22.01.2026 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా మా ఇంటికి భోజనానికి రమ్మనగానే వచ్చారు
క్రిందటి వారం బాబా గారు మీ ఇంటికి కూడా వచ్చి ఉండవచ్చు ప్రచురించాను. మీరందరూ చదివే ఉంటారు.
ఈ రోజు బాబా మన ఇంటికి భోజనానికి వస్తారు అనగానే ఏ విధంగా వచ్చారో వివరిస్తాను. 2009 లేక 2010 సం> ఇదే బ్లాగులో ప్రచురించాను. టైటిల్ ఏమి పెట్టానో గుర్తు లేదు. కాని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మరలా నా స్వీయానుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను..త్యాగరాజు
బహుశ 2009 గాని 2010 సంవత్సరంలో అనుకుంటాను. ఆ రోజు గురువారం. నేను ఆఫీసుకు బయలుదేరేముందు ఉదయం తొమ్మిది గంటలకు భోజనం చేస్తున్నాను. నా భార్య పూజ చేసుకుంటూ శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసుకుంటోంది. తను గురువారము నాడు భోజనం చేయనని ఒక నియమం పెట్టుకుంది. అందుచేత నాకు ఒక్కడికే సరిపడా వంట చేసి బల్ల మీద పెట్టింది. నాకు సరిపడా అన్నం చిన్న గిన్నెతో వండింది.
నేను భోజనం చేస్తూ బాబా గారు ఇవాళ మనింటికి భోజనానికి వస్తారు అని అన్నాను. అపుడు నా భార్య ప్రతిరోజు మనం ఆయనకు నైవేద్యం పెట్టె తింటున్నాముగా, ఎందుకు వస్తారు అంది. నేను మొత్తం భోజనం చేస్తూ గిన్నె లోని అన్నం పూర్తిగా పెట్టేసుకుంటూ, ఈ రోజు బాబా గారు భోజనానికి వస్తే ఈవిడ ఏమి పెడుతుంది అని మనసులో అనుకున్నాను గాని పైకి చెప్పలేదు. కూరలతో సహా ఏమీ మిగలకుండా భోజనం చేసేసాను. గిన్నేలన్నీఖాళీ.
భోజనం పూర్తి అయ్యాక ఆఫీసుకు వెళ్ళిపోయాను. సాయంత్రం నేను ఆఫీసునుంచి వచ్చిన తరువాత నా భార్య ఆరోజు జరిగిన అధ్బుతమైన విషయం చెప్పెంది….అది వినగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. నా మనసులోని కోరికను బాబా ఆరోజునే అంత త్వరగా తీర్చినందుకు బాబా ఏమి నీలీల అని మనసులోనె ఆనందించాను. నా భార్య చెప్పిన వివరాలు…
ఆ రోజు ఉదయం పదకొండు గంటలవేళ మా ఇంటికి ఇద్దరు బ్రాహ్మలు వచ్చారు. హాలులో సోపాలో కూర్చొని వేదమంత్ర్రాలు చదివారు. ఆ తరువాత నాభార్యను, నీకు ప్రహ్లాదుడులాంటి మనవడు పుడతాడమ్మా అని దీవించారు. నా భార్య ఇద్దరికీ చెరొక పది రూపాయలు దక్షిణ ఇచ్చింది. అప్పుడు వారిద్దరూ ఇంకొక ఇరవై రూపాయలు ఇవ్వండి హోటల్ లో భోజనం చేస్తాము అన్నారు. నా భార్య ఇద్దరికీ మరలా చెరొక ఇరవై రూపాయలు దక్షిణ ఇచ్చింది. దక్షిణ తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయారు.
బాబా గారిని భోజనానికి రమ్మన్నాను. కాని ఇంటిలో ఆయనకు భోజనం పెట్టడానికి అప్పటికప్పుడు ఉంటేగా? మొత్తమంతా నేనే ఖాళీ చేసేసి బాబా గారు వస్తే ఈవిడ ఏమి పెడుతుంది అనుకున్నాను. కాని బాబా ఏమి చేసారు? నా ఇంటిలో భోజనం కుదరదు అని బాబాకు తెలుసుగా. అందుకనే మళ్ళీ మరికొంత మొత్తం తీసుకుని హోటల్ లో భోజనం చేస్తాము అన్నారు.
ఆవిధంగా బాబా నీ ఇంటిలో నువ్వు భోజనంపెట్టడానికి సిధ్ధంగా లేకపోయినా హోటల్ లో భోజనం చేస్తామనడం ఆయన భోజనానికి రావడమే కదా...
ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. మరి బాబా గారు ఒక్కరే కాక మరొకాయన కూడా వచ్చారు కదా అని? అది బాబా మనకు పెట్టిన పరీక్ష. మనం ఆయనను గుర్తించగలమా లేదా అని.
ఇప్పుడు మనము శ్రీ సాయి సత్ చరిత్రలోని 46 వ. అధ్యాయములోని ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకుందాము.
దేవుగారింట ఉద్యాపన వ్రతము…టూకీగా ఇస్తున్నాను.
శ్రీ బి.వి. దేవు గారు తన ఇంట ఉద్యాపన రోజున బాబాను భోజనానికి రమ్మని పిలుస్తూ షిరిడీలో ఉన్న బాపూ సాహెబ్ జోగ్ గారికి ఉత్తరం వ్రాసారు. జోగ్ బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించారు. అప్పుడు బాబా “నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషకరమయిన జవాబు వ్రాయుము” “నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము” అని అన్నారు. జోగ్ ఆవిధంగానే జాబు వ్రాసి దేవుగారికి పంపించారు. దేవుగారు ఎంతగానో సంతోషించారు. ఆ రోజు ఉద్యాపన రోజున దేవుగారింటికి 12 గంటలకు ఒక సన్యాసి (దేవుగారికి అంతకు ముందు పరిచయమయిన సన్యాసి) ఇద్దరు కుఱ్ఱవాళ్ళతో వచ్చి భోజనం చేసి వెళ్లారు. కాని దేవుగారు గ్రహించలేక బాబా గారు భోజనానికి వస్తానని రాలేదని మాట తప్పారని జోగ్ గారికి ఉత్తరం వ్రాసారు. అప్పుడు బాబా జోగ్ తో “వాగ్దానము చేసి దగా చేసితిని అనుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరయితిని . కాని నన్ను పోల్చుకోలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? అతని సంశయము తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని” అన్నారు. ఈ విషయాన్నంతా జోగ్ దేవుగారికి ఉత్తరం ద్వారా తెలియపరిచారు. ఆ ఉత్తరం చదివిన తరువాత దేవు గారు ఎంతో సంతోషించారు. ఆయన కళ్ళవెంట ఆనందభాష్పాలు రాలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాప పడ్డారు.
దీనిని బట్టి మనం గ్రహించుకోవలసింది, మన అంతరంగంలో బాబా మీద అచంచలమయిన నమ్మకం, ధృఢమయిన భక్తి ఉండాలే గాని ఆయన మన కోరికలను తీరుస్తారు. ఇటువంటి లీలలను ఆయన మనకు ప్రసాదించినపుడు ఆయన మీద మనకు మరింత భక్తి పెరుగుతుంది.
(తరువాత బాబా నాకు పాము గురించి పదే పదే ఎలా చెప్పారో వివరిస్తాను.)
బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయన వచ్చి భోజనం చేసిన సంఘటనను కూడా త్వరలో మరలా సాయి భక్తులందరికీ అందిస్తాను.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








1 comments:
ఒకప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అని భగవంతుడిని సాకారునిగా ఆరాధించే వారము. ఇప్పుడు వారిని త్రోసివేసి కొత్తదేవుళ్ళనే కొందరు ఆరాధిస్తున్నారు. ఆహా. కలిమాయ!
Post a Comment