16.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్ర నామం 64వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : అనివర్తీనివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్చివః |
శ్రీవత్స వక్షాశ్రీవాసశ్రీపతిః శ్రీమతాం వరః ||
తాత్పర్యం: పరమాత్మను తన పధమునుండి వెనుకకు మరలనివానిగా, కర్మలకు లోబడని ఆత్మకలవానిగా, వస్తువులను, సంఘటనలను చక్కగా కూర్చి క్షేమము కలిగించువానిగా, శుభము కలిగించువానిగా, వక్షస్థలముపై శుభమయిన చిహ్నము కలవానిగా, సంపదలకు వైభవములకు అతీతమై యుండి రక్షించువానిగా, సంపదలు కలిగించువారిలో ఉత్తమునిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
31వ. అధ్యాయము
03.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో, శ్రీసాయి కొంత మంది భక్తులకు శిరిడీలో తన సమక్షములో ముక్తిని ప్రసాదించిన సంఘటనలు వివరింపబడినవి. వారు చాలా అదృష్టవంతులు.
శ్రీసాయి సన్నిధిలో ఒక కౄర జంతువు (పులి) కూడా మోక్షమును పొందినది. యివి ఆనాడు శిరిడీలో జరిగిన విషయాలు. నాకంటి ముందు శ్రీసాయి తన భక్తుడు, నాపాలిట సాక్షాత్తు సాయి స్వరూపుడు, నా పినతల్లి భర్త శ్రీఉపాధ్యాయుల సోమయాజులుగారికి ముక్తిని ప్రసాదించినారు. ఆ వివరాలు నీకు ముందు ముందు ఉత్తరాలలో వ్రాస్తాను. ఈ అధ్యాయములో నన్ను ఆకర్షించిన విషయాలు నీకు వ్రాస్తాను. ఈ అధ్యాయము ప్రారంభములో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఉదహరించినారు. "ఎవరయితే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. జీవిత కాలమమంత అరిషడ్ వర్గాలలో గడిపివేసి అజ్ఞానముతో జీవితము ముగించినవాడికి భగవంతుడు ముక్తిని ఏవిధముగా ప్రసాదించుతాడు ఆలోచించు. అందుచేత భగవంతుని గురించి తెలుసుకోవటానికి వయసుతో పని లేదు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆరాటన, తపన యుండాలి. ఆరెండు యున్ననాడు భగవంతుడు ఏదో ఒక రూపములో మనముందు నిలబడి మనతో కలసిమెలసి జీవిస్తాడు. సన్యాసి విజయానంద్ విషయములో శ్రీసాయి అంటారు "కాషాయ వస్త్రాలు ధరించువానికి దేనియందు అభిమానము యుండరాదు" అందుచేత కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతివాడు సన్యాసి కాడు. శ్రీసాయి ఏనాడు కాషాయ వస్త్రాలు ధరించలేదు. వారు మహాయోగీశ్వరుడు. సన్యాసికి నిజమైన అర్ధము మనకు సాయిలోనే కనిపించుతుంది. శ్రీసాయి ఏనాడు తన భక్తులనుండి ఏమీ కోరలేదు. వారు తన భక్తులనుండి ప్రేమను మాత్రమే కోరినారు. వారు భక్తులనుండి ప్రేమను స్వీకరించి తన భక్తుల శ్రేయస్సు కొరకు తన శక్తిని వారికి ధారపోసినారు. ఈ కలియుగములో శ్రీసాయి వంటి యోగీశ్వరుని మనము యింక చూడలేము. నేడు మన మధ్యయున్న సన్యాసులు అందరు మననుండి వస్తు రూపేణా, ధన రూపేణా ఏదో ఒకటి తీసుకొని మనకు పుస్తకాలలో దొరికే జ్ఞానాన్ని మనకు చక్కగా చదివి వినిపించుతున్నారు. పుస్తక జ్ఞానము కలిగిన వ్యక్తి యింకొక వ్యక్తికి తన జ్ఞానాన్ని తెలియచటానికి కాషాయ వస్త్రాలు ధరించవలసిన అవసరము లేదు అని నేను భావించుతాను. ఈ నాబావంతో చాలా మంది ఏకీభవించవచ్చును. యింతకంటే ఎక్కుగా ఈ విషయములో వ్రాయటము మంచిది కాదు. సన్యాసి విజయానంద్ మరణ కాలములో శ్రీసాయి ఆయన చేత "రామవిజయము" చదివించినారు. మరణానంతరము ఆసన్యాసికి శ్రీసాయి సద్గతి ప్రసాదించినారు. నేను నా జీవితములో నాపాలిట సాయి, నా అన్నదాత, విద్యాదాత నాపినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులుగారి మరణ కాలములో శ్రీసోమయాజులుగారికి ముక్తిని ప్రసాదించమని శ్రీసాయిని కోరినపుడు శ్రీసాయి నాచేత "రాజారాం" అనే మంత్రమును శ్రీసోమయాజులుగారి చెవిలో చెప్పించినారు. శ్రీసోమయాజులు బాబయ్యగారు ఆమంత్రమును నోటితో పలుకుతు ప్రాణాలు వదలినారు.
శ్రీబాలారాం మాన్ కర్ విషయములో శ్రీసాయి ప్రత్యేక ప్రేమను చూపించినారు. శ్రీసాయి శిరిడీలో యుండగా శ్రీమాన్ కర్ కు మచ్చింద్రగడములో దర్శనము యిచ్చి తాను సత్వాంతర్యామి అని నిరూపించినారు. శ్రీమాన్ కర్ బంద్రాకు రైలులో ప్రయాణమునకు సిధ్ధపడినపుడు టికెట్టు లభించక బాధ పడుతున్న సమయములో శ్రీసాయి ఒక జానపదుని వేషములో (పల్లెటూరివాని వేషములో) వచ్చి టికెట్టు యిచ్చి అదృశ్యుడు అయినాడు. శ్రీ సాయి సముఖములో బాలారాం ఈప్రపంచాన్ని వదలిన అదృష్టవంతుడు. మనము శ్రీసాయి యందు భక్తి ప్రేమలను కలిగిననాడు శ్రీసాయి ఏదో ఒక రూపములో మన ముందుకు వచ్చి మనలను కాపాడును. ఈవిషయాలు సమయము, సందర్భము వచ్చినపుడు ముందు ముందు ఉత్తరాలలో నీకు వ్రాస్తాను. యిక తాత్యాసాహెబు నూల్కర్ విషయము ఆలోచించు. దాము, అతను బాబాకు పరీక్ష పెట్టిన మహాభక్తుడు. మనము సాధారణముగా భగవంతుడు భక్తునికి పరీక్ష పెట్టిన సందర్భాలను చాలా చుస్తాము. కాని నూల్కర్ తనకు ఫలానాది కావాలి అది దొరికితేనే శిరిడీ వెళ్ళి శ్రీసాయి దర్శనము చేస్తాను అని మొండి పట్టుదలతో ఉన్నపుడు శ్రీసాయి తన భక్తుని కోరిక తీర్చి తన భక్తునిని శిరిడీకి రప్పించుకొన్నారు. శ్రీనూల్కర్ మరణించిన తర్వాత శ్రీసాయి అంటారు "అయ్యో! తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు" అటువంటి అదృష్టవంతుడు తాత్యా సాహెబు నూల్కర్.
యిక మేఘశ్యాముడు శ్రీసాయి సత్ చరిత్రలో మనము మరచిపోలేని మహావ్యక్తి. తను చదువురాని వాడు అయినా తన అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీసాయిని ఆకట్టుకొని ఈలోకమునుండి వెళ్ళిపోయెను. శ్రీసాయి ఏనాడు కన్నీళ్ళు పెట్టుకోలేదు. మేఘశ్యాముడు చనిపోయినపుడు శ్రీసాయి సామాన్య మానవుడిలాగ ఏడ్చి, మేఘుని అంతిమ సంస్కారాలు దగ్గర ఉండి జరిపించినారు. "యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షీంపబడుదురు" అంటారు శ్రీహేమాద్రిపంతు. మరి శ్రీసాయి నావిషయములో ఏమి అదృష్టము కలిగించెదరో నాకు తెలియదు. తెలియవలసినది నీకు.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment