04.10.2015 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.కపర్డే గారి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం.
బాబా భక్తులు
శ్రీ జీ.ఎస్.కపర్డే - 2 (రెండవ భాగం)
కపర్డే బాగా ధనికుడు. ఆయన రైలులో ఎపుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేసేవారు. ఆరోజుల్లో రైలులో నాలుగు తరగతులుండేవి. తన న్యాయవాద వృత్తి ద్వారా ఒక్కొక్కసారి ఆయన సంవత్సరానికి రూ.90,000/- నుండి రూ.95,000/- వరకు ఆర్జించేవారు. (అప్పట్లో అది ఎంతో అధికం) ఆదాయ పన్ను కూడా లేదు. జీవన వ్యయం కూడా చాలా తక్కువే. ఆరోజుల్లో ఆయనకు ఏడు గుఱ్ఱాలుండేవి.
వాటిలో రెండు ఆస్ట్రేలియన్ జాతికి చెందిన గుఱ్ఱాలతో రెండు గుఱ్ఱపు బండ్లు ఉండేవి. వాటి సంరక్షణకి తగిన పనివారు ఉండేవారు. సమాజంలో ఇంత పెద్ద హోదా కలిగి ఉండటంతో ఆయనని అందరూ 'బెరార్ నవాబు ' అని పిలిచేవారు. అంత ధనికుడవటంవల్లనే ఆయన తనకోసం, తన కుటుంబం కోసం ధనాన్ని దుబారాగా ఖర్చు పెడుతూ ఉండేవారు.
అంతేకాకుండా తన వద్ద ఎంతోమందికి ఉదారంగా ఆశ్రయం కల్పిస్తూ ఉండేవారు. స్వభావ సిధ్ధంగా ఎంతో ఉదార స్వభావులు. అతిధులకోసం ప్రత్యేకంగా ఒక గృహం ఉండేది. ఆశ్రయం పొందిన అతిధులందరూ సుఖంగా ఉండటానికి ధారాళంగా ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆయన జీవన విధానం అటువంటిది. ఆవిధంగా తన దాతృత్వంతో ఎంతో మందికి ఆశ్రయం కల్పించారు.
1911వ.సంవత్సరంలో రాజకీయ జాతీయోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేయసాగింది. రాజద్రోహ నేరం మోపి బాలగంగాధర తిలక్ ని అరెస్టు చేసింది.
కపర్డే, బాలగంగాధర తిలక్ కి సన్నిహితుడుగాను, ఒక రాజకీయ తీవ్రవాదిగాను బ్రిటిష్ వారు భావించారు. ఆ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ తీవ్రవాదులందరి మీద విచారణ జరిపించడంలో నిమగ్నమయి ఉంది. అందుచేత కపర్డేలాంటి వారికి ఆ సంవత్సరం చాలా గడ్డుకాలం. కపర్డే స్నేహితులయిన తిలక్ 24 జూన్, 1908వ.సంవత్సరంలో అరెస్టు చేయబడ్డారని బాబాకు తెలుసు. రాజద్రోహ నేరం మోపబడి, 22, జూలై, 1908వ.సంవత్సరం నుండి 6 సంవత్సరాలు కారాగార శిక్ష విధించారని తెలుసు. తిలక్ కి సన్నిహితుడయిన కపర్డే అనుకోకుండా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే రెండు సంవత్సరాలు ఉండిపోవలసివచ్చింది. తిలక్ ని విడుదలచేయమని కపర్డేగారు ప్రీవీ కౌన్సిల్ కి, హౌస్ ఆఫ్ లార్డ్స్ కి, భారత దేశంలో ఉన్న కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కాని ఏమీ లాభం లేకపోయింది. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. లండన్ లో దీర్ఘకాలం ఉన్నతరువాత భారతదేశానికి తిరిగివచ్చారు. ఒక నెలతరువాత మొట్టమొదటసారిగా కపర్డే షిరిడీ రావడం ఆయన చేసుకున్న అదృష్టం. 1910వ.సంవత్సరం డిసెంబరులో మొట్టమొదటిసారి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. షిరిడీలో ఏడురోజులున్నారు. కపర్డే బాబాను దర్శించుకున్న సమయంలో,మసీదులో బాబా పాదాలవద్ద అనేకమంది అధికారులు గుమికూడి ఉండటం గమనించారు.
బాబా వారందరికీ నీతిబోధలు చేస్తూ మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలలో ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులను, పోలీసు అధికారులను బాబా తన అనుగ్రహంతో వారిని నిర్దోషులుగా బయటపడేలా రక్షించడం గమనించారు . కపర్డే రెండవసారి షిరిడీ వెళ్ళి అక్కడ ఎక్కువకాలం ఉన్నారు. షిరిడీనుండి బయలుదేరదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక 101 రోజులదాకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. జరుగుతున్న విషయాలన్నీ బాబాకు తెలుసు. కపర్డే క్షేమం కోరి, ప్రభుత్వం ఆయన మీద విచారణ జరపకుండా ఉండటానికే ఆయనని షిరిడీనుండి కదలకుండా చేశారు. బాబా ఏమిచేసినా తన క్షేమం గురించేనని భావించి బాబా ఆజ్ఞప్రకారం కపర్డే షిరిడీలోనే ఉండిపోయారు. ఎక్కడ ఏమి జరిగినా బాబాకు అంతా తెలుసుననీ, ఆయన సర్వాంతర్యామి అనీ, పంచభూతాలనూ తన ఆధీనంలో ఉంచుకున్న మహాపురుషుడు బాబా అని అర్ధం చేసుకున్నారు. బాబా మాటల మీద విశ్వాసముంచి పూర్తిగా ఆయన సేవకు అంకితమయ్యారు.
బ్రిటిష్ ప్రభుత్వం కపర్డే మీద విచారణ జరిపి ఆయనకు విధించబోయే శిక్షనుండి బాబా ఎలా తప్పించారో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
(తరువాయి భాగం రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment