21.10.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
విజయదశమి శుభాకాంక్షలు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖాపర్డే గారి డైరీలోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ - 2
07.12.1910, బుధవారం
ఈ రోజు ఉదయం నా ప్రార్ధన అయిన తరువాత, రిటైర్డ్ మామలతదారు బాలా సాహెబ్ భాటే వాడాకు వచ్చి, మాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆయన కొంత కాలం నుండీ యిక్కడే వుంటున్నారట. ఆయన ముఖంలో ఒక విధమయిన ప్రశాంతత కనిపిస్తోంది.
సాయి మహరాజ్ బయటకు వెళ్ళటం చూశాము మేము. మధ్యాహ్నం మసీదుకు వెళ్ళాము. నేను, బాబాసాహెబ్ సహస్ర బుధ్ధే, మా అబ్బాయి బాబా, బాపూసాహెబ్ జోగ్, ఇంకా పిల్లలు అందరం కలిసి వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాము. సాయి మహరాజ్ చాలా హాస్య ధోరణిలో కనిపించారు. బాబా సాహెబ్ సహస్ర బుధ్ధేను బొంబాయి నుండి వచ్చారా అని అడిగారు. అవునని చెప్పాడు అతను. తిరిగి బొంబాయి వెడతావా అని అడిగారు. తిరిగి అవునని చెప్పాడు. కాని తిరిగి వెళ్ళాలా లేదా అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నాడు. సాయి మహరాజ్ "అవును నిజమే నీకు చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. చెయ్యవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నాలుగయిదు రోజులు నువ్విక్కడే ఉండాలి. నీవిక్కడే ఉండి నీగురించి నీవు తెలుసుకోవాలి. పొందిన అనుభవాలన్నీ సత్యాలే. అవి భ్రమలు కావు. వేల సంవత్సరాల పూర్వం నుండీ నేనిక్కడ ఉన్నాను". అన్నారు. తరువాత నావైపు తిరిగి సంభాషణని దారి మళ్ళించారు సాయి మహరాజ్. ."ఈ ప్రపంచం చాలా విచిత్రమయినది. అందరూ నావాళ్ళే. నేనందరినీ సమంగానే చూస్తాను. కాని కొందరు దొంగలు. నేను వారికేం చేయగలను? తమ చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఇతరుల చావుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వారు నన్నెంతో బాధించారు, హింసించారు. కాని నేనేమీ అనలేదు. మౌనంగా ఉన్నాను. భగవంతుడు చాలా గొప్పవాడు. భగవంతుని కార్య నిర్వాహకులు అన్ని చోట్లా ఉన్నారు. వారంతా చాలా శక్తిమంతులు. మనిషి, భగవంతుడు తనను ఉంచిన స్థానంలో
సంతృప్తితో ఉండాలి. కాని నేను చాలా శక్తిమంతుడిని. నేనిక్కడ 8 లేక 10 వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నాను."
నిన్న మీరెందుకని కోపంగా ఉన్నారని అడిగాను. నూనె వ్యాపారి ఏదో అనటం చేత కోపం వచ్చిందన్నారు. ఇవాళ భోజన పదార్ధాలను పంచేటప్పుడు, "కొట్టద్దు, కొట్టద్దు" అని అన్నారెందుకని అడిగాను. దానికాయన "పాటిల్ కుటుంబ సభ్యులందరూ పోట్లాడుకుని విడిపోతున్నారు" అందుకని నేను ఏడుస్తున్నాను" అని సమాధానమిచ్చారు. సాయి సాహెబ్ మృదుమధురమయిన స్వరంతో మాట్లాడారు. ఆయన మాటలాడేటపుడు ఆయన అసాధరణమైన కరుణ, తరచుగా నవ్వే ఆయన నవ్వు నా జ్ఞాపకాలలో శిలాక్షరాలుగా మిగిలాయి. దురదృష్టవశాత్తు ఎవరో రావడంతో మా సంభాషణకు అంతరాయం కలిగింది. దాంతో మాకు బాధ కలిగింది. కానీ చేయగలిగిందేమీ లేదు. మేము ఆ విషయాలే మాట్లాడుకుంటూ వచ్చేశాము. సంభాషించుకుంటున్న మొదట్లో తాత్యాసాహెబ్ నూల్కర్ అక్కడ లేడు కాని తర్వాత వచ్చాడు. బాలా సాహెబ్ భాటే సాయంత్రం వచ్చినపుడు తిరిగి అందరం ఇదే విషయం గురించి మాట్లాడుకొన్నాము.
డిసెంబరు,8, 1910, గురువారం
ఉదయం ప్రార్ధన తరువాత సాయిమహరాజ్ బయటకు వెడుతుండగా వారి దర్శనమయింది.
తరువాత మధ్యాహ్నం ఆయనను చూడటానికి వెళ్ళాము. కాని ఆయన కాళ్ళు కడుక్కొంటూ ఉండటం చేత తిరిగి వెనుకకు వచ్చేశాము. బాబాసాహెబ్ సహస్రబుధ్ధే, నేను, మా అబ్బాయి, ఈ రోజు ఉదయాన్నే వచ్చిన మరొక పెద్ద మనిషి (కొత్త వ్యక్తి) అందరం కలిసి వెళ్ళాము. ఆ తరువాత తిరిగి వచ్చేశాము. మాతో తాత్య సాహెబ్ నూల్కర్ రాలేదు. తరువాత మళ్ళీ వెళ్ళాము. కాని, సాయిసాహెబ్ మమ్మల్ని వెంటనే పంపేశారు. అందుచేత తిరిగి వచ్చేశాము. ఆయన ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. రాత్రి సాయి సాహెబ్ చావడిలో నిద్రించారు. ఆరాత్రి మేము చావడి ఉత్సవాన్ని చూశాము. అది చాలా బాగుంది.
ఇంతకు ముందు నేను చెప్పిన కొత్త వ్యక్తి పోలీస్ ఆఫీసర్. హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను. అతని మీద లంచగొండితనం నేరం ఆరోపించబడి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఆకేసు నుండి బయట పడితే సాయిమహరాజ్ దర్శనం చేసుకుంటానని మొక్కుకొన్నాడు. ఇపుడా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. అతనిని చూడగానే సాయిమహరాజ్ ఇంకా కొన్నాళ్ళు అక్కడే ఉండవలసింది. పాపం వాళ్ళు చాలా నిరాశ పడ్డారు" అన్నారు. ఈ విధంగా ఆయన రెండు సార్లు అన్నారు. ఆ తరువాత మాకు తెలిసిందేమిటంటే ఆ కొత్తవ్యకిని ఆయన మిత్రులు ఆగమని బ్రతిమాలినా ఈయన వినలేదని. ఆయన అంతకు ముందెప్పుడూ సాయిమహరాజ్ ని చూడలేదు. అటువంటిది సాయిమహరాజ్ కి అతని గురించి, అతను ఏమి చేసాడో ఎలా తెలిసిందన్నదే ఆశ్చర్యం.
(మరికొన్ని విషయాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment