20.09.2015 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిర్భయమైన మరణాన్ని పొంది సాయిపాదాలలో లయమైపోయిన తాత్యాసాహెబ్ నూల్కర్
ఆంగ్లమూలం: లెఫ్టినెంట్ కల్నల్ నింబాల్కర్
తెలుగు అనువాదం : సాయిబానిస రావాడ గోపాలరావు
తాత్యాసాహెబ్ నూల్కర్ - 5 (ఐదవ భాగం)
అదే సమయములో ద్వారకా మాయి ముందర ఒక బట్టలవ్యాపారి రంగురంగుల బట్టలు అమ్మకానికి తీసుకొని వచ్చాడు శ్యామా తమ్ముడు బాపాజి తన కోసం ఒక రంగు వస్త్రము కొని తన తలకు చుట్టుకొన్నాడు. శ్రీసాయి బాపాజి దగ్గరకు వచ్చి బాపాజి తలకు చుట్టబడిన వస్త్రాన్ని తీసుకొని తన తలకు చుట్టుకొన్నారు. బాపాజి తిరిగి ఆవస్త్రాన్ని తీసుకొని తన తలకు చుట్టుకొన్నారు. ఈవిధముగా శ్రీసాయి మరియు బాపాజి ఆ రంగువస్త్రముతో ఆటలు ఆడుకొంటుంటే, తాత్యాసాహెబ్ కుమారుడు డాక్టర్ వామనరావు సహనాన్ని కోల్పోయి సాఠేవాడకు కోపముతో వచ్చి "సాయికి భక్తుల విషయాలు అనవసరము. పిల్లలతోను, ఇతరులతోను ఆటలు ఆడుకోవటమే ముఖ్యము అని శ్రీసాయిపై నింద మోపాడు. "ద్వారకామాయిలో ఏమిజరిగినది, ఎందుకు చికాకుపడుతున్నారు" అని తన కుమారుడు డాక్టర్ వామనరావును శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ ప్రశ్నించారు.
ద్వారకామాయిలో శ్రీసాయికి తాను తన తండ్రి కోరికను తెలియపర్చినప్పటినుండి తను సహనాన్ని కోల్పోయి బయటకు వచ్చినంతవరకు జరిగిన సంఘటనలు అన్నీ తన తండ్రికి చెప్పారు శ్రీవామన్ రావు. తన కుమారుడు ద్వారకామాయిలో శ్రీసాయి పిల్లలతో ఆటలు ఆడటము, బాపాజితో రంగు వస్త్రముతో ఆటలు ఆడటము చెబుతున్నపుడు తాత్యాసాహెబ్ నూల్కర్ కళ్ళలో ఆనందభాష్పాలు రాసాగాయి.
తండ్రి ఆనందానికి కారణము ఏమిటి అని వామనరావు ఆలోచించుతూ, తనకు వివరముగా చెప్పమని తండ్రిని కోరాడు. ద్వారకామాయిలో ఉన్న శ్రీసాయి, చిన్నపిల్లలతోను, బాపాజీతోను ఆటలు ఆడే దృశ్యాన్ని తాత్యాసాహెబ్ నూల్కర్ కు సాఠేవాడలోని అతని గదిలోనే చూపించారు. ఈవిధముగా తాత్యాసాహెబ్ నూల్కర్ కు శ్రీసాయి దర్శనము ఇచ్చారు. ఎంతటి అదృష్ఠవంతుడు శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్?
తాత్యాసాహెబ్ నూల్కర్ మరణము:
దినదినానికి శ్రీనూల్కర్ ఆరోగ్యము క్షీణీంచసాగింది. శ్రీసాయి దయతో ఆరోగ్యము బాగుపడగలదని అతని కుటుంబ సభ్యులు ఆశతో ఉన్నారు. బాబాసాహెబ్ తన స్నేహితుని సేవలో నిద్రాహారాలు లేకుండా రోజులు గడుపుతున్నాడు. ఒకనాడు రాత్రి రెండుగంటలకు తాత్యాసాహెబ్ మూత్రవిసర్జన చేయటానికి బాధపడుతున్నారు. మూత్రము పట్టె డబ్బా దగ్గరలో లేదు. పనివాడు గదిలో లేడు. తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క బాధను చూసి బాబాసాహెబ్ తన మిత్రునికి మూత్రము పోసే డబ్బా తెచ్చి ఇచ్చారు. తాత్యాసాహెబ్ తన మిత్రుని ప్రేమకు చలించిపోయి కన్నీళ్ళు కార్చసాగాడు. శ్రీసాయి అన్నమాటలు ఇద్దరూ గుర్తు చేసుకొన్నారు. ఇదే ఋణానుబంధానికి గుర్తుగా మిగిలిపోతున్నది అనే భావన ఇరువురిలో కలిగింది. రాత్రి మూడుగంటల సమయములో తాత్యాసాహెబ్ నూల్కర్ కు మలవిసర్జన జరిగింది. అప్పటినుండి తాత్యాసాహెబ్ నాడి కొట్టుకోవడంలో తేడా కనిపించసాగింది. తాత్యాసాహెబ్ నూల్కర్ తన చిన్నకుమారుని పిలిపించుకొని భజన చేయమన్నారు. ఆయన స్వయంగా మెల్లిగా శ్రీసాయినామం ఉచ్చరించసాగారు. డాక్టర్ వామనరావు తన తండ్రికి ఆఖరి క్షణాలు వచ్చినవని గ్రహించాడు. డాక్టర్ గా తన విధి నిర్వహణలో యింజక్షన్ ఇవ్వదలచాడు. కాని సిరంజి విరిగిపోయి ఉంది. ఏమీచేయలేని స్థితిలో ఉన్నాడు. తాత్యాసాహెబ్ తనకు యిష్ఠమైన భజనను తన ఇద్దరు కుమారులను కలిసి పాడమన్నారు.ఆభజన వింటుంటే తాత్యాసాహెబ్ నూల్కర్ కన్నులలో ఆనందము కనిపించింది. ఆసమయంలో ఆయన ప్రక్కన ఆయన భార్య, ఇద్దరు కుమారులు, బావమరిది, శ్రీకాకా సాహెబ్ దీక్షిత్ ఉన్నారు. చిన్న కుమారుడు విశ్వనాధ్ ఉదయం ఐదు గంటల సమయంలో రాధాకృష్ణమాయి ఇంటికి పరుగున వెళ్ళి అక్కడినుండి శ్రీసాయి పాదతీర్ధాన్ని, ఊదీని తీసుకొని వచ్చాడు. పెద్ద కుమారుడు ఊదీని తాత్యాసాహెబ్ నుదుట వ్రాసాడు. తాత్యాసాహెబ్ కన్నులు తెరచి తనవాళ్ళనందరిని ఒక్కసారి చూసారు. ఆయన ముఖంలో చీకుచింత లేదు. ప్రశాంత వదనముతో ఉన్నారు. తన పెద్దకుమారుని చేతిలో ఉన్న శ్రీసాయిపాద తీర్ధాన్ని చూసి తన నోటిలో పోయమన్నారు. శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ నోరు తెరిచారు. పెద్దకుమారుడు మూడు చెంచాల తీర్ధము తన తండ్రి నోటిలో పోసారు. మూడవ చెంచాతీర్ధము త్రాగుతుంటే శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ ఆఖరి శ్వాస తీసుకొన్నారు. అదే సమయంలో ద్వారకామాయిలో నుండి శ్రీసాయి బయటకు వచ్చి ఆకాశములో చూస్తూ గట్టిగా అరుస్తూ తన నోటిపై చేతులతో కొట్టుకొంటూ తన బాధను వ్యక్తపరచి, ఈమశీదు వెనకాల ఒక నక్షత్రము రాలిపోయిందని అన్నారు.
అంతిమ సంస్కారాలు : శ్రీసాయి అన్నమాటలు:
తెల్లవారింది. షిరిడి ప్రజలు సాఠేవాడ దగ్గర గుమిగూడి తాత్యాసాహెబ్ నూల్కర్ కు శ్రధ్ధాంజలి ఘటించసాగారు. ఆయన పార్ధివ శరీరాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకొని వెళ్ళారు. ద్వారకామాయికి లెండీబాగ్ మధ్య ఉన్న మార్గంలో పరుగు పరుగున శ్మశానానికి వెళ్ళి తాత్యాసాహెబ్ నూల్కర్ ఆఖరి దర్శనము చేసుకొన్నారు. ద్వారకామాయిలో శ్రీసాయి విచార వదనముతో ఉన్నారు. ఉదయమువేళ తీసుకొనే ఉపాహారము తీసుకోలేదు. ఐదు ఇళ్ళకు భిక్షకు వెళ్ళలేదు. తన చుట్టు కూర్చున్న భక్తులను ఉద్దేశించి ఇలాగ అన్నారు.
"తాత్యా నాకంటే ముందుగా ఈలోకం విడిచి వెళ్ళిపోయినాడు. అతనికి పునర్జన్మము లేదు".
ఈవిధముగా శ్రీసాయి అంకిత భక్తుడు శ్రీతాత్యా సాహెబ్ నూల్కర్ నిర్భయమైన మరణాన్ని పొంది శ్రీసాయి పాదాలలో లయమైపోయారు.
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment