Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 15, 2017

షిరిడీకి పాదయాత్ర

Posted by tyagaraju on 8:09 AM
      Image result for images of shirdi saibaba smiling

  Image result for images of white rose

15.08.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమైన బాబా లీలను తెలుసుకుందాము.
ఈ లీల సాయిలీల ద్వైమాసపత్రిక జనవరి – ఫిబ్రవరి 2107 వ.సంవత్సరం సంచికనుండి గ్రహింపబడింది.

శ్రీ లారెన్స్ డిసౌజా వివరింపగా శ్రీమతి మయూరి మహేష్ కదమ్ గారు వ్రాసారు.  మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువాదం చేసినవారు శ్రీ మీనల్ వినాయక్ దాల్వి.
(ఈ రోజు శ్రీమతి మయూరి మహేష్ కదమ్ గారితోను, లారెన్స్ డిసౌజా గారితోను మాట్లాడాను.)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

షిరిడీకి పాదయాత్ర
మనకు శ్రీసాయిబాబా గురించి తెలిసినా, తెలియకపోయినా మనకు ఆయనలో నమ్మకం ఉన్నా లేకపోయినా మనం నాస్తికులమయినా కాకపోయినా మనం ఆయనకు దగ్గరగా ఉన్న లేక దూరంగా ఉన్నా, తన వద్దకు లాక్కుని తన భక్తునిగా చేసుకోవడం సాయిబాబా చేసే అధ్బుతమయిన చమత్కారం. 


 ఆయన దగ్గరకు చేరుకున్న భక్తునికి తమ యిద్దరిమధ్య ఉన్న బంధం ఎటువంటిదో తెలియచేస్తారు.  ఆవిధంగా బాబాకు చేరువయిన భక్తుడు బాబాయందు అపరిమితమయిన భక్తిని పెంపొందించుకుంటాడు.  ఈవిధంగ యింతకు ముందు ఎంతోమంది భక్తులకి యిటువంటి అనుభవాలు కలిగాయి.  అటువంటి భక్తులలో "ఓమ్ సాయి శరణ్ శ్రీ లారెన్స్ బాబా సేవాట్రస్టులో" లారెన్స్ డిసౌజా ఒకరు.

గత 37 సంవత్సరాలుగా లారెన్స్ డిసౌజా  బొంబాయిలోని కుర్లా ప్రాంతంలో ఉన్న కజుపాడనుంచి షిరిడీవరకు కాలినడకన యాత్ర చేస్తూ వస్తున్నాడు.  ఎంతోమంది భక్తులు ఆయనతో కూడా షిరిడీ వరకు పాదయాత్ర చేయసాగారు.  ఆయన మొట్టమొదటిసారిగా 1980 వ.సంవత్సరంలో షిరిడీకి పాదయాత్ర చేసారు.  ఆయన చేసే ఈ పాదయాత్ర వెనుక జరిగిన కారణమేమిటో తెలుసుకుంటే చాలా అధ్బుతంగా ఉంటుంది. ఆ ఆశ్చర్యకరమయిన సంఘటన మనలో సాయిబాబా మీద ఉన్న భక్తిని మరింతగా పెంచుతుంది.  లారెన్స్ క్రైస్తవ మతస్థులు.  ఆయన హస్ మన్ కంపెనీలో డ్రిల్లర్ గా పని చెస్తూ ఉండేవాడు.  వారిది క్రిస్టియన్ కుటుంబం అవడంచేత వారంతా ఆంగ్లంలోనే మాట్లాడేవారు.  లారెన్స్ మంచి యువకుడవడంవల్ల జీవితాన్ని ప్రతిక్షణం చాలా ఆనందంగాను   విలాసవంతంగాను గడుపుతూ ఉండేవాడు.  చాలా ఖరీదయిన చుట్టలు కాలుస్తూ ఉండేవాడు.  
            Image result for images of costly cigar
కాని ఒకరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది.

అతను పనిచేస్తున్న కంపెనీలో యాజమాన్యానికి, కార్మిక సంఘాల యూనియన్ కి మధ్య విభేదాలు, గొడవలు వచ్చాయి.  దాని ఫలితంగా డిసౌజాను పోలీసులు అరెస్టు చేసారు. అతను ఘట్ కోపర్ పోలీస్ స్టేషన్ లాకప్ లో కొంతకాలంపాటు గడపవలసివచ్చింది.  ఆ లాకప్ గదిలో ఒక మూలగా శ్రీసాయిబాబా వారి ఫొటో ఉంది.  అందులో బాబా ఒక చేతిని తన చెంపకు, చెవికి ఆనించి కూర్చున్న భంగిమలో ఉన్నారు.  
          Image result for images of shirdi saibaba smiling
అప్పటివరకు అతనికి శ్రీసాయిబాబా గురించి ఏమీ తెలియదు.  ఆ లాకప్ లో ఉన్న యితర ఖైదీలు ఉదయం సాయంత్రం ఫొటొ వద్దకు వెళ్ళి బాబాను పూజిస్తూ ఉండేవారు.  వారంతా బాబా కీర్తనలు పాడుతూ పూజ చేసే సమయంలో డిసౌజాను కూడా రమ్మని పిలిచేవారు. “నాకు ఈ సాధువు ఎవరో తెలీదు.  మా క్రైస్తవ మతంలో యిటువంటి పూజాపునస్కారాలు ఏమీ ఉండవు” అని చెప్పి తన తోటి ఖైదీలు పిలిచినా దగ్గరకు వెళ్ళేవాడు కాదు.
ఒకసారి స్నానం చేసివచ్చి చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు.  ఆ సమయంలో బాబా ఫొటొవద్ద ఒక వృధ్దుడు కూర్చుని ఉండటం కనిపించింది.  డిసౌజా చుట్ట కాలుస్తూ ఆవృధ్దుడినే గమనిస్తూ ఉన్నాడు.  ఆవృధ్ధుడు డిసౌజాని దగ్గరకు రమ్మని పిలిచాడు.  చేతిలో కాలుతున్న చుట్టను వుంచుకుని ఆవృధ్దుని వద్దకు వెళ్ళడం గౌరవం కాదని ఆలోచించాడు.  తను కాలుస్తున్న చుట్ట చాలా ఖరీదయినది.  ఇపుడు ఆవ్యక్తి గాని, ఇక్కడ వుండే ఎవరయినా గాని తన ఖరీదయిన చుట్ట కావాలని అడుగుతారేమో? అనే అనుమానం కలిగింది.  తనతో ఉన్నవాళ్ళలో చాలామంది పొగత్రాగుతారు.  అందువల్ల కాలుతున్న చుట్టని నలిపి తను కూర్చున్న చోటనే వదిలి వృధ్ధుని దగ్గరకు వెళ్ళాడు.  ఆవృధ్ధుడు సాయిబాబా ఫొటోని పూజించమని చెప్పాడు.  లారెన్స్ ఆవృధ్దుడు ఏవిధంగా చెబితే ఆవిధంగా చేస్తున్నాడు.  కాని అతని మనసంతా తను వదిలేసిన చుట్ట మీదే ఉంది.  ఈలోపుగా తనతోటివాళ్ళు వచ్చి చుట్ట తీసేసుకుంటారేమోనని తెగ బాధపడిపోతూ ఉన్నాడు.  పూజ పూర్తయిన వెంటనే చుట్ట దగ్గరకి వచ్చాడు.  మరలా చుట్ట తీసుకుని చివరిదాకా కాలుస్తూ కూర్చున్నాడు.  సరిగా ఆసమయంలో తనతో ఉండేవాళ్ళలో ఒకతను వచ్చాడు.  అతను ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు.  అప్పటికే అక్కడ పూజ జరిగి ఉండటం చూసి, పూజ ఎవరు చేసారు అని ఆశ్చర్యంగా డిసౌజాని అడిగాడు.  ఒక వృధ్దుడు తన చేత పూజ చేయించాడని జరిగినదంతా వివరంగా చెప్పాడు డిసౌజా.  “వృధ్దుడా? ఎవరు? మనలో ఉన్న ఆవృధ్దుడు ఎవరు?” అని ప్రశ్నించాడు.  తోటివారినందరినీ అతని ఎదురుగా నిలబెట్టాడు.  వారిలో తనతో అంతకుముందు పూజచేయించిన వ్యక్తి లేడు.  పూజ చేయించిన వృధ్దుని ఆకారం , అతను ఎలా ఉన్నాడో అడిగిన మీదట, లారెన్స్ డిసౌజా వర్ణించి చెప్పాడు  ఆవృధ్దునికి గడ్డం ఉందని, సాయిబాబాలాగ తలకు గుడ్డ చుట్టుకుని ఉన్నాడని అంతా కళ్ళకు కట్టినట్లు వివరంగా చెప్పాడు.  అతను చెప్పిన వివరణంతా సాయిబాబాతో పోలిఉండటంతో అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.  సాయిబాబాయే తమతో ఉంటున్నవానిగా దర్శనమిచ్చారని రూఢిపరచుకున్నారు.  ఇన్నాళ్ళుగా తాము సాయిబాబాను పూజిస్తూ ఉన్నా తమకు కలుగని అనుభవం, చమత్కారం డిసౌజాకు కలిగిందని అతను ఎంతో అదృష్టవంతుడని అభినందించారు.  “ఆయనకు శిరసు వంచి నమస్కరించుకో, నీకేంకావాలో అది అడుగు, ఆయన నీకోరికని ఏవిధంగా తీరుస్తారో చూడు” అన్నారు.  మొదట్లో అతను ఈవిషయాన్ని నమ్మలేదు.  కాని అందరూ కలిసి చెప్పగా చెప్పగా తనని తొందరలోనే జైలునుంచి విడుదల చేయించమని బాబాని ప్రార్ధించుకున్నాడు.  “తొందరలోనే నేను జైలునుంచి విడుదలయితే షిరిడీకి నడిచి వస్తాను” అని మొక్కుకున్నాడు.  నిజానికి అతనికి షిరిడీ ఎక్కడుందో తెలియదు.  కాని తను తొందరలోనే విడుదల అవుతానని  కూడా ఏమాత్రం నమ్మకంలేదు. షిరిడీ బొంబాయికి దగ్గరలోనే ఉంటుందనుకున్నాడు. ఆ తరువాత అందరినీ ఆశ్ఛర్యపరచిన సంగతేమిటంటే మూడు రోజులలోనే అతనిని జైలునుండి విడుదల చేసారు.



జైలునుంచి విడుదలయి యింటికి తిరిగి వచ్చినతరువాత ఎప్పటిలాగే జీవితాన్ని గడపసాగాడు.  సాయిబాబాకు తాను యిచ్చిన మాటని మర్చిపోయాడు.  అతను మర్చిపోయినా సాయిబాబా మాత్రం మర్చిపోలేదు.  సాయిబాబా, డిసౌజాకు ఎన్నోసార్లు కలలలో కన్పించి “షిరిడీకి ఎప్పుడు వస్తున్నావు” అని అడుగుతూ ఉండేవారు.  డిసౌజా తనకు వచ్చిన కలను అర్ధం చేసుకోలేక కల గురించి తన తండ్రికి చెప్పాడు.  “నువ్వు ఆవిధంగా సాయిబాబాకు ఏమయినా చెప్పావా?” అని ప్రశ్నించాడు తండ్రి.  తను లాకప్ లో ఉండగా జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పాడు.  ఆయనకు నాలుగు కార్లు ఉన్నాయి.  తండ్రి తన అంబాసిడర్ కారు తీసుకుని షిరిడీ వెళ్ళమని కొడుకుకు చెప్పాడు.  అపుడు కొడుకు తాను బాబాకు యిచ్చిన మాట ప్రకారం కాలినడకనే షిరిడీ వెడతానని చెపాడు.  ఇది వినగానే తండ్రి పకపకమని నవ్వి బొంబాయినుండి షిరిడీకి ఎంత దూరం ఉంటుందో చెప్పాడు.  అయినప్పటికి డిసౌజా తన మాటమీదనే నిలబడి, తన స్నేహితులని కూడా రమ్మని పిలిచాడు.  అతని స్నేహితులందరూ మత్తుమందులకు బానిసలు.  తరచూ ఓపియమ్ లాంటివి సేవిస్తూ ఉంటారు.  డిసౌజా తనతో షిరిడీకి రమ్మని పిలవగానే వారంతా ఒక షరతు పెట్టారు.  తమందరికీ ఉదయం ఫలహారం, భోజనాలు, మత్తుమందులను ఏర్పాటు చేసినట్లయితే రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తాము కోరిన కోరికలను తీర్చాలని చెప్పారు.  ఆవిధంగా ఏడుగురు స్నేహితులతో ఒక బృందంగా ఏర్పడి కాలినడకన షిరిడీ వెళ్ళడానికి సంకల్పించారు.  పాదయాత్ర ప్రారంభించడానికి జనవరి 14వ.తారీకు ముహూర్తం నిర్ణయించుకున్నారు.  ఒట్టిచేతులతో పాదయాత్ర చేసేకన్నా కూడా సాయిబాబా ఫోటోపట్టుకుని చేస్తే మంచిదని ఎవరో సలహా యిచ్చారు.  డిసౌజా సాయిబాబా ఫొటోని తెచ్చి తన మెడలో వేళ్ళాడదీసుకుని తన ఏడుగురి స్నేహితులతో కలిసి 1979, జనవరి 14వ.తారీకున పాదయాత్ర ప్రారంభించాడు.
               Image result for images of shirdisaibaba small photo

ఎవరినయితే బాబా తనవద్దకు పిలిపించుకుంటారో వారు మాత్రమే షిరిడీకి రాగలరనే విషయం డిసౌజాగారి విషయంలో ఋజువయింది.  షిరిడీ ఎక్కడ ఉందో తెలీదు.  బొంబాయినుండి ఏదారిలో ఏ దిక్కులో వెళ్ళాలో కూడా తెలీదు.  అసలేమీ తెలీకుండానే షిరిడీకి పాదయాత్ర ప్రారంభించాడు.  దారిలో కనపడ్డవారినందరినీ షిరిడీకి దారి అడుగుతూ నడక సాగించారు.  ఆరోజుల్లో రోడ్లు కూడా సరిగా లేవు.  సౌకర్యాలు కూడా తగినట్లుగా లేవు.  ఎక్కడయినా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుందామన్నా దానికి తగినట్లుగా ప్రదేశాలు కూడా ఏమీ లేవు.  అందువల్ల ఒక గ్రామంలోకి ప్రవేశించగానే తరువాత ఏగ్రామం వస్తుంది, అది ఎంతదూరంలో ఉంది అక్కడికి ఏవిధంగా చేరుకోవాలి మొదలైన విషయాలన్నీ గ్రామస్తులని అడుగుతూ పాదయాత్ర కొనసాగించేవారు.  రాత్రివేళలలో బస చేయడానికి ఏగ్రామాలు అనుకూలంగా ఉంటాయనే విషయాలని కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు.  రాత్రికి బస చేసిన తరువాత మరుసటి రోజు ఉదయం పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు.  ఈ విధంగా వారు పాదయాత్ర మొదలుపెట్టిన తొమ్మిదవ రోజుకు షిరిడీ చేరుకున్నారు.

(రేపటి సంచికలో బాబా చరణాలవద్ద డిసౌజాగారికి కలిగిన అత్యధ్భుతమయిన అనుభవమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List