12.01.2016 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీనుండి మరికొన్ని విశేషాలు
సాయి సత్ చరిత్ర పారాయణ చేసేవారందరికీ తెలుసు. బాబా వారి చిరునవ్వు ఎంతో అద్భుతంగా ఉండేదనే విషయం. ఈ విషయాన్నే ఖపర్డెగారు స్వయంగా తన డైరీ లో వ్రాసుకున్నారు. ఎంతో అధ్బుతంగా ఉంటుందట ఆయన చిరునవ్వు. ఇక చవండి.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ - 21
16.01.1912 మంగళవారమ్
ప్రతీరోజులాగే
ఈ రోజు కూడా తొందరగా లేచి, పురాణామృతంతో నా దిన చర్యను ప్రారంభించాను. అది మరాఠీ భాషలో ప్రసిధ్ధమయిన వేదాంత గ్రంధం. ఉపాసనీ చదువుతూ ఉంటే, నేను, బాపూసాహెబ్ జోగ్, భీష్మ,
రామ మారుతి వింటూ ఉంటాము.
అది చాలా రమ్యమైన
గ్రంధం. అవసరమయిన చోట నేను వివరించి చెబుతూ
ఉంటాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళటం చూశాను,
కాని ఆయన మసీదుకు తిరిగి వచ్చిన తరువాత వారి దర్శనానికి ఆలశ్యంగా వెళ్ళాను. ఆయన అసంతుష్టి చూపించకపోవడమే కాకుండా, నన్ను దయతో
ఆదరించారు. ఆయనకు సేవ చేస్తూ కూర్చున్నాను. మేఘాకు అనారోగ్యంగా ఉండటంతో అతనిని త్వరగా రమ్మని
ఆజ్ఞాపించకపోవడం వల్ల, మధ్యాహ్న ఆరతి ఆలస్యమయింది.
ఆఖరికి అతను ఆరతి ఇచ్చిన తరువాత, మేము తిరిగి వచ్చి భోజనాలు కానిచ్చేసరికి సాయంత్రం
నాలుగు గంటలయింది. దీక్షిత్ రామాయణం కాస్త
చదివాడు. ఆ తరువాత, మేము మసీదుకు వెళ్ళి సాయిమహరాజ్ దర్శనం చేసుకున్నాము. ఆయన మమ్మల్ని ఎక్కువ సేపు కూర్చోనివ్వలేదు. ఆయన బయటకు వచ్చి తొందర తొందరగా ఎప్పుడూ చేసే వ్యాహ్యాళిని
ముగించేసి మమ్మల్ని వాడాకు వెళ్ళిపొమ్మని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారో మాకర్ధం కాలేదు. వాడాకు వచ్చిన తరువాత, ముందు రోజు అస్వస్థతగా ఉన్న
దీక్షిత్ పనివాడు. హరి చనిపోయాడని తెలిసింది.
వైద్యం తెలిసిన
ఉపాసనీ కోసం కబురు పంపించాము గాని అతను దొరకలేదు.
పనివాడు చనిపోయాడన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. వాడాలో యధావిధిగా ఆరతి ఇచ్చి శేజ్ ఆరతికి వెళ్ళాము. సాయి మహరాజ్ విశేషమయిన అనుగ్రహంతో ఉన్నారు. తరువాత అద్భుతమయిన ప్రసన్నత ఉట్టిపడే తరంగాలను ప్రసరించి ఉపదేశం
చేశారు.
ఆయన రామ మారుతిని
కూడా ఆవిధంగానే అనుగ్రహించారు. మేము చాలా సంతోషంతో
తిరిగి వచ్చాము. అర్ధరాత్రికి ముందు, హరి అంత్యక్రియలు
చేశాము. కట్టెలు అవీ సంపాదించడం కాస్త కష్టమయింది. బాపాజీ ఎలాగయితేనేం సమకూర్చగలిగాడు. ఆ తరువాత దహన సంస్కారం జరిగింది. మాధవరావు దేశ్ పాండే ఉండి ఉంటే ఇంత కష్టపడవలసి వచ్చేది
కాదు. అతను తన భార్యా పిల్లలను తీసుకురావడానికి
నాగపూర్ వెళ్ళాడు. అంత్యక్రియలకి చాలా సమయం
పట్టింది. ఎప్పుడూ జరిగే భీష్మ భజన, దీక్షిత్
పురాణం ఏమీ జరగలేదు.
17.01.1992 బుధవారమ్
ఈ రోజు చాలా
తొందరగా నిద్రలేచాను. బాపూసాహెబ్ జోగ్ స్నానానికి
వెడుతుండటం చూశాను. ఈ లోగా నేను ప్రార్ధన చేసుకున్నాను. ఆ తరువాత కాకడ ఆరతికి చావడికి వెళ్ళాము. మేఘా రాలేనంతగా అనారోగ్యంతో ఉన్నాడు. అందుచేత బాపూసాహెబ్ జోగ్ ఆరతి ఇచ్చాడు. సాయిబాబా ఎంతో దయతో నవ్వుతూ చూశారు. ఆ నవ్వు ఎంతో అధ్బుతంగా ఉంది. ఒక్కసారి ఆ నవ్వు చూడటం కోసమే ఏళ్ళతబడి ఉండిపోవచ్చు. నేను అత్యంత సంతోషంతో వెఱ్ఱివాడిలా ఆయన ముఖం చూస్తూ
ఉండిపోయాను.
మేము తిరిగి వచ్చిన తరువాత నారాయణరావు
కొడుకు గోవిందు, సోదరుడు భావూ కోపర్ గావ్ మీదుగా హోషియాబాద్ కి బండిలో వెళ్ళిపోయారు. ఇక నా రోజువారీ కార్యక్రమాలని ప్రారంభించాను. కొద్ది పంక్తులు వ్రాసి, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్
లతో కలిసి పరమామృతం చదివాను. సాయి మహరాజ్ బయటకు
వెళ్ళటం ఆ తరువాత తిరిగి మసీదుకు రావటం చూశాము.
ఆయన మవునంగా ఏవో ఉపదేశాలు ఇచ్చారు కాని, అవివేకిలాగ నేను వాటినర్ధం చేసుకోలేకపోయాను. వాడాకు తిరిగి వచ్చిన తరువాత ఏకారణం లేకుండా నాకు ఏదో
గుబులుగాను, నిరుత్సాహంగాను అనిపించింది. బల్వంతుకు
కూడా విచారంగా అనిపించి, షిరిడీ విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. సాయిబాబాను అడిగి అప్పుడు నిర్ణయించుకోమని చెప్పాను. భోజనమయిన తరువాత కొద్దిసేపు పడుకున్నాను. తరువాత దీక్షిత్ రామాయణమ్ విందామనుకున్నాను గాని,
సాయిబాబా అతనిని రమ్మని కబురు చేయటంతో అతను వెళ్ళిపోయాడు. దానివల్ల మా పని ముందుకు
సాగలేదు. ఖాండ్వా తహసిల్దారు ప్రహ్లాద్ అంబాదాస్
ఈరోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి అడిగి సంపాదించారు. జలగావ్ పటేల్, అతనితో లింగాయత్ ఉన్నాడు. వాళ్ళు రేపు వెళ్ళిపోవచ్చు. సాయిబాబా సాయంత్రం వ్యాహ్యాళిలో ఉండగా చూశాము. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. రాత్రి ఎప్పటిలాగే భీష్మ భజన, దీక్షిత్ రామాయణం
జరిగాయి. వాడాలో ఆరతి సమయంలో ఉదయం నాకు సాయిమహరాజ్
ఇచ్చిన ఉపదేశాలు అర్ధమయి ఎంతో సంతోషం కలిగింది.
(మరికొన్ని విశేషాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment