28.07.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(4)
భక్తి మార్గం – 6వ.భాగమ్
ఆంగ్ల
మూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
9. ఆత్మ
నివేదన (శరణుజొచ్చుట)
అనగా
పూర్తిగా భగవంతునికి అప్పగించి వేయుట. తనని తాను భగవంతునికి అర్పించుకొనుట. అంతేకాక భక్తుడు తన భార్యాపిల్లలనే కాక మొత్తం తన
స్థిరచరాస్థులను కూడా భగవంతునికి అప్పగించి సర్వశ్య శరణాగతిని వేడుట.
అహంకారాన్ని కూడా వదలివేసి తాను చేసిన పనులన్నిటినీ
కూడా తాను పూజించే భగవంతునికి గాని గురువుకు గాని అర్పించుట. ఈ నవవిధ భక్తులలో ఆత్మనివేదన భక్తి చాలా ముఖ్యమయినది. సంత్ రామదాసు ఆత్మ నివేదన గురించి ఈ విధంగా చెప్పారు. ఆత్మ నివేదన లేక తనకు తాను అర్పించుకోకుండా జననమరణ
చక్రాలనుండి తప్పించుకోలేడు. భక్తిలో స్మరణం
మొట్టమొదటిదయితే ఆత్మనివేదన భక్తిలో చివరిది. అదే ఉత్తమస్థాయి. (నవవిధభక్తులలో పరాకాష్ట).
శ్రీసాయి
సత్ చరిత్రలో ఆత్మనివేదన గురించి ఉదాహరణగా కాకాసాహెబ్ దీక్షిత్ గురించి చెప్పుకోవచ్చు. ఆయన బొంబాయిలో తను చేస్తున్న న్యాయవాద వృత్తిని,
అధికార హోదాని, ఆఖరికి తన భార్యాపిల్లలను కూడా వదలి తరచూ షిరిడీ వచ్చి చాలా రోజులు
అక్కడే ఉండిపోయేవాడు. ఒకసారి ఆయన లండన్ లో ఉన్నప్పుడు రైలు ఎక్కుతుండగ జారిపడిపోయారు. కాలికి దెబ్బతగిలి జీవితాంతం కుంటిగానే నడవవలసివచ్చింది. కాని ఆయన ఎప్పుడూ బాబాని తన కాలికుంటితనాన్ని బాగుచేయమని
అడగలేదు. కాని ఆయన తన కాలి కుంటితనముకంటే తన
మనసు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమయిన ఆనందాన్ని కలుగచేయమని వేడుకొన్నాడు. (అధ్యాయం – 50). మానసికంగాను, శారీరకంగాను, కాకాసాహెబ్ బాబాకు సర్వశ్యశరణాగతి
చేశారు. ఒకసారి కాకాసాహెబ్ ఒక మహారాజావారి
కేసు వాదించినందుకు పెద్ద మొత్తంలో ఫీజు ముట్టింది. ఆయన తనకు ఫీజుగా ముట్టిన వెండినాణాలన్నిటినీ ఒక పెద్ద ట్రంకుపెట్టెలో పెట్టి
షిరిడీ వచ్చి బాబాముందు పెట్టి “బాబా, ఇదంతా
నీదే” అన్నారు.
అప్పుడు బాబా “అవునా! అని పెట్టి తెరచి రెండు చేతులతో
నాణాలన్నిటినీ అక్కడున్న భక్తులందరికీ ఇష్టమొచ్చిన రీతిలో పంచిపెట్టేశారు. కొద్ది నిమిషాలలోనే పెట్టెంతా ఖాళీ అయిపోయింది. ఆసమయంలో నాగపూర్ సబ్ జడ్జి శ్రీగార్డే, కాకాసాహెబ్
మరొక స్నేహితుడు అక్కడే ఉన్నారు. వారిద్దరూ
కాకాసాహెబ్ మొహంవైపు ఏకాగ్రతతో చూశారు. తను
సంపాదించిన సొమ్మంతా క్షణాలలో లెక్కలేకుండా అందరికీ పంచిపెట్టబడినా కూడా, కాకాసాహెబ్
మొహంలో కించిత్తు విచారం కూడా కనపడకపోవడంతో వారిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆయన పరిత్యాగం, తన సద్గురువుకు చేసిన సర్వశ్య శరణాగతి
అపూర్వం, అద్వితీయం. (అధ్యాయం 45).
ఒకసారి
బాబా, కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణుడయినప్పటికి, అతనికి కత్తినిచ్చి మేకను చంపమన్నారు. కాకాసాహెబ్ తన జీవితంలో ఎపుడూ అటువంటి పని చేయలేదు. కాకాసాహెబ్ వెంటనే ఆపని చేయడానికి సిధ్ధపడ్డాడు. అప్పుడతను బాబాతో “నీ అమృతతుల్యమైన మాటలే మాకు శిరోధార్యము. అదే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. ఎల్లప్పుడూ నిన్నే జ్ఞప్తియంధుంచుకొని, రేయింబవళ్ళు
నీరూపమునే ధ్యానించుచు, నీయాజ్ఞలు పాటింతుము.
చంపుట తప్పా, ఒప్పా అనునది మాకు తెలియదు.
దానిని గూర్చి మేము విచారించము. అది
సరియైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు
ఆజ్ఞ అక్షరాలా పాటించుటే మావిధి, ధర్మము” అన్నాడు. (అధ్యాయం 23).
బాబా
జీవించి ఉన్న రోజుల్లో కాకాసాహెబ్ బాబాని సంప్రదించకుండా ముఖ్యమైన పని ఏదీ చేయలేదు. బాబా సమాధి అనంతరం కూడా అదే పధ్ధతిని అవలంబించాడు. ఏదయినా సమస్య వచ్చినపుడు చీటీలమీద వ్రాసి బాబా పటం
ముందు వేసి ఒక చిన్న పిల్లవాని చేత ఒక చీటీ తీయించి అదే బాబా సమాధానంగా భావించేవాడు.
దేహం మొత్తం గురువుకి సమర్పించినపుడు దాని పని తీరుపై మనకేమి హక్కు ఉంటుందని అంటూ ఉండేవారు. అందు చేతనే హేమాడ్ పంత్ శ్రీసాయి సత్ చరిత్ర మరాఠీలో
కాకాసాహెబ్ దీక్షిత్ గురించి “బావనకసీ సువర్ణ” 52 మార్లు శుధ్ది చేసిన బంగారం. ఇంకా
చెప్పాలంటే స్వచ్చమయిన మేలిమి బంగారం” అని అభివర్ణించారంటె అందులో ఎంతమాత్రం అతిశయోక్తి
లేదు. (అధ్యాయం – 23). బాబా కాకా సాహెబ్ కి
అతని అంత్యకాలమున విమానంలో తీసుకొనిపోయెదనని మాటిచ్చారు. (అధ్యాయం – 50). ఆవిధంగా నెరవేర్చారు కూడా. 1926 వ.సంవత్సరము జూలై
26వ.తేదీన కాకాసాహెబ్ అన్నాసాహెబ్ ధబోల్కర్ తో బొంబాయిలోని లోకల్ రైలులో ప్రయాణము చేస్తూ
ఉన్నట్లుండి తన శిరస్సును ధబోల్కర్ గారి భుజముపై వాల్చి ఎటువంటి బాధ, చికాకు లేకుండా
ప్రాణములు విడిచారు. ఆరోజు హిందూ క్యాలండరు
ప్రకారం పదకొండవరోజు అనగా ఏకాదశి పరమపవిత్రమయిన రోజు.
సాయిబాబావారి
అతి సులభమయిన, లాభదాయకమయిన విధానం
మన
శాస్త్రాలలో చెప్పినటువంటి నవవిధ భక్తుల గురించి మనం తెలుసుకొన్నాము. సాయిబాబా తన భక్తుల చేత వాటినెలా ఆచరింపచేశారో కూడా
తెలుసుకొన్నాము. రాధాబాయి దేశ్ ముఖ్ బాబాను
తనకు మంత్రోపదేశం చేయమని పట్టిన పట్టు విడవకుండా అడుగుతూ ఉండేది. బాబా ఆమెకు సులభమయిన మంచి ఫలితాన్నిచ్చే విధానాన్ని
వివరించారు.
“మనస్ఫూర్తిగా
నీ దృష్టిని నాయందే నిలుపు. నేను కూడా నిన్ను
అదే విధంగా చూస్తాను”
వాస్తవానికి
ఇది మరొక విధమయిన స్మరణభక్తి అనగా ధ్యానం.
తరువాత బాబా హేమాడ్ పంత్ ను ఉద్దేశించి “ఎల్లప్పుడు నానిరాకారమునే ధ్యానింపుము. అదే జ్ఞాన స్వరూపము – చైతన్యము - ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న
నా ఈ ఆకారమును ధ్యానించుడు. ఆవిధంగా కొన్నాళ్ళు
చేయగా చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును.
ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో
నైక్యమే బ్రహ్మముతోనభిన్నమగును”
తల్లి
తాబేలు నదికి ఒక యొడ్డున ఉండును. దాని పిల్లలింకొక
యొడ్డున యుండును. తల్లి వానికి పాలిచ్చుటగాని,
పొదుపుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే
వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు
ఏమీ చేయక తల్లిని జ్ఞానపకముంచుకొనును. తల్లి
తాబేలు చూపు చిన్నవానికి అమృతధారవలె పని చేయును.
అదే వాని బ్రతుకునకు, సంతోషమునకు ఆధారము.
గురువునకు, శిష్యునకు గల సంబంధము ఇట్టిదే” అని బోధ చేశారు.
( అధ్యాయం – 19)
వాస్తవానికి
ప్రేమతో గాని, ద్వేషంతో గాని నువ్వు ఏరూపాన్ని ధ్యానించిన ఫలితం ఒక్కటే. నువ్వు ఆరూపాన్నే పొందుతావు. ఉదాహరణకు, రావణుడు, కంసుడు, సాలెగూటిలో చిక్కుకొన్న
కీటకం.
(పైన చెప్పబడిన నవవిధ భక్తి అయిన ఆత్మ నివేదన లో కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతటి భక్తుడో మనం అర్ధం చేసుకోవచ్చు. తాను తెచ్చిన వెండి నాణాలన్నిటినీ బాబా ముందు పెట్టి అంతా నీదే అన్నారు. ఆయన మనసులో ఎటువంటి ఆలోచనా లేదు. ఆ రోజుల్లో వెండి నాణాలంటే ఎంత పెద్ద మొత్తమో మనకందరకూ తెలుసు. తన ఎదురుగానే భక్తులందరికీ పంచిపెడుతున్నా ప్రసన్నంగా ఉన్నాడే తప్ప మనసులో ఎటువంటి ఆందోళన పడలేదు. మరి దీక్షిత్ సర్వశ్య శరణాగతి చేశాడుగా. సర్వశ్య శరణాగతికి ఆయనే గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తరువాత బాబా చెప్పిన అతి సులభమయిన భక్తి, ఆయన మీదే దృష్టి పెట్టి సదా ఆయననే ఏకాగ్రతతో చూస్తూ ఉండటం. ఇంతకు ముందు సంచికలో వివరించినట్లుగా ఆయన కుడికాలి బొటనవేలు మీద దృష్టి పెట్టి ధ్యానం చేసినట్లయితే ఆయనే మన కళ్ళముందు ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.)
(రేపటి
సంచికలో ఉత్తమమైన భక్తి గురించి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment