0712.2025 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
సంవత్సరంన్నర తరువాత తిరిగి మన బ్లాగులో శ్రీ సాయిబాబావారి లీలలను ప్రచురిస్తున్నాను
ఈ రోజు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక సెప్టెంబరు – అక్టోబరు 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ
మరాఠీలో ప్రచురింపబడిన దానికి ఆంగ్లానువాదం షమ్షాద్ మీర్జా
తెలుగు అనువాదంః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ
శ్రీ విఠల్ లక్ష్మన్ సుబంధ గారు సాయిబాబా వారికి భక్తులు. ఆయన 1931 వ.సం. డిసెంబరు 26 న వ్రాసిన ఉత్తరంలోని ముఖ్యాంశాలు.
“బాబావారి స్వహస్తాలతో పవిత్రమయిన ఊదీని మీరు నాకు పంపినందులకు నేను మీకెంతో కృతజ్ఞుడిని. ఊదీ శక్తికి ఈ ప్రపంచంలో మరేదీ సాటి రాదు.”
ఒక్కసారి సాయిమహరాజ్ ఎదుట నిలచి నిరంతరం వెలుగుతూ ఉండే బాబా ధునిలోని పవిత్రమయిన ఊదీని అందుకున్నవారు మాత్రమే పలికిన ఆ చిన్న పదాలలోనే వారి ప్రేమ, నమ్మకం,అసాధారణమయిన వ్యక్తీకరించలేని సత్యం బోధ పడతాయి.
మొట్టమొదటి దర్శనమ్…
అది 1910 వ.సం. సెప్టెంబరు 6 వ.తారీకు. ఈ రచయిత (రామచంద్ర ఆత్మారామ్ తర్ఖడ్) తన స్నేహితులతో కలిసి మొదటిసారిగా శ్రీ సాయిబాబాను దర్శించుకొన్నారు. షిరిడీలో మసీదులోకి అడుగు పెట్టగానే ఆయన హృదయంలో ఒక విధమయిన అనుభూతి చెలరేగింది. ఆ ఉద్విగ్న క్షణం వర్ణింపనలవి గానిది. తన ఆత్మకు, తన ప్రభువుకు కలిగిన ఆ మధురమయిన కలయిక జీవితాంతం ఒక గుర్తుగా మిగిలిపోతుంది.
అటువంటి అధ్బుతమయిన అనిర్విచనీయమయిన కలయిక అది. కేవలం ఆత్మతోనే అనుసంధానమయిన కలయిక.
షిరిడీలోని వాతావరణం ఆధ్యాత్మికతతో కూడిన విద్యుత్ తరంగాలతొ నిండిఉంటుంది. ప్రతిరోజు వివిధరకాలయిన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు బాబా, “వెళ్ళండి, ఊదీ తీసుకుని వెళ్ళండి. వాడాలో కూర్చోండి” అనేవారు.
ఆయన తరచుగా లేచి ధుని వద్దకు వెడుతూ ఉండేవారు. తన చేతితో ధునిలోని ఊదీని తీసి భక్తుల నుదుటి మీద ఎంతో ప్రేమతో పెట్టేవారు. ఆయన తన బొటనవ్రేలితో ఊదీని పెట్టినపుడు మిగిలిన నాలుగు వేళ్ల మీద అంటుకుని ఉన్న ఊదీ భక్తుల నుదుటి మీద బాబా వల్ల ప్రసాదించబడిన అనుగ్రహమా అన్నట్లుగా కిరణాలలాగా అంటుకునేది.
బాబావారి ఒక్కొక్క స్పర్శ నిశ్సంబ్దంగా సాగే ఒక ప్రార్ధన, వైద్యం, ఒక ఆశీర్వాదం.
భార్యయొక్క నమ్మకమ్ ---
1911 వ.సం. మార్చి నెలలో హోలీ పండుగ సెలవులలో రచయిత మరొక్కసారి షిరిడీకి వెడదామని నిర్ణయించుకున్నారు. ఆయన షిరిడీ బయలుదేరే ప్రయత్నంలో ఉండగా తన భార్య యొక్క విచారగ్రస్తమయిన వదనం చూశారు. ఆమెకు కూడా షిరిడీకి రావాలనే భావం ఆమె మొహంలో వ్యక్తమవుతోంది.
ఆయన ఎంతో మృదువుగా “నీకు కూడా నిజంగా సాయిబాబాను చూడాలని ఉందా?” అని అడిగారు.
షిరిడీలో తినడానికి సరైన ఆహారం, త్రాగడానికి నీరు ఉండదనీ, బహిరంగంగానే స్నానాలు చేయవలసి ఉంటుందని, పడుకోవడానికి కూడా తగిన వసతులు ఉండవని అన్నారు. అందువల్ల చాలా ఇబ్బందులు పడాల్సివస్తుందని ఆమెను హెచ్చరించారు. ఆమె భర్త చెప్పిన ఇబ్బందులనేమీ పట్టించుకోలేదు. ఆమె మనసులో సాయిబాబాను చూడాలనే కోరిక.
కేవలం ఒక చీర, జాకెట్టు, ఒక శాలువా, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆమె తన భర్తను అనుసరించింది. అది శరణాగతికి, ప్రేమకు, నిరాండబరత్వానికి చిహ్నం.
షిరిడీలో ఆమెకు కూడా బాబా తన స్వహస్తాలతో ఊదీని ప్రసాదించారు. ఆమె మరికాస్త ముందుకు బాబాకు దగ్గరగా వెళ్లగానే రచయిత యొక్క హృదయంలో ఆందోళన కలిగింది. బాబా ఆమెను మందలిస్తారా?
కాని బాబా ఆమెవయిపు ఎంతో ప్రేమగా చూస్తూ “నువ్విక్కడ ఇదే స్థితిలో ఉన్నావా?” అని అడిగారు.
ఆమే ఎంతో వినయంగా “బాబా నేను ఊదీ ద్వారా మీదో ఎంతో సన్నిహితంగా ఉన్నాను” అంది.
బాబా నవ్వి, “దీన్ని స్వీకరించు, ఊదీని జాగ్రత్తగా భద్రపరచుకో. అది నీ పిల్లలకి ఎంతగానో ఉపకరిస్తుంది” అన్నారు.
బాబా చిన్న కాగితంలో ఊదీని జాగ్రత్తగా చుట్టి, అనుగ్రహం అనే నాణెంతో దానిని కట్టి పవిత్రమయిన వారసత్వ చిహ్నంగా ఆమె చేతిలో పెట్టారు.
(ఇంకా ఉంది, రేపు ఊదీ - వైద్యం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








1 comments:
ఆట వెలది పద్యం
------------------------
రాము డన్న సాయిరాముడే గుర్తొచ్చు
భక్త జనుల మదికి ప్రబలి నేడు
కృష్ణు డనగ సాయికృష్ణుడే కనిపించు
సకల దేవత లుండు సాయి యందె .
Post a Comment