Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, January 3, 2019

బాబాకు మనము ఏమి సమర్పించాలి

Posted by tyagaraju on 8:08 AM



 Image result for images of shirdi sai baba preaching




                    Image result for images of roses






03.01.2019  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు
బాబాకు మనము ఏమి సమర్పించాలి
( శ్రీ రాధాకృష్ణ స్వామీజీ)
(సాయి పదానంద జనవరి, 2003, సంచిక సాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడినది)
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్

దాదాపు నెలరోజులు పైగా అయింది  మన బ్లాగులో ప్రచురించి.  నా కంప్యూటర్ మరియు లాప్ టాప్ లు రెండు ఒకేసారి పాడయిన కారణంగా ప్రచురింపలేకపోయాను.  ఈ రోజు మన సాయి భక్తులందరికీ బాబాకు మనము సమర్పించవలసినవి ఏమిటి, ఆయన భక్తులుగా మనం చేయవలసినదేమిటి అనే విషయాల మీద శ్రీ రాధాకృ ష్ణస్వామిగారి వ్యాసాన్ని ప్రచురిస్తున్నాను.  చదివిన తరువాత మీ అభిప్రాయములను తెలపండి.

బాబా మాత్రమే కల్పతరువుగా తన భక్తుల కోరికలను తీర్చగలడని, అటువంటి బాబాకు మనం తిరిగి ఏమీ ఇవ్వనక్కరలేదనే భావం మనలో ఉండవచ్చు.  ఆయనకే మన కోరికలన్నిటిని తీర్చగలిగిన శక్తి ఉన్నపుడు సామాన్యులమయిన మనము ఆయనకేమివ్వగలం అనే ఆలోచన తప్పు.  ఇవ్వడమనేది ఏకపక్షంగా ఉండరాదు.  ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉండాలి.  భగవంతుడయినా సరే ముందు స్వీకరించిన తరువాతనే అనుగ్రహిస్తాడు.  అందుచేతనే (Give and Take policy) ఇచ్చి పుచ్చుకోవడమనే సాంప్రదాయం వాడుకలోకి వచ్చ్చింది.



ఇక్కడ మీకొక సందేహం రావచ్చు.  బాబా మననుంచి ఏదీ ఆశించనట్లయితే ఆయన మననుండి దక్షిణ అడిగి మరీ ఎందుకని తీసుకునేవారు?  మండుటెండలో బిక్షకోసం యింటింటికీ ఎందుకని తిరిగేవారు.  బాబా ఎప్పుడూ దక్షిణకోసం గాని, బిక్షకోసంగాని ఆరాటపడలేదు.  ఈవిధంగా ఆయన చేయడంలోని ఆంతర్యం భక్తుల  హృదయాలలో ఉండే దయాగుణాన్ని అన్వేషించడానికే.  మన జీవితాలు ఉన్నతంగా సాగడానికే మనం సంపాదించినదానిలో కొద్ది మొత్తాన్ని దానధర్మాలకై వినియోగంచమని మనకు ఆవిధంగా బాబా బోధించారు. 
బాబా తన భక్తుల ప్రార్ధనలకు, కోరికలకు స్పందించి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు.  తన భక్తులు వ్యాకులతలతో ఉన్నప్పుడు గాని, కష్టాలలో ఉన్నపుడు గాని తన అత్యద్భుతమయిన చమత్కారాలను, లీలలను ప్రదర్శించి వారికి తన చేయూతనందించి సహాయం చేస్తూ ఉంటారు.  ఈవిధంగా ఆయన సహాయం అందుకున్న భక్తులనుంచి బాబా ఏమీ ఆశించరు.  బాబా తన భక్తుల కోరికలను తీర్చి వారు తను బోధించిన విధంగా ఏవిధంగా ప్రవర్తించాలో ఆవిధంగానే భక్తులు ఉండాలనే కోరుకొంటారు.  కాని, మనమందరం ఆయన ఆశయాన్ని ఆయన మననించి ఏమికోరుకొంటున్నారో ఇవన్నీ  మర్చిపోయి, ప్రతిసారి బాబాని పదే పదే క్రొత్తకోరికలతో ప్రార్ధిస్తూ ఉంటాము.  బాబా మన కోరికలను తీర్చగానే మనం ఎంతో ఉద్వేగం చెంది, భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరయి కన్నీరు కారుస్తూ ఆయనకు మన క్రుతజ్ఞతాభివందనాలను అర్పించుకొంటాము.

బాబాని మనం మన కోరికలను తీర్చే కల్పతరువుగా భావిస్తాము.  అంతేకాదు, ఆయన మన గురువు, భగవంతుడు అని చెప్పుకొంటాము.  బాబాకు మేము భక్తులం అని మనకు మనమే ప్రకటించుకొంటాము.  నిజం చెప్పాలంటే బాబాకు మేము భక్తులం శిష్యులం అని మనకు మనమే చెప్పుకునే అర్హత మనకు లేదు.  దానికి మనం పాత్రులము కాదు.  ఆయన మనకు బోధించిన బోధనలను గాని, ఉపదేశాలను గాని  గుర్తుంచుకోకుండా ఆయన ముందు మనం చేతులుచాచి మరలా మరలా అర్ధించడానికి అవసరమయిన అధారం ఏది దొరుకుతుందా అని అన్వేషిస్తూనే ఉంటాము.  బాబా మనలనుంచి ఏది కోరుకుంటున్నారో, ఏవిధంగా మనం ఉండాలో చెప్పిన విషయాలన్నీ మర్చిపోవడమే కాకుండా కావాలనే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము.  ఆయన పాదాలముందు నిలబడి మరొక క్రొత్త కోర్కెను తీర్చమని అర్ధిస్తున్నాము.  ఆయన మన కోరికను తీర్చనప్పుడు ఆయన మీద ఒకింత కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాము.

బాబా జీవనవిధానం మనకు ఇస్తున్న సందేశం ---

బాబా తన భక్తుల కోర్కెలను తీరుస్తారనే విషయం అందరికీ తెలుసు.  ఆకారణం చేతనే అన్ని జాతులవారు, కులాలవారు, మతాలవారు బాబా సమాధి చుట్టూ చేరి ఆయనను దర్శించుకునేందుకు గుమికూడుతూ ఉంటారు.  తమతమ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి, ఆయన తమ మీద ప్రసరించిన అనుగ్రహానికి  ఆయనకు కానుకలను సమర్పించుకుంటూ ఉంటారు.  కాని, బాబా ఉపదేశాలను గ్రహించుకోవడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు.  ఒక కోరిక తీరిన తరువాత  మరొక కోరికను తన ముండు పెట్టడమనే తీరును బాబా తన భక్తులనుంచి కోరుకోరు.  ఆయన మననించి కోరుకునేది తను చెప్పిన ఉపదేశాలను అర్ధం చేసుకోమని.  తను ఉపదేశించిన విషయాలను అందరికీ వ్యాప్తి చేయమనే ఆయన మననుంచి కోరుకునేది.  ఆయన బోధనలను ఆచరణలో పెట్టమనే మనలనుంచి బాబా కోరుకొంటారు.  బాబా చెప్పిన సిధ్ధాంతాలను, బోధనలను, మనం ఆచరణలో పెట్టినపుడే మనలో భక్తి ఎంత ఉందనే విషయాన్ని బాబా గుర్తిస్తారు.

శ్రధ్ధ, సబూరి --  ఈ రెండు పదాలు మనకు బాబా సుపరిచితమయినవే.  కాని, మన జీవిత గమ్యంలో వాటి సారాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాము.  శ్రద్ధ అనగా భగవంతుని మీద సడలని భక్తి, ఆత్మనివేదన.  వీటిని అభ్యాసం చేయడం, ఆచరించడం అంత సులభమేమీ కదు.  కారణమేమంటే మన జీవితం అధఃపతనం చెందడానికి కారణమయ్యే మన గమనాన్ని మార్చుకోవాలి.  మనలో ఉన్నటువంటి స్వార్ధపూరిత ఆలోచనల స్థానంలో భగవంతుని మీదనే మన దృష్టిని నిలిపి ఆయన కోరుకున్నట్లుగానే అన్నీ సమర్పిస్తూ ఉండాలి.

సబూరి --  మన జీవితంలో కలిగే  కష్టాలు, విఘాతాల సమయాలలో స్థిరంగా ఉండమని సహనం మనకు బోధిస్తుంది.  జీవితంలో మనకు అనేక ఒడిదుడుకులు, ప్రకంపనాలను ప్రతిక్షణం మనం అనుభవిస్తూ ఉంటాము.  ఈ రెండు సూత్రాలను సాధన చేయకుండా భక్తులమయిన మనం ఏవిధంగా వాటిని తట్టుకొని నిలబడగలము.  మన దైనందిన జివితంలో వీటిని ఆచరణలో పెట్టమనే బాబా మనలనుంచి కోరుకునేది.

కర్మ, భక్తి, ధ్యానం --  మనలో ఉన్నటువంటి సంకుచితమయిన ఆలోచనలని, స్వార్ధ స్వభావాన్ని, మూర్ఖ పధ్ధతులను విడనాడి సేవాభావాన్ని, త్యాగనిరతిని అలవరచుకొని క్రొత్త జీవితాన్ని గడపమనే బాబా తన భక్తులనుంచి కోరుకొంటారు.  స్వార్ధాన్ని వదలి స్వలాభాపేక్షకు అనుసంధానమయిన ‘నేను’ ను విడిచిపెట్టమని, ధర్మగుణాన్ని సేవానిరతిని అలవరచుకొని ఆ విధంగా జీవించమని బాబా ఉపదేశించారు.  ఇదే బాబా మనకు ఉపదేశించిన కర్మయోగం.  మనం చేసే ప్రతి కర్మను ఒక పుష్పంగా భగవంతునికి సమర్పించాలి.  ఇదే భక్తియోగం.  ప్రతిచోటా భగవంతుడు ఉన్నాడనే భావంతో ఉండటమే ధ్యానయోగం.  మన ఆలోచనలను, కోరికలను, మనోభావాలను, అర్పించడం కూడా భక్తియోగాన్ని తెలియచేస్తుంది.

చివరిగా బాబా మననుంచి కోరుకునేది –

బాబా మనలని నామస్మరణ, ధ్యానం చేసుకోమని ఉపదేశించారు.  శరీర స్పృహను మరచి తన నామాన్నే జపించుకుంటు ఉండమని చెప్పారు.  తన రూపంమీద ధ్యానం చేసుకోమన్నారు.  ఈవిధంగా నిరంతరం ఆగకుండా ధ్యానం చేసుకోవాలి.  మన మనస్సుని, బుధ్ధిని, శరీరాన్ని అహాన్ని ఆయన చైతన్యంలో విలీనం చేయాలి.  ఇదే చివరిగా ఆయన మననుంచి కోరుకునేది.  ఈ విషయాలని చులకనగా చూడవద్దు.  వీటిలో చెప్పబడిన ముఖ్యోద్దేశాన్ని గుర్తించి ఆచరణలో పేట్టవలసిన అవసరం ఎంతయినా ఉంది.  బాబా షిరిడీలో రొట్టెముక్క కోసం ఇంటింటికి తిరిగేవారు.  వాస్తవానికి ఆయన మననుంచి ఆహారాన్ని కోరుకోలేదు.  మన అస్తిత్వాన్ని పూర్తిగా తనకు సమర్పించాలనే కోరుకొన్నారు.

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List