06.01.2026 మంగళవారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఎనిమిదవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 8 వ.భాగమ్
శ్రీ సాయి సత్ చరిత్రలో ఎంతోమంది భక్తుల గురించి వివరింపబడింది. అయినప్పటికీ నేను ఈ భక్తులందరి గురించి క్లుప్తంగా పద్య రూపంలో చరణాలను రచిద్దామనే ప్రేరణ కలిగింది కొత్త తరంవారు వాటిని చదివినపుడు వారికి శ్రీ సాయి సత్ చరిత్రను చదవాలనే ఆసక్తి కలిగి సాయిభక్తి ఆరోజుల్లో ఎంత ప్రగాఢంగా ఉండేదో అర్ధం చేసుకొంటారు. నేను నాలో కలిగిన ఈ ఆలోచనని కొంతమంది సాయిభక్తులతో చర్చించినపుడు వారు నన్ను సాయి భక్తుల మీద పద్యాలు వ్రాయమని ప్రోత్సహించారు.
ప్రారంభంలో శ్రీ సాయి సత్ చరిత్రను ఆధారం చేసుకుని షిరిడీ శ్రీ సాయి మందిరంలో ఏ భక్తుల ఫొటోలయితే పెట్టబడి ఉన్నాయో వారి గురించి వ్రాయడానికి నిర్ణయించుకొన్నాను. ‘అమృతధార’, ‘సాయి గెజెట్’, డా.విన్ని గారి పుస్తకాలలో ప్రచురింపబడిన విషయాల ద్వారా సమాచారాన్ని సేకరించాను. ఆ విధంగా ‘శ్రీ సాయి భక్త స్తుతి’ పుస్తకం రూపు దిద్దుకుంది.
వీరందరూ నిజమయిన, స్వచ్చమయిన సాయి భక్తులు. వారు నవవిధ భక్తులను పూర్తిగా ఆచరణలో పెట్టి తమ శరీరాన్ని, మనస్సునూ, జీవితాన్ని సాయికి అంకితం చేసి తమ జీవితాలను ధన్యం చేసుకొన్నారు. వారు సాయి మీద భక్తి కోసం ఎంతగానో శ్రమించి తమ జీవితాన్ని త్యాగం చేశారు. అందువల్లనే వారి జీవితాలు మనకి ఆదర్శప్రాయం. ఒకవేళ అనుకోకుండా పొరబాటున ఏ సాయిభక్తుల పేర్లయినా మర్చిపోయి ఉంటే కనక వారి పాదాలకు నేను వినమ్రంగా క్షమాపణలు వేడుకొంటున్నాను.
సాయి భక్తులను ప్రశంసిస్తూ ఈ విషయాలను వ్రాస్తున్నపుడు భక్తులయొక్క నమ్మకం మరియు సాయిబాబా మీద ప్రేమ ఎల్లవేళలా ప్రతిబింబిస్తూ ఉంటాయి. శ్రీ సాయి సత్ చరిత్రలో చెప్పబడినట్లు “పద్యరచనలో వ్యాకరణ దోషాలతో పద్యాలు అంత బాగాలేకపోయినా, సంకల్పం స్వచ్చమయినది, భక్తి నిజమయినది అయితే సాయి వాటిని ఆమోదిస్తారు.” ఆ ఉత్సాహంతోనే నా ఈ సాయిభక్తి స్తుతి రచనను సాయి చరణాల వద్ద సమర్పిస్తున్నాను. ఇందులో నా కల్పితమయిన తెలివితేటలు ఏమీ లేవు. అంతా సాయి సద్గురువు ప్రేరణ మరియు సాయికి నేను చేసుకుంటున్న సేవ మాత్రమే.
ఆ విధంగా శ్రీ సాయిబాబా వారి కృపను పొందిన భక్తులలాగె మన భావాలు, మరియు సాయి మీద నమ్మకం మరింతగా బలీయమై ఆయన దయ, పాఠకులు, మరియు శ్రోతలందరి హృదయాలలోను పరిమళించు గాక అని ప్రార్ధిస్తాను. నేటి కొత్త తరానికి సాయిభక్తిని అంతర్గత శక్తిగా రూపొందించుకొని, ఆ జ్ఞానానికి విద్యార్ధులుగా రూపొందమని కోరుతున్నాను. ఆ విధంగా మీకు సద్గురు సాయిబాబా వారి అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది.
ఈ పుస్తకానికి ఐ ఎస్ బి ఎన్ సంఖ్య తప్పనిసరి కాబట్టి ప్రచురణ కర్త రచయిత పేరు కావాలన్నాడు. నా అహంకారాన్ని నియంత్రించుకునే ఉద్దేశ్యంతో నా పేరు ప్రచురించడానికి నేను ఇష్ట పడలేదు. మరునాడు ప్రచురణ కర్తను కలిసి సాయి నాలో ఏ పేరును ప్రేరేపిస్తారో దానినే చెబుదామని నిశ్చయించుకున్నాను. ఆ విధంగా మరుసటిరోజు నేను ప్రచురణ కర్తను కలవడానికి బయలుదేరుతూ ఇంటి బయటకు రాగానే ఇంటి ముందు నుంచి ఒక లారీ వెడుతోంది. దాని మీద ‘సాయిధాన్’ అని వ్రాయబడి ఉంది. బాబా సూచించినది ఆ పేరే అని గుర్తించి దానినే ప్రచురణ కర్తకి తెలిపాను. అతను కూడా ఆ పేరు బాగుందని అన్నాడు.
ఈ పుస్తకం సాయిభక్తులు వారియొక్క భక్తిని గురించి తెలుపుతుంది. వారియొక్క సాయిభక్తి నిజమయిన ధనం. ‘సాయి భక్తి స్తుతి’ పుస్తక రచనకు కేవలం నేను నిమిత్త మాత్రుడిని. అత్యంత వినయంతో శ్రీ సాయిబాబా వారి దివ్య చరణాలకు నా నమస్కారాలను తెలియచేసుకుంటున్నాను.
దినేష్ జుకర్
(సమాప్తం)
(తరువాతి సంచికలో నేను అనువాదం చేయడం మరచిన పవిత్రమయిన బాబా ఊదీ)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








0 comments:
Post a Comment