Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 21, 2013

పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి - 1

Posted by tyagaraju on 7:01 AM
 
                                            
                                            
                              

                                                                 
21.02.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                  

                                         

శ్రీ  విష్ణుసహస్రనామ స్తోత్రం 38వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:    పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భశ్శరీరభృత్ 
         
            మహర్ధిరృధ్ధో వృధ్ధాత్మా మహాక్షో గరుడధ్వజః  ||  

తాత్పర్యం:  పరమాత్మను బొడ్దునందు పద్మము గలవానిగా, పద్మములవంటి కన్నులు గలవానిగా, మరియు పద్మమునందు పుట్టువానిగా, శరీరము నిర్వహించువానిగా, మరియూ శరీరము వృధ్ధి పొందువానిగా, ఆత్మగా వృధ్దిపొందువానిగా మరియూ వృధ్ధి పొందు రూపమే తానైనవానిగా, గొప్ప కన్ను లేక చూపు (సూర్యునిగా) గలవానిగా మరియూ గరుడ పతాకము గలవానిగా, ధ్యానము చేయుము. 

ఈ రోజునుండి సాయి.బా.ని.స. తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలు "పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి" ప్రారంభిస్తున్నాను.  తండ్రి తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలు మేము చదవడమేమిటి అనుకోకండి.  ఈ వుత్తరాలన్ని కూడా సాయి తత్వం మీద, సాయి మీద తన కుమారునికి కూడా భక్తి పెంపొందిచడానికి చేసిన ప్రయత్నమే ఈ ఉత్తరాలు.

ఓం సాయిరాం


పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి - 1


         పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి

           "మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము"

ఈ అదృష్టము నాకు 24.04.1946 నాడు లబించినది.

"అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వశ్య శరణాగతి చేయునవకాశము కలుగుట".  ఈ అవకాశము 24.04.1995 నాడు కలిగినది.

నాపాలిట సాయి మానవత్వానికి ప్రతిరూపము అయిన నాపినతండ్రి స్వర్గీయ శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులుగారి జ్ఞాపకార్ధము ఈచిన్న పుస్తకము "పుణ్యభీమి షిరిడీలో దొరికిన రత్నమణి సాయి" ను సాయి బంధువులు అందరికీ అంకితము చేస్తున్నాను.

                                                                                                                                                                     హైదరాబాద్,
                                                                                                                                                    24.04.1995
ప్రియమైన సాయి బంధువులకు

నమస్కారములు - 1989 సంవత్సరములో "పుణ్యభూమి షిరిడీలో దొరికిన రత్నమణి సాయి" ని దర్శించటము జరిగినది.  ఆనాటినుండి నాజీవిత గమ్యము మారిపోయినది.  07.06.1990 నుండి శ్రీసాయిబాబా జీవిత చరిత్రను నిత్య పారాయణ గ్రంధముగా స్వీకరించినాను.  06.01.1992 నుండి నా కుమారుడి చేత కూడా శ్రీసాయిబాబా జీవిత చరిత్ర నిత్యపారాయణ చేయించాలి అనే కోరిక కలిగినది.  అదే రోజునుండి శ్రీసాయితో నా అనుభవాలు శ్రీసాయి సత్ చరిత్రపై నా ఆలోచనలును ఉత్తరాలు రూపములో నా కుమారునికి వ్రాసినాను.  నాకృషి ఫలించినది.  నా కుమారునికి శ్రీసాయిపై ఎనలేని నమ్మకము కుదిరినది.  ఈ నా విజయానికి మూలము శ్రీసాయి ఆశీర్వచనాలు.  శ్రీసాయి యిచ్చిన ఈ విజయ ఫలము నాకు, నాకుమారునికి మాత్రమే పరిమితము కాకూడదు అనే ఉద్దేశముతో తెలుగు భాష తెలిసిన సాయి బంధువులు అందరిని ఈ ఉత్తరాలు చదవమని కోరుతున్నాను.  శ్రీసాయిని గురించి తెలియని వారు ఈ ఉత్తరాలు చదివిన తర్వాత సాయి బంధువులుగా మారితే నాకృషి ఫలించినది అని తలుస్తాను.  23.02.1992 తర్వాత నా జీవితములో జరిగిన సంఘటనలు, సాయితో నా అనుభవాలు నన్ను సాయి బా.ని.స. గా మార్చివేసినవి.  శ్రీసాయి అనుగ్రహించిన రోజున వాటినన్నిటినీ సాయి బంధువుల ముందు ఉంచటానికి ప్రయత్నిస్తాను.

శ్రీసాయి సేవలో                                                                                                                                       మీ
                                                                                                                                                    సాయి.బా.ని.స.

                                                                                                                                                                       హైదరాబాద్
                                                                                                                                                             06.01.1992
                                       1వ.అధ్యాయము  

ప్రియమైన చక్రపాణి,

నా జీవితములో 07.06.1990 గురువారము మరపురానిరోజు,  ఆనాటినుండి శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ ప్రారంభించినాను.  నీచేత కూడా శ్రీసాయి సత్ చరిత్ర నిత్య పారాయణ చేయించాలి అని ఆలోచించినాను.  ఆ ఆలోచనలకు కార్యరూపము ఈ ఉత్తరాలు. నీకు 48 ఉత్తరాలు వ్రాయదలచినాను.  ప్రతి ఉత్తరానికి ముందు శ్రీసాయి సత్ చరిత్రలో ఆ ఉత్తరానికి సంబంధించిన అధ్యాయము చదువు. దాని తర్వాత నేను వ్రాసే ఉత్తరాలు చదువు.  అపుడు శ్రీసాయితో నా అనుభవాలు నీకు అర్ధము అగుతుంది.  నీలో సాయిపై నమ్మకము పెరుగుతుంది.

శ్రీసాయిబాబా జీవిత చరిత్ర ఉపోద్ఘాతములో నీకు ఒక ప్రశ్న ఎదురు పడుతుంది.  నేను ఈ ప్రశ్నకు నీకు యిచ్చే సమాధానము మూడు వాక్యాలు (1) శ్రీ సాయి తండ్రి కొడుకుల మధ్య సంబంధము, (2) శ్రీసాయి నీకు భగవంతునికి మధ్య ఉన్న సంబంధము (3) శ్రీసాయి మంచి యజమానికి అతని బానిసకు మధ్య ఉన్న సంబంధము.  నేను మూడవ కోవకు చెందిన సంబంధము కోరుకొంటున్నాను. 

ఈ ఉపోద్ఘాతములో నిన్ను వేధించే సమస్య గురు చరిత్ర పారాయణ.  గురు చరిత్రలోని విషయాలు ఆచరణలో పెట్టడము చాలా కష్ఠము.  ఈ కష్ఠాలను దూరము చేయటానికి శ్రీ హేమాద్రిపంతు శ్రీసాయిబాబా జీవిత చరిత్రను మరాఠీ భాషలో వ్రాసినారు. శ్రీ ప్రత్తి నారాయణరావుగారు శ్రీసాయి సత్ చరిత్రను శ్రీసాయిబాబా జీవిత చరిత్రగా తెలుగులో అనువదించి మన కష్ఠాలను దూరము చేసినారు.   మనము శ్రీసాయిబాబా జీవిత చరిత్ర నిత్య పారాయణ చేసిన, గురు చరిత్రను నిత్య పారాయణ చేసినట్లే.

మొదటి అధ్యాయములోని విషయాలు చర్చించేముందు కొన్ని విషయాలు నీకు తెలియ చేయాలి.  ముఖ్యముగా నేను శ్రీసాయిబాబాను తెలుసుకొన్న విధము.  ఈ విషయాలు నీలో ఉత్సాహమును కలిగించుతుంది అని తలుస్తాను.  1964 సంవత్సరములో నేను కాకినాడ కాలేజీలో చదువుకొనే రోజులలో శ్రీ సత్యసాయి బాబా పేరు విన్నాను. ఆ రోజులలో ఆయన గురించి చాలా మంది మంచిగాను, చెడుగాను మాట్లాడుకొనేవారు.  నేను వారి మాటలపై ఎక్కువగా ఆసక్తిని కనపరచలేదు.  భగవంతుడు మానవ రూపములో ఉంటారనే ఆలోచన నాలో కలిగినది.   మరి శ్రీసత్య సాయి భగవంతుడా అనే ప్రశ్న కూడా మనసులో ఉదయించినది.  అదే రోజు రాత్రి (1964 సంవత్సరము) శ్రీసత్యసాయి నాకలలో దర్శనము యిచ్చి నాభుజము మీద చేయి వేసినారు.  నాశరీరములో విద్యుత్ తరంగాలు ప్రవహించి నేను వాటిని తట్టుకోలేని స్థితిని కలిగించినవి.    శ్రీసత్యసాయి అంటారు "నీకు యింకా సాయి తత్వము గ్రహించే శక్తి రాలేదు.  అంత వరకు నీవు సాయిని పూజించలేవు" 1964 సంవత్సరములో శ్రీషిరిడీ సాయి గురించి నాకు ఏమీ తెలియదు.  1965 సంవత్సరములో నా చదువు పూర్తి అయి ఉద్యోగములో చేరినాను. 1989 సంవత్సరములో ఒక స్నేహితుడు శ్రీషిరిడీ సాయి పటము యిచ్చినారు.  ఆ పటము యింటి గోడకు తగిలించినాను.    ఆ పటము చూస్తూ ఉంటే ఆయన చిరునవ్వు నాలో చాలా ఆలోచనలు రేకిత్తించినాయి.  ఆ ఆలోచనలకు సమాధానము వెతకనారంచించినాను.   1964 సంవత్సరములో శ్రీసత్యసాయి కలలో చెప్పిన మాటలు జ్ఞాపకము రాసాగినాయి.  1989 సంవత్సరము నాజీవితములో క్రొత్త మలుపును ప్రసాదించినది.  1989 సంవత్సరములో ఒక రాత్రి కలలో శ్రీషిరిడీసాయి ఒక అజ్ఞాత వ్యక్త్రి రూపములో అంటారు, "నీళ్ళ ట్యాంక్ ఖాళీ అయినది.  కొత్త నీరు నింపు"...   

ష్రీ షిరిడీసాయి దృష్టిలో నీళ్ళ ట్యాంక్ అంటే మనిషి మెదడు.  కొత్త నీరు అంటే కొత్త ఆలోచనలు.  ఈ క్రొత్త ఆలోచనలతో శ్రీషిరిడీసాయిని నాగురువుగా అంగీకరించినాను.    
                               
శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలోని మొదటి అధ్యాయములో శ్రీసాయినాధుడే శ్రీగణేశుడని చెప్పినారు.  అందుచేత ఏపని మొదలు పెట్టినా శ్రీసాయిని తలచుకొని నమస్కరించి ప్రారంభించు.  శ్రీవినాయకుని తలచుకొని నమస్కరించినట్లే కదా!  మన పెద్దలకు నమస్కరించటము మన సాంప్రదాయము.  శ్రీహేమాద్రి పంతు ఆసాంప్రదాయాన్ని పాటించి మనము మరచిపోయిన మన సాంప్రదాయాన్ని మనకు గుర్తు చేసినారు.  నేను ఈరోజున సుఖ సంతోషాలతో ఉన్నాను అంటే నాపితామహుడు శ్రీరావాడ సీతారామయ్య, మానాయనమ్మ శ్రీమతి సరస్వతి అమ్మ, నా తండ్రి శ్రీ రావాడ వెంకటరావు, నా తల్లి శ్రీమతి రమణమ్మ, మాబాబయ్యగారు శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు, నా పినతల్లి శ్రీమతి కామేశ్వరమ్మ గార్ల ఆశీర్వచనాలు.   వారి అందరికి నమస్కరించుతున్నాను.  శ్రీ హేమాద్రిపంతు ఈ మొదటి అధ్యాయములో తన గ్రంధము చదివే వారి అందరికీ నమస్కరించినారు.  ఈ నా ఉత్తరాలు చదివే పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు ఆశీర్వచనాలు.  శ్రీ హేమాద్రిపంతు శ్రీసాయిబాబాను దత్తావతారముగా వర్ణించినారు.  ఒకనా డు నేను ధ్యానములో ఉండగా శ్రీసాయి అన్నారు "ఈ రోజులలో అడవులలో కూడా ప్రశాంతత కరువు అయినది.  అందుచేత ప్రతి యింట దత్తదేవుని  ధ్యాన మందిరాలు కట్టుకొని ప్రశాంతముగా దత్త దేవుని ధ్యానించాలి నాభక్తులు.  మరి శ్రీసాయిబాబా దత్తాత్రేయుని అవతారమని నేను నమ్ముతాను.   శ్రీ హేమాద్రిపంతు మొదటి అధ్యాయములో శ్రీ సాయిబాబా రోజూ గోధుమలు విసరటము విషయము ప్రస్తావించినారు.  గోధుమలు విసరటములోని భావము నీకు అర్ధము అయి ఉంటుందని తలచెదను.  ఈ విషయములో నేను శ్రీసాయిని ధ్యానించినపుడు ఆయన నాకు యిచ్చిన సందేశము నీకు చెబుతాను విను - "నీవు సంఘము అనే తిరగలిలో గోధుమలు లాగ విసరబడి పిండిగా మారి నాభక్తులకు రొట్టెగా దొరకాలి".  ఈ సందేశములోని అర్ధము తెలుసుకొని ప్రతి సాయి భక్తుడు తనతోటి మానవుడు కోసము పాటుపడి సంఘానికి న్యాయము చేకూర్చాలి.  నేటికీ శ్రీసాయిబాబా గోధుమలు విసిరిన తిరగలిని షిరిడీలోని శ్రీసాయి సమాధి మందిరములోను, ద్వారకామాయిలోను చూడవచ్చును.  

                            
                                                  
అనేకమంది భక్తులు షిరిడీ వెళ్ళి ఆతిరగలి చూచి దానికి నమస్కరించుతారు.  నేను ద్వారకామాయి లోని తిరగలికి నమస్కరించినపుడు భక్త కబీరు తన శిష్యులను అడిగిన ఒక ప్రశ్న జ్ఞాపకము వచ్చినది.  కబీరు అంటారు, రాతితో చేసిన దేవుని విగ్రహాలకు మనము పూజలు చేస్తూ ఉంటాము.  మరి రాతితో చేసిన తిరగలి సంఘములోని ప్రజలకు గోధుమ పిండిని యిస్తుందే మరి అటువంటి తిరగలికి పూజ చేయటములో తప్పు ఏమిటి?

ఒకసారి శ్రీ సాయిబాబా తన పూర్వ జన్మ విషయాలు చెబుతూ అంటారు, "నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని" అంటే, శ్రీ సాయి కబీరుగా జన్మించినపుడు "సంఘములోని మనుషులు అందరు నేత మగ్గముపై నేయబడి మంచి బట్టగా తయారు అవ్వాలి" అనేవారు.  శ్రీ సాయిబాబాగా జన్మించినపుడు సంఘములోని సాయి భక్తులు అందరు తిరగలిలో విసరబడి పిండిగా మారి తోటి మానవులకు రొట్టెగా దొరకాలి" అంటారు.

పాణి !  యింతవరకు మొదటి అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయిబాబా గురించి వ్రాసిన విషయాలు శ్రీ సాయి ధ్యానములో చెప్పిన సందేశాలు నీకు చెప్పాను.  ఈరోజుకు నీవు చదివిన ఈఉత్తరములోని విషయాలు మరొక్కసారి ఆలోచించు. సంఘానికి నీవు ఎంత వరకు ఉపయోగ పడగలవు అనేది నీప్రశ్నలకు శ్రీసాయిని సమాధానము అడుగు.  సమాధానము పొంది ఆయన యిచ్చే సందేశాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు. 

యింతటితో మొదటి అధ్యాయముపై నా అనుభవాలు ముగించుతాను.  రేపటి రోజు కొత్త అనుభవాలు రావచ్చును.  సందర్భానుసారముగా నీకు తెలియచేయటానికి ప్రయత్నించుతాను.  రేపటి నా రెండవ ఉత్తరము కోసము ఎదురు చూడు.

శ్రీ సాయి సేవలో
నీ తండ్రి..   
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List