02.10.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులారా! మనం అప్పుడప్పుడు బాబావారి అంకిత భక్తుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు కపర్డే గారి గురించి ప్రచురిస్తున్నాను. కపర్డేగారి గురించిన సమాచారమంతా శ్రీబొండాడ జనార్ధనరావుగారి బ్లాగునుండి సేకరింపబడింది.
బాబా భక్తులు
శ్రీ జీ.ఎస్.కపర్డే - 1
(తనకు ఎంతో ఆదాయాన్ని సముపార్జించి పెట్టే న్యాయవాద వృత్తిని, రాజకీయ జీవితాన్ని పదలిపెట్టి, ఒక పిచ్చి ఫకీరయిన బాబా సాంగత్యం తప్ప మరేదీ అవసరం కపర్డేకు లేదనే భావనను ఆనాటి బ్రిటీష్ పాలకులలో కలిగించారు బాబా. బ్రిటీష్ వారిలో ఆభావం కలిగినందువల్లే కపర్డే బ్రిటిష్ ప్రభుత్వం విధించబోయే శిక్ష నుండి తప్పించుకున్నారు. కపర్డే 46 డైరీలు వ్రాశారు. ఈ డైరీలలో కపర్డే బాబాతో తాను ఉన్నపుడు జరిగిన సంఘటనలని తేదీలవారిగా వ్రాశారు. డైరీల ద్వారా మనకు లభించిన సంఘటనలు మొదటగా దీక్షిత్ ద్వారా లభిస్తే, రెండవది కపర్డే గారి ద్వారా మనకి లభ్యమయాయి.)
గణేష్ శ్రీకృష్ణ కపర్డే బెరార్ జిల్లాలోని ఇంగ్రోలీ గ్రామంలో ఆగస్టు, 27, 1854 లో జన్మించారు. ఆరోజు వినాయక చతుర్ధి. అందుచేతనే ఆయన పేరులో గణేష్ అని కూడా చేర్చారు వారి తల్లిడండ్రులు. ఆయన తండ్రి శ్రీకృష్ణ నార్ధర్. చిన్నతనం నుండీ బీదరికాన్ని అనుభవించినా, కష్టపడి మామలతదారు స్థాయికి ఎదిగారు.
కపర్డే ఎల్ఫిన్ స్టన్ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసి, 1884 లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆయన సంస్కృతం, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యుడు. ఆ భాషలలో మంచి పండితుడిగా పేరుపొందారు. ఆయనకు గుజరాతీ భాషలో కూడా అంతే ప్రావీణ్యం ఉంది. ఆయన పుట్టుకతోనే భాషాకోవిదుడు. సంస్కృత, ఆంగ్ల భాషలలో మంచి వక్త. కాలేజీలో ప్రవేశించే ముందే కపర్డే ఒక గురువు వద్ద సంస్కృతాన్ని అభ్యసించి మంచి పండితుడయారు. కాలేజీలో ఆయన ప్రొఫెసర్ వర్డ్స్ వర్త్ వద్ద ఆంగ్ల భాషను అభ్యసించారు. ఈ వర్డ్స్ వర్త్, ప్రముఖ ఆంగ్ల కవయిన విలియం వర్డ్స్ వర్త్ మనుమడు.
స్వామి దయానంద సరస్వతి గారు ఒకసారి కపర్డే చదువుతున్న కాలేజీకి వచ్చారు. సంస్కృత భాషలో కపర్డేకి మంచి పట్టు ఉండటం వల్ల స్వామి దయానంద సరస్వతిగారితో పాండిత్య చర్చకు ఈయనని ఎంపిక చేశారు. కపర్డే గారి సంస్కృత పాండిత్యానికి స్వామీజీ ఆయనను ఎంతగానో అభినందించారు.
బాబా కపర్డేని దాదాసాహెబ్ అని సంబోధిస్తూ ఉండేవారు. ఒకసారి దాదాసాహెబ్ కుటుంబంతో సహా షిరిడీకి వచ్చారు. కుటుంబ సభ్యులందరూ బాబాకి ఎంతో భక్తితో సేవలు చేశారు.
కపర్డే సామాన్యమయిన వ్యక్తి కారు. ఆయన గొప్ప పండితుడు. ఆంగ్ల భాలో ఎంతో ప్రావీణ్యం ఉంది. సుప్రీం శాసనమండలిలోను, రాష్ట్ర సమితిలోను ఆయనకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన వాగ్ధాటి, వాదనా పటిమ శాసన సభను ఆకట్టుకున్నాయి. ఆయనకు వేదాంత, ఆధ్యాత్మిక గ్రంధాలలో మంచి ప్రావీణ్యం ఉంది. కపర్డేగారికి, విద్యారణ్యగారు వ్రాసిన పంచదశిలో కూడా గణనీయమైన పాండిత్యం ఉంది. (పంచదశ సంస్కృత శ్లోకాలలో వ్రాయబడ్డ అద్వైత గ్రంధం).
అయినా కాని, ఆయన మసీదులోకి అడుగుపెట్టినా తన పాండిత్యాన్ని ఏమాత్రము ప్రదర్శించకుండా మవునంగానే ఉన్నారు. ఎంతోమంది ఆయన యిచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలని శ్రధ్ధగా వింటూ ఉండేవారు. వేదాంత గ్రంధాలలో ఆయనకున్న జ్ఞానం ఎటువంటిదంటే, ఆఖరికి ఉపాసనీబాబా కూడా కాపర్డేగారిని తన గురువుగా భావించాడు. అంత పాండిత్యం ఉన్నాగాని కాపర్డేలో వీసమంతయినా అహంభావం లేదు. బాబాముందు ఒక సామాన్యునిలా ఎంతో పూజ్య భావంతో మెలిగేవారు. తన డైరీలలో బాబాని సాయిమహరాజ్ అనే సంబోధిస్తూ ఉండేవారు.
బాబా భక్తులలో కాపర్డే, గోపాలరావు బూటీ, నూల్కర్, వీరు ముగ్గురూ బాబా సన్నిధిలో మవునంగానే ఉండేవారు. వారు బాబాముందు వినయంగా ఉండటమే కాక బాబా ఆజ్ఞలని శిరసావహించేవారు. కాపర్డే ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలని అధ్యయనం చేశారు. పంచదశలో కూడా మంచి పాడిత్యం ఉంది. కాపర్డే షిరిడీలో నాలుగు నెలలు ఉన్నారు. ఆయన భార్య ఏడుమాసాలు ఉంది. వారున్న కాలంలో యిద్దరూ షిరిడీలో ఎంతో సంతోషంగా గడిపారు. షిరిడీలో ఉన్న కాలంలో కాపర్డే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం బాబాని దర్శించుకునేవారు. ప్రతిరోజు ఆధ్యాత్మికోపన్యాసాలు కూడా యిస్తూ ఉండేవారు. ఆయన భార్యకు బాబాపై ఎంతో నమ్మకం. 1885 - 1890 ఈమధ్య కాలంలో కాపర్డేగారు బెరాల్ లో మున్సిఫ్ గాను, అసిస్టెంట్ కమీషనర్ గాను పనిచేసిన తర్వాత, అమరావతిలో మరలా న్యాయవాద వృత్తిని చేపట్టారు. ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు. 1890 నుండి ఆయనకు ప్రజాజీవితంలో ఆసక్తి కలిగి, 1890 సంవత్సరంలో జిల్లా కౌన్సిల్ కి అధ్యక్ష పదవినలంకరించారు. ప్రజాజీవితంలో ఆయనకు కలిగిన ఆసక్తి వల్ల బాలగంగాధర తిలక్ గారికి సన్నిహుతుడయ్యారు.
ప్రతిరోజు జరిగే విశేషాలన్నిటినీ డైరీలలో వ్రాయడం ఆయనకు అలవాటు. ఆవిధంగా ఆయన రమారమి 46 డైరీల వరకు వ్రాశారు. వాటిలో కొన్ని ఖరీదయిన "కోలిన్స్ డైరీలు" 'లేటస్ డైరీల' వంటివాటిని కూడా విదేశాలనుండి తెప్పించుకుని వాటిలో వ్రాసేవారు . ఖరీదయిన ఈ డైరీలు మనకి ఇప్పటికీ లభ్యమవుతున్నాయి.
1879 లో ఒక్క పాకెట్ డైరీ తప్ప 1894, 1938 సంవత్సరాలలో ఆయన ఆడైరీలలోనే దినచర్యనంతా వ్రాశారు. జరిగిన సంఘటనలు, కార్యక్రమాలు అవి ముఖ్యమయినవయినా, చిన్నవయినా, ఎంత రాత్రయినా సరే డైరీలో వ్రాసిన తరువాతనే పడుకునేవారు. ఆయన తన డైరీలలో వ్రాసినవన్నీ వాస్తవాలు. అన్నీ సమగ్రంగా ఉన్నాగాని, రాజకీయపరంగా ఎటువంటి వివాదాలు రాకుండా నివారించడానికి, ఉద్దేశ్యపూర్వకంగా కొన్నిటిని మాత్రం తెలియపర్చలేదనిపిస్తుంది. ఆయన వ్రాసిన డైరీలలోని విషయాలన్నీ సాయిలీల పత్రికలో ఆగస్టు 1985 సంవత్సరం నుండి పునర్ముద్రించబడ్డాయి. 1924 నుండి 1925 వరకు సాయిలీల పత్రికలో ప్రచురింపబడినా కాని అవి పూర్తిగా లేవు.
కాపర్డే గారు షిరిడీలో ఉన్నది చాలా తక్కువ కాలమే అయినా, ఆయన వ్రాసిన డైరీలలో బాబావారి జీవన విధానం గురించి, ఆయన కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకు అందించారు. కాపర్డేగారు బాబా గురించిన సమాచారమంతా తేదీల వారీగ ఒక క్రమమయిన పద్ధతిలో వ్రాయబడ్డవాటిగా ప్రసిధ్ధి చెందాయి. బాబాగారి మరొక అంకిత భక్తుడయిన దీక్షిత్ గారు కూడా డైరీలు వ్రాశారు. దీక్షిత్ గారు వ్రాసిన డైరీలు 140 పేజీలు. ఆడైరీలలో ఆయన తాను షిరిడీలో ఉన్నపుడు జరిగిన సంఘటనలను, తాను షిరిడీకి రాకముందు విషయాలను వ్రాశారు. కాపర్డే విద్యారణ్యస్వామి వ్రాసిన పంచదశను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితుడు. ప్రతిరోజు షిర్దిడీలోని వాడాలొ పంచదశలోని విషయాలన్ని వివరిస్తూ ఉండేవారు. దీక్షిత్ గారు రామాయణం మీద ఉపన్యాసాలిస్తే, భీష్మగారు భగవద్గీత గురించి ఉపన్యాసాలిచ్చేవారు. దీక్షిత్, కాపర్డేలు తాము వ్రాసిన డైరీలలో బాబాగారి జీవనం, వారి లక్ష్యాలను పూర్తిగా వివరించారు.
(తరువాయి భాగం రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment