Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 3, 2016

శ్రీసాయిబాబావారి బోదనలు మరియు తత్వము - 20. విభిన్న మతాలు – 2వ.భాగమ్

Posted by tyagaraju on 8:18 AM
   Image result for images of shirdi sai as fakir
        Image result for images of rose hd

03.11.2016  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోదనలు మరియు తత్వము
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్







తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
20. విభిన్న మతాలు – 2వ.భాగమ్
ఒకసారి ఒక మామలతదారు దక్షిణాఫ్రికానుండి వచ్చిన బ్రాహ్మణుడయిన ఒక వైద్యునితో షిరిడీకి వచ్చాడు.  షిరిడీకి రమ్మని పిలిచినప్పుడు ఆవైద్యుడు తన ఇష్టదైవం శ్రీరాముడని, తాను ఒక మహమ్మదీయునికి నమస్కరించనని అందుచేత షిరిడీకి రావడం ఇష్టం లేదని చెప్పాడు.  అపుడా మామలతదారు అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరని, బాబాకూడా తనకు నమస్కరించమని కూడా అనరనీ అందుచేత సంతోషంగా షిరిడీకి రావచ్చని చెప్పాడు.  


అతను ఆహామీ ఇవ్వడంతో ఆవైద్యుడు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు.  కాని, ఆవైద్యుడు బాబాను చూడగానే ఆయనకు నమస్కారం చేసాడు.  అందరూ చాలా ఆశ్చర్యపోయారు.  ఒక మహమ్మదీయునికి నమస్కరించనని చెప్పినవాడివి బాబాను చూడగానే ఆయనకు ఎందుకని నమస్కారం చేసావని అందరూ అడిగారు. 
          Image result for images of shirdi sai as fakir

తనకు  బాబాలో తన ఇష్టదైవమయిన రాములవారి దర్శనభాగ్యం కలిగిందని అందుచేతనే ఆయనకు సాష్టాంగనమస్కారం  చేసానని చెప్పాడు.  ఆవిధంగా చెబుతూ బాబా కూర్చున్నవైపు చూడగానే ఆయన స్థానంలో రాములవారికి బదులు బాబా కనిపించారు.  ఆవైద్యునికి ఎంతో విస్మయం కలిగి “ఇది కలా, నిజమా? ఆయన మహమ్మదీయుడెలా అవుతారు?  ఆయనొక గొప్ప యోగి సంపన్నుడు” అని అర్ధం చేసుకున్నాడు.

ఆవిధంగా సాయిబాబా రెండు వర్గాలయిన హిందూ – ముస్లిమ్ ల మధ్యనున్న వైరాన్ని రూపుమాపడానికి తన ధర్మాన్ని నిర్వర్తించారు.  వారిమధ్య శతృత్వభావాన్ని తొలగించడానికి ఒక్కొక్కసారి యుక్తిని, ఒక్కొక్కసారి తన యోగశక్తిని, దైవిక శక్తిని ఉపయోగిస్తూ ఉండేవారు.  రాముడు – రహీమ్ ఇద్దరూ ఒక్కరే అని, ఇద్దరిలోను వీసమెత్తయినా భేదం లేదని అందుచేత తమలో తామే కోట్లాడుకోవడం వ్యర్ధమని బోధించారు.  అజ్ఞానాన్ని విడనాడి అందరూ చేయిచేయీ కలుపుకొని ఇరువర్గాలు సఖ్యతతో జీవించండి. అప్పుడె మానవజాతి అంతా సమైక్యంగా ఉంటుందని బోధ చేసారు.
“ఎవరయినా నీకు అపకారం చేసినట్లయితే వారిమీద ప్రతీకారం తీర్చుకోవద్దు.  నువ్వేదయినా చేయగలిగినట్లయితే ఇతరులకి మంచి చేయి.”

సాయిబాబా హిందువులను, ముస్లిమ్ లను సమభావంతో చూడటమే కాదు, క్రిష్టియన్, జోరాష్ట్రియన్ మతాలవారి మీద కూడా ఆవిధంగానే దయకలిగి ఉండేవారు.

చక్రనారాయణ్ క్రైస్తవ మతస్థుడు.  అతను రహతాకు సబ్ ఇన్ స్పెక్టర్ గా నియమింపబడ్డాడు.  కొంతమంది బాబా భక్తులు బాబావద్దకు వెళ్ళి, “బాబా మనకు ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఫౌజ్ దార్ గా వచ్చాడు” అన్నారు.  అప్పుడు బాబా ఇచ్చిన ప్రత్యుత్తరం, “అయితే ఏమయింది?  అతను నాసోదరుడు.”

అలాగే రష్యా – జపాన్ ల మధ్య యుధ్ధం జరుగుతున్న రోజులలో పార్శి మతస్థుడయిన జహంగీర్ ఫ్రామ్ జీ దారువాలా కెప్టెన్ గా ఉన్నాడు.  మూడు ఓడలు తప్ప తన ఓడలన్నిటినీ శత్రువులు సముధ్రంలో ముంచేశారు.  త్వరలోనే మిగిలినవి కూడా సముద్రంలో మునిగిపోవడం ఖాయమనుకున్నాడు.  తన జేబులో ఉన్న బాబా ఫోటోని తీసి బాబా వైపు చూస్తూ తనను, మునిగిపోబోతున్న తన ఓడలను రక్షించమని కన్నీళ్ళతో ప్రార్ధనలు చేసాడు. 

బాబా ఒక్కసారిగా “హా” అని అరచి ద్వారకామాయిలో తన స్థలంలో కూర్చున్నారు.  ఆయన కఫనీ, తలకు చుట్టుకున్న గుడ్డ పూర్తిగా నీటితో తడిసి వాటినుండి ధారగా అరగంటసేపు నీళ్ళు కారాయి.  ద్వారకామాయి నీటితో నిండిపోయి పెద్ద నీటి మడుగు ఏర్పడింది.  అక్కడున్న భక్తులందరూ ఆదృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు.  అక్కడ నీటినంతా బయటకు తోడేసి శుభ్రం చేసి బాబా బట్టలను శుభ్రంగా పిండేశారు.  మూడవరోజున జహంగీర్ బాబాకు టెలిగ్రామ్ (తంతి) పంపించాడు.ఆ టెలిగ్రామ్ లో, బాబా తనను, మునిగిపోతున్న ఓడలలోని ప్రయాణీకులను బాబా ఏవిధంగా రక్షించినది తెలిపాడు, ఆయనకు శతకోటి నమస్కారాలు అందచేసుకున్నాడు.  జహంగీర్ భారత దేశానికి తిరిగి వచ్చిన వెంటనే షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు.  మసీదు సభామండపం మరమ్మత్తుల కోసం రూ.2,200/- విరాళంగా సమర్పించాడు.

సాయిబాబా అన్నిమతాలను గౌరవభావంతో చూసేవారు.  తన భక్తులను కూడా ఆవిధంగానే గౌరవభావంతో మెలగమని ఉద్భోధించారు.  ఒకసారి తన అంకిత భక్తుడయిన కాకాసాహెబ్ దీక్షిత్ తన బసలో క్రీస్తు గురించి, క్రైస్తవమతం గురించి చెడుగా మాట్లాడినట్లు తెలిసింది.  ఆ తరువాత కాకా సాహెబ్ ద్వారకామాయికి వచ్చి బాబా కాళ్ళకు ఎప్పటిలాగే మర్ధనా చేస్తుండగా బాబా కోపంతో “అవతలకి ఫో, నాకాళ్ళు నువ్వేమీ మర్ధనా చేయనక్కరలేదు” అని గట్టిగా అరిచారు.  బాబా తనమీద ఆవిధంగా ఎందుకని కోపగించుకున్నారో దీక్షిత్ కి అర్ధమయి పశ్చాత్తాపపడ్డాడు.  ఆతరువాతే బాబా దీక్షిత్ ని తన కాళ్ళు పట్టడానికి అనుమతించారు.  అంతే కాదు.  బాబా ఎన్నడూ మత మార్పిడులను ప్రోత్సహించలేదు.  ఎవరయినా మతం మారతామన్నా ఆయన ఇష్టపడేవారు కాదు.  ఒకసారి బడేబాబా మహమ్మదీయ మతంలోకి మారిన ఒక హిందూ వ్యక్తిని మసీదుకు తీసుకుని వచ్చాడు.  వెంటనే బాబా మతం మార్చుకున్న ఆవ్యక్తి చెంపమీద ఒక్క లెంపకాయ కొట్టి “ఏమీ?  నీ తండ్రిని మార్చుకున్నావా?” అని కోపంతో అరిచారు.  ఎవ్వరయినా సరే తమతమ మతానికి, తాము పూజించే దైవానికి, తమ గురువుకు బద్ధులై ఉండాలని బాబా అందరికీ బోధిస్తూ ఉండేవారు.  “నీ స్వంత తండ్రే నీకు తండ్రి, అంతే గాని ఇతరుల తండ్రులు నీకు తండ్రి కాదు కదా” అని చెబుతూ ఉండేవారు.


క్లుప్తంగా చెప్పాలంటే బాబావారి లక్ష్యం ఒక్కటే.  మతాలు వేరయినా భగవంతుని తెలుసుకోవడంలో అన్ని మతాలు చెప్పే సారాంశం ఒక్కటేనని, అన్ని మతాలలోని ప్రాధమిక సూత్రాలు కూడా ఒక్కలాగే ఉంటాయని తెలియ చెప్పి వారిని సన్మార్గంలో పెట్టడం.   మానవులందరూ భగవంతుని బిడ్డలే.  ఆభగవంతుడిని మనం ఈశ్వరుడని పిలిచినా అల్లా అని పిలిచినా లేక ఇంకేపేరున పిలిచినా ఆయన బిడ్డలందరూ సామరస్యంతో అన్నదమ్ములలా ప్రశాంతంగా జీవించాలి.  మతాల ప్రాతిపదికగా తమలో తాము కోట్లాడుకోరాదని బాబా ఈసందర్భంగ హితవు పలికారు. 

 సాయిబాబా తమ జీవితకాలంలో షిరిడీలో ఈ విషయం గురించే తమ యోగ శక్తితోను, దైవాంశ శక్తితోను సమయానుకూలంగా తన భక్తులకు హితోపదేశం చేస్తూ ఉండేవారు.  ఆయన చేసిన బోధనల ఫలితం కారణంగానే,  బాబావారు మసీదులో కూర్చుని ఉన్నపుడు అక్కడ ఉన్న హిందువులు, ముస్లిమ్ లు ఆయన వద్ద ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మెలిగేవారు.  మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు, భావాలు, మత గర్వం లేకుండా బాబావారు పంచే ప్రసాదాలని ఇరువర్గాలవారు ఎటువంటి విముఖత్వం చూపకుండా, సంకోచం లేకుండా స్వీకరిస్తూ ఉండేవారు.  రోజు విడిచి రోజు జరిగే చావడి ఉత్సవాలలో కూడా బాబా చావడికి వెళ్ళే సమయంలో హిందువులు, ముస్లిమ్ లు కూడా అధికారిక లాంఛనాలయిన ఛత్ర చామరాలు పట్టుకుని భక్తితో ఆయన వెంటే నడుస్తూ వెళ్ళేవారు.  భక్తులలో ప్రధానంగా ఎక్కువగా హిందూ భక్తులే ఉండేవారు.  వారు పండరీపూర్ లో నిర్వహించే ఆరతి సాంప్రదాయాలనే అనుసరిస్తూ మసీదులో బాబాని పూజిస్తూ ఉండేవారు.  వారు చేసే భజనలు కూడా పూర్తిగా హిందూ పురాణగాధలను ఉదహరిస్తూ సాగేవి.  ఆసమయంలో అక్కడ ఉన్న ముస్లిమ్ భక్తులు కూడా ఆభజనలలో తాము కూడా పాలుపంచుకుని ఆనందించేవారు.  హిందూ భక్తులు పంచిపెట్టే ప్రసాదాలను కూడా ఎటువంటి సంకోచం లేకుండా నిరభ్యంతరంగ స్వీకరించేవారు.  అదే విధంగా ముస్లిమ్ భక్తులు ఎవరయినా పూజ్య భావంతో సమర్పించడానికి పుష్పాలు, పటికబెల్లం, కొబ్బరి తీసుకునివచ్చినపుడెల్లా, ఫతియా చదివేవారు.  ఒక్కొక్కసారి బాబా కూడా అందులో పాల్గొనేవారు.  ఆసమయంలో అక్కడ ఉండే హిందూ భక్తులు అక్కడ జరిగే తతంగాన్నంతటిని ప్రశాంత చిత్తులై గమనిస్తూ ఉండేవారు.  గౌరవభావంతో మెలగేవారు.  ప్రసాదంగా పంచబడే చక్కెర పలుకులను, కొబ్బరి ముక్కలను ఆనందంగా స్వీకరిస్తూ ఊండేవారు.  ఇరు వర్గాలమధ్య అంతటి సోదరభావం ఎంతో అద్భుతంగా ఉండేది. 

ఈనాడు. మన భారత దేశానికి అటువంటి సామరస్యం, ఐక్యత, సోదరభావం ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉంది.  ప్రాణరక్షణకు, ఆస్తిపాస్తుల పరిరక్షణకు సర్వమతాలవారు ఏకత్రాటిపై జీవించడం ఎంతయినా అవసరం.  అదే మన దేశ ఔన్నత్యాన్ని ఐకమత్యాన్ని కలకాలం నిలిపేలా చేస్తుంది.

ఇప్పటికీ హిందువులు ముస్లిమ్ లు, శిక్కులు, పార్శిలు,క్రైస్తవులు, అందరూ  షిరిడీలో సాయినాధుని దర్శించుకుని తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు.  ఇదే భక్తి భావం దేశమంతటా విస్తరించాలి.

అందుచేత మన సాయి భక్తులందరమూ ఈవిషయంలో మనస్ఫూర్తిగా మనమే బాబా బోధనలను ఆచరణలో పెట్టి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.  మన ప్రవర్తనే ఒక చక్కటి ఉదాహరణగా ఇతరులకు ఆచరణాత్మకంగా ఉండాలి.

21. బోధనలు సంగ్రహంగా
సాయిబాబావారి అంకిత భక్తుడయిన కాకాసాహెబ్ దీక్షిత్ ‘రఘునాధ్ సావిత్రి సాయినాధ్ భజనమాల’ పుస్తకంలో ముందు మాటగా సాయిబాబావారు చెప్పిన బోధనలను కొద్ది మాటలలో వివరించారు.

“భగవంతుడనేవాడు ఉన్నాడు.  ఎవ్వరూ ఆయనకన్నా గొప్పవారు కాదు.  ఆయన సకల జీవరాశులలోను, ఆఖరికి చలనంలేనివాటిలో కూడా వ్యాపించి ఉన్నాడు.  ఆయన లీలలను తెలుసుకోవడం అసాధ్యం.  అవి అగాధం.  సృష్టి, స్థితి, లయకారకుడు ఆయనే.  రక్షకుడు ఆయనే.  నిర్వహించేది, అంతంచేసేది ఆయనే.  ఆయన మనలను ఏవిధంగా నడిపిస్తే ఆవిధంగా జీవించాలి.  అనవసరమయినవాటికోసం ఆశ పడకుండా ఆయన ప్రసాదించినవాటితోనే సంతృప్తిగా జీవించాలి.  ఆయన అనుజ్ఞ లేనిదే ఆకయినా కదలదు.”
“ప్రతివారు నిజాయితీగా ప్రవర్తించాలి.  వివేకంతో (ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే జ్ఞానం) మెలగాలి.  నేనే కర్తననే అహంభావం లేకుండా మన పనిని మనం నిర్వర్తించాలి.  ఫలితాన్ని భగవంతునికి వదలి మనం నిమిత్త మాత్రులుగా ఉండాలి”.

“సకల ప్రాణుల ఎడల దయ కలిగి ఉండాలి.  వాదాలలో తలదూర్చరాదు.  ఎవరయినా మనలని నిందించినట్లయితే శాంతం వహించాలి.”

“ఇతరులు మనమీద చేసే నిందాపూర్వకమయిన మాటలని మన శరీరానికి తూట్లు పొడవవు.  ఇతరులపై శతృత్వాన్ని పెంచుకోరాదు.  దూషణ చేయరాదు.  ఎవరేమి చేసినా మనం పట్టించుకోకూడదు.  ఎవరి పని వారిదే మన పని మనదే.”

“ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండాలి.  సోమరితనంగా ఉండవద్దు.  భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి.  తిండి తినడం, నీరు త్రాగడం ఏవీ మాననక్కరలేదు. అన్నీ మితంగా ఉండాలి. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి.” 
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List