09.10.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
నిన్నటిరోజున కళ్ళ డాక్టర్ వద్ద కంటి పరీక్షల కోసం వెళ్ళిన కారణంగా, కాపర్డే గారి గురించిన సమాచారం ప్రచురించడానికి సాధ్యం కాలేదు. ఈ రోజు నాలుగవ భాగం అందిస్తున్నాను చదవండి.
బాబా భక్తులు
శ్రీ.జీ.ఎస్. కపర్డే - 4 (నాలుగవ భాగం)
కపర్డే షిరిడీలో ఉన్న కాలంలో, ముఖ్యంగా రెండు రోజులు అనగా 1912 జనవరి 13,17 తేదీలలో బాబా సంతోషంగా ఉన్నప్పుడు, బాబా రెండు సార్లు కపర్డే పై యోగ దృష్టి సారించారు. ఈవిషయం ఆయన వ్రాసుకున్న డైరీలో గమనించవచ్చు. బాబా సారించిన యోగ దృష్టి వల్ల కపర్డే జీవితకాలమంతా ఆధ్యాత్మికానందంలో గడిపారు. (జనవరి 13, 17, 1912 సం రెండు రోజుల డైరీ సమాచారాన్ని క్రింద ఇచ్చాను చూడండి - త్యాగరాజు)
1911 వ. సంవత్సరంలో భీష్మ కపర్డేతో షిరిడీకి వచ్చాడు. కపర్డే రెండవసారి షిరిడీ వెళ్ళినపుడు తను వ్రాసుకున్న డైరీలో భీష్మ గురించి ప్రస్తావించారు. భీష్మ షిరిడీలో ఉన్నపుడు బాబా మీద 9 ఆరతి పాటలను వ్రాశాడు. ఆ విధంగా భీష్మ వచ్చిన తరువాత ఆరతి పాటల పుస్తకానికి ఒక రూపం వచ్చింది. షిరిడీ ఆరతులు పుస్తకానికి ఒక రూపం ఏర్పడిందంటే ఆకీర్తి అంతా భీష్మకే చెందుతుంది. ఆవిధంగా భీష్మ 'శ్రీసాయినాధ సగుణోపాసన' పేరుతో బాబా ఆరతి పాటలను వ్రాశాడు. ఈ పాటలతోపాటుగా కొన్ని హిందూ సాంప్రదాయ శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆరతి సమయంలో ఈ పాటలను రాగ యుక్తంగా బాబా సన్నిధిలో ఆలపించేవారు. ఈ పాటలన్నీ ఒక పుస్తకంగా ముద్రించబడింది. ముద్రణకయిన ఖర్చునంతా కపర్డే భరించారు. బాబా మహా సమాధి చెందిన తరువాత, సమాధి మందిరంలో ప్రతిరోజు పూజా సమయంలో ఉపయోగించవలసిన పుస్తకంగా అధికారికంగా స్వీకరింపబడింది. 1922 వ.సంవత్సరం వరకు ఆరతి పాటల పుస్తకం ముద్రణకు అయే ఖర్చునంతా కపర్డే చెల్లిస్తూనే వచ్చారు. ఆవిధంగా కపర్డే కృషి వల్లనే 'శ్రీసాయినాధ సగుణోపాసన వ్యాప్తిలోకి వచ్చింది. షిరిడీ సాయిబాబా సంస్థానం వారు కూడా ఈ ఆరతి పాటలనే అధికారికంగా అమలు చేశారు.
ఒకసారి 1911 సంవత్సరంలో షిరిడీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. కపర్డే కుమారుడు బల్వంత్ కి ప్లేగు వ్యాధి సోకింది. తల్లి లక్ష్మీబాయి కొడుకుని బాబా వద్దకు తీసుకొని వచ్చి కాపాడమని ప్రార్ధించింది. బాబా ఆమెతో ధైర్యముగా ఉండమనీ ఆమె కొడుకుని కాపాడుతానని చెప్పారు. తరువాత బాబా తన శరీరం మీద ప్లేగు వ్యాధి వల్ల వచ్చిన బొబ్బలను చూపించారు. బల్వంతునికి వచ్చిన ప్లేగు వ్యాధిని తాను స్వీకరించి అతనిని కాపాడినట్లుగా చెప్పారు. కపర్డే భార్య లక్ష్మీ బాయి గణేష్ కపర్డే, బాబాకు అంకిత భక్తురాలు. బాబా ఆమెను అనుగ్రహించారు.
కపర్డే 1915వ.సంవత్సరంలో మూడవసారి షిరిడీ వెళ్ళి అక్కడ మూడు రోజులున్నారు. 19, మే, 1917వ.సంవత్సరంలో నాలుగవసారి బాలగంగాధర్ తిలక్ గారితో షిరిడీ వచ్చి, ఒక్క రోజుండి బాబా దర్శనం చేసుకొన్నారు. స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన విషయంలో తిలక్ గారు బాబా సలహా తీసుకున్నారు. తిలక్ గారికి బాబా రహస్యంగా కొన్ని సలహాలిచ్చినట్లుగా సంకేతాలు ఉన్నాయి. భారత దేశానికి హింసాత్మక చర్యలతో కాకా అహింసా ఉద్యమం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం సిధ్ధిస్తుందని బాబా, తిలక్ గారికి చెప్పారు. బాబా యిచ్చిన సలహాననుసరించి తిలక్ గారు తన పంధా మార్చుకున్నారు (కాస్త తగ్గించుకున్నారు). కాని ఆయన ఇచ్చిన సలహా ఏమిటన్నది మాత్రం రహస్యంగా ఉంచారు. తిలక్ షిరిడీనుండి వెళ్ళిపోయిన తరువాత అహమ్మద్ నగర్ జిల్లా కలెక్టర్, సాయిబాబా కార్యకలాపాలపై అనగా స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించి, నిఘా పెట్టి తనకు రహస్య నివేదికను పంపించమని ఒక గూఢచారిని పంపించారు.
1912 మార్చ్ నెలలో కపర్డే షిరిడీనుండి బయలుదేరారు. బయలుదేరే ముందు బాబా బ్రిటిష్ ప్రభుత్వం వారి విచారణ నుండి ఆయనను తాను ఎలా రక్షించారో వివరంగా చెప్పారు. 1912వ.సం.లో షిరిడీ విడిచి వెళ్ళిన తరువాత మరలా 1917 లో బాలగంగాధర తిలక్ గారితో షిరిడీ వచ్చారు. 1962 లో ఆయన పెద్ద కుమారుడు కపర్డే గారి జీవిత చరిత్రను వ్రాసిన దాని ప్రకారం ఆయన మొత్తం మీద 5 సార్లు షిరిడీకి వచ్చారు. ఐదవసారి ఆయన 1918 లో వచ్చారని చెప్పబడింది. ఆయన షిరిడీలో మొత్తం ఎన్ని రోజులు ఉన్నారన్న విషయం కూడా తెలీదు. కాని ఆయన ఒక ప్రత్యేకమయిన విషయం గురించి బాబా నుండి సలహా తీసుకుందామనె ఉద్దేశ్యంతో వచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే హోం రూల్ గురించి యింగ్లాండుకు వెడుతున్న కాగ్రెస్ వారితో కలిసి వెళ్ళాలా వద్దా అనే విషయంపై ఆయన సలహా కోరారు. ఈ విషయం మీద బాబా ఏమి సలహా యిచ్చారు, ఏమి చర్య తీసుకున్నారన్న విషయం బయటకు రాలేదు.
@@@
(కపర్దే డైరీలలోని సమాచారం)
13.01.1912
ఉదయాన్నే లేచి కాకడ హారతికి వెళ్ళాను. సాయి మహరాజు ఒక్క మాట మాట్లాడలేదు. సాధారణంగా చూచే చూపులు కూడా లేవు. ఖాండ్వా తహసీల్దారు ఇక్కడికి వచ్చాడు. మేము యోగ వాసిష్ఠం చదువుతుండగా అతన్ని చూచాము. సాయి నడకకు వెళ్ళటం, తిరిగి రావటం చూచాను. నిన్నటి పాటగత్తెలిద్దరూ వచ్చారు. కొద్దిగా పాడారు. బహుమతిగా మిఠాయిలు తీసుకొని వెళ్ళీపోయారు. మధాహ్న హారతి సంతోషంగా గడిచింది. మేఘాకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. మాధవరావు దేశ్ పాండే తమ్ముడు బాపాజీ తన భార్యతోపాటు భోజనానికి పిలిచాడు. ఖాండ్వా తహసీల్దారు సంస్కారం గల వాడిగా కనిపిస్తున్నాడు. ఆయన యోగవాసిష్ఠం చదివాడు. ఆయన తనకున్న భక్తి భావాలకు అనుగుణంగా మనుష్యులను మలచటం ద్వారా తాను దుఃఖం తెచ్చుకొన్నానన్నాడు. మధ్యాహ్నం కొద్ది విశ్రాంతి తరువాత దీక్షిత్ భావార్ధ రామాయణం చదివాడు. (బాలకాండ 11వ.అధ్యాయం). అది యోగవాసిష్ఠంకు సారాంశం వంటిది. చాలా బాగుంది. సాయి మహరాజు వెళ్ళుతుండగా చూచాను. ఆయన మూడ్ మారిపోయింది. ఆయన కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు గానీ లేరు. భజన, రామాయణాలతో రాత్రి కార్యక్రమం పూర్తయింది.
17.01.1912
నేను పొద్దున్నే లేచి, బాపూసాహెబ్ జోగ్ స్నానానికి వెడుతుండటం చూచాను. అదే వేళలో నేను ప్రార్ధన చేసుకున్నాను. తరువాత చావడికి కాకడ హారతికి వెళ్ళాము. మేఘా అసలు లేచిరాలేనంత అనారోగ్యంగా ఉన్నాడు. బాపూసాహెబ్ హారతిచ్చాడు. సాయిబాబా కరుణార్ధంగా నవ్వారు. ఆ నవ్వు ఒక్కసారి చూడడానికే యిక్కడ ఏళ్ళ తరబడి ఉండవచ్చు.
వెర్రివాడిలా ఆయన ముఖం చూస్తూ ఉండిపోయాను. మేము తిరిగి వచ్చాక నారాయణరావు కొడుకు గోవింద, తమ్ముడు భావు బండి తీసుకొని కోపర్ గావ్ మీదుగా హోషంగాబాద్ వెళ్ళిపోయారు. నేను నా మామూలు దిన చర్యలో పడిపోయాను. కొద్ది పంక్తులు వ్రాసి, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్ లతో కలిసి పరమామృతం చదివాను. సాయిమహరాజు బయటికి వచ్చి, తిరిగి మసీదుకు వెళ్ళటం చూచాను. ఆయన నిశ్శబ్దంగా ఏవో చెపుతున్నారు గాని అవివేకి లాగా తెలుసుకోలేకపోయాను. వాడాకు తిరిగి వచ్చాక నాకేదో విషాదంగా నిష్కారణంగానే ఏదోలా ఉంది. బల్వంత్ కు కూడా విచారంగా అనిపించింది. వెంటనే షిరిడీ విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. సాయిబాబాను అడిగి నిర్ణయించుకొమ్మన్నాను. భోజనానంతరం కొంచెం పడుకొని లేచాను. దీక్షిత్ రామాయణం వినాలనుకున్నాను. కాని సాయిబాబా దీక్షిత్ కోసం కబురు చెయ్యటంతో అతడు వెళ్ళిపోయాడు. అంచేత మా చదువు ముందుకు సాగలేదు. ఖాండ్వా తహసిల్దార్ ప్రహ్లాద్ అంబాదాసు తిరిగి వెళ్ళడానికి అనుమతి అడిగి పొందారు. జల్ గావ్ పటేలు, ఒక లింగాయతూ వచ్చి ఉన్నారు. వాళ్ళు రేపు వెళ్ళిపోవచ్చు. సాయంత్రం నడక సమయంలో సాయి మహరాజును చూచాను. ఆయన చాలా మంచి మూడ్ లో ఉన్నారు. ఆ రాత్రి భజన, రామాయణ పఠనం జరిగాయి. వాడాలో హారతి సమయంలో బాబాగారు ఉదయం ఇచ్చిన సూచనలకు అర్ధం తెలిసింది. ఆనందమైంది.
(ఆఖరి భాగం రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment