23.12.2025 మంగళవారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం నాలుగవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 5 వ.భాగమ్
ఆ వృధ్ధుడికి గాని ఆ ఇంటిలోని వారెవరికీ ఆ ఫోటోలొ ఉన్నది సాయిబాబా అని తెలీదు. ఆ వృధ్ధుడు తన అక్కగారిని పిలిచాడు. ఆవిడకి 90 సంవత్సరాలుంటాయి. ఆవిడని పిలిచి ఆఫోటొ గురించిన వివరాలు అడిగాడు. ఆవిడ, “మా ఇంటికి ఎంతోమంది వస్తూ ఉండేవారు. కొద్దిరోజులు ఇక్కడ ఉండి వెడుతూ ఉండేవారు. అహ్మద్ నగర్ లో ఉండే మా దూరపు బంధువులలో ఒకామె కోడలికి ఈ ఫకీరంటే ఎంతో గాఢమైన నమ్మకం ఉండేది.
ఆమె తన వృధ్ధాప్యంలో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉండగానే ఆమె మరణించింది. ఈ ఫోటో ఆమె ట్రంకు పెట్టెలో దొరికింది. ఈ ఫకీరు మీద ఆమెకి ఎంతో నమ్మకం, భక్తి ఉండటం వల్ల నేను ఈ ఫొటోని మాత్రమే ఉంచి గోడమీద తగిలించాను. ఆమెకు సంబంధించిన మిగతా సామానంతా బయటివారికి ఇచ్చేశాము. ఇది జరిగి చాలా సంవత్సరాలయింది. ఈ విషయం నేనెవరికీ చెప్పలేదు. నన్నెవరూ అడగలేదు కూడా” అని వివరించింది.
ఆ కుటుంబంలోనివాళ్ళందరూ ఈ విషయం విని నోట మాటలేకుండా శిలా విగ్రహాల్లా నుంచుండి పోయారు.. అసలు ఊహించని ఆ ప్రదేశంలో సాయిబాబా మరొక్కసారి తన ఉనికిని చాటుకున్నారు. బాబా కనిపించిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము. ఈ సంఘటన కారణంగా మా నమ్మకం మరింతగా బలపడింది. ఇది రాస్తున్న సమయంలో నా హృదయంలో ఈ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. “నేనెక్కడికి వెళ్ళినా నా తోడు నువ్వే”. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో సాయి లేని ప్రదేశమే లేదు.
సాయి భక్తి అనేది మరే ఇతర భక్తి కన్నా భిన్నంగా కేవలం సాయిబాబా మందిరాలకు, ఆచారవ్యవహారాలకు మాత్రమే పరిమితం కాదు. అది సాయి భక్తులందరి హృదయాలలో గూడు కట్టుకొని ఉంటుంది. అది తనంతటతానుగా ఊహించని రీతిలో బయటపడుతుంది. సాయి భక్తులు కేవలం బాబా లీలలు ఆయన చేసిన చమత్కారాల గురించే మాట్లాడుకోరు. వారు బాబాతో తమకు కలిగిన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు క్షణకాలంలో జరిగిన దివ్యమయిన సంఘటనలను కూడా ఎంతో ఉద్వేగభరితంగా వివరిస్తూ ఉంటారు. సాయిబాబా మీద సాయిభక్తులకు ఉన్న నమ్మకం ధృఢమైనది. చెక్కుచెదరనిది.
అటువంటి అధ్భుతమయిన ఒక సంఘటన నా సన్నిహిత సనేహితురాలు వివరించింది. ఆమెలో ఎంతో ప్రగాఢమైన ఆధ్యాత్మికత నిండి ఉంది. ఆమె గొప్ప సాయి భక్తురాలు. ఆమె లండన్ లో ఉన్నపుడు ఒకరోజున ఒక ఫలహారశాలకు (రెస్టారెంట్) కు వెళ్ళింది. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆమెకు సాయిబాబాను చూడాలని మనసులో గాఢంగా అనిపించింది. ఏదోవిధంగా సాయి, దర్శనం ఇస్తాడనే భావంతొ ఉంది. కాని లండన్ లో సాయిబాబా మందిరాలు ఏమన్నా ఉంటాయా అని వింతగా ఆలోచిస్తూ ఉంది. అదే సమయంలో ఆమె కూర్చున్న రెండు మూడు బల్లల అవతల ఒక భారతీయ కుటుంబం వారు కూర్చొని ఉన్నారు. కొద్ది నిమిషాలలోనే అక్కడ కూర్చున్నవారిలో ఒకామె మొబైల్ మ్రోగింది. మసక వెలుతురులో ఆమె మొబైల్ తెర వెలిగింది. అందులో ఆమె తన మొబైల్ లో లాక్ స్క్రీన్ గా పెట్టుకున్న సాయిబాబా వారి ఫొటొ మెరుస్తూ కనిపించింది.
నా స్నేహితురాలికి ఎంతో సంతోషం కలిగింది. ఒక విదేశీ గడ్డపై ప్రశాంతంగా ఉన్న ఒక రెస్టారెంట్ లో తను సాయిబాబా గురించి ఆలోచించిన మరుక్షణమే సాయిబాబా దర్శనం కలగడం ఎంతో అధ్భుతం అనిపించింది. ఆమె ఎంతటి ఆనందాన్ని అనుభవించి ఉంటుందో సాయిభక్తులు మాత్రమే ఊహించుకోగలరు. “ఎక్కడయితే భక్తి ఉంటుందో అక్కడ సాయి ఉంటారు.”
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








0 comments:
Post a Comment