21.06.2021 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 6 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
మనస్సును, ఇంద్రిమయులను స్వాధీనమంధుంచుకొనుట…
శరీరము రధము, ఆత్మ దాని యజమాని, బుధ్ధి ఆ రధమును నడుపు సారధి మనస్సు,
కళ్ళెము. ఇంద్రియములు గుఱ్ఱములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో,
ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు
గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరలేడు. జనన మరణ చక్రములో పడిపోవును.
ఎవరికి గ్రహించు శక్తికలదో,
ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో
(బండినడుపువాని గుఱ్ఱమువలె) ఎవడు బుధ్ధిని మార్గదర్శిగా
గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు. విష్ణుపదమును చేరగలడు. అతనికి మరుజన్మ ఉండదు.
మనస్సును పావనము చేయుట…
మానవుడు తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించనట్లయితే అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనం కానిదే ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. పావనమయిన మనస్సులోనే వివేకము (అనగా సత్యమయినదానిని అసత్సమయినదానిని
కనుగొనుట) వైరాగ్యము (అసత్యమయినదానియందభిమానము
లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే,
మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే, ఆత్మ సాక్షాత్కారమునకవకాశము
లేదు. ‘దేహమే నేను’ అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందభిమానము ఉండుటయే బంధమునకు
కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను.
గురువుయొక్క ఆవశ్యకత…
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమయినది. ఎవ్వరైనా
స్వశక్తిచే దానిని పొందుటకాశించలేరు.
కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి (గురువు) సహాయము మిక్కిలి అవసరము. గొప్పకృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేనిదానిని
అతి సులభముగా గురువునుండి పొందవచ్చును.
వారు ఆ మార్గమునందు నడచియున్నవారు కావున
శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు
మీదనుంచి ఇంకొక మెట్టునకు తీసుకునిపోగలరు.
భగవంతుని కటాక్షము…
ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమయినది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును, వైరాగ్యమును
కలుగజేసి సులభముగా భవసాగరమునుండి తరింపజేయగలడు. వేదములనభ్యసించుటవల్ల గాని,
మేధాశక్తి వల్ల గాని, పుస్తకజ్ఞానము వల్లగాని, ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని
పొందగలరు. అట్టివారికే
ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది.
(శ్రీ సాయి సత్ చరిత్ర 16, 17 అద్యాయములలో ఇవే విషయాలు ప్రస్తావింపబడి
ఉన్నాయి…. త్యాగరాజు)
ఓ! బాబా! ఇక గురునానక్ కు అంతిమ సమయం దగ్గరలోనే ఉందని తెలుసుకున్న
హిందువులు ఆయన శరీరానికి దహనక్రియలు చేయడానికి నిర్ణయించుకున్నారు. కాని
ముస్లిమ్ భక్తులు ఆయన శరీరాన్ని సమాధి చేయాలని పట్టుపట్టారు. అపుడు గురునానక్…
“మీరు నా ఇరుప్రక్కలా పుష్పాలను ఉంచండి. హిందువులందరూ కుడివైపున, ముస్లిమ్స్ ఎడమవయిపున ఉంచండి.
రేపటికి ఎవరి పుష్పాలయితే తాజాగా ఉంటాయో దాని ప్రకారం నిర్ణయించుకోండి”
అన్నారు.
అపుడు ఆయన వారినందరినీ భగవంతుని ప్రార్ధించమని
చెప్పి, ఒక దుప్పటి కప్పుకుని పడుకున్నారు. సెప్టెంబరు, 22, 1539 వ.సం తెల్లవారుజామున గురునానక్ పరమాత్మలో ఐక్యమయ్యారు. ఆయన తన కీర్తనలలో
“నానక్ లీన్ భాయో గోవింద స్యోన్ జ్యోన్ పానీ శాంగ్
పానీ’
“నీటిలో నీరు కలిసిపోయినట్లే నానక్ కూడా అదేవిధంగా
భగవంతునిలో కలిసిపోయారు”
ఆయన శిష్యులు దుప్పటిని ఎత్తి చూసినపుడు
వారికి దానిక్రింద పుష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు.
పుష్పాలన్నీ అపుడే కోసినట్లుగా తాజాగా ఉన్నాయి. హిందువులు తమ పుష్పాలను దహనం చేస్తే,
ముస్లిమ్స్ తమ పుష్పాలను సమాధి చేసారు.
ఓ!బాబా! అదేవిధంగా నీ మహాసమాధి వార్త కూడా షిరిడీ గ్రామంలో దావానలంలా వ్యాపించింది.
అపుడు ఆయన పార్ధివశరీరాన్ని ఆరుబయట పూడ్చిపెట్టి పైన సమాధి నిర్మించాలని
ముస్లిమ్స్ అన్నారు. కాని హిందూ భక్తులు గ్రామస్థులతో బాబా శరీరాన్ని వాడాలో తప్ప మరెక్కడా ఉంచడానికి
వీలులేదని అందరూ ముక్తకంఠంతో ఖరాఖండీగా చెప్పారు.
చివరికి నీ ప్రేరణవల్లనే అందరూ ఏకగ్రీవంగా
నీ శరీరాన్ని వాడాలోనే ఉంచడానికి నిర్ణయించారు. ఆ వాడానే ఇపుడు సమాధిమందిరంగా ప్రసిధ్ధి
చెందింది. ముస్లిమ్స్,
హిందువులు అందరూ ప్రతిరోజు అధిక సంఖ్యలో వచ్చి నీ చరణకమలాలకు నమస్కరించుకుని
మనశ్శాంతిని పొందుతున్నారు.
డా.సుభోధ్ అగర్వాల్, డెహ్రాడూన్
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment