19.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
గత రెండు రోజులుగా ప్రచురణకు కొంత అంతరాయం కలిగింది.విపరీతమయిన కరెంటుకోత, ఇన్వర్టర్ ఉన్నా నెట్ కనెక్షన్ ప్రతి అయిదు నిమిషాలకు అంతరాయం కలగడం వల్ల ప్రచురించలేకపోయాను.. ఈ రోజు శ్రీ విష్ణుసహస్ర నామం 66వ.శ్లోకంతో ప్రారంభిస్తున్నాను.
శ్రీవిష్ణు సహస్ర నామం 66వ.శ్లోక, తాత్పర్యం
శ్లోకం: స్వక్షస్స్వంగ శ్శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్చిన్న సంశయః ||
తాత్పర్యం: పరమాత్మను చక్కని నేత్రములు, అవయవములు కలవానిగా, నూరు విధముల యితరులకానందము కలిగించువానిగా, జీవుల కానందము కలిగించు వృషభరాశిగా, అన్నిటియందలి కాంతిగా, గణములకు అధిపతియైనవానిగా, ఆత్మచే అన్నిటినీ నడుపువానిగా, మరియూ లోబరచుకొన్నవానిగా, మంచి పేరు మరియూ కీర్తి కలవానిగా, సందేహము నివృత్తి చేయువానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 32వ.అధ్యాయం
04.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు గురు శిష్యుల సంబంధము అనుబంధములపై చాలా చక్కగా వివరించినారు. శ్రీ సాయి తనకు తన గురువుకు మధ్య ఉన్న అనుబంధమును చక్కగా వివరించి చెప్పినారు. ఈ విషయములో నేను నీకు ఎక్కువగా చెప్పను కాని ఒకటి రెండు మాటలు చెబుతాను కొంచము విను.
నీ చిన్నతనములో నీ తల్లి నీకు ఆట, మాట, పాట నేర్పినది. బడిలో గురువు నీకు విద్యా బుధ్ధులు నేర్పినారు. ప్రకృతి నీకు బ్రతుకు తెరువు నేర్పినది. యివి అన్ని నీవు యితరుల దగ్గరనుండి నేర్చుకొన్నావు. మరి నీవు మానవ జన్మ ఎత్తినందులకు దానిని సార్ధకము చేసుకోవాలి. మానవ జన్మను సార్ధకము చేసుకోవటానికి సమర్ధ సద్గురువు చాలా అవసరము. ఆటువంటి సమర్ధ సద్గురువు మన సాయిబాబా. అజ్ఞానము అనే అడవిలో దారి తెన్ను తెలియక నలుగురు స్నేహితులు తిరుగుతున్నపుడు వారిలో ఒకరైన శ్రీసాయి ఏవిధముగా ప్రవర్తించి తన గురువు సహాయముతో అజ్ఞానమునుండి బయట పడినది మనము చదివి అర్ధము చేసుకొంటే గురువు యొక్క అవసరము ఎంత యున్నది మనకే అర్ధము అగుతుంది. ఈ అధ్యాయములో శ్రీసాయి చెప్పిన మంచి మాటలు నిత్యము జ్ఞాపకము ఉంచుకో. అవి "ఉత్త కడుపుతో చేయు అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసి వేయకుడు. భోజన పదార్ధములు అర్పించుట శుభసూచకములు" నీకు జ్ఞాపకము యుండి ఉంటుంది. నీవు మన యింటిలో భోజనము చేస్తు ఎంత విసురుగా ప్రవర్తించేవాడివి. మీ అమ్మ వండిన పదార్ధములు రుచిగా లేవని తూలనాడేవాడివి.
నీవు ఆవిధముగా భోజనము దగ్గర ప్రవర్తించేటప్పుడు నేను నీకు శ్రీసాయి చెప్పిన మాటలు గుర్తు చేస్తు "అన్నము పరబ్రహ్మ స్వరూపమని" చెబుతూ ఉండేవాడిని. యిపుడు నీకు వయస్సు పెరిగినది. నేను ఎక్కువగా చెప్పనవసరము లేదు. భోజనము చేసేముందు శ్రీసాయిని ధ్యానించుకొని భోజనము చేయి. నీమంచి చెడ్డలు అన్ని ఆయనే చూసుకొంటారు. నిన్ను సరయిన మార్గములో నడిపించుతారు. ఎలాగా భోజనము ప్రస్తావన వచ్చినది. శ్రీసాయి ఈ భోజనము గురించి ఏమంటారు అనేది తెలుసుకోవలసి యున్నది. ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు వ్రాస్తారు "బాబా ఎన్నడు ఉపవసించలేదు. యితరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్ధమెట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము". అలాగని విపరీతముగా భోజనము చేస్తు ఈ శరీరమును కదలలేని గుఱ్ఱములాగ చేయవద్దు. యిదే అధ్యాయములో శ్రీసాయి యొక్క మాటలను శ్రీహేమాద్రిపంతు ఈవిధముగా వ్రాసినారు "ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిదికాదు. ఆహారములో మితి (తక్కువ) శరీరమునకు మనస్సుకు కూడా మంచిది. ఈ అధ్యాయములో శ్రీసాయి తన కధ చెప్పినారు. అందులో ఆయన తనకు, బట్టలపై చేయు అల్లిక పనివారికి అని వ్రాసినారు. తన యజమాని (భగవంతుడు) తనకు 600 రూపాయలు జీతమిచ్చెను అని చెప్పినారు. యిక్కడ 600/- రూపాయలు అంటే 600 సంవత్సరాలు అని చెప్పవచ్చును. యిక్కడ బట్టలపై అల్లిక పని అంటే మన జీవితాలును మంచి మార్గములో పెట్టడము అని అర్ధము.
భగవంతుడు మన అందరిని జరీ పనితనము లేని సాధారణ నేత వస్త్రాలగా తయారు చేసి ఈభూలోకానికి పంపినాడు. శ్రీసాయి వంటి మంచి పనివాళ్ళను ఈభూలోకానికి పంపి సాధరణ నేత వస్త్రాలపై మంచి జరీ అల్లిక పనిని చేయించెను. శ్రీసాయి యోగీశ్వరులలో యోగిరాజ్, అటువంటి వారి పాదాలను మనము నమ్ముకోవటము మన అదృష్ష్ఠము. ఆయన మన సాధారణ జీవితానికి జరీ అల్లిక పని చేసి మన జీవితాలను తీర్చి దిద్దుతారు. భగవంతుడు వారికి ఈపనిని 600 సంవత్సరాలు చేయమని ఈభూలోకానికి పంపియుంటారు. ఎవరో చెప్పగా విన్నాను. భగవంతుడు శ్రీరాఘవేద్రస్వామిని కూడా 600 సంవత్సరాలుపాటు ఈభూలోకములో యుంటు యిక్కడ యున్న జనులకు భక్తి మార్గము బోధించమన్నారని. అందుచేత శ్రీరాఘవేద్రస్వామి ఈలోకంలో మన మధ్య లేకపోయినా ఆయన పవిత్ర ఆత్మ ఈభూమండలములో తిరుగుతున్నదని ఆయనను నమ్ముకున్న భక్తులు అంటారు. శ్రీసాయి 1918 సంవత్సరములో మహాసమాధి అయినా, ఆయన పవిత్ర ఆత్మ 600 సంవత్సరాలు ఈ భూమండలముపై తిరుగుతు తన భక్తులను ఎల్లపుడు కాపాడుతు యుంటుంది. యిది నేను ఏపుస్తకమునుండి చదివి చెప్పీంది కాదు. నాకు ఎవ్వరును చెప్పలేదు. యిది నా ఊహ మాత్రమె. ఈ నాఊహను బలపరచటానికి ఒక చిన్న సంఘటనను వివరించుతాను. శ్రీసాయి ఏనాడు తన చినిగిన బట్టలను యితరులచేత కుట్టించుకోలేదు. మధ్యాహ్ న్న సమయములో ద్వారకామాయిలో ఏకాంతముగా యున్నపుడు తన చినిగిన కఫనీని స్వయముగా సూది దారముతో కుట్ట్లుకొనేవారు. దీని అర్ధము ఏమిటి ఆలోచించు. నీకు తోచిన అర్ధము నీకు వ్రాస్తాను. ఈవిషయములో చర్చించటము అవసరము లేదు. శ్రీసాయి చినిగిన వస్త్రమును కుడుతున్నారు అంటే ఎక్కడో తన భకుని జీవితము చినిగి యుండి యుంటుంది. ఆభక్తుని జీవిస్తాన్ని తిరిగి ఉధ్ధరించుతున్నారని భావించుదాము.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment