Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 31, 2017

శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్

Posted by tyagaraju on 8:08 AM
         Image result for images of shirdisaibaba smiling
          Image result for images of pink rose


31.01.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్
ఈ రోజు మరొక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకుందాము. 
బెంగళూరు నివాసి ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత 7 సంవత్సరాల వయసులోనే బాబా అనుగ్రహాన్ని పొందిన భాగ్యశాలి. 
2015 వ.సంవత్సరంలో ప్రొఫెసర్ ఆర్.విశ్ కాంత గారు చెప్పిన అనుభవాల మాలిక.


“1944 సంవత్సరానికి ముందు జూన్ 30 వ.తేదీన మా తండ్రిగారు కొన్ని విషాదకర సంఘటనలలో మృతి చెందారు. 11వ.రోజు కర్మకాండలు పూర్తయిన తరువాత 12వ.రోజున నేను స్కూలుకు వెళ్ళాను.  మధ్యాహ్నం 12-15 ని. కి ఇంటికి తిరిగి వచ్చాను.  మా అమ్మగారు వంటింటిలో మాకోసం వంట చేస్తూ ఉన్నరు.  అప్పటికి ఇంకా వంట పూర్తికాకపోవడంతో నేను వరండాలో ఆడుకుంటూ ఉన్నాను.  మా ఇల్లు పెద్ద ఖాళిస్థలంలో వెనుకవైపున ఉంది.  మా ఇంటి ముందు అంతా ఖాళీస్థలం.  అకస్మాత్తుగా 9 వంవత్సరాల వయసు గల బాలుడు మా ఇంటి ముందు గేటు వద్ద కనిపించాడు. ఆ బాలుడు మంచి రంగుతో చాలా అందంగా ఉన్నాడు.  ఆ బాలుడు తెల్లటి కఫనీ ధరించి తలకు ఒక గుడ్డ చుట్టుకుని ఉన్నాడు.  అప్పట్లో మా అమ్మగారికి గాని, నాకు గాని సాయిబాబా గురించి అసలు ఏమీ తెలీదు.  బహుశా బాబా ఒక పెద్దవయస్కుని రూపంలో దర్శనమిస్తే నేను భయపడవచ్చనే ఉద్దేశ్యంతో చిన్న పిల్లవానిగా వచ్చి ఉండవచ్చు.

ఆ బాలుడు నాదగ్గరకు వచ్చి మృదువయిన స్వరంతో “నేను మీఅమ్మగారిని కలవడానికి వచ్చాను” అన్నాడు.  ఈ మాటలు అతను బెంగళూరులో స్థానికంగా మాట్లాడే కన్నడ భాషలో అన్నాడు.  అప్పట్లో మేము గాంధీనగర్ లో ఉండేవాళ్ళం.  ఆరోజుల్లో మా అమ్మగారు వారంలో ఒక రోజు ఆకలితో వచ్చే పిల్లలకి అన్ని పదార్ధాలతో తృప్తిగా భోజనం పెట్టి పంపించేవారు.  వారినే వారాలబ్బాయిలు అనేవారు.  వారు వారంలో ఒక రోజు మాయింటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు.  ఈ బాలుడు కూడా అదే విధంగా వచ్చిన వారాలబ్బాయే అనుకున్నాను.  వాడిని చెయ్యి పట్టుకుని వరండాలోనుంచి వంటింటికి కొద్ది అడుగుల దూరంవరకు లాక్కుని వెళ్ళాను.  వాడిని అక్కడ నుంచోబెట్టి “అమ్మా! నీకోసం ఎవరో వచ్చారు” అని గట్టిగా అరిచి చెప్పాను.  ఈ బాలుడు నాకు ఎడమవైపున ఉండి తన కుడిచేతిని నా ఎడమ భుజంమీద వేసి నుంచున్నాడు.  తన కుడికాలు పాదాన్ని ఎడమపాదం మీద అడ్డంగా వేసి నుంచున్నాడు. (బాబా లెండీబాగ్ కు వెడుతూ మధ్యలో తన ఎడమకాలు పాదం మీడ కుడికాలి పాదాన్ని ఉంచి నుంచున్న భంగిమ ఏవిధంగా ఉంటుందో సరిగ్గా అదే భంగిమలో నుంచున్నాడు)
                   Image result for images of shirdisaibaba cross legged standing
         Image result for images of jasmine flowers

నా పిలుపు వినగానే మా అమ్మగారు వంటగదిలోనుండి బయటకు వచ్చారు.  నా పక్కన నుంచున్న అబ్బాయిని చూసి ఆశ్చర్యపోతూ “ఇవాళ నువ్వు రావలసిన రోజు కాదు.  పొరబాటున వచ్చావు.  ఈ క్షణంలో నీకు నేనేమీ భోజనం పెట్టలేను.  వంట అయేంతవరకు నువ్వు ఉండగలిగితే నీకు భోజనం వడ్డిస్తాను” అన్నారు.  మా నాన్నగారు చనిపోయిన తరువాత మా అమ్మగారు చాలా నిరాశ నిస్పృహలతో బాధ పడుతూ ఉన్నారు.  మా తాతగారు అప్పులు చేయడంవల్ల అప్పులవాళ్ళందరూ మాకు ఉన్నదంతా స్వాధీనం చేసేసుకున్నారు.  కట్టుబట్టలు తప్ప మాకింకేమీ మిగలలేదు.  అప్పుడా బాలుడు (బాబా) మృదువయిన స్వరంతో “అమ్మా! అందుకే నేను వచ్చాను.  నువ్వు చాలా కష్టాలలో ఉన్నావని నాకు తెలుసు” అని అభయహస్తంతో ఉన్న చిన్న బాబా ఫోటోను మా అమ్మగారికిచ్చాడు.  ఫోటో ఇస్తూ “ఈయన షిరిడీ సాయిబాబా. ఈయనని పూజించు.  నీకష్టాలన్నీ తీరిపోతాయి” అన్నాడు.  ఆ తరువాత ఆ బాలుడు నాభుజంమీద తట్టి వెళ్ళిపోయాడు.  ఆ తరువాత మేము ఎక్కువగా ధనవంతులు ఉండే గాంధినగర్ ప్రాంతంనుండి సామాన్యులు ఉండే మల్లేశ్వరంలోని ఇంటికి మారాము.  దురదృష్టవశాత్తు ఇల్లు మారేటప్పుడు ఆఫోటోని ఎక్కడో పోగొట్టుకున్నాము.

బాబా అన్న మాటలు “నావాళ్ళు విదేశంలో ఉన్నా వెయ్యి క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుకపిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నాదగ్గరకి లాక్కుంటాను” (ఓవి 15,  28వ.అధ్యాయం శ్రీసాయి సత్ చరిత్ర)

ఒక్కసారి కనక ఆయన నిన్ను తన భక్తుల సమూహంలోకి లాక్కున్నట్లయితే  ఆయనని నీ హృదయంలో నిలుపుకుని మనఃస్పూర్తిగా ప్రార్ధించు.  నీకష్టాలన్నీ తొలగిపోతాయి.  విడవకుండా వచ్చే కష్టాలనుండి కూడా ఆయన నిన్ను తన అసామాన్యమయిన రీతిలో బయటకు లాగుతారు.

Source: Baba's Divine Manifestations by Vinny Chitluri
సాయిలీలా వాట్ స్ యాప్ గ్రూప్ నుండి సేకరణ
(రేపటి సంచికలో ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంతగారికి జీవితాన్ని ప్రసాదించిన బాబా)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List