04.01.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము.
శ్రీ. జీ.ఎస్.ఖపర్డే డైరీ - 16
01.01.1912 సోమవారమ్
ఈ రోజు ఉదయం
తొందరగానే నిద్రలేచి, కాకడ ఆరతికి చావడికి వెళ్ళాను. మొట్టమొదటగా సాయి మహరాజ్ వదనం చూశాను. మధురమయిన తేజస్సుతో కరుణతో నిండి ఉంది.
నాకు చాలా ఆనందం కలిగింది. వాడాకు తిరిగి వచ్చిన తరువాత ఉపాసనీ సోదరుడు కన్పించాడు. అతను ధులియా నుండి వచ్చాడు. ఇంతకు ముందు అతనిని పూనాలోను, అమరావతిలోను చూశాను. అతను సాయి మహరాజ్ ను దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఆయన పూర్వజన్మల బంధమే అందరినీ కలుపుతుందని, దాని
పర్యవసానమే ఇపుడు కలుసుకున్నామని అతనితో అన్నారు.
ఆయన క్రిందటి జన్మ గురించి చెబుతూ,”అతను, బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, మాధవరావు
దేశ్ పాండే, నేను, దీక్షిత్, అందరూ కలిసి ఇరుకుగా
నున్న ఒక సందులో ఉన్నారని” చెప్పారు. అక్కడ అతని ధార్మిక గురువు ఉన్నారని, ఆయనే తిరిగి
మనందరినీ ఇక్కడ కలుసుకోవడానికి తీసుకొచ్చారని చెప్పారు. ఆయన బయటకు వెడుతుండగా చూసి, తరువాత రామాయణం చదువుకుంటూ
కూర్చున్నాను. మధ్యాహ్న ఆరతి సమయంలో మరలా ఆయన
దర్శనం చేసుకున్నాను. ఆయన నా యెడల ఎంతో ఆదరంగా
ఉన్నారు. దీక్షిత్ ఈ రోజు ‘నైవేద్యమ్’ ఏర్పాటు
చేశాడు. అతనితో కలిసి అందరం భోజనాలు చేశాము. నేను, వైద్య, నానాసాహెబ్ చందోర్కర్, దహను మామలతదారయిన
దేవ్, ఇంకా మరికొందరితో కలిసి కూర్చున్నాను.
తరువాత సాయి మహరాజ్ ను దర్శించుకోవడానికి మసీదుకు వెళ్ళాను.
అయన అందరితోపాటుగా నన్ను కూడా పంపించేశారు మొదట.
కాని, మళ్ళీ నన్ను వెనక్కి పిలిచి “పారిపోవడానికి తొందర పడుతున్నావే” అన్నారు. సాయంత్రం చావడికి ఎదురుగా ఆయన దర్శనం చేసుకున్నాము. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. భజనకి
బాలా షింపీ వచ్చాడు.
02.01.1912 మంగళవారమ్
ఈ రోజు చాలా
తొందరగా నిద్రలేచాను. నిన్న వచ్చిన ఉపాసనీ
సోదరుడు ఈ రోజు తెల్లవారకముందే వెళ్ళిపోయాడు.
నా ప్రార్ధన పూర్తయిన తరువాత కాకా మహాజని, ఆత్రే ఇంకా ఇతరులు వెళ్ళిపోయారు. తరువాత చాలా మంది వెళ్ళిపోయారు. మధ్యాహ్న ఆరతి తరువాత సి.వి. వైద్య మరొక ముగ్గురితో
కలిసి వెళ్ళాడు. నానా సాహెబ్ చందోర్కర్ ధనుర్మాస
పూజ చేశాడు. మమ్మల్నందరినీ ఆహ్వానించాడు. భోజనమయిన తరువాత సి.వి.వైద్య వెళ్ళిపోయాడు. ఆ తరువాత కోపర్ గావ్ మామలతదారయిన మాన్ కర్, దహను
మామలతదారు దేవా, వెళ్ళిపోయారు. సూర్యాస్తమానమయిన
తరువాత నానా సాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులుగా నిండుగా సందడిగా ఆనందంగా ఉన్న వాడా
ఇప్పుడు ఎవరూ లేక ఖాళీగా ఉంది. తోడెవరూ లేకుండా
ఉంది మాకు. సాయి మహరాజ్ బయటకు తిరిగడానికి
వచ్చినపుడు ఆయన దర్శనం చేసుకున్నాము. మరలా
శేజ్ ఆరతి సమయంలోను దర్శించుకున్నాము. మా అబ్బాయి
బాబా, గోపాలరావ్ దోలే నన్ను అమరావతికి తీసుకువెళ్ళడానికి ఈ రోజు ప్రొద్దున్న వచ్చారు. వారు సాయి మహరాజ్ ను దర్శించుకుని, అనుమతి గురించి
ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ రోజు భీష్మకి
ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భజన జరగలేదు. రామ
మారుతి ఈ రోజు వెళ్ళిపోదామనుకున్నాడు గాని, సాయిబాబా అతనిని ఆపేశారు. రాత్రి రామాయణం, భాగవత పఠనం జరిగాయి.
03.01.1912 బుధవారమ్
ప్రొద్దున్న
తొందరగా లేచి, కాకడ ఆరతికి వెళ్ళి, ప్రార్ధన ముగించుకున్నాను. మా అబ్బాయి బాబా, గోపాలరావు దోలే సాయి మహరాజ్ వద్దకు
వెళ్ళి అమరావతికి వెళ్ళడానికి అనుమతి అడిగారు.
సాయి మహరాజ్ అందరూ వెళ్ళవచ్చని చెప్పారు.
మా అబ్బాయి బాబా, గోపాలరావు దోలే సంతోషంగా తిరిగి వచ్చారు. ఆ విషయం నాతో చెప్పారు. అందుచేత నేను మాధవరావు దేశ్ పాండేతో వెళ్ళాను. సాయి మహరాజ్ తనిచ్చిన అనుమతిని ధృవపరిచారు. మేము తిరిగి వస్తుండగా ఆయన ఖిండ్ ఖిండ్ దగ్గర మమ్మల్ని
వెంబడించి వచ్చి మమ్మల్ని మరునాడు వెళ్ళమని చెప్పారు. అయన బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి మసీదుకు వచ్చేటప్పుడు
చూశాను. మాధవరావు నా ప్రయాణం గురించి అడిగాడు. సాయి మహరాజ్ నాకు ఇక్కడా, అమరావతిలోను ఇళ్ళున్నాయనీ,
నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండవచ్చనీ, అసలు నేను అమరావతికి వెళ్ళకపోవచ్చనీ చెప్పారు. ఆ విషయం అక్కడితో నిర్ణయమయిపోయింది. నేను మా అబ్బాయి బాబా, గోపాలరావు దోలేలతో అమరావతికి
తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పాను. వారు వెళ్ళడానికి సిధ్ధమయి వెళ్ళివస్తామని చెప్పడానికి,
సాయి మహరాజ్ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్ళినపుడు, ఆయన మరునాడు వెళ్ళమని అనుమతిచ్చారు. మేఘా ఈ రోజు తన గాయత్రి పునశ్చరణ అనుష్టానం పూర్తయిన
సందర్భంగా, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాడు. మేము కూడా అతనితో కలిసి భోజనాలు చేశాము. భోజనాలు సాఠేవాడలో జరిగాయి. మధ్యాహ్నం, ఆ తరువాత సాయంత్రం యధాప్రకారంగా సాయి
మహరాజ్ వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు రెండుసార్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నాను. ఆయన నవ్వుతూ చాలా ఉత్సాహంగా, ఒకేసారి నవ్వుతూ, తిడుతూ
ఉన్నారు. రాత్రికి భీష్మ భజన జరిగింది. దీక్షిత్ రామాయణంలో రెండు అధ్యాయాలు చదివాడు. సాయంత్రం తాత్యా పటేల్ తండ్రి మరణించాడు.
(మరికొన్ని విశేషాలు మరుసటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment