11.10.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.కపర్డే గారి గురించి ఆఖరి భాగం ప్రచురిస్తున్నాను. చదవండి.
బాబా భక్తులు
శ్రీ జీ.ఎస్.కపర్డే - 5వ.భాగం (ఆఖరు భాగం)
బాబా మహాసమాధి చెందిన తరువాత కపర్డే షిరిడి వెళ్ళనప్పటికీ, భగవత్స్వరూపుడయిన బాబా, ఆయనను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూనే ఉన్నారు. ఒకసారి అమరావతిలో ఉన్న ఆయన యింటిలో దొంగలు పడినపుడు, బాబా ఆ దొంగలను తరిమి వేశారు. ఈ సంఘటన బాబా చాలా బలహీనంగా ఉండి యిక నాలుగు రోజులకు మహాసమాధి చెందడానికి ముందు అక్టోబరు 1918, 14వ.తేదీ రాత్రి జరిగింది. బాబా ఆవిధంగా తన అంకిత భక్తుల మీద తన అనునుగ్రహాన్ని చూపించేవారు.
బాబా భుజించడానికి ఆయన ముందు ఎన్ని పదార్ధాలు ఉన్నా గాని వాటినేమీ ముట్టుకునేవారు కాదు. లక్ష్మీ బాయి సమర్పించే నైవేద్యం కోసమే ఎప్పుడూ వేచి చూస్తూ ఉండేవారు. ఆమె తెచ్చిన భోజనాన్ని ఆనందంగా ఆరగించేవారు. ఆమె స్వయంగా వండి బాబా కోసం మసీదుకు తీసుకుని వస్తూ ఉండేది. బాబా ఆరగించిన తరువాతే తాను భుజించేది. ఆమె భక్తి అటువంటిది. ఈ సంఘటనలు మనకు షిరిడీ డైరీ నుండి, బీ.వీ.దేవ్ గారు వ్రాసిన పుస్తకాలనుండి లభిస్తాయి. (కొన్ని సంఘటనలు శ్రీసాయి సత్ చరిత్రలో మనకు కనిపించవు). ఒకసారి లక్ష్మీబాయి బాబా కోసం, సాంజా, పూరీ, అన్నం, పప్పు, పాయసం యింకా కొన్ని మధుర పదార్ధాలు తీసుకొని వచ్చింది. ఆమె భోజన పదార్ధాలను తీసుకుని రాగానె బాబా వెంటనే ఆత్రుతగా తన ఆసనం నుండి లేచి ఎప్పుడూ కూర్చునే చోటుకు వచ్చారు. లక్ష్మీబాయి తెచ్చిన భోజన పళ్ళాన్ని ముందుకు లాక్కుని మూత తీసి ఆరగించడం ప్రారంభించారు. అంతకు ముందే అక్కడ భక్తులందరూ బాబాకి సమర్పించడానికి తెచ్చిన పదార్ధాలు ఉన్నాయి. బహుశా బాబాకు లక్ష్మిబాయి తెచ్చిన భోజనం మిగిలినవాటి కంటే మరింత దివ్యంగా ఉండి ఉంటుంది. బాబా తన ముందు, భక్తులు తెచ్చిన పదార్ధాలు ఎన్ని ఉన్నా వాటిని ముట్టుకోకుండా లక్ష్మీబాయి తీసుకుని వచ్చే దాకా వేచి ఉన్నారు. ఆమె తెచ్చిన భోజనాన్ని మహదానందంగా స్వీకరించారు. అపుడు అక్కడే ఉన్న శ్యామా బాబా ను యిలా అడిగాడు. "బాబా భక్తులందరూ నీకు సమర్పించడానికి వెండి పళ్ళాలలో ఎన్నో పదార్ధాలు తీసుకుని వచ్చారు. నువ్వు వాటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. లక్ష్మీబాయి తెచ్చిన భోజనాన్ని మాత్రం వెంటనే ఆరగించావు. ఏమిటి దీని రహస్యం". అపుడు బాబా లక్ష్మీబాయి యొక్క గత జన్మల గురించి వివరంగా చెప్పారు. "ఈ భోజనం యదార్ధముగా మిక్కిలి అమూల్యమయినది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిస్తూ ఉండేది . ఆ జన్మ తరువాత ఒక తోటమాలి యింటిలో జన్మించింది. తదుపరి ఒక క్షత్రియుని యింటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచాను. అందుచేతనే ఆమె పళ్ళెం నుండి ప్రేమతో తెచ్చిన భోజనాన్ని ఆనందంతో స్వీకరించాను." లక్ష్మీబాయి బాబా పాదాలకు నమస్కరించింది. బాబా ఆమె ప్రేమకు సంతసించి ఆమెతో "రాజారాం, రాజారాం" అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండు. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును. నీకు మేలు కలుగును" అన్నారు. ఈ మాటలు ఆమెలో ఆధ్యాత్మిక శక్తిని నింపాయి. బాబా రక్షణ తనకు సంపూర్ణంగా లభించిందనే ధృఢమైన నమ్మకం ఏర్పడింది.
కపర్డే గారి కుటుంబం చాలా పెద్దది. ఒక్కొక్కసారి పిల్లలు కాకుండా 50 మంది వరకూ ఉండేవారు. లక్ష్మీబాయి ఎంతో ఓర్పు, సహనంతో అంత మందికి ఎక్కడా లోటు రానివ్వకుండా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేది. కపర్డే న్యాయవాద వృత్తిలో ఉన్నపుడు అంత ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం ఆయనది. కాని, తరువాత ఆయన అదృష్టం తిరగబడింది. ఒక సందర్భంలో బాబా 01.02.1912 నాడు లక్ష్మీబాయికి రూ.200/- యిమ్మనిబాబా దీక్షిత్ ను ఆదేశించారు. అయితే ఈ ఆదేశం అమలు కానప్పటికీ, అది కపర్డేగారి అహంకారాన్ని తొలగించడానికి, ఆయన బీదరికాన్ని, సహనాన్ని తెలియచెప్పడానికి మాత్రమే ఉద్దేశింపబడింది. (ఇదే విషయం మీద కప్ర్డే గారు డైరీలో వ్రాసుకున్న భాగాన్ని కూడా ఇచ్చాను - త్యాగరాజు ) లక్ష్మీబాయి మంచి ఆరోగ్యవంతురాలయినప్పటికీ, 1928 తరువాత ఆమె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించడం మొదలయింది. మందులు వాడినా గానీ, ఆరోగ్యం మెరుగు పడలేదు. ఆమెకు తన అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయని ఊహించి ఉంటుంది. 11.07.1928 న కుటుంబ సభ్యులందరితోను ఫొటో తీసుకోవడానికి ఏర్పాటు చేసింది. తన ఆభరణాలని, పట్టు చీరలు, ఇంకా మిగిలిన ఆస్తులన్నిటినీ తన కోడలికి, పిల్లలకి పంచింది. భగవంతుని విగ్రహాన్ని ఏవిధంగా పూజిస్తుందో, ఆవిధంగా కపర్డేని కూడా పూజించింది. ఆవిధంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఎందుకని ఆ విధంగా చేస్తున్నావని ప్రశ్నించినపుడు తాను ఈ లోకం నుండి నిష్క్రమిస్తున్నట్లుగా చెప్పింది. ఆవిధంగా బాబా దర్శన భాగ్యంతో 20.07.1928 న ఆమె జీవితం ప్రశాంతంగా ముగిసింది. 10 సం. తరువాత 01.07.1938 న కపర్డేగారు కూడా 84 సం. వయసులో తనువు చాలించారు. ఆయన కొడుకు కూడా లాయరు, రాజకీయ నాయకుడు కూడా.
(కపర్డే & శ్రీమతి లక్ష్మీ కపర్డె )
పైన ఉదహరించిన సంఘటనలన్ని కూడా 1962 వ.సంవత్సరంలో ఆయన పెద్ద కొడుకయిన బాలకృష్ణ అనబడే బాబా సాహెబ్ కపర్డే గారు తన తండ్రి జీవిత చరిత్రను వ్రాసిన వాటిలోనివి. తన తండ్రి జీవిత చరిత్రనుండి, కపర్డే గారు వ్రాసుకున్న డైరీలనుండి ముఖ్యమైన విషయాలను వెల్లడి చేశారు. ఆయన జీవిత చరిత్ర, డైరీ రెండూ వేరు వేరు. రెండూ ఒకటే అనుకుని పొరపాటు పడకూడదు.
@@@@@
కపర్డేగారు వ్రాసుకున్న డైరీనుండి
01.02.1912
ఇవాళ సాయంత్రం మేమంతా మశీదు ముందర మేమంతా బాబా నడకకు వెళ్ళడానికి ముందుగా సమావేశమయ్యాము. సాయిబాబా దీక్షిత్ తో నా భార్యకు 200 రూపాయలు తమ కాళ్ళకు నూనె రాసినందుకు ఇమ్మని చెప్పారు. ఈ ఆజ్ఞ పాటింపరానిది.
నేను చందాల మీద బ్రతకవలసిన పరిస్థితి వచ్చిందా? అంతకంటే నాకు చావే నయ. సాయిసాహెబ్ నా గర్వాన్ని నలిపి నాశనం చేయదలచుకున్నారు. అందుకే పేదరికానికి ఇతరుల దానానికి అలవాటు పడేలా చేస్తున్నారనిపించింది. దాని క్రింద ఫుట్ నోట్ లో ఇలా ఉంది నేను 01.02.1912 డైరీ తిరగేసి నువ్వు చెప్పిన పేజీ చదివాను. ఇది సరిగ్గా నా మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. మా సద్గురు సాయినాధులు ఆజ్ఞ ఇచ్చారు. ఆయన సర్వజ్ఞులు. ఆయనకన్ని విషయాలు తెసులు. నా అంతరంతరాలలోని ఆలోచనలను గ్రహించగలిగారు. కనుకనే తమ ఆజ్ఞను అమలుపరచాలని పట్టుపట్టలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని తలుచుకుంటే నా భార్య ఆ సమయంలో పేదరికాన్ని, శ్రామిక జీవనాన్ని ఇష్ట పడేది కాదని అర్ధమయింది. కాకాసాహెబ్ దీక్షిత్ జీవితాన్ని ఉన్నదున్నట్లు జీవించారు. అందుకే ఆనందంగా ఉన్నారు. అందుచేత సాయిమహారాజ్ నాకు రెండు వందల రూపాయలు - అంటే పేదరికం, ఓర్పు రెండూ ఇమ్మన్నారు.
కపర్డే లోని యీ సింహావలోకనం ప్రస్తావన మనం లక్ష్మీబాయి కపర్డే జీవిత చరిత్ర తరచి చూచేటపుడు వస్తుంటుంది. ఈ చరిత్రకు ఆధారం ఆమె కొడుకు వ్రాసిన కపర్డే జీవిత చరిత్రే.
లక్ష్మీ బాయి చిన్ననాటి జీవితం గురించిన వివరాలేవీ కపర్డే జీవితచరిత్రలో లేవు. మనకు ఆమె కపర్డే భార్యగా, పిల్లల తల్లిగా, ఇల్లు దిద్దే గృహిణిగా మాత్రమే కనిపిస్తుంది. లక్ష్మీబాయి చదవగలదే గానీ వ్రాయలేదు. అంటే ఆమె విద్యా హీనురలని కాదు. నిజానికామె గొప్ప సంస్కారం గల స్త్రీ. కీర్తనకారుల ద్వారా వినీ, స్వయంగా చదివీ రామాయణ మహాభారత గాధలు, పాండవ ప్రతాపం, శివలీలామృతం మొదలనినవన్నీ నేర్చుకున్నది.
దాదా సాహెబ్ కపర్డే ఇల్లు బాగా పెద్దది. ఒక్కక్కప్పుడు దానిలో పిల్లలు కాక మొత్తం మీద ఏభై మంది ఉండేవారు. దాదాసాహెబ్, అతని భార్య, ముగ్గురు కొడుకులు, వాళ్ళ భార్యలు, తాము ఆశ్రయమిచ్చిన మూడు కుటుంబాలు పన్నెండు, పదిహేను మంది విద్యార్ధులు, ఇద్దరు వంటవాళ్ళు, వాళ్ళ భార్యలు, ఇద్దరు గుమాస్తాలు, ఒక కాపలావాడు, ఎనిమిది మంది గుఱ్ఱాల శాలలో పని చేసేవారు, ఎడ్లబళ్ళు తోలేవారిద్దరు, ఒక గోపాలకుడు, ఇద్దరు పనిమనుషులు, సగటున కనీసం ముగ్గురు అతిధులు, ఇలాంటి ఇల్లు అధికారికంగా నడుపుతూ ఉండాలంటే లక్ష్మీబాయి సంచలించే కన్ను ప్రతిదాన్నీ శ్రధ్ధతో చూస్తుండవలసిందే.
సద్గురు శ్రీసాయినాధ్ మహారాజ్ కి జై
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment