Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, July 13, 2014

శ్రీసాయి తత్వం

Posted by tyagaraju on 8:52 AM
                     
               

13.07.2014 ఆదివారము

ఓం  సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీసాయి సత్ చరిత్ర పై సాయి.బా.ని.స గారు ఎంతో పరిశోధన చేశారు.  ఆయన ప్రతీ రోజు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసేవారు.  ఆయన పారాయణ చేయడంతోనే సరిపెట్టలేదు.  సాయి సత్చరిత్రలోని ప్రతీ పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం ఆయనకు కరతలామలకం.  అంతే కాదు సత్ చరిత్ర పారాయణ చేసిన తరువాత అయిపోయిందనుకొని గ్రంధాన్ని ఒకచోట భద్రంగా ఉంచి మరుసటిరోజు యధాప్రకారంగా పారాయణ చేసిన వారు కాదు. చరిత్ర మీద ఎంతో పరిశోధన చేశారు.  ఇంతకు ముందు మీకు శ్రీరామునిగా సాయి, కృష్ణునిగా సాయి, శివునిగా సాయి మొదలైన వాటి మీద ఆయన చేసిన పరిశోధనలను మన బ్లాగులో ప్రచురించాను.  ఈ రోజునుండి సాయి తత్వం మీద ఆయన చేసిన పరిశోధనల వ్యాసాన్ని మీకందిస్తున్నాను. చదవండి.  ఈ వ్యాసాలను చదివినవారందరూ ప్రతీరోజూ శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేసి కనీసం రోజుకు ఒక పేజీ ఆయన చెప్పిన విషయాలు యదార్ధమే అని నిర్ధారించుకోండి.      
   
              

ఈ రోజునుండి సాయి తత్వం మీద సాయి.బా.ని.స. వ్రాసిన వ్యాసాలను ప్రచురిస్తున్నాను.

ఓం సాయిరాం



శ్రీసాయి తత్వం

ఓం శ్రీగణేశాయనమః, ఓం శ్రీసరస్వత్యైనమః, ఓం శ్రీసాయినాధాయనమః 

మొట్టమొదటగా నాఉపన్యసం ప్రారంభించేముందు సాయి భక్తులందరికీ నాప్రణామములు.  సాయిబాబా తత్వాన్ని గురించి చెప్పడమంటే పంచభూతాలయిన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, వీటిలోని శక్తిని కొలవడంవంటిది.  వాటిలో ఉండే శక్తిని కొలిచే ప్రయత్నం చేయడమంటే వర్తమానభవిష్యత్ లను ఒకే సమయంలో అనుభవించడంవంటిది. 

అది అసాధ్యం.  కాని మానవ స్వభావం ఎప్పుడూ కూడా సూక్ష్మ వివరాలను చేదించి వాటి వివరాలను తెలుసుకోవడానికీ అందు కోసం ఆప్రక్రియపై పరిశోధన చేయడం కొనసాగిస్తోంది. 

సాయి సత్ చరిత్ర ఆధ్యాత్మిక గ్రంధమని మనకందరకూ తెలుసు.  అందుచేతనే మనమందరం పారాయణ చేస్తున్నాము.  సాయి ధులియా కోర్టులో తన వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పారు.  సాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయములో బాబా చెప్పిన మాటలు.

"నేను అందరి హృదయాలలోను నివసించువాడను.  సర్వ జీవరాశులలోను నేను ప్రకటితమవుతున్నాను.  సృష్టి స్థితి లయకారకుడను నేనే.  ఈ చరాచర జగత్తంతా పాలించువాడను నేనే"

ఈవిశ్వమంతటా సాయే వ్యాపించి ఉన్నాడన్నది యదార్ధము.  సాయి తత్వాన్ని గురించి మాట్లాడటమంటే చిన్న పిల్లవాడు అక్షరాభ్యాసం నేర్చుకొనడంవంటిది.  

సాయి సత్ చరిత్రను నేను అనేకమార్లు పారాయణ చేశాను.  కాని అన్ని మార్లు పారాయణ చేసినా నేనింకా విద్యార్ధినే అవడం వల్ల నేను గ్రహించుకొన్నవి చాలా తక్కువనే భావిస్తున్నాను.  ఆయన తత్వాన్ని యింకా లోతుగా అధ్యయనం చేసి ఆయన గురించి మరింతగా తెలుసుకునే భాగ్యాన్ని మరుసటి జన్మలలోకూడా కలిగించమని బాబాని ప్రార్ధిస్తున్నాను. 

భగవదాజ్ఞ లేనిదే ఆకయినా కదలదు,చీమయినా కుట్టదు.  ప్రస్తుతకాలంలో ఒక మహాపురుషుడయిన యోగి గురించి వివరించే ఈ ప్రయత్నంలో సాయినాధుడు నన్ను ఒక సాధనంగా వాడుకొంటున్నారు.  కృతజ్ఞతకు మరోమాట లేదనే నేను భావిస్తాను.  సాయినాధుడు నాచేయి పట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు ఆయనకు నేనెంతో ఋణపడి ఉన్నాను. చీకటిలో ఉన్న మనలిని చీకటిలోనుంచి వెలుతురులోకి తీసుకొని రావడానికి సద్గురువులు దీపాలవంటివారు.  అనగా మనలోనున్న అజ్ఞానాన్ని పారద్రోలి మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు.  దీపాలు ఏవిధంగా తయారవుతాయి? వాటి మూలపదార్ధాలను కనుగొనడమంటే అది శుధ్ధ తెలివితక్కువతనమే అవుతుంది.  సాయి ద్వారకామాయిలో నీటితో దీపాలను వెలిగించి అజ్ఞానమనే చీకటిని ప్రారద్రోలారు.  వెలుతురు ఏవిధంగా దేనిద్వారా వచ్చిందన్నది కాకుండా మనకు లభించిన వెలుతురుకే ప్రాధాన్యమివ్వాలి.           

శ్రీసాయినాధులవారు సూచించిన మార్గంలో నడవటానికి నాకెంతో సంతోషంగా ఉందని చెప్పడం సమంజసంగా ఉంటుంది.

జ్ఞానులు చేసే ప్రవచనాలు జీవనదులయిన గంగా, యమున, నర్మద, కృష్ణ జలాలవంటివి.  ఈ నదులలో వివిధరకాలయిన చేపలు జీవిస్తున్నాయి.  చివరికి నదులలోని నీరంతా సముద్రంలోనే కలుస్తుంది. సముద్రపునీరు ఉప్పగా ఉన్నప్పటికీ ఎన్నో రకాలయిన చేపలు అందులో జీవిస్తున్నాయి.  సాయి సముద్రంలో మనం చేపలవంటివారం.  సాయి తన భక్తులకి ఎంతో సరళంగా బోధలు చేసేవారు. అవి భక్తులకి సులభంగా అర్ధమయే రీతిలో ఉండేవి. 


పూర్తిగా వికసించిన కమలం చెరువులో ఎంతో సుందరంగా కనపడుతుంది.  నీటిలో నుండి తీసిన కొద్దిసేపటికే తన తాజాతనాన్ని కోల్ఫొతుంది. వాస్తవానికి కమలం నీటిలో ఉన్నాకూడా దానియొక్క తాజాదనం పరిమితం.  అది శాశ్వతం కాదు.  తరువాత వాడిపోవలసిందే.  హేమాద్రిపంత్ లాంటి ఎంతోమంది జ్ఞానులు జన్మించారు.  వారంతా కూడా శ్రీసాయినాధుడు మరియు వారి భక్తుల సాంగత్యంలో కలువవలాగే వికసించి ధన్యులయారు.  ఒక గురువుయందు భక్తితో ఏవిధంగా మెలగలో హేమాద్రిపంతే అందుకు ఒక ఉదాహరణ.  సాయి తత్వం గురించి నాకు తెలిసిన ఏచిన్నవిషయమైనా సాయి భక్తుల ప్రయోజనం కోసం సరళమైన భాషలో తెలియచేస్తున్నాను.  ఇది నా చిన్ని ప్రయత్నం. 

నేను  శ్రీ సాయిసత్ చరిత్రను పారాయణ కోసం చేతులలోకి తీసుకున్నపుడెల్లా "నా పిల్లలందారూ ఆకాశంలో ఎగిరే గాలిపటాలవంటివారు" 


అని సాయి నాతో చెబుతున్నట్లుగా అనిపించేది.  గాలిపటం ఎగరడానికి కట్టిన దారం లాంటిది జీవితం.  దారం చిక్కులు పడకుండా జాగ్రత్తగా కనిపెట్ట్లుకొని ఉండటానికి నేను దారపు కండెవంటివాడిని, అని బాబా చెప్పారు.  సాయి చెప్పిన పదకొండు వాగ్దానాలలో ఒకదానికి యిది సరిపోలుతుంది.  వాటిలో బాబా చెప్పిన విషయం "నాభక్తులు నన్నెప్పుడు పిలిచినా నాసమాధినుండే నేను వారిని రక్షిస్తాను". 

నేనెప్పుడూ యాత్రలు చేయలేదు.  అందుకు నాకు చాలా బాధగా ఉండేది.  కాని సాయి నన్నిలా ఓదార్చారు.  "విష్ణువును దర్శించడానికి హరిద్వార్ కు వెళ్ళనవసరం లేదు.  కనులు మూసుకొని ప్రశాంతంగా నామనసులోకి తొంగి చూడు.  హరి దర్శనమవుతుంది".  శ్రీసాయి సత్ చరిత్ర 15వ.అధ్యాయంలో మనకు యిదే విషయం కనపడుతుంది.  "నేనందరి హృదయాలలోను నివసించువాడను.  సదా నన్నే ధ్యానించువారిని నేనెల్లప్పుడూ వారి రక్షణభారం వహిస్తాను"     

"అక్రమ మార్గంలో ధన సంపాదన ముందు ముందు కష్టనష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.  భగవంతునికి ప్రీతి కల్గించే విధంగా పనిచేయాలి.  అదిమాత్రమే మానవునికి దీర్ఘకాలంలో సుఖశాంతులనందిస్తుంది”  దీనికి సంబంధించిన తత్వం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 25వ.అధ్యాయంలో కనపడుతుంది. దామూ అన్నా కాసార్ తొందరలోనే ఎక్కువ ధనం సంపాదించే ఉద్దేశ్యంతో భాగస్వాములతో కలసి వ్యాపారం చేద్దామనుకొన్నాడు.  అప్పుడు బాబా"నీయింటిలో డబ్బుకు కొదవలేదు.  ఒక్కరాత్రిలోనే విపరీతంగా ధనం సంపాదించి ధనికుడనైపొదామనే అత్యాశవద్దు" అన్నారు.  ఆవిధంగా బాబా అక్రమార్జన తప్పని చెప్పి దామూ అన్నాని ఆప్రయత్నాన్నించి విరమింప చేశారు.  

ధనవంతులు నిర్మించుకొన్న పెద్ద పెద్ద భవంతులలోకి గాని వాటి ప్రక్కనే కట్టుకొన్న పూరిగుడిశెలలోకి గాని సాయిసాగరం నుండి వీచే గాలి సమంగానే వీస్తుంది.
బాబా తన ప్రేమాభిమానాలను అందరిమీద సమంగానే చూపించేవారు.  బాబా ముగ్గురు భక్తులను సమానంగా  ప్రేమించారు, అభిమానించారు.  వారు ధనవంతుడయిన గోపాల్ ముకుంద్ బూటీ,  శ్యామా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సామాన్యుడు, కుష్టురోగియైన భాగోజీ షిండే.  వీరు ముగ్గురూ వేరు వేరు వర్గాలకు  చెందినవారు. 

కొన్ని కొన్ని సమయాలలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారికి ధనసంపాదన అడ్డంకిగా మారుతుంది.  మన దైనందిన జీవితాసరాలకోసం, మన శరీర పోషణకోసం, ధనం ముఖ్యమయినది.  అందులో సంధేహం లేదు. అందుకోసం మన కనీస అవసరాల కోసమే ధనం సంపాదించాలి.  

బాబా ఎల్లాప్పుడూ ఈ సూత్రాన్నే ఆచరించారు.  

బాబా ప్రతిరోజూ భక్తుల వద్దనుండి దాదాపు 500 రూపాయల దాకా దక్షిణగా స్వీకరించేవారు.  ఆవిధంగా వచ్చినదంతా సాయత్రమయేసరికి తన భక్తులందరికీ పంచిపెట్టేసేవారు.  మరుసటి రోజున తిరిగి యధాప్రకారంగా భిక్షకు బయలుదేరేవారు.  

"త్రాగుడువల్ల సుఖసంతోషాలు లభించవు.  జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినపుడే నిజమైన శాంతి లభిస్తుంది". శ్రీసాయి సత్ స్చరిత్ర 19వ.అధ్యాయంలో మనం యిదే విషయాన్ని గమనించవచ్చు.  బాబా ఒకత్రాగుబోతుకు కలలో కనిపించి  అతని గుండెలమీద కూర్చొని గట్టిగా అదిమిపెట్టి జీవితంలో యిక మరెప్పుడూ త్రాగనని వాగ్దానం చేసిన తరువాతనే వదలిపెట్టారు.   

"అనాధప్రేత సంస్కారం వెయ్యి సార్లు గంగాస్నానం చేసినంత ఫలితాన్నిస్తుంది." దానికి ఉదాహరణ బాబా తన అంకిత భక్తుడయిన "మేఘుడి" కి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  

"నాపిల్లలు దీపావళినాడు బాణాసంచాలు కాలుస్తూ విష్ణుచక్రాలను కాలుస్తూ ఆనందిస్తూ ఉంటే వారిని ఆవిధంగా చూడటం నాకెంతో సంతోషాన్ని కలుగజేస్తుంది.  పండుగరోజులు సుఖసంతోషాలకు ప్రతీక “ అని నమ్మేవారు బాబా.         


(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List