08.04.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామం 60 వ.శ్లోకం, తాత్పరయం
శ్లోకం : భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతి సత్తమః ||
తాత్పర్యం: పరమాత్మ శక్తులను, మహిమలను గలవాడు. చీకటిని నశింపచేయువాడు. ఆనందము కలుగ చేయువాడు. వన పుష్పములచే చేయబడిన మాలను ధరించినవాడు. అదితి యొక్క కుమారుడు. నాగలిని ధరించినవాడు. మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టి నంతటిని భరించి సహించువాడు. సన్మార్గమున నడచువారిలో అత్యంత ముఖ్యుడైనవాడు.
శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము
30.01.1992
ప్రియమైన చక్రపాణి,
శ్రీసాయి ఏనాడు ఏ పుస్తకము చదవలేదు. కాని, తన భక్తులచేత ఆధ్యాత్మిక రంగములో ముఖ్యమైన పుస్తకాలను తనే స్వయముగా చేతితో పట్టుకొని, ఆభక్తులను ఆశీర్వదించి, వారి చేత ఆపుస్తకాలను చదివించెను. ఆయన తన హిందూ భక్తుల చేత చదివించిన ముఖ్య పుస్తకాలలో 1. గురుచరిత్ర 2. విష్ణుసహస్ర నామము 3. గీతా రహస్యము అనేవి ముఖ్యమైనవి. మానవుని ఆధ్యాత్మిక రంగ అభివృధ్ధికి పుస్తక పఠనము కూడా చాలా అవసరము అని శ్రీసాయి ఈవిధముగా తెలియచేసినారు. సాయి భక్తులు ఈ పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయాలని కోరుతున్నారు. ఈ పుస్తకాల వ్యవహారములో రామదాసికి మరియు శ్యామాకు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీసాయి ఇలాగ అంటారు. "ధనము యిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు". ఈవిషయము నాజీవితములో అనుక్షణము జ్ఞప్తికి వస్తుంది. ధనము ఉంది అనే అహంకారముతో నీవు ఏవష్తువునైన కొనగలవు. కాని మనుష్యులను కొనలేవు. అవసరమువచ్చినపుడు మంచి పనుల నిమిత్తము ధనము విరివిగా ఖర్చు పెట్టు, వెనకాడవద్దు. ప్రతి విషయానికి ధనానికి లంకె పెట్టవద్దు. ఎవరికైన ధన సహాయము మరియు మర్యాద చేయవలసివచ్చినపుడు ప్రేమతో చేయి. డబ్బు గురించి ఆలోచించుతు మనుషులను దూరంగా ఉంచకు. ధనము ఖర్చు ఆగిపోతుంది అనే భావనతో నీబాధ్యతను నీవు చేయకపోతే భగవంతుడు ఏదో విధముగా ఆపని పూర్తి చేయించుతాడు.
ఆతర్వాత జీవించినంత కాలము ఆపని చేయలేదు అనే అసంతృప్తి నీకు మిగులుతుంది మరియు లోకులు వేసే నింద మిగులుతుంది. ఈ విషయములో నాజీవితములో జరిగిన రెండు ఉదాహరణలు వ్రాస్తాను. నాపినతల్లి భర్త నాతండ్రి దగ్గరనుండి ఏమీ ఆశించకుండానే నన్ను నా చిన్నతనములో తన యింట ఒక పది సంవత్సరాలు ఉంచు కొని నాకు విద్యాబుధ్ధులు నేర్పినారు. నా ఈ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము నేను నాపినతల్లి భర్తను మరచిపోలేను. నేను సదా వారికి కృతజ్ఞుడిని. యింక నా జీవితములో ప్రవేసించిన యింకొక వ్యక్తి నామావగారు అంటే నీ తల్లియొక్క తండ్రి. నేను ఆయన దగ్గరనుండి ధన సహాయము కోరుతాననే భయముతో ఆయన నానుండి తప్పించుకొని తిరుగుతు ఎదుట పడినపుడు నన్ను అవమానించుట వలన నేను జీవించినంత కాలము వారిని మరచిపోలేను. మొదటి వ్యక్తిని చూచినపుడు, తలచినపుడు. తలను గౌరవము, భక్తి భావనతో క్రిందకు దించుతాను. మరి రెండవ వ్యక్తి విషయములో గౌరవము, భక్తిలను ప్రదర్శించలేను. అందుచేత జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము కాదు అనే విషయాన్ని మరచిపోవద్దు. శ్రీమతి ఖాపర్దే విషయములో శ్రీసాయి ఆమె భక్తికి మెచ్చి ఆమె గత జన్మల వివరాలను మనలకు తెలియపర్చుతారు. మానవుడు మంచి పనులు చేయటము మన జన్మజన్మలలో ఏవిధముగా అభివృధ్ధి చెందుతాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును. మనము కూడా శ్రీసాయి ఆశీర్వచనములలో మంచి పనులు చేస్తు మంచి జన్మము పొందుదాము.
శ్రీ సాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment