13.01.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోనుండి అతి ముఖ్యమయిన విశేషాలు చదవండి.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 22
18.01.1912 గురువారమ్
ఈ రోజు వ్రాయవలసింది
చాలా ఉంది. ఈ రోజు చాలా తొందరగా లేచి, ప్రార్ధన
చేసుకున్నాను. సూర్యోదయానికి ఇంకా గంట సమయం
ఉండటం వల్ల, మళ్ళీ పడుకుని సూర్యోదయం వేళ లేచాను.
నేను, ఉపాసనీ, బాపూ సాహెబ్ జోగ్, భీష్మ, పరమామృతం చదివాము.
తహసిల్దార్ ప్రహ్లాద్ అంబాదాస్, పటేల్ అతని అనుచరుడు
(లింగాయత్) వారి స్వస్థలాలకి తిరిగి వెళ్ళిపోయారు. చివరి ఇద్దరికీ సరిగా బయలుదేరే ముందు అనుమతి లభించింది. మేము సాయిబాబా బయటకు వెళ్ళడం, తిరిగి మసీదుకు రావడం
చూశాము. ఆయన నన్నెంతో ఆదరించి, నేను ఆయనకు
సేవ చేస్తున్నపుడు, రెండు మూడు కధలు చెప్పారు నాకు.
ఆయన డబ్బు తీసుకోవడానికి చాలామంది వచ్చారట. ఆయన వారినెప్పుడూ ఆపకుండా తీసుకువెళ్ళనిచ్చేవారట. ఆయన వారి పేర్లు గుర్తుంచుకొని, వారినే అనుసరిస్తూ
ఉండేవారట. వారు భోజనాలకి వెళ్ళినపుడు, తాను
వారిని చంపి, తన డబ్బును తిరిగి తెచ్చుకున్నారట.
మరొక కధలో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు.
అతను తకియా దగ్గర ఉండేవాడు. ఒకతను అతని
భార్యను ప్రలోభపెట్టి, ఆఖరికి ఆ గ్రుడ్డివానిని హత్య చేశాడు. చావడి దగ్గరికి నాలుగువందల మంది సమావేశమయి అతను
చేసిన పనిని ఖండించారు. వారతనికి శిరచ్చేదం
చేయవలసిందేనని ఆదేశించారు. గ్రామ తలారి అది
తన ఉద్యోగ భాధ్యని కాకుండా మనసులో ఏదో ఉద్దేశ్యాన్ని పెట్టుకుని ఉరి తీశాడు. అందుచేత ఆ హంతకుడు మరుజన్మలో ఆ తలారికి కొడుకుగా
జన్మించాడు.
ఆయన మరొక కధను
ప్రారంభించారు. ఈలోపులో ఒక అపరిచిత ఫకీరు వచ్చి
సాయిబాబా పాదలను తాకాడు. సాయిబాబాకి చాలా కోపం
వచ్చింది. కాకపోతె కాస్తంత కోపాన్ని ప్రదర్శించి,
గట్టిగా కదలకుండా పట్టిన పట్టు విడవకుండా, ప్రశాంతంగా ఉన్న ఆ ఫకీరును విదిల్చి కొట్టారు. ఆఖరికి అతను బయటకు వెళ్ళి, బయట ప్రహరీ గోడ దగ్గర
నిలబడ్డాడు. సాయిబాబా కోపంతో ఆరతి పళ్ళాలని,
భక్తులు తెచ్చిన నైవేద్యాలతో నిండుగా ఉన్న పాత్రలని విసరికొట్టారు. ఆయన రామమారుతి బువాను పైకెత్తి పట్టుకున్నారు. అపుడు తనకెంతో ఆనందం, ఏవో ఊర్ధ్వ లోకాలకు వెడుతున్నట్లుగా
భావన కలిగిందని ఆ తరువాత చెప్పాడు. భాగ్య అనే
అతని పట్ల, ఒక గ్రామీణుడి పట్ల సాయిమహరాజ్ మొరటుగా ప్రవర్తించారు. సీతారామ్ ఆరతి తీసుకు వచ్చాడు. మేము ఎప్పటిలాగే ఆరతి ఇచ్చాము. కాని కాస్త హడావిడిగా
పూర్తి చేశాము. మహల్సాపతి కొడుకు మార్తాండ్
సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఎటువంటి గందరగోళం లేకుండా ఆరతి ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు
పూర్తి చేయాలో అన్నీ సూచనలు చేశాడు. సాయిబాబా
తన మామూలు స్థానంనుండి బయటకు రాగానే అతనావిధంగా మార్గదర్శకం వహించాడు. ఆరతి పూర్తయే ముందు బాబా తమ యధాస్థానానికి వచ్చారు. ఎప్పటిలాగే అందరూ వెళ్ళారు. ఊదీ ఒక్కొక్కరికీ కాకుండా అందరికీ ఒకేసారి సామూహికంగా
పంచారు. ఆయన వాస్తవంగా కోపంగా లేరు కాని జరిగినదంతా
ఒక లీలగా చూపించారు.
ఈ మొత్తం వ్యవహారం
వల్ల చాలా ఆలస్యమయింది. తాత్యా పాటిల్ తన తండ్రి
సంవత్సరీకంలో భాగంగా అందరికీ భోజనాలు ఏర్పాటు
చేయడంతో పూర్తయేటప్పటికి సాయంత్రం 6.30 అయింది. దాని తరువాత ఏ పనీ చేయడానికి సమయం లేకపోయింది. సాయి మహరాజ్ సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటపుడు
దర్శించుకోవడానికి వెళ్ళాము. ఆయన ఎప్పటిలాగే
బయటకు వచ్చి నడుస్తుండగా మేము నమస్కరించుకున్నాము. వాడాలో ఎప్పుడూ జరిగే విధంగానే ఆరతి జరిగింది. మేఘా లేచి నిలబడలేనంతగా జబ్బు పడ్డాడు. ఆ రాత్రి అతనికి గడవదని బాబా చెప్పారు. ఆ సాయంత్రం చావడి ఉత్సవానికి నిలబడ్డాము. ఎప్పటిలాగే నేను నెమలీకల విసన కఱ్ఱను పట్టుకున్నాను. అన్నీ సక్రమంగా జరిగాయి. సీతారమ్ ఆరతి ఇచ్చాడు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
పీ.ఎస్. నేను
ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు సాయిబాబా
కోపంతో అన్న మాటల ప్రవాహంలో మా అబ్బాయి బల్వంతును రక్షించామన్నారు, ఆ తరువాత పదే పదే ఒక మాటన్నారు “ఫకీర్, దాదా సాహెబ్ ను (అర్ధం – నన్ను) చంపాలనుకున్నాడు
కాని నేను అనుమతించలేదు” ఆయన ఇంకొక పేరు చెప్పారు గాని దానిని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను.
19.01.1912 శుక్రవారమ్
ఈ రోజు చాలా
విచారకరమయిన రోజు. ఈ రోజు చాలా తొందరగా నిద్రలేచి
ప్రార్ధన పూర్తిచేసుకునేటప్పటికి సూర్యోదయానికింకా గంట పైగా సమయం ఉంది. అందువల్ల మళ్ళీ పడుకుని, బాపూసాహెబ్ లేపాక కాకడ ఆరతి
వేళకి లేచాను. తెల్లవారుఝామున నాలుగు గంటలకు
మేఘా చనిపోయాడని దీక్షిత్ కాకా చెప్పాడు. కాకడ
ఆరతి జరిగింది కాని సాయిమహరాజ్ తమ ముఖం చూపలేదు, కళ్ళు తెరచి కూడా చూడలేదు. దయతో చూసే చూపులు కూడా ప్రసరించలేదు.
మేము తిరిగి వచ్చిన తరువాత మేఘా అంత్యక్రియలకు ఏర్పాట్లు
జరిగాయి. మేఘా శరీరాన్ని బయటకు తీసుకురాగానే సాయిబాబా వచ్చారు. అతని మరణానికి బిగ్గరగా శోకించారు. ఆయన కంఠంలో నుండి వచ్చిన రోదన అందరినీ కంట తడి పెట్టించింది. ఆయన శవం వెంట గ్రామం వీధి మలుపు దాకా వెళ్ళి ఆ తరువాత
తాము మామూలుగా నడిచే త్రోవలో వెళ్ళిపోయారు.
మేఘా శరీరాన్ని ఒక పెద్ద చెట్టు క్రింద ఉంచి అక్కడ దహన సంస్కారాలు చేశారు. సాయిబాబా అతని మరణానికి శోకిస్తున్నట్లు దూరంనుంచి
కూడా స్పష్టంగా వినిపించింది. ఆరతి సమయంలో
చేతులు ఊపినట్లు, అతనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా
చేతులు ఊపుతూ కనిపించారు. కట్టెలు బాగా ఎండి
ఉండటంతో మంటలు చాలా పైకి లేచాయి. దీక్షిత్
కాకా, నేను, బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, దాదా కేల్కర్, అందరం, సాయిబాబా మేఘా శవాన్ని చూసి అతని గుండెలమీద భుజాలమీద,
పాదాలమీద తాకటం వల్ల, మేఘా ధన్యుడయ్యాడని కీర్తించాము.
అంత్యక్రియలు పూర్తయిన తరువాత మేము ప్రార్ధనకు కూర్చోవలసింది. కాని బాపూ సాహెబ్ జోగ్ రావటంతో అతనితో మాట్లాడుతూ
కూర్చున్నాను. ఆ తరువాత నేను సాయిబాబాను చూడటానికి
వెళ్ళాను. ఆయన మధ్యాహ్నమంతా ఎలా గడిపావని అడిగారు. ఆ సమయమంతా నేను మాట్లాడుతూ వ్యర్ధంగా కాలక్షేపం చేశానని
చెప్పి తప్పు ఒప్పుకుని చాలా బాధపడ్డాను. ఇది నాకొక గుణపాఠం. మేఘా మరణిస్తాడని మూడు రోజుల క్రితమే సాయిబాబా ఏవిధంగా
ముందుగానే చెప్పారో ఆ మాటలను “ఇది మేఘా ఇచ్చే
చివరి ఆరతి” గుర్తు తెచ్చుకున్నాను. మేఘా తన చివరి సేవను పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నందుకు
ఏమని భావించాడో, తన గురువుగా భావించిన సాఠేను చూడలేకపోయినందుకు ఎంతగా కన్నీరు పెట్టుకున్నాడో,
సాయిబాబా గారి ఆవులని విడిచి పెట్టమని అతను ఎలా ఆదేశించాడో అన్నీ గుర్తు చేసుకున్నాను. అతనెప్పుడూ ఏకోరికా కోరలేదు. మేమంతా అతని అమితమయిన భక్తి భావ జీవితాన్ని కొనియాడాము. నేను అర్ధరహితమయిన మాటలు వింటూ, ప్రార్ధన చేసుకుని
ప్రశాంతంగా ఉండనందుకు చాలా బాధపడ్డాను. భీష్మ,
మా అబ్బాయి బలవంత్ ఇద్దరికీ బాగుండలేదు. అందుచేత
భజన జరగలేదు. రాత్రి దీక్షిత్ కాకా రామాయణం
చదివాడు. గుప్తే, అతని సోదరుడు వారి కుటుంబం
ఈ రోజు ఉదయం బొంబాయి వెళ్ళిపోయారు.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment