Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 11, 2014

సాయి భక్తుడు - చెరిగిపోని గుర్తులు

Posted by tyagaraju on 8:54 AM
            
               

సాయి భక్తుడు - చెరిగిపోని గుర్తులు

ఈ రోజు సాయి భక్తుడయినవాడు ఏవిధంగా ఉంటాడో, ఏవిధంగా ఉండాలో తెలుసుకుందాం.  నిజమయిన సాయి భక్తుడు  తాను సాయిభక్తుడినని ఎప్పుడూ ప్రకటించుకోడు.  తన భక్తుడు అవునా కాదా అన్నది బాబా నిర్ణయం.  బాబా అలా నిర్ణయించాలంటే సాయి చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి.  అంతేగాని ప్రజల మెప్పుకోసం, అనవసర భేషజాన్ని, దర్పాన్ని ప్రదర్శించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.  అటువంటి వారు సాయితత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోక కేవలం ప్రజల మెప్పుకోసం, అధికారం కోసమే జీవిస్తారు. ఇటువంటివారు సంఘంలో ఒకవిధమయిన గౌరవాన్ని కోరుకుంటారే తప్ప నిజమయిన సాయి సేవకులుగా మాత్రం చెలామణి కాలేరు.  


ఇది చదివిన తరువాత మనం కూడా (నాతో సహా) ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొందాము.  ఇది ఎవరినీ కించ పరచడం కాదు.  ఒక్కొక్కసారి మనం కూడా ఆవేశంలో  తెలిసీ తెలియక తప్పులు చేస్తూ ఉంటాము.   ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ప్రవర్తించామో అవన్నిఒక్కసారి  గుర్తుకు తెచ్చుకొని ఇక ముందు ఆవిధంగా ప్రవర్తించకుండా మనలని మనం సరిదిద్దుకోవాలి. సాయి సత్ చరిత్రను మరొక్కసారి చదివి బాబా చెప్పినట్లు నడుచుకోవాలి.  ఇప్పుడు మీరు చదవబోతున్న విషయంలో నిజమయిన సాయి భక్తుడు ఏవిధంగా ఉండాలో గ్రహించండి.   అదేవిధంగా, నమ్రతగా, మెల్లగా మాట్లడుతూ, ఎంతో వినయంగా ఉండే కొంతమంది సాయి భక్తులను నేను  చూశాను. 

నిజమయిన సాయి భక్తుడు ఎప్పుడూ ఆడంబరాలను ప్రదర్శించడు.

ఇక చదవండి.

సాయిలీల మాసపత్రిక మార్చ్ - ఏప్రిల్-2008 సంచికనుండి గ్రహింపబడింది.

ఆంగ్లమూలం: ఆర్.రామకృష్ణారావు,(బ్లాక్ 39 ఎ.(బీఎస్ పి) రౌబండ సెక్టర్, భిలాయి - 490 006 చత్తీస్ ఘర్)  

శ్రీ ఆర్. రామకృష్ణారావు గారి అనుభవం: 

నిజమయిన సాయి భక్తుడయినవాడు  పేరుప్రఖ్యాతులను, ధనం, అధికారం, వీటినెప్పుడూ లెక్కచేయడు.  వీటన్నిటికీ అతీతుడు.  సాయే తన యోగక్షేమాలను చూస్తూ ఉంటాడనీ, తన అవసరాలను ఆయనే తీరుస్తాడనే నిశ్చితాభిప్రాయంతో జీవిస్తాడు.  అలాగని అతడు దుర్బలుడూ కాడు, అత్యంత దీనస్థితిలోను ఉండడు.  నిజమయిన సాయిభక్తుడు గొప్ప విద్యావంతుడు కాకపోవచ్చు, సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కాకపోవచ్చు.  కాని, అతని వ్యక్తిత్వం యితరులుకన్నా విభిన్నంగా ఉంటుంది. 

1. నేను నాసంస్థకు సంబంధించిన పాఠశాలలలో నగదును తనిఖీ చేయడానికి, ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెడుతూ ఉండేవాడిని.  ఆవిధంగా ఒక సామాన్య వ్యక్తిలాగ పాఠశాలలకు వెళ్ళి స్టాఫ్ రూం లో ప్రిన్సిపాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుండేవాడిని.  ఒకరోజు నేను ఒక పాఠశాలలో నగదును తనిఖీ చేయడానికి ఎటువంటి సమాచారం ముందుగా ఇవ్వకుండా అకస్మాత్తుగా వెళ్ళాను.  

నేనెవరో చెప్పకుండా స్టాఫ్ రూం లో ప్రిన్సిపాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాను. అంతలో ఒక ప్యూన్ వచ్చి నాకు నమస్కారం చేశాడు.  అతను మంచి శుభ్రమయిన దుస్తులు ధరించి వున్నాడు.  అంతకు ముందు నాకతనితో పరిచయం లేదు. ప్యూన్ అక్కడ కుర్చీలని, బల్లమీద వున్న ఫోటోలని, టెలిఫోన్ ని శుభ్రంగా తుడిచాడు.  గాజుగ్లాసుని శుభ్రంగా కడిగి మంచి నీటితో నింపి ఉంచాడు.  ఫ్లవర్ వాజులో వాడిన పూలను తీసేసి పాఠశాల ప్రాగణంలో తను పెంచుతున్న పూలమొక్కలనుండి పూలను కోసితెచ్చి ఫ్లవర్ వాజులో అందంగా అమర్చాడు.  తన యిష్టదైవమయిన సాయిబాబా ఫోటో ముందు అగరువత్తులు వెలిగించాడు.  బల్లమీద గ్లాసుతో నీళ్ళుపెట్టి, సాయిబాబా ప్లాస్టిక్ ఫొటో ఒకటి పెట్టాడు.  గాజు గ్లాసులోనుండి సాయి ఫోటో పెద్దదిగా కనిపిస్తోంది. గ్లాసులో ఒక గులాబీ పువ్వును పెట్టి సాయి పాదాల వద్ద మరొక పువ్వు పెట్టాడు. 


 గదంతా అగరువత్తుల పరిమళంతో నిండిపోయి ఎంతో హాయి గొలుపుతూ నిర్మలంగా ఉంది.  అంతేకాకుండా కొన్ని సాయిలీల పత్రికలు, ఆరోజు దినపత్రిక  బల్లమీద నాముందు పెట్టాడు. పాఠశాలకు సంబంధించిన సిబ్బందిలో అతని హోదా చాలా అత్యల్పం.  తరువాత తరువాత నేను ఆపాఠశాలకు తనిఖీ కి వెళ్ళినప్పుడెల్లా అతనిని గమనించడానికే చాలా ముందుగా వెడుతూ ఉండేవాడిని.  అతనెప్పుడూ గట్టిగా మాట్లాడటంగాని, ఎవరిమీదా గట్టిగా అరుస్తూ మాట్లాడటంగాని, నేనెప్పుడూ చూడలేదు.  ప్రిన్సిపాల్ తో సహా పాఠశాల సిబ్బంది మొత్తం అతనిని ఎంతో గౌరవ భావంతో చూస్తారన్న విషయం నేను గ్రహించాను.  పిల్లలు కూడా అతనిని 'అంకుల్ ' అని పిలుస్తారు.  

2) ప్రతినెలా నేను ఒక క్షౌరశాలకు వెడుతూ ఉండేవాడిని. అక్కడ చాలా వున్నాయి గాని యిది మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది.  ఈ షాపులో పొగత్రాగడం నిషేధం.  ఒకవేళ ఎవరయినా పొగత్రాగడానికి ప్రయత్నిస్తే వాళ్ళని మరొక షాపుకి వెళ్ళిపొమ్మని షాపతను నిష్కర్షగా చెప్పేవాడు.  తన షాపుకు వచ్చేవాళ్ళందరినీ జోళ్ళు బయటనే విడిచి లోపలకు రమ్మని చెప్పేవాడు.  అతను తన షాపుని ఒక సాయి దేవాలయంగా చూసుకునేవాడు.  సాయి భక్తిగీతాలు మంద్ర స్థాయిలో షాపులో వినిపిస్తూ ఉండేవి.  

ఒకసారి నేనతనిని, తను తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల వ్యాపారం దెబ్బతింటుందనే బాధ కలగటల్లేదా అని అడిగాను.  నాప్రశ్నకి సమాధానంగా అతను "ప్రతిరోజు నా తిండికి కావలసినవన్నిటినీ బాబాయే సమకూరుస్తున్నప్పుడు నాకెందుకు చింత?" అన్నాడు.  "నాకేదయితే ప్రాప్తమో అదే ప్రాపిస్తుంది.  నాది కానిదెప్పుడు నాకు ప్రాప్తం కాదు" అని కూడా అన్నాడు. 

మరొకసారి అతని షాపుకి వెళ్ళినపుడు ఒక సామెత చెప్పాడు.  "మరో సో జావే నహీ జావే సో మరో నహీ" అనగా దానర్ధం ఏదయితే నాస్వంతమో అది నానుండి పోదు.  ఏదయితే నాదికాదో అది నావద్దనుండి పోతుంది. ఈ సూత్రాన్ని అర్ధం చేసుకొని జీవనం సాగించేవాడికి ఎటువంటి చీకూ చింతా ఉండవు.  ఆనందంగా జీవిస్తాడు.  

ఇటువంటివారే మొదటినుండి చివరిదాకా బాబా భక్తులు.  వీరంతా అతి సామాన్యులు. ఇటువంటివారికి ఎటువంటి భేషజాలు ఉండవు.  వీరంతా సాయి చేతిలో పనుముట్లుగా తమను తాము భావించుకుంటూ ఉంటారు.  ఇటువంటి సాయి భక్తులు కోపంతో ఉండటంగాని, సణగడంగాని, బిగ్గరగా అరవడంగాని, యితరులమీద నిందాపూర్వకంగా గట్టిగా అరవడంగాని నేనెప్పుడూ చూడలేదు.  

ఇటువంటి సాయిభక్తులు ప్రత్యేకంగాను, ప్రస్ఫుటంగాను ఎప్పుడూ కనపడరు.  మనమే వారిని గుర్తించగలగాలి.  ఒక నిజమయిన సాయిభక్తునికి చెరిగిపోని ఈ లక్షణాలు, గుర్తులు సరిపోవా?



(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List