18.02.2013 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా శ్రీవిష్ణుసహస్ర నామ శ్లోకాలు తాత్పర్యం ఇవ్వలేకపోయాను. ఈరోజునుండి యధాప్రకారంగా అందిస్తున్నాను.
శ్రీవిష్ణుసహస్రనామం 35వ. శ్లోకం తాత్పర్యం:
శ్లోకం: అచ్యుతః ప్రధితః ప్రాణః ప్రాణదోవాసవానుజః |
అపాం నిధిరధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్టితః ||
తాత్పర్యం: భగవంతుని జారిపడుటలేని వానిగా, పేరుపొందిన వానిగా, ప్రాణశక్తిగా, ప్రాణశక్తిని యిచ్చువానిగా, యింద్రుని సోదరునిగా, నీటికి నివాసమైనవానిగా, అధిష్టించి యున్నవానిగా, అజాగ్రత్త లేనివానిగా, నిశ్చలముగా నిలిచియుండువానిగా, ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 10వ. అధ్యాయం
గర్భవతిగా ఉన్న నామితృని కుమార్తెకు మతిస్థిమితం లేదు. ఆమె ఎప్పుడు అరుస్తూ వస్తువులన్నిటినీ కిటికీ గుండా విసిరివేస్తూ ఉండేది.
ఆమెకు ప్రసవించే సమయం దగ్గర పడింది. కాని ప్రసవం చాలా కష్టమవచ్చని డాక్టర్స్ చెప్పారు. దానితో అందరూ చాలా ఆందోళన పడ్డారు. ఆమెను ఎల్లవేళలా కనిపెట్టుకుని వుండేలాగ ఒక మంచి నర్స్ ని నియమించారు. కాని శ్రీసాయిబాబా వారి ఆశీర్వాదంతో ఆమె సమస్యలన్ని తీరిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ ని తీసుకురావడానికి ఒక మనిషిని పంపించారు. యింకొకతను ఆమె అక్కగారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆమె అక్కగారు వెంటనే వచ్చింది. అక్కగారు ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే, ఆవిడ చెల్లెలికి ఎటువంటి కష్టం లేకుండానే మగపిల్లవాడు జన్మించాడు.
వెంకటరావు దక్షిణ కెనరాలోని ముల్కీ గ్రామ వాస్తవ్యుడు. 1916 వ. సంవత్సరంలో అతనికి క్రిస్మస్ రోజున బాబా ఫొటో ఉదీ వచ్చాయి. అతని అల్లుడు హై కోర్టులో లాయరు. అతను కనపడకుండాపోయాడు. అతను మరణించి వుండవచ్చనె వదంతులు కూడా వచ్చాయి. వెంకటరావుని అతని స్నేహితుడు షిరిడీ వెళ్ళి బాబావారిని దర్శించుకోమని ఆయన సహాయం చేస్తారని చెప్పాడు. కాని వెంకటరావుకు ఆసమయం లో షిరిడీ వెళ్ళడానికి సాధ్యపడలేదు.
ఆయన వద్ద అప్పటికే బాబా ఫొటో ఊదీ ఉండటం వల్ల, మేము ఆరతి ఇచ్చి ఆయన నుదిటి మీద ఊదీ పెట్టాము. ఇది బొంబాయిలో జరిగింది. అదే సమయంలో ముల్కీలో ఉన్న ఆయన కుమార్తెకు ఒక స్వప్నం వచ్చింది. ఆయనకు బాబా ఫొటొ వచ్చిందా అనీ ఒకవేళ వస్తే ఫలానా తారీకున, ఫలానా సమయంలో ఆరతి ఇచ్చారా అని ఆమె తన తండ్రికి ఉత్తరం వ్రాసింది.
ఉత్తరం చదవగానే, తాను బాబాకి ఆరతి ఇచ్చిన తేదీ సమయం , తన కుమార్తెకు వచ్చిన స్వప్నంలో కనిపించిన తేదీ సమయం రెండూ కూడా సరిగ్గ సరిపోవడంతో వెంకటరావు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన వెంకటరావుకు బాబాపై భక్తిని మరింతగా పెంచింది. అతని అల్లుడిని గురించిన ఎటువంటి ఆధారాలు అతనికి లభించలేదు.
కానీ బాబాపై అతని భక్తి ఏమాత్రం చెక్కు చెదరలేదు. బాబా మీద ఎంతో భక్తితో అతను ఊదీ సేవించగానే ఎన్నో వ్యాధులు నయమయాయి. ఒకసారి అతనికి గుండె నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్థితిలో అతనికి బాబా దర్శనమయింది. బాబాతో కూడా ఆయన యిద్దరు సేవకులు కనిపించారు. అతను ఎంత వద్దని వారించినా వారిద్దరూ అతని పాదాలను రుద్దసాగారు. కొంత సేపయిన తరువాత ముగ్గురూ అదృశ్యులయ్యారు. ఆతరువాత 1918 లో యీస్టర్ సెలవులకు వెంకటరావు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నాడు. తనకు వచ్చిన దివ్యదర్శనంలో కనిపించిన బాబా యిద్దరు సేవకులు బాబావద్ద కూర్చుని ఉండటం కనిపించి ఆశ్చర్యపోయాడు.
వెంకటరావు పెద్దకొడుకు ఒక నాస్తికుడు. అతడు తన తండ్రి భక్తిని, నమ్మకాలను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు. కాని, ఈసంఘటనలన్న్నీ చూసిన తరువాత అతనికి కూడా బాబాపై విశ్వాసం కుదిరి మంచి బాబా భక్తుడయ్యాడు. తనకెపుడే సమస్య వచ్చినా వెంటనే బాబా రక్షణకోసం షిరిడీకి ఉత్తరం వ్రాసేవాడు.
గోవిందరావు మొక్కు
గోవిందరావు గధ్ధే నాగపూర్ నివాసి. ఒకసారి అతని చెల్లెలు కుమారునికి ప్రమాదకరమయిన జబ్బు చేసింది. మందులెన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆస్థితిలో గోవిందరావు, పిల్లవాడికి బాగయితే షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. ఆమరుసటిరోజునుండి పిల్లవాడి ఆరోగ్యం మెరుగవడం మొదలై కొద్ది రోజుల్లో పూర్తిగా స్వస్థత చేకూరింది.
తరువాత గోవిందరావు తన మొక్కు సంగతి మరిచిపోయాడు. ఆమొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. అతనికి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయి ఎన్ని మందులువాడినా తగ్గలేదు. ఇలా ఉండగా ఒక గురువారమునాడు భజన చేసే సమయంలో అతనికి తన మొక్కు సంగతి గుర్తుకు వచ్చింది. తనకు పూర్తి ఆరోగ్యం చేకూరితే కనక తన మేనల్లునితో కలిసి బాబా దర్శనం చేసుకుంటానని మరలా ప్రార్ధించాడు. రెండు రోజులలోనే అతను పూర్తి ఆరోగ్యవంతుడయాడు. బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు
(ఆఖరి భాగం రేపు)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment