06.08.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ.అధ్యాయం
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 79వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ |
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ||
పరమాత్మను బంగారు వర్ణముగా, చక్కని శబ్దములతో, వర్ణములతో కూడిన నామముకలవానిగా, బంగారు చాయగలిగిన తన అవయవములందు గంధపు పూతగలవానిగా, ఆయన అవయవములు పొందిక కలవిగా, అతిక్రమిమించువారిని తన పరాక్రమముతో సం హరించువానిగా, అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసముగా, నేతిని స్వీకరించు అగ్నిగా, కదలునట్టి వాయువుగా, కదలని చోటుగా, తనచే నిండిన శూన్యముగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ. అధ్యాయము
19.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు శ్రీసాయియొక్క అనంతత్వాన్ని, భక్తులపై వారికి యున్న ప్రేమను వర్ణించినారు. యిటువంటి సద్గురువు మనకు లభించటము మన పూర్వ జన్మ సుకృతము. ప్రేమయొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వివరింపబడినది. ఒక్కొక్కసారి అనిపించుతుంది - నీవు నీతోటివాడిని ప్రేమించకపోతే నీవు శ్రీసాయి భక్తుడివి అని చెప్పుకోగలవా.
ఈ ప్రశ్న ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు. ప్రతి ఒక్కరు తమలో తాము ప్రశ్న వేసుకొంటే చాలు. ఈ ప్రశ్నకు సమాధానము, అవును నేను నాతోటివాడిని ప్రేమించుతాను అని నీమనసు చెబితే నీవు శ్రీసాయికి ప్రీతిపాత్రుడివి - అందులో ఎట్టి వివాదము లేదు. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీ షేవడే తనతోటి విద్యార్ధులను ఉద్దేశించి ధైర్యముతో అన్న మాటలు నాలో కూడా ధైర్యాన్ని కలిగించుతున్నాయి. - "నేను పూర్తిగా వారినే నమ్మి యున్నాను. వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదును." ప్రతి సాయి బంధు తన జీవితములో ఏదైన విషమ పరీక్ష వచ్చినపుడు శ్రీసాయిని స్వచ్చమైన మనసుతో ప్రార్ధించి ఆపరీక్షలో విజయాన్ని సాధించి యుంటారు. మరి నేను శ్రీసాయిని స్వచ్చమైన మనసుతో ప్రార్ధించిన ప్రార్ధన ఒక్కటే. అది నీకు కొంచము కష్ఠము అనిపించవచ్చు. - "మరి నాజీవితములో నాంతిమ శ్వాస గురువారము నాడు శ్రీసాయి పాదాల మీద వదలాలని ఉంది. యిది నాకు శ్రీసాయికి మధ్య ఉన్న పరీక్ష. శ్రీసాయి దయతో నేను విజయాన్ని సాధించుతాను అనే నమ్మకము ఉంది. ఈ నానమ్మకానికి సాక్షిగా నిలబడవలసినది నీవు. విజయాన్ని ప్రసాదించవలసినది శ్రీసాయి. ఈ రోజు నిత్యపారాయణలో శ్రీసాయి యిచ్చిన సందేశము - "ఈపాదములు ముదుసలివి, పవిత్రమైనవి. యిక నీకష్ఠములు తీరిపోయినవి. నాయందే నమ్మకము ఉంచుము. నీమనోభీష్ఠము నెరవేరును." నేను ఆఫీసుకు వెళ్ళటానికి బయలుదేరినాను. యింతలో టెలిగ్రాం అంటూ ఒక వ్యక్తి ఎదురు వచ్చినాడు. ఆటెలిగ్రాం లోని సందేశము శ్రీసాయి ఆశీర్వచనాలతో వచ్చినదా అని అనిపించినది. ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్య పారాయణలో "నీ మనోభీష్ఠము నెరవేరును" అని సందేశము వచ్చినది. టెలిగ్రాంలో నీ అక్క హేమలతకు వివాహము నిశ్చయము అయినది అనే వార్త వచ్చినది. రెండు రోజుల క్రితము మీ అక్కకు పెండ్లి చూపులు జరగటము - ఈ వివాహము జరగాలి అనే నామనసులోని కోరిక - ఈరోజు శ్రీసాయి సత్ చరిత్రలోని సందేశము మరియు టెలిగ్రాం ద్వారా వివాహము నిశ్చయము అయినది అనే వార్త - యిది అంతా శ్రీసాయి లీల కాదా ! ఒక్కసారి ఆలోచించు. నేను, మీఅక్క, మనస్పూర్తిగా శ్రీసాయిని ఈ వివాహము విషయములో సహాయము చేయమని వేడుకొన్నాము. శ్రీసాయి మాప్రార్ధన విన్నారు. నామనసులోని కోరిక తీర్చినారు. ఈ సంతోషముతో శ్రీసాయికి మరొక్కసారి నమస్కరించుతున్నాను.
శ్రీసాయి సేవలో
నీతండ్ర్లి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment