30.11.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 4వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
12 P.M. షిరిడీకి కొద్ది మైళ్ళ దురంలో ఉన్న సాకోరికి గం.11.15 ని. లకు చేరుకొన్నాము. సాకోరి ఎంతో ప్రశాంతంగాను, పరిశుభ్రంగాను ఉంది. షిరిడితో పోల్చుకుంటే ఆశ్చర్యకరమయిన విషయం ఒకటి గమనించవచ్చు. షిరిడీ వచ్చేపోయే భక్తులతోను, ప్రజలందరి కోలాహలంతోను నిండి ఉండే పుణ్యక్షేత్రం. సమాధి మందిరంలోకి భక్తులందరూ బారులుతీరు వరుస క్రమంలో వెడుతూ ఉండే ప్రదేశమయితే, ఇక్కడ సాకోరిలో మాత్రం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ కొద్దిమంది భక్తులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు.
సాకొరిలో ప్రధానమయిన భవనం, చిన్న చిన్న మందిరాలను (దత్తాత్రేయ
దేవాలయాలవంటివి) చాలా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉపాసనీ మహరాజ్ చాలా కాలం
తననుతాను బంధించుకున్న పంజరం నామనసులో బలమైన ముద్ర వేసింది.
ఇక్కడె ఉంటున్న గోరవకె అనే వృధ్ధుడితో నేను ముఖాముఖీ సంభాషించాను. ఇక్కడ జరిగే క్రతువులు, యజ్ఞాల గురించి వాటి ప్రాముఖ్యతను వివరించాడు. ఇక్కడ కన్యలు ఇపుడు యధావిధిగా యజ్ఞాలు నిర్వహించబోతున్నట్లు చెప్పాడు. సతీ గోదావరి మాతను దర్శించుకున్నాను. ఆమె చాలా నిష్టగా ఉంది. ఆమెతో అంత సులభంగా మాట్లాడేలా కనిపించలేదు, ఆమెను చూడగానే కాస్తంత భయం వేసింది .
(గోదావరి మాతాజి)
బహుశ మధ్యాహ్నం ఆమెతో
మాట్లాడే అవకాశం కలగవచ్చు. ఈ మధ్యాహ్నం ఇక్కడె సంస్థానంలోనే ఉంటున్న ఒక వ్యక్తిని కలుసుకోవాలి. అతను ఉపాసనీ మహరాజ్ మీద పరిశోధనవ్యాసం
రాశాడని నాకు తెలిసింది.
6 P.M. శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం కార్యదర్శి, నిర్వాహకుడు
అయిన శ్రీ ఎస్.ఎన్.టిప్నిస్ తో చాలాసేపు సంభాషించాను. కాని ఆయన చెప్పే విషయాలను నేను టేపురికార్ఢులో
రికార్డు చేయలేకపోయాను. గత 40 సంవత్సరాలుగా ఆయన సాకోరి ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఉన్నత విద్యావంతుడు. ఆయన దక్కన్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ & రీసెర్చ్ సెంటర్ లో
ఎమ్.ఎ.పిహెచ్ డి. చేసారు. శ్రీ
సాయిబాబావారి జీవితం గురించి ఆయన బోధనల గురించి బాబా నమ్మదగ్గ
ఆధారాల ద్వారా సేకరించి ఎక్కడా విమర్శలకు తావులేకుండా హేతుబధ్ధంగా అధ్యయనం
చేయవలసిన అవసరం ఉందని పట్టుబట్టి మరీ మరీ చెప్పారు. భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను. సాయిబాబా వారి తత్త్వం, ఆయన బోధనలు ప్రచారం గురించి, సాయిబాబా సంస్థానం వారినుండి
పూర్తివివరాలను తెలుసుకోమని నాకు మంచి సలహా ఇచ్చారు.
ఉపాసనీ మహరాజ్ సాయిబాబాకు సన్నిహిత శిష్యుడిగా
ఏవిధంగా ఉన్నదీ మనసుకు బాగా హత్తుకునేటట్లుగా వివరించారు. సాయిబాబా వారి శక్తి ప్రవాహం ఆయన
మీద ప్రసరించబడింది.
ఆశక్తిని ఆయన తరువాత గోదావరి మాతాజీకి ప్రసరింపచేశారు.
ఒకరినుంచి మరొకరికి ఈ శక్తి ప్రసారం జరిగింది. అదే గురుపరంపర అని వివరించారు.
ఉపాసనీ మహరాజ్ గారి గురించి, సతీ గోదావరి మాతాజీ గురించి చాలా శ్రధ్ధగా, సావధానంగా
అధ్యయనం చేయాలని హెచ్చరిస్తూ చెప్పారు.
ఆమె భగవంతునితో సమానమయిన ఒక యోగిని అనీ, ఉపాసనీ మహరాజ్ తన వారసురాలిగా ఆమెను నియమించినట్లుగా స్పష్టమైన ప్రకటన చేసారని
చెప్పారు. సతీ గోదావరి
మాతాజీలో ఉన్న శక్తి గురించి కధనాలను శ్రీ టిప్నిస్ గారు వివరించారు. ఒక జర్మనీ దేశస్థుడయిన పీటర్
గారి గురించి, మరొకతను భగవాన్ శ్రీ సత్య సాయిబాబావారి భక్తుడని అతని గురించిన విషయాలను చెప్పారు. భగవాన్ సత్యసాయిబాబా వారే ఆ భక్తుడిని
సతీ గోదావరి మాత పాదాల చెంత శాంతి లభిస్తుందని పంపించారన్న ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు.
అంతే కాదు, స్వామి ముక్తానందగారు కూడా సాకోరిలో మోక్షాన్ని పొందడానికి 6 నెలలముందు సాకోరిలోని దత్తాత్రేయుని దేవాలయం వద్ద నివసించినట్లుగా చెప్పారు. భగవత్ సంకల్పం వల్ల ఆయన ఈ ప్రదేశానికి
ఆకర్షితులయ్యారు.
సతీ గోదావరి మాతాజీని ఎక్కువ సమయం దర్శించుకొన్నాను. గంటన్నరకు పైగా జరిగిన దర్శనం అధ్బుతమయిన
అనుభూతినిచ్చింది. బహిరంగంగా
భక్తుల సమక్షంలో సతీ గోదావరి మాతాజీ ఎన్నో మంత్రాలను స్వయంగా పఠిస్తూ విష్ణువుకి
– కృష్ణునికి పూజలు చేసారు.
అది ఎంతో అరుదయిన దృశ్యం.
ఆవిడను కలుసుకుని మాట్లాడె అవకాశం కలగలేదు. ఆమె యజ్ఞం ఏర్పాట్లలో
తీరిక లేకుండా ఉన్నారు. మరొక రోజు ఎప్పుడయినా తప్పకుండా ఇక్కడికి మళ్ళీ వస్తాను. ఈ ప్రదేశం ఏకాంతంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మికతతో నిండి ఉంది. ఉపాసనీ మహరాజ్ గారి గురించిన మరికొన్ని
పుస్తకాలు ఇక్కడ నాకు లభిస్తాయి. సతీ గోదావరి మాతాజీని కలుసుకునే అవకాశం లభించవచ్చు.
బాలదేవ్ గ్రిమే నాకు స్వామి రామ్ బాబా
గురించి అధ్బుతమయిన విశేషాలు చెప్పాడు. నేనాయనను
తప్పకుండా కలుసుకోవాలి.
బొంబాయిలో ఆయన ఉండే రెండు వేరు వేరు చిరునామాలు
ఇచ్చాడు. (చిరునామాలు
అప్రస్తుతమనిపించి ఇక్కడ ఇవ్వలేదు…,.
త్యాగరాజు) ఆయన ఆ చిరునామాలలో ఉన్నారో లేదో
కనుక్కోవాలి. స్వామి
రామ్ బాబా గారు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినపుడు సాయిబాబా ఆయనకు
ఒకసారి దర్శనమిచ్చారని గ్రిమే చెప్పాడు.
వైద్యులు ఆయన మీద ఆశవదిలేసుకున్న తరుణంలో
ఆయన వెంటనే కోలుకున్నారని చెప్పాడు.
సాయిబాబా తమ దివ్యహస్త స్పర్శకు ధన్యవాదములు.
(10 P.M. డైరీలో వ్రాసుకున్న విషయాలు చాలా టూకీగా….సంస్థాన్ సభ్యులలో ఒకరైన అప్పాసాహెబ్ బొరావకే గారిని కలుసుకున్నారు. ఆయనను చాలామంది ఒక సాధువుగా పరిగణిస్తారు. ఆయన చాలా పొడవుగా సన్నగా ఉన్నారు. ఆయనలో ఆధ్యాత్మిక భావాలు చాలా ప్రగాడంగా
ఉన్నాయి. ఆ తరువాత ఆంటోనియో
గారు ఒక గురువారము నాడు పల్లకీ ఉత్సవానికి స్వామి శేఖరరావుతో కలిసి వెళ్లారు. పల్లకీ ఉత్సవం గురించి వివరించారు. పల్లకీ ఉత్సవం తరువాత సమాధి మందిరంలో పాడిన పాటలు అన్నీ ఆయనకు ఎంతగానో నచ్చాయి. ఆ పాటల కాసెట్లను కొనుక్కోవాలని నిర్ణయించుకొన్నారు.)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో ఉద్ధవరావుతో సంభాషణ (ఇంటర్వ్యూ) )
0 comments:
Post a Comment