23.09.2016
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
15.
సబూరి (ఓర్పు)
సాయిబాబా
బోధించిన రెండు ముఖ్యమయిన విషయాలలో రెండవది ‘సబూరి’ లేక ‘ఓర్పు’. మనం ఆశించిన ఫలితం లభించేటంత వరకు ఎంతకాలమయినా సరే
వేచి చూడటానికి సిధ్ధపడి ఉండటమే ఓర్పుతో లేక సహనంతో ఉండటం.
ఎవరికయితే తాను పూజించే దైవం, లేక కులదైవం మీద గాని,
సద్గురువు మీద గాని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటుందో అటువంటివారికి ఓర్పు లేక సహనం దానంతట అదే వస్తుంది. మొట్టమొదట్లో మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు లేదా
మనం ఆశించినదానికి ప్రతికూలంగా రావచ్చు. వ్యతిరేక
ఫలితాలు వచ్చినా కూడా మనం పూజించే దైవం మీద లేక మనం నమ్మిన సద్గురువు మీద గాని మన విశ్వాసం
చెదిరిపోకూడదు. ఉదాహరణకి 11వ.అధ్యాయంలో కళ్యాణ్
నివాసి అయిన హాజీ సిధ్ధికీ ఫాల్కే వృత్తాంతాన్నే తీసుకుందాము. అతను మక్కా, మదీనా యాత్రలు పూర్తి చేసుకొని బాబాను
దర్శించుకోవడానికి షిరిడీ వచ్చాడు. షిరిడీ
వచ్చిన ప్రతివారికి మసీదులోకి ప్రవేశించే భాగ్యం ఉన్నాగాని ఫాల్కేకి మాత్రం మసీదు మెట్లు
ఎక్కి అడుగుపెట్టడానికి బాబా అనుమతినివ్వలేదు.
షిరిడీలో 9 నెలలు ఉన్నాగాని బాబా కనికరించలేదు. బాబాకు అంకిత భక్తుడయిన శ్యామా దగ్గరకు వెళ్ళి తన
తరఫున బాబాతో మాట్లాడమని వేడుకొన్నాడు. బాబా,
ఫాల్కే యొక్క భక్తిని పరీక్షించడానికి ఎన్నో ప్రశ్నలడిగారు. అతనిని పరుషంగా తిట్టడం కూడా జరిగింది. అయినా గాని ఫాల్కే ఏమాత్రం నిరాశ చెందలేదు. బాబా మహాపురుషుడని తెలుసు. అందువల్లనే
బాబా ఎంత తిట్టినా కూడా తన సహనాన్ని కోల్పోలేదు.
ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే బాబా కరుణ తనమీద ప్రసరించేటంత వరకు ఎంతో ఓపికతో
ఉన్నాడు. బాబాకు అతనిపై ప్రేమ కలిగింది. ఆతరువాత బాబా అతనికి మసీదులో ప్రవేశించటానికి అనుమతినివ్వడమే
కాక తనతో భోజనం చేసే అదృష్టాన్ని కూడా కలిగించారు. అతనికి అప్పుడప్పుడు డబ్బు కూడా ఇచ్చేవారు.
ఓర్పు
గురించి తెలుసుకోవడానికి మరొక ఉదాహరణ 48వ.అధ్యాయంలోని అక్కల్ కోట నివాసి సపత్నేకర్
విషయంలో గమనించవచ్చు. సపత్నేకర్ బాబాను దర్శించుకోవటానికి
వెళ్ళినపుడు బాబా అతనిని “బయటకు పొమ్మని” నిర్లక్ష్యంగా మాట్లాడారు. కాని సపత్నేకర్ ఎంతో ఓపికతో ఉన్నాడు. చివరికి బాబా అతనిపై దయ చూపించారు. అపుడు బాబా”ఈ టెంకాయను తీసుకొనుము. దీనిని నీభార్య చీర కొంగులో పెట్టుము. సంతోషముగా వెళ్ళుము. మనస్సులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోవద్దు” అని అతనికి
పుత్రసంతానం కలిగేలా ఆశీర్వదించారు.
ఓ.వీ. 166
అదే
విధంగా 41వ.అధ్యాయంలో దహను మామలతదారయిన బాలా సాహెబ్ దేవ్ విషయాన్ని కూడా గమనిద్దాము. బాబానుండి స్పష్టమయిన ఆదేశాలు వస్తే తప్ప ‘జ్ఞానేశ్వరి’ని
చదవదలచుకోలేదు దేవ్. దేవ్ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోగానే బాబా అతనితో
“నా చింకి గుడ్డలను ఎందుకు దొంగిలిస్తావు” అని అతనిని కోపంతో చివాట్లు పెట్టారు. అతని వెనకాల పరుగెత్తి తిడుతూ కొడతానని భయపెట్టారు. “నిన్ను గొడ్డలితో నరికి చంపుతాను. ఎక్కడికి పోతావు పరుగెత్తుకుంటూ. నీవెంటే వచ్చి నువ్వెక్కడున్నా సరే నిన్ను చంపుతాను”
అని బెదిరించారు.
ఓ.వీ. 118
కాని
దేవ్ ఏమాత్రం భయపడలేదు. బాబానుండి అటువంటి
కఠినమయిన చీవాట్లు, తిట్లు తిన్నా గాని ఏమాత్రం తొణకలేదు. బాబా తనను అంతలా తిడుతున్నాగాని బాబా మీద అతనికి
భక్తి ఉప్పొంగింది. ఆయన తిట్టే తిట్లని సువాసనా
భరితమైన పూల జల్లులాగ భావించాడు.
ఆ
తరువాత బాబా మాటిమాటికీ దేవ్ నుండి దక్షిణ అడిగి తీసుకుంటూ ఉండేవారు. దేవ్ ఎటువంటి సంకోచం లేకుండా బాబా అడిగినన్ని సార్లు
దక్షిణ సమర్పిస్తూ ఉండేవాడు. ఆతరువాత బాబా
జ్ఞానేశ్వరిని చదవమని దేవ్ ని ఆజ్ఞాపించడమే కాకుండా కొన్ని రోజుల తరువాత స్వప్నంలో
దర్శనమిచ్చి అతను ఏవిధంగా చదువుతున్నాడో పరిశీలించి చదవవలసిన విధానాన్ని తెలిపి తగిన
సూచనలు చేశారు.
ధైర్యము,
ధృఢ సంకల్పము, ఓరిమి, సహనము అన్నా అన్నిటి అర్ధాలు ఒకటే. ఎన్ని కష్టనష్టాలు ఎదురయినా మనం ఓరిమితో ఉండాలి. సహనంతో ఎన్ని పరీక్షలకయినా తట్టుకునే మనస్థైర్యం
ఉండాలి. ప్రారంభంలో సాయిబాబా తన భక్తుల కోరిక
మేరకు కష్టాలను తొలగిస్తారు. కాని ఆతరువాత
భక్తులు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన తరువాత కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, అనుభవించే
కష్టాలన్ని గతజన్మల కర్మఫలితాల వల్లనేననీ అవి అనివార్యమని తన భక్తులకు బోధిస్తూ ఉండేవారు. “ఆ కష్టాలను
అనుభవించి తొలగించుకోవలసిందే. జననమరణ చక్ర
పరిభ్రమణంలో ఇది యధార్ధమయిన విషయం. వాటిని
తొలగించుకోవాలంటే వాటివల్ల వచ్చే పరిణామాలని అనుభవించుట ఒక్కటే పరిష్కారం". అని తన భక్తులకు హితబోధ చేశారు బాబా.
అధ్యాయం – 13 ఓ.వీ. 82
(ఇంకా
రేపటి వరకు సహనంతో ఉండండి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment