Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 13, 2013

శ్రీసాయితో మధురక్షణాలు - 18

Posted by tyagaraju on 6:13 AM
                
                 
12.09.2013  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మధురక్షణాలు అనువాదం చేయడానికి కాస్త సమయం తీసుకుటున్నందువల్ల మనబ్లాగులో ప్రచురణకు కాస్త ఆలస్యమవుతోంది.    అధ్భుతమైన ఈ బాబా లీలను చదివి ఆ అనుభూతిని పొందండి.  బాబా వారికి అన్ని విషయాలు మనము చెప్పకుండానే గ్రహించి మనకు తెలియకుండానే నివారణ కావిస్తారు. ఒక్కొక్కసారి మన సమస్య చెప్పకున్నా వారే ఆసమస్యను పరిష్కరిస్తారు.. ఈ అద్భుతమైన లీలను చేదివేముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం తాత్పర్యం చదవండి.  

శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం

శ్లోకం:  ఉధ్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః   |

         అర్కో స్వాజసన శ్శృంగీ జయంత స్సర్వ విజ్జయీ     || 

తాత్పర్యం : నేత్రములతో కాంతిని అన్నివైపులకు ప్రసరింప చేయుచున్నాడు.  ఆయన ఈ సృష్టిచక్రమునకు శిఖరముగా ఆహారమును పుట్టించుచున్నాడు.  తన సృష్టియందలి జీవుల జయమే తానైనవాడు.  ఆయన సర్వమూ తెలిసినవాడు.  మరియూ సర్వమును జయించినవాడు.   
                          

శ్రీసాయితో మధురక్షణాలు - 18 

చూపు క్షీణించిన కండ్లకు దృష్టిని ప్రసాదించిన సాయి

బాబా జీవించి ఉండగా ఆయనను చూసిన భక్తులలో  శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే కూడా ఒక గొప్ప భక్తుడు.  ఎందుచేతనో ఆయన తాతగారి (తల్లివయిపు తండ్రి) కంటిచూపు మందగించింది.  



అత్యుత్తమమయిన వైద్యం చేయించినా గాని, కంటి చూపు మెరుగుపడటానికి బదులు ఆయన పరిస్థితి యింకా దిగజారిపోయి రెండు కళ్ళలో చూపు పూర్తిగా పోయింది.  ఆరోజుల్లో శ్రీగోవిందరావు మాన్ కర్ అనే సన్యాసి ఉండేవారు.  ఆయన గొప్ప సాయి భక్తుడు, బ్రహ్మచారి.  ఆయన, దేశ్ పాండే తాతగారిని షిరిడీ తీసుకొని వెళ్ళి బాబాగారి ఆశీర్వాదములు తీసుకొనమని సలహానిచ్చారు.  శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్ పాండే గారి కుటుంబ సభ్యులందరూ దీనికి సమ్మతించారు.  తాతగారిని  షిరిడీ తీసుకొనివెళ్ళడానికి తోడుగా ఎవరు వెడతారనే సమస్య ఎదురయింది.  ఆయన మేనమాలిద్దరికీ కూడా పరీక్షలు జరుగుతూ ఉండటం వల్ల వారు రాలేని పరిస్థితి.  విఠల్ దేశ్ పాండే ఒక్కడే ఖాళీగా ఉన్నాడు.  ఆఖరికి అందరూ కూడా అతనిని తోడిచ్చి  తాతగారిని షిరిడీ పంపించడానికి నిర్ణయించారు.  ప్రయాణంలో చాలా జాగ్రత్తగాను, బుధ్ధిగాను, ఉండమని ఖచ్చితమమైన ఆదేశాలు యిచ్చారు.  ఒక మంచిరోజున వారిద్దరూ షిరిడీకి ప్రయాణమయ్యారు.

అది 1916వ.సంవత్సరం.  అప్పటికి విఠల్ దేశ్ పాండే వయస్సు 12 సంవత్సరాలు.  శ్రీవిఠల్ దేశ్ పాండేగారు తమ అనుభవాన్ని యిలా వర్ణిస్తున్నారు.

"మేము షిరిడీకి చేరుకున్న వెంటనే మేమిద్దరమూ తిన్నగా బాబాగారి దర్శనం కోసం "ద్వారకామాయి" కి వెళ్ళాము.  బాబా మావైపు నవ్వుతూ చూసి 6 రూపాయలు దక్షిణ అడిగారు.  నాదగ్గిర సరిగ్గా అంత డబ్బులేదు.  అందుచేత నేను 10రూ.నోటు యిచ్చాను.  బాబా తల అడ్డంగా ఊపి, తనకు నావద్దనున్న 10రూ.గాని, 5రూ.గాని వద్దనీ, తనకు సరిగా 6రూపాయలు మాత్రమే కావాలని చెప్పారు.  బాబా చాలా పట్టుదలగా ఉన్నారు. నేను మాతాతగారిని క్రింద వసారాలో కూర్చోబెట్టాను.  ప్రస్తుతం అక్కడ వంట చెఱకు నిలవచేసుకోవడానికి ఒక గదిఉంది.  ఆరోజుల్లో దాని వెంబడే ఒక యిరుకైన వీధి, దానికి అవతల ఒక గోడ ఉన్నాయి.  నేను మాతాతగారి అనుమతి తీసుకొని 10రూ.నోటుకు చిల్లరగా 10 రూపాయి నాణాలు తీసుకొని రావడానికి బయటకు వెళ్ళాను.  నేను ప్రతీ దుకాణం దగ్గరకు చిల్లరకోసం వెళ్ళాను, కాని, అంత చిన్న గ్రామంలో ఎవ్వరూ నాకు చిల్లర యివ్వలేదు.  నేను పూర్తిగా అలసిపోయాను.  నేను చిన్నపిల్లవాడిని కనుక నాకు దఃఖంతో కన్నీళ్ళు వచ్చాయి.  

నాబుగ్గలమీద కన్నీరు జాలువారుతూ ఉంది.  నేను రోడ్డుప్రక్కన నిలబడి వున్నాను.  అపుడు, పంచ, 'బారాబందీ' (ఒకవిధమయిన జాకెట్టు) తలకి పాగా కాళ్ళకు 'పునేరీ' బూట్లు, (పూనాలో ప్రత్యేకమగా తయారయినవి) ధరించిన ఒక పెద్దమనిషె నావైపుకు వచ్చాడు.  ఆయన నుదిటిమీద గంధపు బొట్టుంది.  నావీపు మీద తడుతూ ప్రేమతో ఓదార్పుగా ఎందుకేడుస్తున్నావని అడిగాడు.  మధ్యమధ్యలో వెక్కిళ్ళు పడుతూ నాదుఃఖానికి కారణమయిన కధంతా చెప్పాను.  ఆయన మంచి ఉదారస్వభావుడిలా కనిపించాడు. వెంటనే ఆయన తనజేబులోనుండి పరిరూపాయి నాణాలు తీసి నాచేతికిచ్చాడు.  నాణాలను అందుకున్న వెంటనే ద్వారకామాయికి పరిగెత్తుకొని వెళ్ళి బాబా చేతిలో పెట్టాను.  బాబా చరణకమలాలకి సాష్టాంగ నమస్కారం చేశాను.  బాబా నన్ను దీవిస్తూ "అబ్బాయీ! భయపడకు.  అల్లా మాలిక్ నిన్ను అనుగ్రహిస్తాడు.  నువ్వు వచ్చిన పని పూర్తయింది.  ఇక వెళ్ళు" అన్నారు.  నేను కేవలం 12సం.బాలుడినయినందువల్ల బాబా మాటలలోని గూఢార్ధం నాకు బోధపడలేదు.  బాబాకు మేము షిరిడీ ఎందుకు వచ్చామో చెప్పలేదు.  బాబా కూడా మమ్మల్ని అడగలేదు. "మీరు వచ్చిన పని నెరవేరింది, యిక వెళ్ళండని" బాబా అన్నమాటలకు నేనాశ్చర్య పోయి బాబావంక విభ్రాంతితో చూసినపుడు బాబా మరలా తిరిగి అవే మాటలు అన్నారు. 

నేను ద్వారకామాయినుండి బయటకు వచ్చాను.  మాతాతగారిని కూచోపెట్టిన చోటకు వెళ్ళి చూశాను, కాని అక్కడ మాతాతగారు కనపడకపోవడంతో నాకు చాలా భయం వేసింది.  విపరీతమయిన భయంతో మాతాతగారిని వెదకడానికి ప్రతీ చోటకి పిచ్చిగా పరిగెత్తాను.  కాని, లాభం లేకపోయింది.  మాతాతగారి క్షేమం గురించిన ఆందోళన నన్ను వెంటాడింది.  ఆయనకేమయింది?  కనుచూపుమేరలో ఎక్కడా కనిపించటల్లేదు?.  నేను చాలా దారుణంగా ఊహించుకున్నాను.  మాతాతగారు ఆకస్మికంగా అదృశ్యమవడంతో, భయభ్రాతుడినయిపోయి మరలా బిగ్గరగా ఏడవడం మొదలెట్టాను.  ఓదార్పు లేక ఒంటరిగా ఒకమూల నిలబడ్డాను. అప్పుడే అంతకుముందు నేను కలుసుకొన్న దయగల వ్యక్తి వచ్చి మరలా ఎందుకేడుస్తున్నావని అడిగాడు.  మాతాతగారి అదృశ్యం గురించి నేనతనికి చెప్పాను.  కళ్లనిండుగా కరుణ రసం ఉట్టిపడుతుండగా నన్ను గట్టిగా పట్టుకొని "ఆందోళనపడకు,  వీధిచివర వాడా దగ్గర మీతాతగారు కూర్చొని ఉండటం యిప్ప్పుడే చూశాను" అన్నారు.   నేనిక ఆలశ్యం చేయకుండా ఆయన చూపించిన వైపు పరిగెత్తుకొని వెళ్ళాను.  ఓహ్!  అక్కడ మాతాతగారు చెఱకుగడల గుట్టప్రక్కన కూర్చొని ఆనందంగా చెఱకు ముక్క నములుతూ ఉన్నారు.  "ఒంటరిగా నువ్వు యిక్కడికెందుకు వచ్చావు.  నీకు కళ్ళు కనపడక దెబ్బలు తగిలి గాయపడి చతికిలపడి ఉండేవాడివి కాదా?"  భావోద్వేగంతో కోపంగా నాస్వరాన్ని పెంచి అరిచాను.

మాతాతగారు ప్రశాంతంగా నావైపు చూసి తన ప్రక్కన కూర్చోమని చెప్పి యిలా అన్నారు.  "ఒరేయ్ అబ్బాయీ!  నన్ను కూర్చోబెట్టి నువ్వు చిల్లర తేవడానికి వెళ్ళావు. ఆశ్చర్యకరంగా ముందర నాకు అన్నీ మసకగా కనపడి తరువాత అన్నీ స్పష్టంగా చూడగలిగాను.  ఇక నాకక్కడ ఊరికే సోమరిగా కూర్చోవాలనిపించలేదు.  బయట కాస్త తిరిగివద్దామనిపించింది.  మనం సామానులు పెట్టిన చోటు గురించి కాస్త అవగాహన ఉంది.  అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చేవరకు నీకోసం ఎదురు చూద్దామనుకున్నాను.

నామనసంతా ఆనందంతో నిండిపోయింది.  "ఇక మీరు వచ్చినపని నెరవేరింది" అన్న బాబామాటలు గుర్తుకు వచ్చి వాటివెనుకనున్న రహస్యం అర్ధమయింది.  ఆ పని ఏమిటంటే ,  మాతాతగారికి పోయిన కంటిచూపును తెప్పించమని బాబాని ప్రార్ధించడానికి వచ్చామన్న విషయమని వేరే చెప్పనవసరం లేదు.  మేము ఏవిషయం చెప్పకుండానే బాబా మేము వచ్చిన పని గ్రహించి, మమ్మల్ని ఏమీ ప్రశ్నించకుండానె అనుగ్రహించారు.  

బాబా చూడటానికి మంచి స్ఫురద్రూపిగా పొడవుగా చక్కటి శరీర చాయతో ఉంటారు. (ఆయన చేతులు ఆయన మోకాళ్ళ వరకు ఉండేవి).  ఆరతినిచ్చే ప్రతి సమయంలోను ఆయన వదనం ఎంతో దివ్యమైన కాంతితో ప్రకాశవంతంగా ఉండేది.  బాబా సాధారణంగా హిందీలో మాటలాడేవారు.  ఆయన ఎల్లప్పుడు 'అల్లా మాలిక్ అచ్చా కరేగా' (భగవంతుడు మేలు చేస్తాడు) అని తన భక్తులను దీవిస్తూ ఉండేవారు.  ఆయన తురిమిన ఎండుకొబ్బరిలో పంచదార కలిపి భక్తులకు పంచుతూ ఉండేవారు. స్వయంగా తన చేతితో ఊదీని ప్రసాదంగా యిస్తూ ఉండేవారు. ప్రతీ భక్తునికి మొట్టమొదటగా నుదుటిమీద ఊదీని రాయడం ఆయనకలవాటు. తరువాత వారి చేతులలో ఊదీని వేస్తూ ఉండేవారు.  ఎప్పుడూ ఆయనచుట్టూ 25 నుంచి 30 మంది దాకా భక్తులు ఉండేవారు.  ఆరతి సమయంలో ఆయననుంచి ప్రసాదం తీసుకోవడానికి ఎక్కువమంది గుమిగూడి ఉండేవారు.
                                                     
షిరిడీనుంచి బయలుదేరేముందు నేనెప్పుడూ బాబా అనుమతి తీసుకొనేవాడిని.  ఒకసారి నేను, శ్రీషిండే కారులో నాస్నేహితులు శ్రీదామూఅన్నా రాస్నే, శ్రీశంకరరావు షిండేలతో కలిసి బాబా అనుమతి తీసుకోకుండా హడావిడిగా షిరిడీనుండి బయలుదేరాను.  దారిలో అహ్మద్ నగర్ వద్ద మాకారుకు పెద్ద ప్రమాదం జరిగింది.  మాకారు చాలా వేగంగా వెడుతోంది.  అకస్మాత్తుగా మాకారు ముందు భాగం కుడివయిపునుంచి ఒక వ్యక్తి అడ్డంగా రావడంతో కారు అతనికి గుద్దుకుంది.  అతను తెలివితప్పి క్రింద పడిపోయాడు.  మేము దారుణమయిన పరిస్థితిలో చిక్కుకుపోయాము.  రాస్నేగారు బాబా ఊదీని కొంత ఆగాయపడ్డ వ్యక్తి నోటిలో వేసి, కొంత అతని నుదిటిమీద, చాతీమీద, పొట్టమీద రాశారు.  అతనికి కొంతసేపటి తరువాత స్పృహవచ్చింది.  కాని, అతనికి కాలు విరిగిందని తెలుసుకొన్నాక మాకు చాలా భయం చేసింది.  అతనిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాము.  రాస్నే, షిండే యిద్దరూ వెంటనే బాబాని ప్రార్ధించడానికి తిరిగి షిరిడీ వెళ్ళారు.  ఇక ముందుకు బయలుదేరడానికి  నేను యెప్పటిలాగే బాబా అనుమతి తీసుకొన్నాను.

బాబా అనుగ్రహం వల్ల ప్రమాదంలో గాయపడ్డవ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో, మేము ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడ్డాము.  ఈసంఘటన తరువాత యింక మరెప్పుడు బాబా అనుమతి తీసుకోకుండా షిరిడీ విడిచివెళ్లకూడదనే గుణపాఠం నేర్చుకొన్నాను.

నేను బాబాను స్వప్నంలో కాని, మరింకేవిధంగా కాని చూడలేదు.  కాని, నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగానే బాబాను చూశాను.  ఈసంఘటన 1968 సం.లో, సరిగా యిప్పుడు నేను కూర్చున్న చోటనే జరిగింది.  ఆరోజు 'అనంతచతుర్దసి.  పూజారిలాగ ఉన్న ఒక సన్యాసి కిటికీ బయటనిలబడి, "నాకు కాస్త టీ యిస్తావా?" అని అడిగాడు.  ఆసన్యాసి నాకు పూజారిలాగా కనపడలేదు.  కాని హిందీలో మాట్లాడాడు.  నేను కొంచం ఆశ్చర్యపోయి అతనిని లోపలకు రమ్మన్నాను.  అతను గదిలోకి వచ్చి గోడకు చేరగిలబడి కూర్చొన్నాడు.  టీ బదులుగా దయచేసి ఒకకప్పు పాలు స్వీకరిస్తారా అని అడిగాను.  

ఆయన యిలా జబాబిచ్చారు "నీ యిష్టం"

"పాలలో కాస్త పంచదార వేయమంటారా"?

"నీయిష్టమయితే అలాగే కానీ"

నేను వినయంగా తీయటి పాలు కప్పుతో ఆయన ముందు పెట్టాను.  నా కనుచివరలనుండి ఆయనను గమనిస్తున్నాను.  కాని నాకు సన్యాసి కనప
డలేదు.  స్వయంగా బాబా కనపడుతున్నారు.  ఆయన బాబా తప్ప మరెవరూ కాదు.  అందులో ఎటువంటి సందేహం లేదు.  నాతోపాటుగా మా కుటుంబమంతా ఆయనముందు సాష్టాంగ నమస్కారం చేశారు.  ఆయన మమ్మల్ని దీవించి వెంటనే గదినుండి నిష్క్రమించారు.  వెంటనే నాకు ప్రేరణ కలిగి బయటకు వచ్చి ఆ సన్యాసి కోసం వెతికాను.  కాని ఎటువంటి జాడ లేకుండా ఆయన అదృశ్యమయిపోయారు.  నేనెంతో ఉద్వేగంతో చుట్టుప్రక్కలనున్న వారందరినీ ఆసన్యాసిని ఎవరైనా చూశారా అని అడిగాను.  కాని, అటువంటి వ్యక్తిని తామెవరూ చూడలేదని చెప్పారు.  సన్యాసి రూపంలో దర్శనమిచ్చినది బాబాయేనని స్థిరమైన అభిప్రాయంతో నేను యింటికి తిరిగి వచ్చాను. 

శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే
బొంబాయి
యింటర్వ్యూ : శ్రీ ఎం.ఎస్. ఘోలప్ 
సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి 1982     

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List