Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 13, 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 30వ.అధ్యాయము

Posted by tyagaraju on 11:09 PM


                       
                        
14.04.2013  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్య భూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 30 వ.అధ్యాయము కాస్త పెద్దదిగా ఉండటం వల్ల గత మూడురోజులుగా ఇవ్వలేకపోయాను.  ఉగాదినాడు కూడా కుదరలేదు...అందుచేత కొంత ఆలస్యమయినా సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం లాగే ప్రతీ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడిపేలా వరమివ్వమని, బాబావారి అనుగ్రహం మనందరి మీదా ఎల్లవేళలా ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను. 
        
                  
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 63వ.శ్లోక, తాత్పర్యం

శ్లోకం:  శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః    | 

         గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః       ||

తాత్పర్యం:  ఆయన శుభమయిన శరీరము లేక విగ్రహము కలవాడు.  ఆయన సృష్టించునవి భూగోళమందంతట అయన సాన్నిధ్యముచే శాంతిని ఆనందమును జీవులకు కలిగించును.  అయన గోవులు, వృషభముల హితము కోరుచు, వాటిని గుప్తముగా నుంచి సం రక్షించును.  ఆయన వృషభ నేత్రముతో నుండి వృషభమును యిష్టపడును.     పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
30వ.అధ్యాయము

                                                              02.02.1992

ప్రియమైన చక్రపాణి,

నాజీవితములో నేను గాయత్రి మంత్రమును రోజు జపించలేదు.  వేద శాస్త్రాలు పారాయణ చేయలేదు.  కాని, శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజు పారాయణ చేయటము వలన గాయత్రి మంత్ర జపము, వేద శాస్త్రాల పారాయణ ఫలము నిత్యము నేను అనుభవించుచున్నాను. ఈ నానమ్మకాన్ని కొందరు హేళన చేయవచ్చును.  అయినా వాటిని నేను లక్ష్య పెట్టను.  మన జీవితములో ఎందరో ప్రవేశించుతారు.  మనలను వదలి వెళ్ళిపోతారు.  కాని శ్రీసాయి ఒక్కసారి మన జీవితములో ప్రవేశించిన తర్వాత మనము సాయిని వదలలేము, శ్రీసాయి మనలను వదలలేరు.  ఒకవేళ మనలో ఎవరైన శ్రీసాయిని వదలిన శ్రీసాయి మాత్రము వారిని వదలరు.  కారణము విశ్వాసమునకు మారు పేరు శ్రీసాయి.  జీవితములో అజ్ఞానమును తొలగించుకోవాలి అంటే మన మనసులో శ్రీసాయి అనే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి.  ఎవరైతే ఈ జ్ఞానజ్యోతిని వెలిగించుకొంటారో వారి జీవితము ధన్యమైనది.  ఎవరైతే ఆ జ్ఞాన జ్యోతి కాంతిలో జీవించుతారో వారు అదృష్టవంతులు.  ఎవరైన న్యాయమైన కోరికతో శ్రీసాయిని ప్రార్ధించితే, శ్రీసాయి ఆకోరిక నెరవేర్చెదరు.  ఈ 30వ. అధ్యాయములో శ్రీసాయి సత్చరిత్రలో హేమాద్రిపంతు ఈవిధముగా అంటారు.  "వాదించువారు, విమర్శించువారు ఈ కధలను చవనక్కరలేదు".  నేను మాత్రము అలాగ అనను.  దయచేసి పూర్తిగా నేను వ్రాస్తున్న ఈ ఉత్తరాలు అన్నీ చదువు.  చదివిన తర్వాత నీమనసులో ఈ శ్రీసాయి ఎవరు?  ఆయన పిలుస్తే పలుకుతాడా? ఏదీ ఒక్కసారి ప్రయత్నించుదాము అని మనస్పూర్తిగా శ్రీసాయి సత్ చరిత్రను నిష్టతో పారాయణ చేసి ఆయన తత్వాన్ని అర్ధము చేసుకొని పిలచి చూడు.  ఆయన పలకకపోతే నన్ను దూషించు. ఈ ఉత్తరములో శ్రీసాయి నాకు చూపిన చిన్న లీలను నీకు వ్రాస్తాను. 

1991 డిశంబరు నెలలో మనసుకు శాంతిలేక బాధ పడుతుంటే 16.12.1991 నాటికి శిరిడీ యాత్ర నిమిత్తము ఒక పది రోజుల ముందుగా టికెట్టు రిజర్వు చేసుకొన్నాను.  16.12.1991 నాడు ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేయసాగాను.  ఆరోజున శ్రీసాయి సత్ చరిత్రలో బాబా యిచ్చిన సందేశము నన్ను చాలా సంతోషపరచినది.  అది 30వ. అధ్యాములో "బాబా వద్దకు పొమ్ము, నీమనస్సు శాంతి వహించును".  ఆ సందేశముతో శిరిడీ యాత్ర పూర్తి చేసినాను.  శ్రీసాయి ఆశీర్వచనాలతో తిరిగి యింటికి చేరుకొన్నాను.  కాకాజీ విషయములో శ్రీహేమాద్రిపంతు యిలాగ వ్రాస్తారు - "దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహముతో వచ్చును.  మరి నావిషయములోను అలాగే జరిగినది.  1989 జూన్, జూలై నెలలలో నేను మొదటిసారి శిరిడీకి బయలుదేరిన రోజున శ్రీసాయి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణములో నాకు దర్శనము యిచ్చి నానుండి ఒక రూపాయి దక్షిణగా స్వీకరించిన సంఘటన నీకు నేను వెనకటి ఉత్తరాలలో వ్రాసి యున్నాను గుర్తు చేసుకో.  శ్రీసాయి సమాధి చెందకముందు భక్తులు పొందిన అనుభవాలు అన్ని నిజమైనవి అని చెప్పడానికి నాబోటి సాయి బంధువులు ఈనాడు శ్రీసాయితో అనుభవించిన అనుభవాలు తోటి సాయి బంధువులకు తెలియ చేయటము ఎంత అయినా అవసరము. 

కాకాజీ శిరిడీకి వెళ్లటానికి కోరికను శ్యామాకు వాణి అనె పట్టణములో సప్త శృంగిదేవతకు మ్రొక్కు తీర్చుకోవాలి అనే కోరికను, శ్రీసాయి ఏవిధముగా తీర్చినది మనము ఒక్కసారి అలోచించితే శ్రీసాయి సర్వదేవతా స్వరూపుడు అని బలమైన నమ్మకము మనలో కలుగుతుంది.  ఈ నమ్మకాన్ని నేను స్వయముగా అనుభవించినాను.  నేను 1990 సంవత్సరము తర్వాత శ్రీతిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన, రాజస్థాన్ లోని రణతంభోర్ లోని గణేశ్ మందిరానికి వెళ్ళిన, 
                 

కొరియాలోని చాంగ్  వాన్ పట్టణములోని బౌధ్ధ దేవాలయానికి వెళ్ళిన నేను శ్రీసాయి నాధుని ఆమందిరాలలో చూడగలిగినాను.  

         
అందుచేతనే నేను శ్రీసాయి సకల దేవా స్వరూపుడు అని గట్టి నమ్మకముతో అంటాను.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్యామాకు కాకాజీకి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకో.  బహుశ నీకు జ్ఞాపకము యుండకపోవచ్చును.  తిరిగి వ్రాస్తున్నాను.  "మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినారు" అని కాకాజీ శ్యామాను అడిగెను.  "నాది శిరిడి,, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకిక్కడకు వచ్చినా" నని శ్యామా అనెను.  శిరిడీనుండి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను.  

యిటువంటి సంఘటన నా జీవితములో జరిగినది.  06.05.1991 నాడు తెల్లవారుజాము 01.30 నిమిషాలు బొంబాయినుండి విమానములో కొరియా దేశమునకు ప్రయాణము ప్రారంభించినాను.  విమాన ప్రయాణము అంటేనే భయము.  విమానము ఆకాశములోనికి ఎగరటము కోసము యింజను పని చేయటము ప్రారంభము అయినది.  నా మనసు భయముతో నిండిపోయినది. 

విమానము నేల మీద వేగముగా ప్రయాణము చేస్తున్నది.  నాగుండె వేగముగ కొట్టుకోవటము ప్రారంభించినది.  విమానము ఒక్కసారిగా నేలను వదలి ఆకాశములోనికి దూసుకునిపోతున్నది.  నాప్రాణాలు పైలోకాలకు వెళ్ళిపోతున్న అనుభూతి కలుగుతున్నది.  కండ్లు మూసుకొని శ్రీసాయి నామము జపించుతున్నాను.  నామనసులో శ్రీసాయి తప్ప యింకొకరు ఎవరు లేరు.  ఒక పదినిమిషాల తర్వాత విమానములోని స్పీకర్ల ద్వారా పైలట్ విమానములోని ప్రయాణీకులను ఉద్దేశించి మాట్లాడుతు "విమానము 40 వేల అడుగుల ఎత్తులో గంటకు 900 మైళ్ళ వేగముతో ప్రయాణము చేస్తున్నది, విమానము బయట వాతావరణము 40డిగ్రీల సెంటిగ్రేడ్ (నీరు గడ్డకట్టదానికి కావలసిన చల్లదనము కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత - 40 డి.).  మీ నడుముకు కట్టుకొన్న బెల్టులను విడదీసుకొని విశ్రాంతి తీసుకోండి".  ఆమాటలను విన్న తర్వాత ప్రశాంతముగా ఊపిరి పీల్చుకొని కండ్లు తెరచినాను.  నాప్రక్క సీటులో ఒక ఆజానుభావుడు సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఒక వ్యక్తిని చూసినాను.  ఆవ్యక్తి ఆగ్లేయుడిలాగ యున్నాడు.  ఆవ్యక్తిలోని చిరునవ్వుని చూడగానే నామనసులోని భయము పూర్తిగా తొలగిపోయినది.  అవ్యక్తితో మాట్లాడాలని మనసులో కోరిక కలిగినది. "మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినారు" అని ఆనాడు కాకాజీ శ్యామాను అడిగినట్లుగా నేను ఆవ్యక్తిని అడిగినాను.  దానికి సమాధానము నీవు ఊహించగలవా!  అవ్యక్తి యిచ్చిన సమాధానము నన్ను ఆశ్చర్యముతో ముంచివేసినది.  విమాన ప్రయాణము ప్రారంభములో హడావిడిగా అవ్యక్తి వచ్చి నాప్రక్క సీటులో కూర్చుండినాడు. యింతలో విమానము బయలుదేరినది.అపుడు నేను ఆవ్యక్తితో మాట్లాడలేదు.  నామనసులోని భయాన్ని తొలగించమని శ్రీసాయినాధుని నామ జపము చేస్తున్నాను.  కండ్లు తెరచి ప్రక్క సీటులోని ఆవ్యక్తిని చూసి మీరు ఎవరు? ఎచ్చటనుండి వస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆవ్యక్తి యిచ్చిన సమాధానము నీకు తెలిసి యుంటుంది.  నీఊహ సరయినది.  అవ్యక్తి నోటినుండి వచ్చిన సమాధానము యిక్కడ వ్రాస్తాను విను.  "నేను హిందువుడిని, శిరిడీసాయిబాబాను దర్శనము చేసుకొని తిన్నగా విమానాశ్రయమునకు వచ్చి హాంగ్ కాంగ్  వెళ్ళటానికి ఈవిమానము ఎక్కినాను".  ఈమాటలు వింటు ఉంటే నాశరీరముపై ఉన్న రోమాలు ఒక్కసారిగా ఆనందముతో నిలబడిపోయినాయి.  ఆ ఆనందములో నానోట మాట రావటము లేదు.  నేను భయ ఆందోళనలతో పది నిమిషాలపాటు శ్రీసాయి నామము జపించి కళ్ళు తెరచి ప్రక్క సీటులో ఉన్న వ్యక్తిలో సాక్షాత్తు శ్రీసాయి ఉన్నారు అనే అనుభూతి పొంది ఆవ్యక్తి చేతులను పట్టుకొని శ్రీసాయికి మనసులో నమస్కరించినాను. 

ఆవిమాన ప్రయాణములో ఆవ్యక్తితో చాలా సంతోషముగా మాట్లాడినాను.  తెల్లవారు జామున శ్రీసాయినాధుని హారతి చదువుతుంటే ఆవ్యక్తి తనకూ వినాలని ఉంది అని కోరిక వ్యక్త పరచటము చేత మెల్లిగా అవ్యక్తికి మాత్రమే వినబడేలాగ ఆరతి చదివినాను.  ఆరతి పూర్తి అయిన సమయము భారతీయ కాలమానము ప్రకారము ఉదయము 5.30 నిమిషాలు కాని విమానములో సమయము 8.30 నిమిషాలు.  విమానములోని ఎయిర్ హోస్టస్ మాకు యిచ్చిన అల్పాహారమును శ్రీసాయికి నైవేద్యముగా సమర్పించి ఆప్రసాదమును మేము యిద్ద్దరము తింటు ఈ ప్రసాదము శ్రీసాయినాధులు యిచ్చిన ప్రసాదము అని అన్నాను.  ఆవ్యక్తి నాతో వేళాకోళముగా మాట్లాడుతు నీవు యిది శ్రీసాయినాధులు పంపిన ప్రసాదమని నిరూపించగలవా అనిప్రశ్నించినారు.  నేను ఏమి సమాధానము యివ్వాలి అనే మీమాంసతో ఉండిపోయినాను.  ఆ అల్పాహారము పళ్ళెము మీద యింగ్లీషు భాషలో SWISSAIR                  అని వ్రాసి యుందీ.  నేను నాజేబులోని పెన్ను తీసుకొని  SWISSAIR   లోనిSAI   క్రింద గీత గీసి చూపించినాను.ఆవ్యక్తి సంతోషముతో ఆవిమానములో ఉన్న అమ్మకాల దుకాణమునుండి పెద్ద చాక్ లెట్లు (మిఠాయి) ప్యాకెట్ కొని నాకు యిస్తు ఉంటే నేను పొందిన అనుభూతి చెప్పమంటావా- సాక్షాత్తు శ్రీసాయినాధుడు తన భక్తుని ఆశీర్వదించి మిఠాయి యిస్తున్న అనుభూతిని పొందినాను.  యింతలో విమానము హాంగ్  కాంగ్ చేరుకొన్నది.  ఆవ్యక్తి విమానము దిగిపోతు ఉంటే అతని చిరునామ అడిగినాను.  అవ్యక్తి తన చిరునామా ఉన్న విజిటింగ్ కార్డు యిచ్చినాడు.  యిండియాకు వెళ్ళిన తర్వాత ఉత్తరము వ్రాయమని కోరినాడు.  21.05.91 నాడు తిరిగి హైద్రాబాద్ వచ్చిన తర్వాత ఆవ్యక్తికి  కృతజ్ఞతలు తెలుపుతు రెండు ఉత్తరాలు వ్రాసినాను.  కాని నారెండు ఉత్తరాలకు సమాధానము రాలేదు.  ఒకరోజున ఆవ్యక్తి యిచ్చిన విజిటింగ్ కార్డు శ్రధ్ధగా చూసినాను.  ఆవిజిటింగ్ కార్డుపై ఒక బొమ్మ నన్ను ఆశ్చ్ర్యపరచినది. ఆ బొమ్మ భూగోళము.  ఆవిజిటింగ్ కార్డు చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనలను వ్రాస్తాను.  నన్ను అర్ధము చేసుకో.  నేను ఎంతటి మూర్ఖుడిని.  సాక్షాత్తు శ్రీసాయి నాప్రక్కన కూర్చుని నాతో విమానములో  ప్రయాణము చేసినపుడు నేను ఆయనను గుర్తించలేదు.  యిండియాకు వెళ్ళి ఉత్తరము వ్రాయమన్నపుడు ఆవిజిటింగ్ కార్డును సరిగా అర్ధము చేసుకోలేదు.  ఆవ్యక్తినుండి నామొదటి ఉత్తరమునకు సమాధానము రానప్పుడు ఆవ్యక్తి సాక్షాత్తు సాయినాధుడు అని గుర్తించలేదు.  రెండవ ఉత్తరానికి కూడా సమాధానము రాకపోతే ఆవిజిటింగ్ కార్డులోని భూగోళము ఫొటో చూసి అప్పుడు గ్రహించినాను.  ఆవ్యక్తి సాక్షాత్తు శ్రీసాయినాధుడు అని.  మరి అటువంటి శ్రీసాయికి ఎడ్రసు ఏమిటి?  ఆయన ఈభూగోళము అంతా వ్యాపించ్జియున్నారు అన్న విషయాన్ని ఎంత ఆలస్యముగా గ్రహించినాను.  ఈఆలోచనలను అన్నిటిని నీముందు ఉంచినాను.  నీవు కూడా నా ఆలోచనలలో మునిగి శ్రీసాయి ఈ భూగోళము అంతా వ్యాపించి యున్నారు అని గ్రహించగలగిన రోజున ఈ నాఉత్తరాలకు ఒక ప్రయోజనము ఉంది అని భావించుతాను.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి. 


గమనిక: నేను సాయి.బా.ని.స.గారి ఇంటికి వెళ్ళినపుడు నాకు ఆయన శ్రీసాయినాధులవారు స్వయంగా ఇచ్చిన విజిటింగ్ కార్డును చూపించారు. నేను మరలా ఆయననను కలసినపుడు ఆవిజిటింక్ కార్డ్ ను స్కాన్ చేసి మీకందరికీ కూడా చూసే భాగ్యాన్ని ఆసాయినాధుల ద్వారా కలిగించుతాను. .. త్యాగరాజు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment