27.11.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 2 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411 & 8143626744
మైల్. ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – మంగళవారము – అక్టోబరు 15, 1985
నా డైరీలో వ్రాసుకొన్న అంశములు
11.45 P.M. నాకు అతిధి సత్కారాలను ఎంతో అధ్భుతంగా ఏర్పాటు చేసిన శ్రీ హెచ్.జె అగర్వాల్ గారి వద్ద ఈ రోజు ఉదయాన్నే శలవు తీసుకొన్నాను. ఉదయం గం.7.20 ప్రాతంలో ఖామ్ గావ్ కి బయలుదేరాను. నాతోపాటుగా హను గారు, అగర్వాల్ గారి కారు డ్రైవరు వచ్చారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. దారిలో మేము చాలా చోట్ల ఆగుతూ ప్రయాణించాము. దారిలో అధ్బుతమయిన అజంతా, ఎల్లోరా గుహలను చూడటానికి కొంత సమయం కేటాయించాము. సాయత్రం అయ్యేటప్పటికి ఊరి చివరికి చేరుకొన్నాము.
అప్పటికి
బాబా చీకటి పడింది. అక్కడ
ఒక రైతు ఇంటిదగ్గర కాసేపు విశ్రాంతి కోసం ఆగాము. రైతు, అతని
భార్య మమ్మల్ని ఎంతో ఆదరించి తినడానికి కాస్త పలహారం పెట్టారు. వారిద్దరూ ఎంతో మర్యాదస్తులు. మమ్మల్ని చాలా గౌరవంతో చూసారు. నా పరిశోధనకి సంబంధించి వారితో సాయిబాబా
గురించి కొద్దిగా మాట్లాడాను.
(ఖామ్ గావ్ పంచల్ గావ్ కర్ మహరాజ్ గారి ఆశ్రమం వద్ద శ్రీ ఆంటోనియో గారు, శ్రీ అగర్వాల్ గారు)
(షిరిడీకి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్కన అగర్వాల్ గారి కారు డ్రైవరు, కుడివైపు శ్రీ హను)
(శ్రీ అగర్వాల్ గారితో పరిచయం ఆయనకు 1980 సం.ప్రాంతంలో జరిగింది. ఆ వివరాలు అప్రస్తుతమనిపించి ప్రచురించడం లేదు. సాయిభక్తులు ఆ వివరాలను కూడా తెలుసుకోదలిస్తే ప్రచురిస్తాను.... త్యాగరాజు)
వారివద్ద శలవు తీసుకొన్న తరువాత గతుకుల
రోడ్డుమీద ఎంతో కష్టంగా ప్రయాణించాము. అది
చాలా సాహసమయిన ప్రయాణమనే చెప్పాలి.
ఆఖరికి షిరిడి చేరుకునేటప్పటికి రాత్రి 11 గంటలయింది. ఖామ్
గావ్ నుండి కారులో షిరిడికి 7 గంటల సమయం పడుతుందని అగర్వాల్ గారు
చెప్పారు. కాని మాకు
మొత్తం 16 గంటలు పట్టింది. అప్పటికి నేను చాలా అలసిపోయాను. సాయిబాబావారి సమాధి ఉన్న మందిరం ప్రక్కనే
యాత్రికులు బసచేయడానికి గదులు ఉన్నాయి.
షిరిడీ సంస్థాన్ ఆర్గనైజేషన్ లో పనిచేసే గుమాస్తా నాకు ఒక చిన్న
గదిని ఏర్పాటు చేసాడు. సాయిబాబా మహాసమాధి చెందిన రోజునాడే (అక్టోబరు,
15, 1918) షిరిడీకి రావడం నాకెంతో సంతోషమనిపించింది. అర్ధరాత్రి అయేటప్పటికి నేను నిద్రకుపక్రమించాను.
(FOOT NOTE … ఇతర విషయాలతోపాటుగా నేను ఖామ్ గావ్
లో ఉన్నప్పుడు పాంధే గురూజీ గారి ఆశ్రమాన్ని, ఆయన నడుపుతున్న పాఠశాలను
దర్శించాను. ఆయనకు
88 సంవత్సరాల వయస్సు.
ఆయన ఉపాధ్యాయుడు , మంచి శిల్పి కూడాను. ఆయన గాంధీగారి సిధ్ధాంతాలను పూర్తిగా
ఆచరిస్తున్న వ్యక్తి. గాంధి గారు ఉపదేశించిన సత్యమేవజయతే, అహింసా సిధ్దాంతాలను
ఆచరించడమే కాకా ఖాదీ వస్త్రాలను కూడా ధరిస్తున్నారు. సత్యాగ్రహ ఉద్యమ ప్రచారంలో భాగంగా
గాంధిగారు రెండు సార్లు ఖామ్ గావ్ గ్రామంగుండా వెళ్లినపుడు పాంధే గురుజీ గారికి ఆయన
గురించి బాగా తెలిసింది. పంచల్ గావోకర్ మహరాజ్ గారు నిర్వహిస్తున్న దత్తాత్రేయ ఆశ్రమాన్ని కూడా సందర్శించాను. ఆయన తన మంత్ర శక్తితో సర్పాలను కట్టడి
చేయడంలో నేర్పరి. (వాటి
విషాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు) ఆయన తన పది సంవత్సరాల వయసులో సాయిబాబాను
కలుసుకొన్నారు. ఆయన పుట్టపర్తిలో
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారిని కూడా రెండు మూడు సార్లు కలుసుకొని వారితో వ్యక్తిగతంగా
మాట్లాడారు. పాంచలేగావ్
కర్ గారికి దాదాపు 88 సంవత్సరాల వయసు ఉంటుంది. నేను ఆశ్రమానికి వెళ్ళినపుడు ఆయన నాగపుర్ లో ఉన్నందువల్ల
నాకు ఆయనను కలుసుకునే భాగ్యం, ఆయనతో స్వయంగా మాట్లాడే అవకాశం
కలగలేదు. ఆశ్రమంలోని
వారు నామెడలో కోబ్రా సర్పాలను దండగా వేశారు. గురువుగారి ఆశ్రమంలోఉన్నవారు నేను
చేస్తున్న పరిశోధనకి అది శుభసూచకని పట్టుపట్టి వేసారు. ఖామ్ గావ్ చుట్టుప్రక్కల చాలా సర్పాలున్నాయి. నేను వచ్చిన రోజునే నా బంగళావద్ద
ఒక కోబ్రా కనిపించింది. నా క్షేమం కోసం నాగదిలో రాత్రివేళ ఒక ముంగిసను ఉంచారు.
అక్కడ నేను ఉన్న రోజులలోనే గజానన్ మహరాజ్
గారి (ఆయన 1910 వ.సం.
లో సమాధి చెందారు) ఆశ్రమాన్ని కూడా దర్శించాను. ఆశ్రమం ఎంతో పరిశుభ్రంగా ఉంది. అది ఖామ్ గావ్ కి 15 కి.మీ. దూరంలో షేన్ గావ్ లో ఉంది. ఆశ్రమంలోని పరిశుభ్రత, ఆరంజి రంగుతో వెలిగిపోతున్న ఆశ్రమం గోడలు, అక్కడ ఉన్న
భక్తులందరిలో కనిపించే ప్రగాఢమయిన భక్తి ఇవన్నీ నా మనసులో బలీయమయిన ముద్ర వేసాయి. గజానన్ మహరాజ్ గారు శైవ సన్యాసి.
షేన్ గావ్ లోను మొత్తం విదర్భ ప్రాతం అంతా ఆయన బాగా ప్రసిధ్ధి చెందారు. అధ్బుతాలను చేసే మహాత్మునిగా ఆయనను
ఎంతో గౌరవించేవారు. గజానన్ మహరాజ్ గారికి, సాయిబాబాకు మధ్య సంబంధం ఉందనిపిస్తుంది. షేన్ గావ్ లో గజానన్ మహరాజ్ గారు
సమాధి చెందారన్న విషయం తెలియగానే సాయిబాబా “నా గజానన్ వెళ్లిపోయాడు”
అన్నారు.
(గజానన్ మహరాజ్ గారి ఆశ్రమం షేన్ గావ్)
షిరిడీ - బుధవారము, అక్టోబరు 16, 1985
12.50 P.M. నేను బస చేయడానికి సంస్థానంవారికి చెందిన 182 నంబరు గదిని ఇచ్చారు. ఆగది చాలా సాదా సీదాగా ఉంది. గదిలో ఒక్క ఇనపమంచం మాత్రమే ఉంది. కాని గదికి తాళం వేసుకోవటానికి వీలుగా ఈ ఒక్కగది దొరకడం నా అదృష్టం. గ్రామంలో ఎక్కడినుంచయినా ఒక పరుపు తెచ్చుకోవాలి. శుక్రవారమునాడు ఎలాగయినా సరే నేను గదిని ఖాళీ చేయాలని చెప్పారు. నేను మరొక గది కోసం వెతుక్కోవాలి. నేను గ్రంధాలయానికి దగ్గరగానే ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. గ్రంధాలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి చాలా మంచివాడు. నాకు ఉపయోగపడే పుస్తకాలను వెదకుకొని చదువుకోవడానికి, ముఖ్యమయిన విషయాలను రాసుకోవడానికి చక్కటి ప్రదేశం. సంస్థానానికి, శ్రీహను గారికి నాధన్యవాదములు తెలుపుకొంటున్నాను. నాకు మంచి నమ్మకమయిన, సమర్ధుడయిన గైడ్ షిరిడీ గ్రామస్తుడే దొరికాడు.
(స్వామి శేఖర రావుతో ఆంటోనియో, మరియు షిరిడీ గ్రామ బాలుడు)
అతని పేరు శేఖర్ రావు. అందరూ అతనిని ‘స్వామి’ అని
పిలుస్తారు. ‘స్వామి
శేఖర్ రావు’. అతనికి
ఎటువంటి బాదరబందీలు లేవు. ఒక సన్యాసి జీవితం గడుపుతున్నాడు.
అతను షిరిడిలో గత ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాడు. గ్రామంలో అందరూ అతనికి పరిచయస్థులే. అతను ఆంగ్లంలో కాస్త బాగానే మాట్లాడగలడు. అందువల్ల నేను అక్కడ ఉన్నన్నిరోజులు
నాకు గైడ్ గాను, దుబాసీగాను, చక్కగా ఉపయోగపడతాడు. మేము నా గదివద్ద సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటాము.
సాయిబాబాను గురించి బాగా తెసుసున్న వృధ్ధులు
నలుగురు ఇంకా జీవించే ఉన్నారని తెలిసింది. శ్యామా
దేశ్ పాండే కుమారుడు, మహల్సాపతి కుమారుడు ఇంకా మరిద్దరు. మేము వారిని కలుసుకొని ఆతరువాత ప్రక్క గ్రామం సాకోరీకి కూడా
వెడతాము. ఈరోజు ఉదయం
హను, మరియు కారు డ్రైవరు ఇద్దరూ వెళ్లిపోయారు. ఇక నేనొక్కడినే ఉన్నాను. వాతావరణం బాగానే ఉంది. ఎక్కువ వేడిమి లేదు. నేను మసీదు చూడటానికి సమాధిమందిరం,
గురుస్థానం వద్ద ఉన్న వేపచెట్టు ఇంకా మరికొన్ని ముఖ్యమయిన ప్రదేశాలను
చూడటానికి వెళ్లాను. దసరా పండుగ సందర్భంగా ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తున్నారు. ఇంకా చాలామంది వస్తారని అంటున్నారు. షిరిడిని దర్శించటానికి వస్తున్నవారందరూ
భారతీయులే. అంతమందిలో
నేనొక్కడినే విదేశీయుడిలా కనిపిస్తున్నాను. షిరిడిలో ప్రతీదీ చాలా జాగ్రత్తగా
సంరక్షిస్తూ ఉన్నారు.
(రేపటి సంచికలో మాధవరావు దేశ్ పాండె కుమారుడు ఉధ్ధవ్ ని కలుసుకున్న విశేషాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment