09.06.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అన్నాసాహెబ్ అనే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గారి
గురించి మరింత సమాచారమ్ తెలుసుకుందాము.
సాయి లీల – మరాఠీ రచయిత్రి శ్రీమతి ముగ్ధా దివాద్కర్
ఆంగ్లానువాదమ్ : శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
అన్నాసాహెబ్ అనబడే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ -2వ.భాగమ్
పారమార్ధిక విషయాలలో అన్నాసాహెబ్ కు సంపూర్ణమయిన జ్ఞానం ఉంది. అన్ని విషయాలు చాలా కూలంకషంగా తెలిసున్నవారు. ఈ శరీరం యొక్క అంతిమ గమ్యం పరమాత్మ ప్రాప్తికోసమేనని
బాగా గ్రహించుకున్న వ్యక్తి. దానికణుగుణంగానే ఆయన
జీవించారు. ఒక సద్గురువు సాంగత్యంలో ఎటువంటి
ఆనందం లభిస్తుందో అది అందరికీ
ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఆయన ఎంతోమందికి సాయిబాబావారిని పరిచయం చేసారు. వారందరినీ సత్కార్యాలు నిర్వహించే దశకు చేరుకునేలా కృషి చేసారు. అటువంటివారిలో షోలాపూర్ లోని సత్యనారాయణ కంపెనీ మానేజర్ శ్రీ వి.ఎస్.జోషి గారు ఒకరు.
ఈవిధంగా జీవితం సాగుతున్న దశలో అన్నాసాహెబ్ ఉద్యోగ విరమణ
చేసిన తరువాత్ ఘోడ్ నది పట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. గంగపూర్ శ్రీక్షేత్రంలో
అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అందువల్ల సరుకులు కొనడం కోసం తరచు ఆయన షోలాపూర్ బజారుకు వెడుతూ ఉండేవారు. ఆవిధంగా ఆయనకు వాసుదేవ సదాశివ్ జోషీగారితో
పరిచయం ఏర్పడింది. సదాశివ్ జోషిగారికి 16వ.ఏటనే వైరాగ్యం కలిగింది. అన్నాసాహెబ్ కూడా సాయిభక్తిలో లీనమయిన వ్యక్తి. ఆవిధంగా వ్యాపార రీత్యా జరిగిన చిన్న లావాదేవి వల్ల ఇద్దరికీ మంచి స్నేహం
కుదిరింది.
అన్నాసాహెబ్ గారికి రావుబహద్దూర్ హరి వినాయక్ సాఠే గారితో
కూడా అటువంటి సన్నిహిత సంబంధమే ఉంది.
ఈ సంఘటన 1913వ.సంవత్సరంలో
జరిగింది.
“అన్నాసాహెబ్ గారు షిరిడీనుండి శ్రీజోషి గారికి ఈవిధంగా ఉత్తరం వ్రాసారు.
“నేను షిరిడీలో ఉన్నాను. ఇక్కడ నామసప్తాహం
జరుగుతోంది. మీరు ఇక్కడికి వచ్చి బాబావారి దర్శనం చేసుకోండి. మీకు ఖర్చులకి రూ.10/- అవుతుంది. డబ్బు గురించి
బెంగపెట్టుకోకండి. శ్రీనారాయణ్ గారు మీకు డబ్బు మీరు ఎక్కడున్నా ఇస్తారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి”
ఉత్తరం చదవగానే జోషిగారు చాలా ఆనందభరితులయ్యారు. ఆయన
తన భార్య అనుమతి తీసుకుని డబ్బు ఏర్పాటు చేసుకుని
గాడ్గిల్ గారు ఎప్పుడూ బసచేసే సాఠేవాడాకి చేరుకున్నారు. పూజాసామాగ్రినంతా తీసుకుని అన్నాసాహెబ్ తో కలిసి బాబా దర్శనానికి వెళ్లారు. బాబావారి దివ్యమంగళకరమయిన రూపాన్ని చూసి విస్మయం చెందారు. ఉద్వేగంతో ఆయన కళ్లనుండి
ఆనందభాష్పాలు కారసాగాయి.
సాయంత్రం ఆరతి జరుగుతున్న సమయంలో ఆయన బాబావారి
ముఖారవిందాన్నే చూస్తూ పారవశ్యంలో మునిగిపోయారు. ఆ
స్థితినుండి బయటకి రాలేకపోయారు. అది గమనించి
అన్నాసాహెబ్ “జోషిబువా, ఆరతి
అయిపోయింది. రండి” అన్నారు. ఆమాటలతో జోషిగారు బాహ్యస్మృతిలోకి వచ్చారు.
తనకావిధంగా అచేతన స్థితికలిగి పారవశ్యం కలగడానికి
కారణమేమిటని జోషిగారు అన్నాసాహెబ్ ని అడిగారు. “జోషిబువా! బాబా అటువంటి చమత్కారాలను ఎన్నో చేస్తుంటారు. వాటిని గమనిస్తూ ఉండటమే మనపని” అని జవాబిచ్చారు.
నామసప్తాహ కార్యక్రమంలో కొన్ని రోజులు గడిపిన తరువాత ఇంటికి
తిరిగివెళ్లడం గురించి జోషిగారు హరివినాయక సాఠేగారితో చర్చించారు. “బాబా
అనుమతి లేకుండా తిరిగి వెళ్లడం అసాధ్యం” అని చెప్పారు. అన్నాసాహెబ్ గాడ్గిల్ గారి అతిధిగా వచ్చిన
జోషిగారి తిరుగు ప్రయాణం గురించి ఒక సేవకుడు బాబాగారికి విన్నవించాడు.
“భగవంతుడు అతను ఇక్కడ ఉన్నన్ని రోజులకి సరిపడా
చట్ని – భక్రి (ఆహారం) ఇవ్వలేదా? అతని అభీష్టానికి వ్యతిరేకంగా నువ్వెందుకు బలవంత పెడతావు?” అని బాబా సమాధానమిచ్చారు.
జోషి షిరిడీనుండి తిరుగు ప్రయాణమయే రోజు గురువారమయింది. అపుడు గాడ్గిల్ ఆయనతో “జోషిబువా, ఇక్కడినుండి ప్రసాదం పట్టుకుని వెళ్ళు” అన్నారు. జోషిగారు ప్రసాదం తెచ్చుకునేందుకు బాపూసాహెబ్ జోగ్ దగ్గరకి వెళ్లారు. బాపూసాహెబ్ అందరి చేతుల్లో ఒక్కొక్క ముక్క బర్ఫీ ఉంచారు. అన్నా సాహెబ్, జోషిగారితో “బువా, ఈ ఒక్క బర్ఫీ మీ ఇంట్లో అందరికీ సరిపోదు. ఈ 8 అణాలు తీసుకుని బజారుకు వెళ్ళి ఇంకా బర్ఫీలు కొని పట్టుకునివెళ్ళు” అన్నారు.
షిరిడీలో లభించేదంతా బాబా ప్రసాదమే అనే భావంతో
జోషి బజారుకు బయలుదేరారు. దారిలో ఆయనకు తనవైపే తొందరతొందరగా నడచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో బర్ఫీలు నిండుగా ఉన్న పళ్ళెం ఉంది. “బాబా
ఈ బర్ఫీలను గాడ్గిల్ అతిధికి ఇమ్మని చెప్పారు” అని బాబా
చెప్పిన విషయం చెప్పాడా వ్యక్తి.
ఈ లోగా వేరుశనగకాయలు తెమ్మని గాడ్గిల్ ఒక వ్యక్తిని బజారుకు
పంపించారు. వాటిని జోషిగారికి ఇద్దామని ఆయన ఉద్దేశ్యం. అపుడే రావుబహదూర్ సాఠేగారు “బాబాగారికి ఒక
భక్తుడు వేరుశనగల బస్తాలు పంపించాడు. రెండు
బుట్టలనిండా వేరుశనగకాయలు గాడ్గిల్ కి ఆయన అతిధికి ఇచ్చి మిగిలినవాటిని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచమన్నారు బాబా. అందుచేత వేరుశనగలు కొనవలసిన అవసరం లేదని” చెప్పారు.
ఈ రెండు సంఘటనల ద్వారా బాబా తానున్న చోటునుండి కదలకుండా ఎటువంటి లీలలను ప్రదర్శిస్తారో, అలాగే ఆయన సర్వాంతర్యామి అని అక్కడున్న భక్తులందరికీ అర్ధమయింది.
షోలాపూర్ కి చెరుకున్న తరువాత జోషిగారు గోవింద్ ధోండో పన్సారే
గారికి కొంత డబ్బిచ్చి, బాబా దర్శనం చేరుకురమ్మని
షిరిడీకి పంపించారు. అలాగె బాబాని ఫోటోలు తీసి
ఫోటోలు తీసుకురమ్మని చెప్పారు. షిరిడీలో గాడ్గిల్
గారు, సాఠేగారు ఇద్దరు పన్సారే గారిని ఆహ్వానించి అతిధి
మర్యాదలు చేసి చక్కగా చూసుకున్నారు. ఆయన అక్కడ
నాలుగు రోజులున్నారు. బాబా అనుమతి తీసుకుని ఆయన
బాబాని రెండు ఫోటోలు తీసారు. ఒకటి బాబా రాతి మీద
కూర్చున్నది రెండవది ఆయన ఒక స్థంబాన్ని అనుకుని ఉన్నది. ఫన్సారే చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
బాబా అన్నాసాహెబ్ గారి భక్తిని ఎంతో ప్రశంసించారు. ఆయన
గాడ్గిల్ గారి అతిధులయిన జోషి, పన్సారే ఇద్దరిమీద తన
ప్రేమాభిమానాలను కురిపించారు. బాబా వారిని తనను
ఫోటోలు కూడా తీసుకునేందుకు అనుమతినిచ్చి, వారు ఆత్మోన్నతికి చేరుకునే విధంగా మార్గాన్ని చూపారు.
(అయిపోయింది)
(రేపటి సంచికలో బాలాజీ పాటిల్ నెవాస్కర్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment