20.05.2020 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి
జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు సాయిభక్తులలో ఒకరయిన
శ్రీ ఉద్ధవేష్ బువా
అనబడే శ్యామ్ దాస్
బాబా గురించి నాలుగవ భాగం మీకు
అందిస్తున్నాను. ఆయనయొక్క
సమాచారం shridisaitrust.org – Chennai వారి
నుండి గ్రహింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ఫోన్
నం. 9440375411 & 8143626744
ఉధ్దవేష్
బువా – 4 వ భాగమ్
మరునాడు బాబా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమయిన ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది భక్తులు దెబ్బలు,
తిట్ల రూపంలో ఆయన ఆగ్రహాన్ని చవిచూసారు. కాని బాబాగారి దినచర్య యధావిధిగానే
జరిగింది. ఉద్ధవేష్ బువా మధ్యాహ్నం గం. 3.30 కి ద్వారకామాయికి
చేరుకుని బాబాకు పాదసేవ చేయసాగాడు.
“పదకొండు రూపాయలనగా పోతీని చదవడమేఅయితే, నేను తీసుకున్నాననే చెబుతాను”
కాని అతని మనసులో ఇంకా అనుమానంగానే ఉంది. పోతీ చదవడమంటే భగవద్గీతా?
లేక జ్ఞానేశ్వరియా? అని సందేహంతో బాబాని అడిగాడు. అందుకు సమాధానంగా బాబా “అరే శ్యామ్ దాస్, నువ్వు బాపూ సాహెబ్ జోగ్ దగ్గరకు వెళ్ళు. అతను చదువుతున్న పోతీని తీసుకుని
రా” అన్నారు.
ఉధ్ధవేష్ వెంటనే వెళ్ళి జోగ్ దగ్గరనుంచి పుస్తకం తీసుకుని వచ్చాడు. బాబా యాదృఛ్చికంగా ఒక పేజీ తెరిచారు. అది ఏకనాధ భాగవతంలోని పదకొండవ అధ్యాయం. బాబా ఆ అధ్యాయాన్ని చూపుతూ
“నీజీవితకాలంలో ప్రతిరోజు దీనిని చదువు. ముందర దీనిని ఉన్నది ఉన్నట్లు చదువు. ఆతరవాత నీ అంతట నీవే చదివిన దానిని
అర్ధం చేసుకో. ఎవ్వరికీ
వివరించవద్దు, వ్యాఖ్యానాలు చెప్పవద్దు. నువ్వు మాత్రమే చదివి అర్ధం చేసుకో. అల్లా మాలిక్ నీకు మేలు చేస్తాడు”
అన్నారు.
ఒకసారి ఉధ్ధవేష్ బువా తీర్ధయాత్రలు చేయడానికి సంకల్పించుకుని ద్వారకకి బయలుదేరాడు. యాత్రికుల బృందమంతా బొంబాయి
నుండి ఓడలో బయలుదేరారు. ఓడ ప్రయాణ టిక్కేట్లన్నీ బువా దగ్గరే ఉన్నాయి. తన వద్ద ఉన్న టిక్కేట్లని రెండు భాగాలుగా
విభజించి పెట్టుకున్నాడు. ఒక భాగం తీరంనుండి ఓడవరకు తీసుకునివెళ్ళే నావకి (ఫెర్రీ)
సంబంధించినవి. రెండవభాగం ఓడ ప్రయాణానికి సంబంధించినవి. ఉధ్ధవేష్ నావ టిక్కేట్లు తన చొక్కా
జేబులో, ఓడ టిక్కేట్లు పర్సులోను పెట్టుకున్నాడు.
ఓడలో ఉండగా దేనికోగాని అతను పర్సు బయటకు తీసి చూస్తున్నాడు. ఆసమయంలో అతను ఓడ రైలింగ్
కి ఆనుకుని నుంచున్నాడు. ఎలాపడిపోయిందో తెలియదు కాని అతని పర్సు, పర్సులో ఉన్న
ఓడ టిక్కెట్లు, డబ్బు అన్నీకూడా సాగరానికి సమర్పణ అయిపోయాయి.
ఓడనుంచి దిగేముందు టికెట్ కలెక్టర్ కి తమ తమ టికేట్లను అందరూ ఇచ్చేయాలి. బువా జరిగిన విషయమంతా
టికెట్ కలెక్టర్ కి వివరించి దానికి సాక్ష్యంగా తనవద్దనే ఉన్న నావ టికెట్లను చూపించాడు. టికెట్ కలెక్టర్ అవి చూసి సంతృప్తి
చెంది ఆయనతో ఉన్నవారినందరినీ ఓడ దిగి వెళ్లనిచ్చాడు.
అందరూ కలిసి ద్వారక చేరుకున్నారు. అక్కడ గోమతీ నదిలో స్నానం చేయడానికి,
భగవంతుని పాదాలు స్పృశించి పూజ చేయడానికి రుసుము చెల్లించాలి. తన వద్ద అసలు డబ్బు ఏదీ లేదు. ఎవరినీ అడగటం కూడా అతనికిష్టం లేదు. కాని, బాబానే
సహాయం చేయమని అడుగుదామని షిరిడీకి ఉత్తరం వ్రాసాడు.
అతను షిరిడీకి ఉత్తరం వ్రాసిన రోజే, దహనులో
ఉన్న ఒక ధనికుడికి బాబా కలలో కనిపించి బువాకి వెంటనే డబ్బు పంపించమని ఆదేశించారు. ఆయన వెంటనే బువాకి రూ.50/-
ఇన్సూరెన్స్ మనీ ఆర్ఢర్ ద్వారా పంపిస్తూ అందులో తనకు వచ్చిన కల గురించి
కూడా వివరంగా వ్రాసాడు.
మరొకసారి ఉధ్ధవేష్ మూడన్నర నెలలపాటు సాగే యాత్రా కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఆ యాత్రలో అతను తన యాత్రికుల బృందంతో కలిసి ద్వారక, పోర్ బందర్, గిర్నార్, సోమనాధి,
ఇంకా ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించడానికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో ఆయన తన బృంద సభ్యులు,
తన వ్యక్తిగత సేవకుడితో కలిసి గిర్నార్ కొండలదగ్గర ఆగారు. కొండలపైన దత్తాత్రేయుని పాదుకలు, అంబాజీ టెకడి,
(కొండ శిఖరం మీద ఉన్న అంబాదేవి ఆలయం), గోరక్ నాధ్
దేవాలయాలను దర్శించుకోవాలంటే కొండ ఎక్కాలి.
కొండ ఎలా ఎక్కాలి అని ముందుగా ఒక అవగాహనకి వచ్చారు. దాని ప్రకారం యాత్రికులందరూ కలిసి గురువారమునాడు కొండ ఎక్కాలనే నిర్ణయానికి వచ్చారు. అందరూ మొట్టమొదటగా దర్శనం చేసుకొని భోజనాలు కానిద్దామనుకున్నారు. అందరూ ఉదయాన్నే బయలుదేరారు కాని అప్పటికే చాలా ఆలశ్యమయిపోయింది.
కొండ ఎలా ఎక్కాలి అని ముందుగా ఒక అవగాహనకి వచ్చారు. దాని ప్రకారం యాత్రికులందరూ కలిసి గురువారమునాడు కొండ ఎక్కాలనే నిర్ణయానికి వచ్చారు. అందరూ మొట్టమొదటగా దర్శనం చేసుకొని భోజనాలు కానిద్దామనుకున్నారు. అందరూ ఉదయాన్నే బయలుదేరారు కాని అప్పటికే చాలా ఆలశ్యమయిపోయింది.
ఉధ్ధవేష్ కొండనెక్కుతుండగా ఆయనకి బాబా స్వరం చాలా స్పష్టంగా వినిపించింది. “నేనెప్పుడూ నీతోడుగా ఉంటాను” ఆ స్వరం విన్న తరువాత అతను చాలా సంతోషంగా
కొండ ఎక్కసాగాడు. ఒకచోట
కొండనెక్కే మెట్లు బాగా నిటారుగా ఎత్తుగా ఉన్నాయి. ఎక్కాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేలా
ఉన్నాయి. పైన నెత్తిన
ఎండ బాగా మండిపోతూ ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శరీరానికి వేడి గాలులు బలంగా తాకుతున్నాయి. అతను త్రాగడానికి తెచ్చుకున్న మంచినీళ్ళు
అప్పటికే అయిపోయాయి. కొండమీద ఉన్న ఆలయాలకి చేరుకోవాలంటే ఇంకా
200 నుంచి 300 మెట్ల వరకు ఎక్కాలి. అతను పూర్తిగా అలసిపోయిన సమయానికి
పైకి ఎక్కుతూ వెడుతున్న మిగతావారికంటే నాలుగయిదు మెట్లు వెనకబడ్డాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది. దాహం, వేడిగాలులు
రెండిటికి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. పైకి మెట్లు ఎక్కుతున్నవారందరూ క్రిందకి
వచ్చేటప్పటికి ఉధ్ధవేష్ ఎడమవైపుకు పడిపోయి ఉన్నాడు.
ఒకవేళ కుడివైపునకే పడిపోయి ఉంటే మనిషి ఆనవాలు కూడా దొరికి ఉండేది కాదు. కారణం ఆవైపు అగాధమయిన
లోయ ఉంది. అందులో పడితే
ఇక అంతే సంగతులు. వెంటనే
యాత్రికుల బృందంలో ఉన్న తారాబాయి ఇంకా మిగతావారు ఆయనను రక్షించడానికి వచ్చారు. ఉద్ధవేష్ తెలివితప్పి పడి ఉన్నాడు. వడగాలి వల్ల నోటినుంచి నురగ వస్తూ
ఉంది. తారాబాయి ఆయన ప్రక్కనే
కూర్చుని ఆయన తలను తన ఒడిలో పెట్టుకుంది.
ఆయన నోటిని శుభ్రంగా తుడిచి చిన్న గుడ్డతో విసరడం మొదలుపెట్టింది. అందరూ ఒకచోట గుమిగూడి ఏమిటి చేయడం
అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. వారికెవరికీ ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
ఇపుడు అత్యవసరంగా కావలసినది మంచినీళ్ళు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాని ఎవరివద్ద నీళ్ళు
లేవు. మెట్లు ఎక్కి పైకి
చేరుకోవడం తప్ప మరొక మార్గమేది కనిపించడంలేదు. ఇక ఒక్కటే దారి. తమలో ఎవరయినా మెట్లుదిగి కొండ దిగువకు
చేరుకుని నీళ్ళు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు.
(మరి బాబా తోడుగా ఉంటానన్నారు. బాబా ఎక్కడ? మరి ఆ తరువాత ఏమి జరిగింది? రేపు చివరి భాగంలో చదవండి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(మరి బాబా తోడుగా ఉంటానన్నారు. బాబా ఎక్కడ? మరి ఆ తరువాత ఏమి జరిగింది? రేపు చివరి భాగంలో చదవండి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment