11.01.2016 సోమవారమ్
ఓం సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీనుండి మరికొన్ని విశేషాలు.
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 20
12.01.1912 శుక్రవారమ్
ప్రొద్దున్న
తొందరగా లేచి ప్రార్ధన చేసుకున్న తరువాత, నా రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించాను. అపుడు నారాయణరావు కొడుకు గోవిందు, సోదరుడు భావూ
సాహెబ్ వచ్చారు. వారు హోషంగాబాదు నుండి అమరావతికి
కొంతసేపటి క్రితం వచ్చారట. అక్కడ నేను, నాభార్య
కనిపించకపోవడంతో, మమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చారు.
మేము ఒకరికొకరం కలుసుకున్నందుకు సహజంగానే మాకు చాలా
సంతోషం కలిగి మాట్లాడుకుంటూ కూర్చున్నాము.
బాపూసాహెబ్ జోగ్ లేకపోవడంతో మేము యోగవాసిష్టం కాస్త ఆలస్యంగా ప్రారంభించాము. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటపుడు, తిరిగి మసీదుకు
వచ్చేటప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాము. ఆయన
ఎంతో దయగా ఉన్నారు. తమ హుక్కా పీల్చమని నాకు
మాటి మాటికీ ఇచ్చారు. దాని వల్ల నాసందేహాలు
అనేకం తీరుపోయాయి. మధ్యాహ్న ఆరతి తరువాత భోజనాలు
చేశాము. నేను కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాను. దీక్షిత్ మామూలు రోజుకన్నా మసీదులోనే ఎక్కువ ఆలస్యం
చేశాడు. అందువల్ల రామాయణమ్ చదవడం ఆలస్యమయింది. అధ్యాయం బాగా పెద్దదిగాను. కఠినంగాను ఉండటంతో దానిని
పూర్తి చేయలేకపోయాము. ఆ తరువాత మేము సాయి మహరాజ్
ను మసీదులో దర్శించుకున్నాము. ఇద్దరు నాట్యగత్తెలు
పాడుతూ నాట్యం చేశారు.
ఆ తరువాత శేజ్ ఆరతి
జరిగింది. సాయి మహరాజ్ ఎంతో దయతో బల్వంతును
తన వద్దకు పిలిపించుకుని, మధ్యాహ్నమంతా తమతోనే ఉంచుకున్నారు.
14.01.1912 ఆదివారమ్
ఉదయం తొందరగా
లేచి ప్రార్ధన పూర్తి చేసుకున్నాను. బాపూసాహెబ్
జోగ్, ఉపాసనీ, రామమారుతి లతో కలిసి రంగనాధ యోగవాసిష్టమ్ చదవడానికి కూర్చున్నాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళడం చూచిన తరువాత తిరిగి
చదవడం మొదలు పెట్టాము. ఆయన తిరిగి వచ్చిన తరువాత
మసీదుకు వెళ్ళాను. ఆయన స్నానానికి ఏర్పాట్లు
చేసుకుంటున్నారు. అందుచేత తిరిగి వచ్చి రెండు
ఉత్తరాలు వ్రాసి, మళ్ళీ వెళ్ళాను. ఆయన నామీద
చాలా దయ చూపించి, బాపూ సాహెబ్ జోగ్ తన కోసం తెచ్చిన నువ్వుండలు నాకు ఇచ్చి, బల్వంత్
కు కూడా ఇచ్చారు. మేఘాకు అనారోగ్యం వల్ల ఆ
రోజు తిలసంక్రాంతి అవడం, నైవేద్యం ఆలస్యంగా రావటం ఈ కారణాల వల్ల , మధ్యాహ్న ఆరతి ఆలస్యమయింది. మేము వాడాకు తిరిగి వచ్చి భోజనాలు చేసేటప్పటికి
సాయంత్రం 4 గంటలయింది. అప్పుడు దీక్షిత్ రామాయణం
చదివాడు. కాని ఎక్కువగా ముందుకు సాగలేదు. మధ్యాహ్నం
నేను వెళ్ళినపుడు సాయిబాబా ఎవ్వరినీ రానివ్వలేదు.
అందుచేత నేను బాపూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళాను. సాయంత్రం నమస్కారం చేసుకోవడానికి సరైన సమయానికి వెళ్ళాను. ఖాండ్వా తహసిల్ దారు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడి దినచర్యకు క్రమేపీ అలవాటు పడుతున్నారు. గుప్తే అనే ఆయన తన సోదరుడు, కుటుంబంతో వచ్చాడు. ఆయన ఠాణేలో ఉన్న నా స్నేహితునికి దూరపు బంధువునని
చెప్పాడు. నేనాయనతో మాట్లాడుతూ కూర్చున్నాను. సాయంత్రం శేజ్ ఆరతి, భీష్మ భజన, దీక్షిత్ రామాయణ
పఠణం జరిగాయి. మేమంతా సంక్రాంతి పండుగను తక్కువ
స్థాయిలో జరుపుకొన్నాము.
15.01.1912 సోమవారమ్
ఉదయం తొందరగా
లేచి ప్రార్ధన చేసుకున్నాను. మేఘా అనారోగ్యం
వల్ల సమయానికి లేచి, శంఖం ఊదడానికి రాకపోవడమ్ వల్ల, కాకడ ఆరతి ఆలస్యమయింది. సాయి మహరాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి, చావడి
బయటకు వెళ్ళిపోయారు. నిన్న కాస్తంత తిన్న నువ్వుండ
చెరుపు చేసినట్లుగా ఉంది. ఉపాసనీ శాస్త్రి,
భాపూ సాహెబ్ జోగ్ తొందరగా రాలేదు. అందుచేత ఉత్తరాలు రాస్తూ కూర్చున్నాను. సాయి మహరాజ్ బయటకు వెళ్ళినపుడు ప్రొద్దున్నంతా ఎలా
గడిపావని అడిగారు నన్ను. ఏమీ చదవకుండాను, మననం
చేసుకోకుండాను ఉన్నందుకు చిన్నగా మందలించారు.
ఆయన తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ ఆయనను చూడటానికి వెళ్ళాను. ఆయన చాలా దయగా ఉన్నారు. ఆయన నాతోనే మాట్లాడుతున్నాట్లుగా పెద్ద కధను ప్రారంభించారు,
కాని ఆయన చెబుతున్నంత సేపూ నిద్రమత్తుగా ఉండటంవల్ల ఆ కధను ఏమీ అర్ధం చేసుకోలేకపోయాను. ఆ కధ గుప్తే జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలనే అందంగా
నేయబడ్డ మేలిముసుగులా చెప్పారని ఆ తరువాత నాకు గుప్తే చెప్పాడు. మధ్యాహ్న ఆరతి ఆలస్యయమయింది. అందుచేత మేము తిరిగి వచ్చి భోజనాలు చేసేటప్పటికి
మూడు గంటలయింది. కాసేపు పడుకుని దీక్షిత్ పురాణానికి
వెళ్ళాను. తరువాత మసీదుకు వెళ్ళాము. కాని దూరంనుండే నమస్కారం చేసుకొమ్మన్నారు. ఆ విధంగానే చేసుకున్నాము. నిన్న దీక్షిత్ కు మసీదులో దివ్య ప్రకాశం కనిపించింది. ఈరోజు కూడా కనిపించింది.
రాత్రి యధావిధిగా భీష్మ భజన, దీక్షిత్ పురాణం జరిగాయి.
(మరికొన్ని విశేషాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment