Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 1, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 17. సద్గ్రంధ పఠనం – 1వ.భాగమ్

Posted by tyagaraju on 7:12 AM
Image result for images of shirdisaibaba and devimata
Image result for images of lotus

01.10.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి
     Image result for images of balatripura sundaridevi
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము  
       Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
17. సద్గ్రంధ పఠనం – 1వ.భాగమ్
సాయిబాబా ఏబడిలోను విధ్యనభ్యసించలేదు.  ఏ యుపాధ్యాయుని వద్ద శిక్షణ తీసుకోలేదు.  ఆయన  గ్రామీణులు మాటలాడే (గ్రామీణ భాష) మరాఠీ గాని ఉర్దూ గాని మాట్లాడేవారు. 


ఆయన ఎప్పుడూ మరాఠీ గాని సంస్కృత పుస్తకాలు గాని చదవలేదు.  ఆఖరికి ఖురాన్ కూడా చదవలేదు.  కాని, ఆయనకు ఆపుస్తకాలలోని విషయాలన్నీ బాగా తెలుసు.  అంతేకాకుండా అందులోని అన్నివిషయాలకి పదాలకి సరియైన అర్ధాలు ఆయనకు బాగా జ్ఞాపకం. 

ఒకసారి ఆయన కాకాసాహెబ్ దీక్షిత్  ని క్రమం తప్పకుండా ‘బృందావన్ పోతి’ చదవమని చెప్పారు.  దీక్షిత్ కి ఆయన మాటలు ఏమీ అర్ధం కాలేదు.  అతను ఎన్నో పోతీలను చూపించి ఇవేనా అని అడిగాడు.  చూపించిన ప్రతిసారి బాబా “ఇది కాదు”, నేను చెప్పినది బృందావన పోతీ గురించి అన్నారు.  ఆఖరికి దీక్షిత్, ఏకనాధ్ మహరాజ్ రచించిన ఏకనాధ్ భాగవతంలోని 11వ.అధ్యాయానికి వ్యాఖ్యానం చూపించి ఇదేనా అని అడిగాడు.  “అవును ఇదే” అన్నారు బాబా.  31వ.అధ్యాయం తీసి అందులో 466వ.నంబరు ఓ వీ చూపించారు.  అందులో ఏకనాధ్ మహరాజ్ తానే స్వయంగా తన పుస్తకానికి ‘బృందావన్ 31 అధ్యాయాలు’ అని తనే నామకరణం చేశారు.

అదే విధంగా శ్రీసాయి సత్ చరిత్ర 39వ.అధ్యాయాన్ని గమనిద్దాము.  సంస్కృత పండితుడయిన నానాసాహెబ్ చందోర్కర్ ని సాయిబాబా భగవద్గీతలోని ఒక శ్లోకానికి అర్ధం తెలుపమని ఎన్నో ప్రశ్నలడిగారు.  కాని నానా సాహెబ్ సరియైన సమాధానాలు చెప్పలేకపోయాడు.  బాబా ఆ శ్లోకానికి అర్ధం వ్యాఖ్యానాలతో సహా, సంస్కృతంలో తనకు ఎంతో ప్రావీణ్యం ఉందన్నట్లుగా వివరించి చెప్పారు. 

ఆవిధంగా సాయిబాబా ఆధ్యాత్మిక గ్రంధాలను చదవడం, వినడంలోని విలువలను మనకందరకూ అర్ధమయేటట్లు బోధించారు.  అంతేకాదు కొంతమంది పండితులని, విద్యావంతులయిన తన భక్తులని ద్వారకామాయి ఎదురుగా ఆరుబయట చదవమని చెప్పేవారు.  ఇంకా కొన్ని నిర్ణయించిన ప్రదేశాలలో కూడా చదవమని చెప్పేవారు.

ఒక్కొక్కసారి సాయిబాబా తన భక్తుల యోగ్యతలనుబట్టి, లేక కొన్ని ప్రత్యేకమయిన సందర్భాలలోను తన భక్తుల చేత ముఖ్యమయిన పుస్తకాలని చదివించేవారు.  ఉదాహరణకి 27వ.అధ్యాయంలో కాకా మహాజని ఏకనాధ భాగవతం పుస్తకాన్ని షిరిడీకి తీసుకొనివచ్చాడు.  శ్యామా ఆపుస్తకాన్ని చదువుదామని మసీదుకు తీసుకొనివచ్చాడు.  శ్యామా చేతిలో ఆపుస్తకాన్ని చూసి బాబా “ఏదీ, ఆపుస్తకం ఇటివ్వు” అని తీసుకుని చేతితో తాకి కొన్ని పేజీలని త్రిప్పి శ్యామాకిచ్చి, “దీనిని నీవద్ద ఉంచుకో.  దీనిని చదువు” అని తిరిగి ఇచ్చారు.  మాధవరావు ఆపుస్తకం తనది కాదని చెప్పాడు.  కాని బాబా శ్యామా చెప్పినదేమీ వినిపించుకోకుండా “దీనిని నేను నీకిచ్చాను.  జాగ్రత్తగా నీవద్దనే ఉంచు. ఇది నీకు పనికొస్తుంది” అన్నారు. 

ఇదే అధ్యాయంలో ఇటువంటిదే మరొక ఉదాహరణ.  బాపూసాహెబ్ జోగ్ విషయంలో చూడవచ్చు.  బాపూసాహెబ్ జోగ్ కు ఒక పార్సిల్ వచ్చింది.  అతడా పార్సిల్ ను చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాడు.  బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా ఆపార్సిల్ బాబా పాదాలవద్ద పడింది.  అదేమిటని బాబా అడిగారు.  జోగ్ ఆపార్సిల్ ను బాబా ముందరే విప్పాడు.  అది తిలక్, భగవద్గీతపై వ్రాసిన వ్యాఖ్యానం  ‘గీతా రహస్యం’.  బాబా ఆపుస్తకాన్ని తీసుకొని కొన్ని పేజీలను త్రిప్పి దానిపై ఒక రూపాయనుంచి జోగ్ కి తిరిగి ఇస్తూ, “దీనిని జాగ్రత్తగా చదువు.  నీకు మేలు కలుగుతుంది” అన్నారు.

మూడవ ఉదాహరణ కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో గమనించవచ్చు.  అతని కుమార్తె వత్సల షిరిడీలో మరణించింది.  కాకాసాహెబ్ చాలా ఖిన్నుడై ఉన్నాడు.  బాబా అతని బాధను గమనించి, ఏకనాధ్ మహరాజ్ వ్రాసిన ‘భావార్ధ రామాయణం’ గ్రంధాన్ని తీసి తలక్రిందులుగా పట్టుకున్నారు.  పుస్తకంలో వేలు పెట్టి ఒక పేజీ తెరిచారు.  ఆయన తెరిచిన పేజీలో, వాలిని చంపిన తరువాత వాలి భార్య తారను ఓదారుస్తూ  శ్రీరామచంద్రులవారిచ్చిన ఉపదేశం ఉంది.  సాయిబాబా కాకా సాహెబ్ తో దానిని చదవమని చెప్పారు.
ఏభక్తుడయినా ఆధ్యాత్మిక గ్రంధాన్ని ఒక వారంరోజులలో పారాయణ చేస్తానని మొక్కుకున్నపుడు సాయిబాబా వారిని ప్రోత్సహించడమే కాకుండా ఏవిధంగా చదవాలో తగిన సూచనలు కూడా చేసేవారు.  18వ.అధ్యాయంలోని విషయాన్నే తీసుకుందాము.  వ్యాపారంలో నష్టాలువచ్చి, మరికొన్ని సమస్యలతో విసుగెత్తి, మనశ్శాంతి కోసం బొంబాయినుండి సాఠే, షిరిడీకి వచ్చాడు.  వారం రోజులలో గురుచరిత్ర పారాయణ పూర్తి చేశాడు.  సాయిబాబా ఆరోజు రాత్రి అతనికి కలలో తాను గురుచరిత్రను చేతిలో పట్టుకొని దానిలోని విషయాలను సాఠేకి బోధించుచున్నట్లుగా దర్శనమిచ్చారు.
                                              (ఓ.వి. 44)
“బాబా తన స్థానంలో కూర్చొని, సాఠేను తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు.  గురుచరిత్రను తీసుకుని ఎంతో నైపుణ్యంగా అర్ధాన్ని సాఠేకు వివరించి చెప్పారు.”              (ఓ.వి. 45)

“బాబా ఒక పౌరాణికునిలా గ్రంధాన్ని చదువుతూ, సాఠేకు దానిలోని అర్ధాన్ని విడమరచి చెబుతున్నారు.  సాఠే మంచి శ్రోతలాగ ఎంతో పూజ్యభావంతో బాబా వివరణను అమిత శ్రధ్ధతో ఆలకించాడు.”    (ఓ.వి. 46)

ఈ విధంగా కలగన్న సాఠేకు ఆకలయొక్క అర్ధం బోధపడక, సందేహ నివృత్తి కోసం, సాయిబాబాను అడిగి తెలుసుకోమని కాకాసాహెబ్ తో చెప్పాడు.  అప్పుడు బాబా సాఠేకు ఈ విధంగా ఆదేశించారు.  “అతనిని మరొక సప్తాహం పారాయణ చేయమను.  ఈ గురుచరిత్ర పారాయణ వల్ల భక్తులు పునీతులవుతారు.”               (ఓ.వి. 56)

ఆవిధంగా బాబా సాఠేకు స్వప్నంలో దర్శనమిచ్చి, గ్రంధాన్ని ఏవిధంగా పఠించాలో విశదీకరించడమే కాకుండా, అతను మరలా ఆగ్రంధాన్ని పఠించేలాగ ఉపదేశం చేశారు.
(గ్రంధపఠనం ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List