
30.07.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు తార్ఖడ్ కుటుంబంవారు, బాబావారిని తెండవ సారి కలుసుకున్న సంఘటను తెలుసుకుందాము.
బాబా సాహెబ్ తార్ఖడ్ తో కలిసి రెండవసారి కలయిక
సాయిబాబాతో అటువంటి అద్భుతమయిన పరిచయం కలిగిన అనుభూతితో, తల్లీ కొడుకులిద్దరూ కూడా వెంటనే యింటికి తిరిగి వచ్చి, మాతాతగారితో జరిగినదంతా యెప్పుడు చెబుదామా అని చాలా ఆత్రుతతో ఉన్నారు. యేమయినా సాయిబాబా మరికొద్ది రోజులు షిరిడీలో ఉండమని సూచించారు. వారు అందుకు వారి కోరికను మన్నించారు. భక్తులకి సహాయపడుతూ వారికి మార్గదర్శకులు సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి మాధవరావు దేశ్ పాడే గారితో వారు చర్చలు జరిపారు. ఉదయం బాబాగారు యెవరి కోసమో యెదురు చూస్తున్నారనీ, అడిగిన మీదట తన తల్లి సోదరుడు తనని కలుసుకోవడానికి వస్తున్నట్లుగా చెప్పారనీ మాథవరావు దేశ్ పాండే గారు చెప్పారు. మాథవరావు గారు, సామాన్యంగా భక్తులందరు అనుసరించేదేమిటంటే బాబాగారి అనుమతి తీసుకున్న తరువాతే షిరిడీ వదలి వెడతారని కూడా చెప్పారు. అప్పుడు వారు బాంద్రాలో ఉన్న బాబా సాహెబ్ గారికి, తాము అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతిని పొందామని అందుచేత షిరిడీలో యింకా ఉంటామని ఉత్తరం వ్రాశారు. అలా వారు షిరిడీలో వారం రోజులు ఉన్నారు. తరువాత వారు బాబాగారి వద్ద అనుమతి తీసుకుని మరలా బాబా సాహెబ్ తార్ఖడ్ గారితో తిరిగి వస్తామని మాట యిచ్చి, వారి స్వస్థలమైన బాంద్రాకు తిరిగి వచ్చారు.
వారు ఉన్న ఆ వారం రోజుల కాలంలో, మిగతా సాయి భక్తులయిన శ్రీ మహల్సాపతి, కాకా సాహెబ్ మహాజని, శ్యామా రావు జయకర్ మొదలైన వారినందరినీ కలుసుకున్నారు. వారు మొత్తం విషయమంతా మా తాతగారికి తెలియచెప్పి షిరిడీలోని శ్రీ సాయిబాబా మామూలు వ్యక్తి కాదని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయన మంచి మందులనివ్వడమే కాదు, ఆయనలోఅతీతమయిన శక్తులు కూడా ఉన్నాయని చెప్పారు. మా తాతగారు, మా అమ్మమ్మగారి మనోభావాలని చాలా తేలికగా తీసుకున్నారు. కాని వీటినే మా నాన్నగారినుంచి విని కొంచెం ఆశ్చర్యపోయారు. ఆయనకి తాము మరలా తరువాత షిరిడీ వచ్చేటప్పుడు బాబా సాహెబ్ తో వస్తామని చెపినట్లుగా కూడా, తెలియచేశారు.
ప్రియమైన పాఠకులారా, నేను గట్టిగా నమ్మేదేమిటంటే, బాబా సాహెబ్ గారు కూడా శ్రీ సాయిబాబా గారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అందుచేత ఈ కాలంలో ఆయన తన స్నేహితులయిన శ్రీ షాంరావ్ వ్ జయకర్, శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్, జస్టిస్ థురంథర్ గారిని కలుసుకుని వారందరూ కూడా సాయి భక్తులని తెలుసుకున్నారు. ఆఖరికి మా తాతగారు షిరిడీకి కుటుంబంతో ఒక విలాస యాత్రగా వెళ్ళడానికి అంగీకరించారు. ఆయన చాలా తీరిక లేని వ్యక్తి కాబట్టి ఉద్యోగానికి శలవు పెట్టి వెళ్ళడం కష్టం. అందుచేత, శుక్రవారం నష్ట పోకుండా, వారాంతంలో శుక్రవారం రాత్రి తన స్నేహితులతో సహా వెడదామని నిర్ణయించుకున్నారు.
వారు మన్మాడ్ కి, రాత్రి రైలులో ప్రయాణిస్తున్నారు. మా నాన్నగారు, అమ్మమ్మగారు పక్కలు పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మగవాళ్ళందరూ పేకాటలో మునిగిపోయారు. రైలు నాసిక్ రోడ్ స్టేషన్ ని వదిలింది. తల చుట్టూ తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక ఫకీర్ పెట్టెలోకి ప్రవేశించాడు. అతను మా తాతగారి వద్దకు వచ్చి థర్మం చేయమని అడిగాడు. మా తాతగారు అతనివైపు చూసి, అతని స్థితికి జాలి పడ్డారు. అయన ఒక రూపాయి వెండి నాణెం తీసి, అతనికిచ్చి వెళ్ళిపొమ్మని చెప్పారు. ఫకీరు తన దృష్టిని ఆ రూపాయి నాణెం మీదకి మళ్ళించారు. యెందుకంటే ఆ రోజుల్లో ఒక రూపాయి దానం చేయడమంటే అది చాలా పెద్ద మొత్తం. యిక్కడ నేను పాఠకులకి చెప్పదలచుకునేదేమిటంటే మా తాతగారు ఖటావు గ్రూప్ ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీ, యింకా 1908 సంవత్సరంలో ఆయనకి నెలకి జీతం రూ.2,000/-. ఆయన ఆ ఫకీరుతో 5 వ జార్జ్ బొమ్మతో ముద్రించబడి విడుదల చేయబడ్డ ఆనాణెం అసలయినదేననీ అది 1905 లో చలామణిలోకి వచ్చిందనీ, , అందుచేత దాని గురించి యేవిథమయిన భయం అక్కరలేదని చెప్పారు. తమ పేకాటకి అంతరాయం కలుగుతోండటంవల్ల అతనిని అక్కడినుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. అప్పుడాఫకీరు వెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయానికి వారు షిరిడీ చేరుకున్నారు. మా అమ్మమ్మగారు, నాన్నగారు, వారికా ప్రదేశం బాగా తెలిసింది కాబట్టి మా తాతగారికి దారి చూపించారు. వారు స్నానాలు కానిచ్చి, ఫలహారం తీసుకున్నారు. తరువాత పూజా సామాగ్రితో ద్వారకామాయిలోకి ప్రవేశించారు. మా నాన్నగారు, అమ్మమ్మగారు, బాబా కి వంగి నమస్కరించి వారి పాదాలను స్పృశించారు.

బాబా అపుడు వారివైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, మా తాతగారివైపు తిరిగి, "మ్హతర్య ' (ముసలివాడా) నా తల్లి, సోదరుడు నిన్ను వేడుకుని తరవాత నిన్ను ఒప్పించడంతో వారి ప్రోద్బలంతో నువ్వు షిరిడీ రావడానికి అంగీకరించావు నువ్వు నన్ను గుర్తించావా?" అన్నారు బాబా. మా తాతగారు లేదన్నట్లుగా చెప్పారు. ఆపుడు బాబా తన చేతిని కఫ్నీ జేబులో పెట్టి ఐదవ జార్జ్ బొమ్మ ఉన్న ఒక రూపాయి వెండినాణాన్ని బయటకు తీశారు. దానిని మా తాతగారికి చూపిస్తూ "కనీసం, నిన్న రాత్రి నువ్విచ్చిన దీనినైనా గుర్తిస్తావా?" అన్నారు. యిప్పుడు మా తాతగారు క్రితం రాత్రి రైలులో జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆయన తిరిగి యేదయినా చేప్పేలోపే బాబా ఆయంతో "ఏయ్ ! రాత్రి నువ్వు చూసిన ఫకీరు నేను తప్ప మరెవరూ కాదు" అన్నారు. బాబా సాహెబ్ తక్షణమే దు ఖంలో మునిగిపోయారు. ఆయన తన తప్పుని తెలుకున్నారు. బాబాని ఒక యాచకుడిగా భావించారు. రాత్రి తను చేసిన పనికి చాలా విచారించారు. ఆయన బాబా ముందు వంగి క్షమించమని అడిగారు. జ్యోతీంద్ర మరియు తన భార్య బాబాగారి గురించి చెప్పినది నూటికి నూరు శాతం నిజమని తెలుసుకున్నారు. పైగా, బాబా గారు సామాన్య వ్యక్తి కాదు నిజం చెప్పాలంటే ఆయన "భగవంతుని దూత" అనుకున్నారు.

ఈ సంఘటన తరువాత బాబ సాహెబ్ తార్ఖడ్ గారిలో అపూర్వమైన పరిణామం సంభవించింది. ఆయన యిక ప్రార్థనా సమాజ్ వాది కాదు. ఆయన బాబా మీద ఆథ్యాత్మికమయిన ప్రేమని పెంపొందించుకున్నారు. బాబాతో చర్చించిన తరువాతే ఆయన ముఖ్యమయిన నిర్ణయాలను తీసుకోవడం మొదలు పెట్టారు. బాబా గారు కఫ్నీలు కుట్టించుకోవడానికి బట్టల తానులు పంపడం మొదలుపెట్టారు.
రాత్రి వేళల్లో ద్వారకాయాయిలో వెలిగంచడానికి పెట్రొమాక్స్ లైట్లు కూడా పంపించారు. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడెల్లా సాయంత్రం వేళల్లో వాటిని వెలిగిస్తూ ఉండేవారు. ద్వారకామాయిలో నిర్ణయించిన ప్రదేశాల్లో వాటిని వేళ్ళాడదీస్తూ ఉండేవారు. దీనిని గురించిన ఒక ఆసక్తికరమయిన విషయం ఉంది, దానిని తరువాత వివరిస్తాను.
ప్రియ పాఠకులారా, ఈ రీతిగా తార్ఖడ్ కుటుంబంలోని ముగ్గురికి షిరిడీ సాయిబాబావారితో అనుబంథం యేర్పడింది. నిజానికి ఒక శక్తివంతమైన అయస్కాంతంలాగా బాబా, వారిని తమవైపుకు లాక్కున్నారు. వారందరూ కుడా బాబా మీద అమితమైన ప్రేమని పెంపొందించుకున్నారు. వారికి అనుభవాలు కలుగుతున్నాయన్న సామాన్యమయిన కారణంతో వారి షిరిడీ దర్శనాలు యెక్కువయాయి. వారి స్వభావానికి అవి అద్వితీయం. అవి లీలలు తప్ప మరేమీ కావు. అవే వారికి సాయి బాబా భగవంతుని అవతారం అని యెలియచేశాయి. నేను మీకు ఈ అనుభవాలన్నిటినీ చెప్పబోతున్నాను. వాటిని చదివిన తరువాత మీరు కూడా నాతో యేకీభవిస్తారని నాకు తెలుసు.
బాబా ఆ ఒక రూపాయి వెండినాణాన్ని మా తాతగారికి తిరిగి యిచ్చి, "ముసలివాడా! నీ నాణాన్ని నీకు తిరిగి యిస్తున్నాను.దీనినే నువ్వు పూజించు, నీ సంకల్పం నీకు ఫలవంతమయిన జీవితాన్నిస్తుంది. నన్ను నమ్మండి. ఈ పవిత్రమయిన ద్వారకామాయిలో నేనెప్పుడూ అబథ్థం చెప్పను" అన్నారు. ఆ విథంగా బాబా మా తాతగారిని "మ్హతారయా" అనీ మా నాన్నగారిని "భావూ" అని సంబోథించి, తరువాత జరిగే అన్ని సంభాషణలలో కూడా అదే విథంగా కొనసాగిస్తూ ఉండేవారు.
(తరువాయి భాగంలో బాబాగారి శాండల్ వుడ్ మందిరం)
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment