10.07.2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
ధనము – 1వ.భాగం
ఆంగ్ల మూలం
: లెఫ్టినెంన్ ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం
: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీ ఎమ్.బి.
నింబాల్కర్ గారు శ్రీ సాయి సత్ చరిత్రను క్షుణ్ణంగా చదివి అందులో చెప్పబడిన, ధనము, ఆహారము,
వాక్కు, భక్తిమార్గమ్ వగైరా అనే అంశాలను అన్ని అధ్యాయాలనుండి సేకరించి అన్నిటిని వివరంగా
ఒక చోట కూర్చి మనకి అందించారు. మనమందరం శ్రీ
సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాము. కాని
ఇటువంటి విషయాలన్నటి మీద మనం దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. ఆయన పుస్తకం చదివిన తరువాత మనకి శ్రీ సాయిబాబా వారి
తత్వం ఏమిటో అర్ధమవుతుంది. మోక్షమార్గం, భక్తి మార్గం కోరుకునేవారు ఏవిధంగా ప్రవర్తించాలో
పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. ఇక చదవండి. ముందుగా ధనం గురించి బాబావారిచ్చిన ఉపదేశమేమిటో
తెలుసుకుందాము.
ధనము
శ్రీసాయిబాబా
వారు తన భక్తులకు ధనము గురించి, సంపద గురించి చెప్పిన సలహాలు శ్రీసాయి సత్ చరిత్రలో
ప్రతిచోటా మనకు కనిపిస్తాయి. ప్రజలలో ఏదో విధంగా
అది న్యాయంగా కాని, అన్యాయంగా కాని ధనాన్ని కూడబెట్టాలనే ప్రవృత్తి పెరిగిపోవడం మనం
చూస్తున్నాము. పగలు, రాత్రి ధనాన్ని ఏవిధంగా
కూడబెడదామనే ఆలోచనే తప్ప మరే ఇతర ఆలోచనలు లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. అందుచేతనే సాయిబాబా వారు ఈ విషయం గూర్చి పదేపదే
చెప్పిన ధర్మోపదేశాలను మనం ఒప్పుకొని తీరాలి.
వీరంతా కూడా
ప్రపంచంలో ఉన్న అన్ని సుఖభోగాలను ధనసంపాదనతో
తామంతా అనుభవిస్తూ, తమ తరవాతి తరాలు కూడా నిరంతరం ఐశ్వర్యంతో తులగూగవచ్చనే గట్టి
నమ్మకంతో ఉంటారు. కాని ఒక్క క్షణం మనసు పెట్టి
ఆలోచిస్తే తామంతా నిజమైన సుఖసంతోషాలతో లేమని గ్రహిస్తారు. వారి మనసంతా ఎప్పుడూ అశాంతిగా అస్థిమితంగా ఉంటుంది. తరచూ వచ్చే జబ్బులతో శరీరం బాధలు పడుతూ ఉంటుంది. ఏఒక్క రాత్రి సుఖమైన నిద్ర ఉండదు. అప్పటికీ వారి ధనదాహం ఏమాత్రం తీరదు.
ధనం ఉన్నా కూడా
ప్రాపంచికంగా సామాన్యమైన జీవితం గడుపుతూ ఆత్మ సాక్షాత్కారం పొందాలనే కోరిక గలవారికి
సాయిబాబావారు తగిన సలహానిచ్చారు.
ఆత్మ సాక్షాత్కారం
పొందగోరేవారి కోసం:
ధనం మీద వ్యామోహం
పోనంత వరకు ఆత్మ సాక్షాత్కారం అసాధ్యమని బాబా వారు చెప్పారు. ఒక పెద్దమనిషి బ్రహ్మజ్ఞానం పొందగోరి బాబా వద్దకు
వచ్చిన వృత్తాంతం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయాలలో కనపడుతుంది. అతను బాగా ధనవంతుడయినప్పటికి పరమలోభి. తన జేబులో 250/- రూపాయలు విలువగల నోట్లకట్టలు ఉన్నాగాని,
బాబాకు కనీసం అయిదు రూపాయలయినా అప్పుగా ఇద్దామన్న ఆలోచనే రాలేదు. బ్రహ్మ జ్ఞానానికి, లోభత్వంతో శాశ్వతమైన శతృత్వం. ఎక్కడయితే లోభం ఉంటుందో అక్కడ మోక్షానికి ఆస్కారం
లేదు. అటువంటప్పుడు నిజమైన ముక్తి, మోక్షం
ఎలా సాధించగలుగుతారు? ధనవ్యామోహం ఉన్నవారు
కూడా తాము చేయవలసిన కర్మలను వాటి ఉపయోగాలను నిర్లక్ష్యం చేస్తారు . (69)
దీనిని బట్టి
మనం అర్ధం చేసుకోవలసిన విషయం లోభత్వం వల్ల, శాంతి గాని, తృప్తి గాని, ఆందోళనలనుండి
ఉపశమనం గాని ఏమీ ఉండవు. మనసులో దురాశ ఉన్నపుడు
అంతవరకు ముక్తి కోసం అప్పటికే చేసిన సాధనలు అన్నీ వృధా. (70) అధ్యాయం. 17
అందుచేత గుర్తుంచుకోవలసిన
విషయమేమిటంటే, ధనం మీద వ్యామోహం పోనంతవరకూ ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదు. (165)
భవవంతుని గూర్చి, జ్ఞానసముపార్జన కోసం బోధనలు వింటూ కూడా మనస్సు ప్రాపంచిక విషయాలను గురించి వ్యవహారాల
గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా లభించదు. (166) అధ్యాయం - 16
మహల్సాపతి బాబాకు
ప్రియమైన, సన్నిహిత భక్తుడు. పేదరికం వల్ల
ఆయన తన కుటుంబాన్ని ఎంతో కష్టంతో నెట్టుకొస్తున్నాడు. సాయిబాబాగారు ప్రతిరోజు వందల రూపాయలు అందరికీ పంచిపెడుతూ
ఉండటం చూశారు. కాని తాను మాత్రం ఆయనను ఎప్పుడూ
ఒక్క పైసా అడగలేదు. ఒకసారి హంసరాజ్ అనే ధనవంతుడు
బాబా సమక్షంలో మహల్సాపతికి కొంత ధనం ఇవ్వచూపాడు కాని మహల్సాపతి దానిని తీసుకోకుండా
తిరస్కరించాడు. బాబా కూడా తీసుకొమ్మని మహల్సాపతికి
చెప్పలేదు. (71) అధ్యాయం -
36
“నా భక్తుడు
ఎప్పుడూ ధనానికి ఆకర్షితుడవకూడదు. ధన వైభవంలో
(ఐశ్వర్యంలో) చిక్కుకోరాదు” అన్నారు బాబా (71)
అధ్యాయం 36
29వ.అధ్యాయంలో
మద్రాసునుండి వచ్చిన ఒక మహిళ వృత్తాంతంలో ఈవాస్తవం తెలుస్తుంది. ఆమెకు తరచూ శ్రీరాములవారి దర్శనం అవుతూ ఉండేది. కాని ఆమెకు ఉన్న ధనవ్యామోహం వల్ల అవి ఆగిపోయాయి. ఆమె షిరిడీకి రాగానే సాయిబాబా ఆమెకు అంతకు ముందు
వున్న ఆధ్యాత్మిక స్థితిని గుర్తుకు తెచ్చి, మరలా శ్రీరామచంద్రుల వారి దర్శనం కల్పించడమే
గాక, ఆమె భర్తను కూడా భక్తునిగా మార్చారు.
కాకామహాజని యజమాని
ధరమ్ సీ ధాకర్సీ షిరిడీ వచ్చినపుడు బాబావారు ఎంత అధ్బుతమైన సలహా ఇచ్చారో చూడండి, “ఒకడికి
ఇంటినిండా ధనధాన్యాలు, సంపద ఎన్నో ఉన్నాయి.
కాని అతని మనస్సు ఎప్పుడూ చింతలతో అశాంతిగానే ఉండేది. అతనికి శారీరకంగా కాని, మానసికంగా కాని ఎటువంటి
వ్యాధులు లేవు. కాని ఎప్పుడూ అన వసరమైన పనులన్నిటినీ
నెత్తిన వేసుకొని వాటిని మోస్తూ మనసు నిలకడ లేకుండా ఉండేవాడు." (115)
ఏకారణం లేకుండానే
తలపై భారములన్నీ మీద వేసుకొని మోయుచూ అశాంతిగా అటుయిటూ తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి భారములన్నీ వదలి వేసేవాడు. మరొకప్పుడు మోయుచూ ఉండేవాడు. మనస్సుకు శాంతిలేకుండా ఉండేవాడు. ఎందులకిట్లా అస్థిమితంగా
తిరుగుతావు. ఒకచోట స్థిరముగా కూర్చో” అని చెప్పాను
అన్నారు బాబా. (116) అధ్యాయం 35
సాయిబాబా ధనికులైన
భక్తులకి “ఇంద్రియసుఖాల కోసం ధనాన్ని వృధా చేయవద్దని” సలహా ఇచ్చారు. ధనాన్ని మంచి పనుల కోసం వినియోగించమని చెప్పారు. ధనికులు తమ సంపదని ధర్మకార్యాలకు వినియోగిస్తేనే
దాని ఉపయోగం ఉంటుంది. దాతృత్వం వల్ల వచ్చే
ఫలితాలు ఆధ్యాత్మిక జ్ఞానానికి దారి చూపుతుంది.
(132)
శ్రమచేసి సంపాదించిన
ధనాన్ని దానం చేసినందువల్ల వచ్చే ఫలితాలను పెంపొందించుకోవడానికి బదులు తమ కిష్టమయిన
సుఖభోగాలకు అనవసరంగా ఖర్చు చేస్తారు”
(133)
ఎవడయితే తను
ప్రతీ పైసా కూడబెట్టి సంపాదించిన కోట్లాది రూపాయలను ఇంద్రియ సుఖాలకి ఖర్చు చేయకుండా
ఉంటాడో అతనే నిజమయిన నిత్య సంతోషి. (134)
అధ్యాయం 35
అందుచేతనే బాబా,
శిధిలదశలో ఉన్న శనిదేవుని మందిరాన్ని గోపాలరావు గుండు చేత బాగుచేయించారు. షిరిడీ దర్శించే యాత్రికులు బస చేయడానికి వాడా నిర్మించమని
రావ్ బహదూర్ సాఠేని, కాకాసాహెబ్ దీక్షిత్ ని ప్రేరేపించారు. సాయిబాబా సమాధి కోసం సమాధి మందిరాన్ని నిర్మించమని
ధనికుడయిన బాపూసాహెబ్ బుట్టీని ప్రేరేపించారు.
బాబా, నానాసాహెబ్ చందోర్కర్ నుంచి అంతకు ముందే సహాయం తీసుకొన్నారు. నానాసాహెబ్ తన స్వంత డబ్బుతో, అధికార హోదాతో షిరిడీ
దర్శించే వారికోసం గుడారాలు వేయించి వసతి కల్పిస్తూ ఉండేవాడు. వారి వసతి కోసం, భోజన ఏర్పాట్ల కోసం సాయిబాబావారు చేసిన అప్పులను నానాసాహెబ్
తీరుస్తూ ఉండేవాడు.
ఆవిధంగా బాబా,
ధనికులయిన భక్తులను, ధనంతోను, అధికార హోదా
వల్ల వచ్చిన వారి అహంకారాన్ని అణచివేసి, మెల్లమెల్లగా వారిని ఆధ్యాత్మిక మార్గంవైపు
దారి మళ్ళించారు. ఆయన చెప్పదలచుకున్నది “ఐశ్వర్యం
అనేది మధ్యాహ్నపు నీడవలె అశాశ్వతం. అందు చేత ధనమదంతో ఎవరినీ కూడా అనవసరంగా బాధించవద్దు” (71)
అధ్యాయం – 32 దాసగణుమహరాజ్ రచించిన భక్త లీలామృతం.
ఆత్మ సాక్షాత్కారం
పొందగోరే తన భక్తులలో పేదవారు ఉండవచ్చు. వారికోసం
బాబా ఇచ్చిన మాట “ నా భక్తుల ఇండ్లలో అన్నవస్త్రాలకు లోటుండదు” (33)
అధ్యాయం – 6
ఎవరయితే నాయందే
మనసు నిలిపి భక్తిశ్రధ్ధలతో నన్నే ఆరాధిస్తారో, వారి యోగక్షేమాలను నేను చూచెదనని బాబా
తన భక్తులకు మాట ఇచ్చారు. (34) అధ్యాయం - 6
(రేపటి సంచికలో ధనము - 2వ.భాగం. సంసారులకు బాబా చెప్పిన సలహాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment