10.02.2013 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 8వ.అధ్యాయం
ఇంకారాలేదా ::
నేను షిరిడీలొ ఉండగా బొంబాయినుండి నాసోదరుడినుండి ఉత్తరం వచ్చింది. ఆఉత్తరంలో బాలూ కాకాకి, నానాసాహెబ్ కరంవేల్కర్ భార్య ఇద్దరూ చాలా ప్రమాదకరమయిన జబ్బుతో ఉన్నారని రాశాడు.
ఈ విషయాన్ని నేను బాబాకు తెలిపాను. బాలూ కాకా గురించి అడిగినప్పుడు, భాబా "అతనికి త్వరలోనే నయమవుతుంది" అని చెప్పారు. కరంవేల్కర్ భార్య గురించి అడిగినప్పుడు బాబా "ఆమె ఇంకా యిక్కడకు రాలేదా" అని ఆశ్చర్యంతో అడిగారు. ఆమె ఇంకా షిరిడీకి రాలేదనీ, రమ్మని కబురు చేయమంటారా అని అడిగాను. అలాగే అని సమాధానమిచ్చారు బాబా. కొంతసేపయిన తరువాత బాలూ కాకా కి పూర్తి ఆరోగ్యం చేకూరిందనీ, కరంవేల్కర్ గారి భార్య మరణించిందనే వార్త వచ్చింది.
బాబా ఒక్క మాటంటే చాలు
హార్దాలో మేజస్ట్రేట్ గా పనిచేస్తున్న కృష్ణాజీ నారాయణ్ అనవడే శ్రీచోటా భయ్యా, 11.02.1924 న నాకొక ఉత్తరం వ్రాశారు. ఆఉత్తరంలో ని సారాంశం:
నేను చాలాకాలం ఒక విధమయిన జబ్బుతో బాధపడుతూ ఉండేవాడిని. నేనెప్పుడు భోజనం చేసినా తిన్నదంతా వాంతి అయిపోతూ ఉండేది. ఎంతోమంది డాక్టర్ ల వద్ద, ప్రముఖఆయుర్వేద డాక్టర్ ల వద్ద వైద్యం చేయించుకున్నా ఏమీ గుణం కనపడలేదు. ఆసమస్య అలాగే ఉండి నన్నింకా ఎక్కువగా బాధపెడుతూ ఉండేది.
మానాన్నగారి స్నేహితుడు శ్రీసదాశివ్ రామచంద్ర పట్వర్ధన్ గారు నాకు వైద్యం చేయించడానికి నాగపూర్ నుండి ఒక వైద్యుడిని పంపించారు. ఆయన వృధ్ధుడు. ఆయన మందు తయారుచేసి హార్దాకు తీసుకొని వచ్చారు. మొట్టమొదట ఆయన నాకు మందు మూడు పొట్లాలు ఇచ్చారు. నేను ఉదయం ఒకపొట్లం, మధ్యాహ్న్నం ఒక పొట్లం మందు వేసుకున్నాను. ఈరెండు డోసుల మందు వేసుకోవడం వల్ల నాకు విరోచనాలు మొదలయ్యాయి. నాకు రాత్రి 8 గంటలు అయేసరికి ఎన్ని అయినాయో నాకే గుర్తు లేదు. ఆదెబ్బకి నేను మంచం మీదనుంచి కూడా లేవలేనంతగా నీరసపడిపోయాను. దిగజారిపోతున్న నాపరిస్థితిని చూసి, డాక్టర్ గారు, మాకుటుంబం అంతా చాలా భయపడ్డారు. వారంతా పూజ గదిలో కూర్చొని నాకు నయమవాలని ప్రార్ధించారు. తరువాత నాకు విరోచనాలు తగ్గడానికి మందు యిచ్చారు. అయినప్పటికి రాత్రి 11 గం.వరకూ కూడా విరోచనాలు తగ్గలేదు. అప్పుడా వైధ్యుడు మానాన్నగారితో నాజబ్బుకు యిక ఏమందులు వాడవద్దని, సద్గురు శ్రీసాయిబాబా అనుగ్రహము వల్లనే పూర్తిగా నయమవుతుందని చెప్పారు.
5,6 సంవత్సరాల తరువాత నేను నాస్నేహితునితో కలిసి శ్రీసాయిబాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాను. మాలో ఎవరమూ కూడా శ్రీసాయికి నా జబ్బు గురించి ఏమీ చెప్పలేదు. శ్రీసాయిబాబా కూడా నాజబ్బుగురించి ఏమీ మాట్లాడలేదు. మరుసటి సంవత్సరం గురుపూర్ణిమ నాడు, నేను, నాసోదరుడు నారాయణరావు, మరికొంత మంది మిత్రులతో కలిసి షిరిడీ వెళ్ళాము. మేమంతా ద్వారకామాయికి వెళ్ళి శ్రీసాయిబాబా వద్ద కూర్చొన్నాము. యింతలో మౌసీబాయి అనే ఆమె అక్కడకు వచ్చింది. "మౌసీ బాయీ! ఏమి యింత ఆలశ్యమయింది?" అని బాబా ఆమెనడిగారు. అపుడామె తనకు ఎప్పుడూ వాంతులవుతున్నాయనీ అందుచేతనే ఆలశ్యయమయిందని చెప్పింది. దానికి బాబా నవ్వుతూ "నువ్వు ఎప్పుడు అపక్వ్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటావు అందుకే నీవలా బాధపడుతున్నావు" అన్నారు. వెంటనే మౌసీబాయి బాబాకాళ్ళమీద పడి తన జబ్బును నయం చేయమని ప్రార్ధించింది. బాబా ఆమెను వెంటనే ఆశీర్వదించారు.
బాబా కొంతసేపు మౌనంగా ఉండి, తరువాత నాకేసి చూపుతూ "అతడు కూడా చాలా కాలంగా నీలాగే ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా అతనికి వ్యాధి నయమవలేదు" అన్నారు బాబా. అప్పుడు నాసోదరుడు నారాయణరావు "అవును బాబా యితను చాలా కాలంగా ఆవ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం ఉండటంలేదు" అన్నాడు బాబాతో. దానికి శ్రీ సాయిబాబా "యికపై మందులన్నీ ఆపివేయమను. యిక అతనికి ఈబాధ ఉండదు" అన్నారు. ఆతరువాత ఈరోజుకు 8 సంవత్సరాలు గడిచాయి. ఆరోజునుండి ఈనాటివరకు నాకు ఒక్కసారి కూడా ఆబాధరాలేదు. అంతకు ముందు సుమారు 10,12 సంవత్సరాలు నానా రకాల మందులు వాడాను. కాని, ఫలితం లేకపోయింది. కాని, బాబా అన్నఒకేఒక్క మాటతో ఆజబ్బు పూర్తిగా నయమయింది.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment