తన దివ్యమయిన హస్తముతో ఆశీర్వదించగానే అతని బాధ మటుమాయమయింది.
ఈసంఘటన వల్ల తెలిసేదేమిటంటే బాబా ఆశీర్వాదంతోనే రోగాలు నయమవుతాయని. ఆయన ఆశీర్వాదములు విస్తారంగా ఉన్నపుడు ఎటువంటి మందులు అవసరం లేదని అర్ధమవుతుంది.
అమృతవాణి:
సంత్ జ్ఞానేశ్వర్ రచించిన 'అమృతవాణీ చాలా ప్రసిధ్ధి చెందిన వేదాంత గ్రంధం. సామాన్యమానవుడు దానిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందు వల్ల చాలా కొద్దిమంది మాత్రమే దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలిగేవారు. శ్రీసాయిబాబా భక్తుడయిన దాసగణు, ప్రతివారు చదివి అర్ధం చేసుకోవడానికి వీలుగా దానికి ఓవీల రూపంలో టీకా రచించాలని సంకల్పించాడు. సతారాలో ఉంటున్న ప్రఖ్యాత పండితుడు, సాధువు అయిన దాదా మహరాజ్ కు తన సంకల్పాన్ని వివరించాడు దాసగణు. అమృతవాణిని గొప్పగా వివరించగల దిట్టగా దాదా మహరాజ్ ప్రఖ్యాతుడు. కాని, దాదా మహరాజ్ దాసగణు కోరికను ఏమాత్రం ప్రోత్సహించలేదు. టీకా, అనగా వ్యాఖ్యానం రాయాలంటే ముందు నీకు మూలం క్షుణ్ణంగా అర్ధమయి ఉండాలి. నావద్ద కొద్ది మాసాలు ఉండి మూలాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యి. ఆతరువాత వివరణ రాద్దువుగాని అన్నారు దాదా మహరాజ్. ఈ మాటలు దాసగణుకు రుచించలేదు. "నేను టీకా రచించడం సాయిబాబా సంకల్పమే అయితే దానికి అవసరమయిన జ్ఞానాన్ని, సామర్ధ్యాన్ని ఆయన అనుగ్రహిస్తారు. అందుచేత ఈ విషయంలో నాకెవరి సహాయము అక్కరలేదు" అన్నాడు దాసగణు. దాసగణు ఉద్దేశ్యమేమిటో దాదా మహరాజ్ కి అర్ధం కాలేదు. కాని దాసగణుకు సహాయం చేయమని ఆయన బాబాను ప్రార్ధించారు.
కొంతకాలం తరువాత దాదా మహరాజ్, దాసగణు యిద్దరూ కలుసుకొన్నారు. అప్పటికాయన రెండు అధ్యాయాలకు టీకా రాయడం పూర్తి చేశారు. దాదా మహరాజ్ దాసగణూని, నీటీకా రాయడం ఎంతవరకు వచ్చిందని అడిగారు. దాసగణు తను రచించిన రెండు అధ్యాయాల టీకాను చదివి వినిపించాడు. అది విన్న దాదా మహరాజ్ అవ్యాఖ్యానాన్ని ఎంతో మెచ్చుకొని, బాబా నిజంగా ఎంతో సమర్ధులు. ఆయన అనుగ్రహం వల్లనే నువ్వింతటి చక్కని టీకా వ్రాయగలిగావు. ఆయన ఆశీర్వాదంతోనే నువ్వింతటి కఠినతరమయిన కార్యాన్ని సాధించగలిగావు అని ప్రశంసించారు. నీకింకెవరి సహాయము అక్కరలేదు అన్నారు.
ఊదీ
శ్రీ దాజే వామన్ చిదంబర్ స్కూలు హేడ్మాస్టర్ గా షిరిడీకి బదిలీ మీద వచ్చారు. ఆయన షిరిడీకి వచ్చిన కొంతకాలం తరువాత మేము (కాకాసాహెబ్ దీక్షిత్, ఇంకా మరికొంతమందిమి) కలుసుకున్నాము. మాటల సందర్భంలో ఆయన నాతో షిరిడీలో హేడ్ మాస్టర్ గా ఉద్యోగం చేయడం సంతోషంగా లేదని, కారణం విద్యార్ధుల వల్ల తనకు చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. పిల్లలు ఎవరూ సరిగా చదవటం లేదని చెప్పారు. వారి చదువు సరిగా లేదని దండించినప్పుడు, తాము బాబా వారిని ఊదీ అడిగుతామనీ చెప్పారు. ఆ ఊదీ తామందరూ పరీక్షలన్నిటిలోను ఉత్తిర్ణులవడానికి సహాయపడుతుందని చెప్పారు. బాబా వారినందరినీ పాడుచేస్తున్నారని అన్నారు హేడ్మాస్టర్ గారు.
5, 6 నెలల తరువాత పరీక్షలు జరిగాయి. పిల్లలందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులయారు. ఇప్పుడాయనకు శ్రీ సాయిబాబా మీద చెప్పడానికి ఎటువంటి ఆరోపణలు లేవు.
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment