28.11.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 3 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
బుధవారము, అక్టోబరు, 16, 1985 (తరువాయి భాగమ్)
నిన్న చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినా గాని దానిని తేలికగా తీసుకొని
కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. మంచి భోజనం
చేసాను. ఇక్కడ త్రాగే నీటితో చాలా జాగ్రత్తగా
ఉండాలి. బిస్లెరి నీళ్ళ సీసా కొనుక్కుని త్రాగడం
గాని లేక కొబ్బరి నీళ్ళు గాని త్రాగడం చాలా మంచిది, ఆరోగ్యకరం కూడా. వచ్చే పోయే భక్తులు గుంపులు గుంపులుగా తిరుగుతూ
ఉండటం వల్ల రాత్రివేళలో కూడా చాలా రణగొణధ్వనిగా ఉంటోంది. భారతదేశం అన్ని ప్రాంతాలనుండి భక్తులు నిరంతరం వస్తూనే
ఉన్నారు. వారందరూ బాబాకు, ఆయన సమాధికి సమర్పించడానికి
పూలు, పూలదండలు, ప్రసాదాలు మొదలయినవవి ఎన్నో తీసుకువస్తున్నారు.
5.30 P.M. స్వామి శేఖరరావుని కలుసుకుని ఒక పటిష్టమయిన కార్యాచరణను తయారు చేసాను. మొట్టమొదటగా సాయిబాబా జీవించి ఉండగా ఆయనను చూసినవారు ఆయన గురించి బాగా తెలుసున్న నలుగురు గ్రామస్థులను కలుసుకుని ప్రత్యక్షంగా మాట్లాడాలి. కనీసం రోజుకి ఒక్కరి ఇంటికయినా వెళ్ళి వారి ఇండ్లలోనే కలుసుకొని స్వయంగా మాట్లాడాలి. మొట్టమొదట శ్యామా దేశ్ పాండే గారి కుమారునితో ప్రారంభించి ఆతరువాత మహల్సాపతిగారి కుమారుని ఇంటికి వెళ్లాలి. అయిదవ రోజున సాకోరీకి వెళ్ళాలి. ఆతరువాత రోజులు సాయిబాబాను చూసిన ఆనాటి భక్తులు ఇంకా ఎవరయినా ఇప్పటికీ జీవించి ఉన్నట్లయితే వారిని కూడా కలుసుకొని మాట్లాడాలి. ఒకవేళ సాయిబాబాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకోనివారయినా సరే వారితో కూడా మాట్లాడి వివరాలు సేకరించాలి. ఉదయంపూట అందరినీ కలుసుకుని మాట్లాడటం, మధ్యాహ్న సమయంలో గ్రంధాలయానికి వెళ్ళి నా పరిశోధనకు సంబంధించి అన్నీ రాసుకోవడం, తయారుచేసుకోవడం చేయాలి. భద్రతా కారణాల దృష్ట్యా నాగదికి ఎప్పుడూ తాళం వేసుకుంటూ ఉండమని స్వామి శేఖరరావు చెప్పాడు. ఇపుడు దసరా ఉత్సవాల రోజులు కాబట్టి యాత్రికులతో బాగా రద్దీగా ఉంటుంది, దొంగలు ఉండే అవకాశం కూడా ఉందని హెచ్చరించాడు. ఇపుడు సంస్థానంవారు ఆదివారం వరకు నేను ఈ గదిలో ఉండవచ్చని చెప్పారు. సరే చూద్దాము…
షిరిడీ – గురువారము – అక్టోబరు 17, 1985
10.15 A.M. వాతావరణం చాలా బాగుంది. ఈ రోజు ఉదయం ప్రముఖుడయిన మాధవరావు
దేశ్ పాండె గారి కుమారుడు ఉద్దవ్ ను కలుసుకొని ముఖాముఖీ సంభాషించే అవకాశం లభించింది. శ్రీ సాయిబాబా సమాధి చెందేనాటికి ఆయన వయస్సు 12 సంవత్సరాలు. ఆయనను కలుసుకుని మాట్లాడటం,
మా సమావేశం చాలా అద్భుతంగా జరిగాయి. ఆయనకు నేను ఏమేమి ప్రశ్నలు అడగాలో
ముందుగానే మనసులో నిర్ణయించుకొన్నాను. కాని వెంటనే అంతులేని ప్రశ్నలతో ఆయనను
ముంచెత్తడం కన్నా ముందు ఆయన చెప్పే విషయాలన్నీ శ్రధ్ధగా వినడం మంచిదని అదే ముఖ్యమని
తోచింది. ఆయనను ప్రశ్నించే
ఆలోచన విరమించుకొన్నాను. ఆయన, ఆయన భార్య ఇద్దరూ ఎంతో మర్యాదస్తులు. మాకు చక్కని అథిదిసత్కారాలు చేసారు. మాకు మంచి టీ ఇచ్చారు. టీ తాగుతూ విశ్రాంతిగా కూర్చుని మేమిద్దరం సంభాషించుకొన్నాము.
మేము మాట్లాడుకుంటూండగా
వారింటికి ఎప్పుడు వస్తూండే శ్రీ బాల దేవ్ వై. గ్రిమె గారు తన భార్య అరుణతో కలిసి వచ్చారు. గ్రిమె గారు కోపర్ గావ్ వాస్తవ్యుడు. వారు ఉద్దవ్ గారిని
మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. వారితోపాటుగా వారి కుమారుడు
8 ఏండ్ల వయసుగల పవన్ కూడా వచ్చాడు. గ్రిమె ముప్పది
సంవత్సరాల యువకుడు. మంచి
పరిజ్ఞానం ఉన్నవాడిలా కనిపించాడు. అతను, అతని
భార్య ఆంగ్లం ధారాళంగా మాట్లాడగలరు.
అందువల్ల వారిద్దరూ నాకు దుబాసీలుగా ఉద్దవ్
గారు చెప్పే మాటలని ఆంగల్లోకి అనువదించి చెప్పడానికి సంతోషంతో
అంగీకరించారు. బొంబాయిలో
స్వామి రామ్ బాబా అనే గురువు యొక్క చిరునామా నాకు గ్రిమె ఇచ్చాడు. రామ్ బాబా గారికి 130 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఆయన ఇప్పటికీ వార్ధక్యపు జాడలు లేకుండా చక్కటి రూపంతో ఉన్నట్లుగా కనిపిస్తారని,
ఆయన ఆంగ్లం చాలా బాగా మాట్లాడతారని చెప్పాడు. పూర్వపు రోజులలో ఆయన సాయిబాబాను కూడా కలుసుకున్నట్లుగా చెప్పాడు. గ్రిమే చెప్పినదాని ప్రకారం స్వామి
రామ్ బాబా గారు సాయిబాబా గురించి సాధ్యమయినంత వరకు స్వయంగా ఆయనకే తెలిసిన వివరాలన్నిటినీ నాకు
చెప్పగలరు. కారణం ఆయన స్వయంగా బాబాను చూసినవారు. భారతదేశం
మొత్తంమీద ఆయన ఒక్కరే సాయిబాబా గురించి చాలా విపులంగా అన్ని వివరాలను చెప్పగలిగిన వ్యక్తి.
బాలదేవ్ గ్రిమె, అతని భార్య ఇద్దరూ తమతోపాటు నన్ను, స్వామి శేఖరరావుని
సతీ గోదావరి మాత ఆశ్రమం చూడటానికి సాకోరీకి రమ్మని ఆహ్వానించారు. అక్కడ కొన్ని ప్రత్యేకమయిన యజ్ఞాలను
నిర్వహిస్తున్నారని చెప్పారు. నేను ఎంతో సంతోషంగా వారితో వెళ్ళడానికి ఒప్పుకొన్నాను. ఆ యువ దంపతులకి నామీద, నేను చేసే పరిశోధన మీద ఎంతో గౌరవభావం ఉందని నా అభిప్రాయం. నేను చేసే పరిశోధనకి వారిద్దరూ నాకు
సహాయపడగలరని నాకనిపించింది. ఇంకొక ముఖ్యమయిన విషయం ఏమిటంటే భారతదేశంలో
అందరూ ప్రశ్నించేటట్లుగానే గ్రిమే నన్నడిగిన మొదటి ప్రశ్న, “మీకు
వివాహమయిందా?” అని.
నాకు వివాహం కాలేదని చెప్పగానే అతను కాస్త నిరాశ పడినట్లుగా కనిపించాడు. ఇటువంటి విలక్షణమయిన ప్రశ్న నాకు ఎప్పుడూ ఇబ్బందికరంగా ఉంటుంది. నాకింకా వివాహం ఎందుకని కాలేదో చెప్పుకోవలసి
వస్తోంది. అప్పుడతను
నన్ను త్వరలోనే వివాహం చేసుకోమని, భార్యా పిల్లలతో మరలా భారత
దేశానికి రమ్మని పట్టుపట్టాడు.
షిరిడీలో శబ్దకాలుష్యం ఎక్కువగా ఉందని
అది తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఆ శబ్దాలు
ఆధ్యాత్మిక వాతావరణాన్ని పాడుచేస్తున్నాయని అన్నాడు. ముఖ్యంగా
మసీదులోను, చావడిలోను
సాయిబాబా వారి చిత్రపటం వద్ద మౌనంగా కూర్చుని ధ్యానం చేసుకోవడానికే తాను వస్తానని చెప్పాడు. ఈ ప్రదేశాలలో
ఆధ్యాత్మిక తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయని చెప్పాడు. సమాధి మందిరంలోకన్నా మసీదులో ఆధ్యాత్మిక వాతావరణం చాలా బలంగా ఉందన్న విషయం నేను కూడా గమనించాను. మసీదు వద్ద
చావడి వద్ద ఎవరికయినా సరే అనుభూతి కలుగుతుంది. నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి.
ఉధ్ధవ్ గారు చాలా అధ్బుతమయిన వ్యక్తి. ఉద్దవ్ తన తండ్రి ఆఖరి కోరిక ప్రకారం
ఆయన మాట శిరసావహించి సంస్థానానికి నలుబది ఏండ్లపాటు ఉచితంగా సేవ
చేసారు. ఆయన ఇంటిలో సాయిబాబా
శ్యామాకు ఇచ్చిన అత్యంత విలువయిన వస్తువులు ఉన్నాయి. వాటిలో గణపతి విగ్రహం ఉంది. ఆవిగ్రహానికి ప్రతిరోజు మంత్రాలు
చదివి అగరువత్తులు వెలిగించి పూజిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన విషయాలలో ఒకటి
నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మా సంభాషణలలో సాయిబాబా సాక్షాత్తు
భగవానుడె (మానవ శరీరంతో
ఉన్న భగవంతుడు) అని ఉద్ధవ్ గారు అన్నారు. నిరంతరం అన్ని వేళలా బాబా ఉనికిని
తాను అనుభవిస్తూనే ఉంటానని అన్నారు.
(దాదాపు 25 సంవత్సరాల క్రితం
మేము మొదటి సారి షిరిడీ వెళ్ళినపుడు ఉద్దవ్ గారి ఇంటికి వెళ్ళి ఆయనను కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో వారి ఇంటిలో బాబా శ్యామాకు
ఇచ్చిన గణపతి విగ్రహాన్ని చూపించారు. ఆయనతో ఫోటో కూడా తీయించుకొన్నాము…. త్యాగరాజు)
(34 సంవత్సరాల తరువాత ఆగస్టు 2019 వ.సంవత్సరంలో బలదేవ్ గ్రిమే గారితో మాట్లాడె అవకాశం దొరిగింది. ఎ.ఆర్.
జున్నకర్ గారి ద్వారా నా ప్రియమిత్రుడు రాబిన్ అగర్వాల్, గ్రినే ఎక్కడ ఉన్నారో ఆయన గురించిన
వివారాలు సేకరించి నాకు చెప్పాడు. అతనికి నా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. మేమిద్దరం ఫోనులో
మాట్లాడుకొన్నాము. అతనితోను,
అతని కుమారుడు పవన్ తోను నేను ఈ మైల్ ద్వారా, వాట్స్
ఆప్ ద్వారా ఒకరికొకరం సంప్రదించుకుంటునే ఉన్నాము. బాలదేవ్ గ్రినే భార్య అరుణ మరణించిందని తెలిసి బాధపడ్డాను. ఆమె సాయిబాబాకు మంచి భక్తురాలు.
ఆమె షిరిడిలో ఉన్నపుడు శ్రీసాయి సత్ చరిత్రను 53 సార్లు పారాయణ చేసింది. బాలదేవ్ గ్రిమే ప్రస్తుతం పూనాలొ
ఉంటున్నారు. ఆయన వయస్సు
72 సంవత్సరాలు,)
(రేపు సాకోరి విశేషాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment