01.09.2011 గురువారము
సచ్చరిత్ర - మన సమస్యలకు సమాథానం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు సేకరించి పంపిన జ్యోతి గారి బాబా అనుభవాన్ని తెలుసుకుందాము.
గతకొద్ది సంవత్సరాలుగా సాయిబాబా నాకు యెన్నోవిథాలుగా రక్షకుడిగా ఉన్నారు. జరిగిన కష్టాలన్నిటినీ యింత సులభంగా దాటగలనని అనుకోలేదు. ఎన్నో విషయాలని నేనర్ధం చేసుకునేలా చేసినందుకు, నా జీవితంలో సమాథానం లేని ప్రశ్నలకు కూడా సమాథాన్నిచ్చిన లార్డ్ సాయిబాబా కి నేనెల్లప్పుడూ కృతజ్ఞురాలిని. నాచుట్టూ ప్రతీక్షణం ఆయన ఉన్నాడనే అనుభూతిని చెందుతూ ఉంటాను.
బాబా నా జీవితంలోకి మా నాన్నగారి ద్వారా వచ్చారు. మానాన్నగారు జీవితాంతమూ యెదురు తిరిగే స్వభావంతోనే ఉన్నారు, కాని 1984 లో ఆయనకు షిరిడీలో ఒక వారం పైగా ఉండే అవకాశం వచ్చింది. ఆయనక్కడ ఒక ప్రాజెక్ట్ నిమిత్తమై ఉన్నారు. నా బాబాని సజీవంగా చూసినవాళ్ళని కొంతమందిని ఆయన కలుసుకోవలసి వచ్చింది. మా నాన్నగారు బాబాని పూజించనప్పటికీ, ఎలాగో బాబాని మా జీవితంలోకి తీసుకొచ్చారు. ఒకసారి సాయి మాయింటికి వచ్చారు, ఆయన యింక యెప్పటికీ వెళ్ళలేదు. నేనందరినీ పూజిస్తున్నప్పటికీ, నేను కాలేజీ లో ఉన్నత విద్య చదువుతున్నప్పటికి గాని బాబా గొప్ప తనాన్ని తెలుసుకోలేకపోయాను.
అనుభవం :: 1
2004 లో నేను ఎం.బీ.ఎ. చదువుతున్నాను. ఆ సంవత్సరం మా బాచ్ చాలా ఆలశ్యంగా చేరడంవల్ల, మొదటి సెమిస్టర్లో 16 పేపర్లకి పరీక్ష రాయవలసి వచ్చింది. ఒక్క నెల సమయంలో 16 సబ్జెక్ట్స్ కి పరీక్షకి తయారవడమంటే ఎలాగో మీరే ఊహించుకోండి. నేనప్పుడు శ్రథ్థ గలదాన్ని కాదు. నిజానికి నేను (సరాసరి మార్కులు) యావరేజ్ విద్యార్థినిని. అయినప్పటికీ నేను చదవడానికి చాలా కష్టపడ్డాను. నేనంతగా కేంద్రీకరించలేకపోయాను. విషయాలు గుర్తు పెట్టుకోవడం నాకు చాలా కష్టం. అది కష్టమైన పరిస్థితి. ఒక పేపరుకన్నా యెక్కువే నేను తప్పుతాననే భావం నాలో ఉంది. నేను ఏడిచాను .. ఏడిచాను... ఫలితాన్ని గురించి నాకు చాలా భయం వేసింది.
శ్రీ సాయి సచ్చరిత్ర గొప్పతనాన్ని గురించి యెంతో మా అమ్మగారి ద్వారా వినడం వల్ల, ఫలితం గురించి బాబా ని అడుగుదామని నిర్ణయించుకున్నాను. నేనాయనను ప్రార్థించి జవాబిమ్మని అర్థించాను. చూడకుండా గుడ్డిగా సచ్చరిత్రలో ని ఒక పేజీతెరచి చూశాను. అది 29వ అథ్యాయం, అది టెండూల్కర్ కుమారుడి కుటుంబం గురించి వారి అబ్బాయి పరీక్షా ఫలితం గురించి అతను పరీక్ష తప్పుతాడనే భయంతో ఉండటం గురించినది. బాబా అతని తల్లితో అంటారు, "అతనిని ప్రశాంతంగా పరీక్షకు తయారవనీ, అతనీ సంవత్సరం తప్పక ఉత్తిర్ణుడవుతాడు. నామీద నమ్మకం ఉంచమని చెప్పు, నిరాశ చెందవద్దని చెప్పు." ఇది చదివాక నాకు ప్రశాంతత లభించింది, 16 పేపర్ల లోనూ పాసవుతాననే నమ్మకంతో పరీక్షా గదిలోకి వెళ్ళాను, అన్నిటిలోనూ ఉత్తీర్ణురాలినయ్యాను. ఆని సబ్జెక్ట్స్ లోనూ నూ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి.ఇది నాలో సాయి మీద ఒక కొత్త మక్కువని కలిగించింది, అప్పటినించి నా నమ్మకం యెప్పుడు సడలలేదు.
అనుభవం :: 2
2004 సంవత్సరంలో మా అమ్మగారికి కాన్సర్ అని నిర్థారణ అయింది, బాబా దయవల్ల యెలాగో తగ్గింది. కాని మరలా 2010 కాన్సర్ మళ్ళి రావడంతో నేను చాలాభంగపడిపోయాను. . ఆమె వయసు 50 సంవత్సరాలయినప్పటికీ నేనావిడని పోగొట్టుకోదలచుకోలేదు. వైద్యులు ఒకదాని తరవాత మరొకటి విచారకర వార్తలను చెపుతున్నారు, నయం చేయడం అంత సులభం కాదనీ దేనికైనా సిథ్థంగా ఉండాలనీ చెప్పారు. ఏది మంచిదో బాబా అదే చేస్తారని నాకు తెలుసు. వ్యాథి నిర్థారణ చేసిన కొన్ని వారాల తరువాత, ఆవిడ కాన్సరు మొదట అనుకున్నత ప్రమాదకరమైనది కాదనీ అది నయమవుతుందనీ మాకు తెలిసింది. యిదంతా బాబా దయ వల్లే జరిగింది. ఆవిడ వైద్యం చేయించుకుంటొంది, లక్షణాలు తగ్గుతున్నాయి. ఈమథ్యనే మేము షిరిడీ యాత్రకు కూడా వెళ్ళాము, అక్కడ ద్వారకామాయిలో, బాబా మరలా నా కళ్ళు తెరిపించి నాకు సమాథానాలనిచ్చారు. బాబా ద్వారకామాయిలో నివసించేవారని మీకందరికీ తెలుసును, అది రాత్రి పొద్దుపోయేదాకా తెరిచే ఉంటుంది. భక్తులందరూ అక్కడకి వెళ్ళి కూర్చుని అక్కడి శక్తిని అనుభవిస్తారు. నేను మా అమ్మగారు అక్కడ సచ్చరిత్రను చదవడానికి వెళ్ళాము. మా అమ్మగారు మసీదుకు ముందరి మెట్టువద్ద కూర్చుని చదువుతున్నారు. నేను నేలమీద కూర్చుని బాబా ఇంకా అక్కడే ఉన్నారనీ తనపిల్లలైన మమ్మలనందరినీ చూస్తున్నారనీ ఊహించుకుంటూ తదేకంగా లోపలకు చూస్తున్నాను. నేను ప్రార్థించి సచ్చరిత్రలోని నాకు తోచిన పేజీ తీశాను, అది 22 వ అథ్యాయం. అందులో బాబా బాలా సాహెబ్ మిరికర్ గారితో చెపుతారు, "నువ్వు కూర్చున్నది మన ద్వారకామాయి, ఆమె ఒడిలో ఉన్న తనబిడ్డల అన్ని ప్రమాదాలనీ, ఆందోళనలనీ తొలగించి వేస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయ గలది. సామాన్య భక్తులకి ఆమె తల్లి. ఆమె అన్ని కష్టాలనుండి రక్షిస్తుంది. ఆమె ఒడిలో కూర్చున్నవాడి కష్టాలన్ని తొలగిపోతాయి. ఆమె నీడలో సేద తీరినవాడికి అనుగ్రహం లభిస్తుంది." యిది నేను ద్వారకామాయిలో ఉన్నప్పుడు జరిగింది. ఆయన బాపూ సాహెబ్ బూటీతో కూడా చెప్పారు, "నానా ఏమిటి చెపుతున్నాడు? నీ చావుగురించి భవిష్యత్తు చెపుతున్నాడా. బాగుంది, నువ్వు భయపడనవసరం లేదు. అతనితో ధైర్యంగా చెప్పు, "చావు యెలా వస్తుందో చూద్దాము." నాకు చాలా సంతోషం వేసి ఉపశమనం పొందాను. నేను ఏడిచాను. నేను కన్నీటిని ఆపుకోలేకపోయాను. బాబా నాకు కావలసిన సమాథానాలనన్నిటినీ యిచ్చారు. ఆయనెప్పుడూ అనుమానాలకు తావివ్వరు. యదార్థంగా మా అమ్మగారికి నయమవుతుందని నాకు తెలుసు, అది వైద్యుల వల్లకాదు, మందుల వల్ల కాదు, నా బాబా దయ వల్లనె. నాకు బాబా అంటే ఇష్టం. అందరికి వారి జీవితంలో ఉన్నట్లుగానే నాకూ సమస్యలున్నాయి, కాని వాటినెదుర్కోవడానికి ఏదోవిథంగా బాబా నాపక్కన ఉంటారు.
సాయి బంథువులారా బాబా లీలని చదివారుగా. ఇందులో జ్యోతి గారు ఒక యావరేజీ విథార్థిని. కేవలం ఒక్క నెలలో 16 సబ్జెక్ట్స్ చదివి పరీక్ష రాయడమంటే మాటలుకాదు. కాని ఆమె సమస్యకు తగినట్లుగా 29 వ అథ్యాయం రావడం అది టెండుల్కర్ కుమారుడి పరీక్ష గురించి రావడం కేవలం యాదృచ్చికం కాదు, అది ఆమె సమస్యకు బాబా యిచ్చిన సమాథానం. ఆ సమాథానంతోనే ఆమె పరీక్షలో మొత్తం అన్నీ కూడా అదీ మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలవడం అంతా బాబా అనుగ్రహం. యిక్కడ మనమొకటి గుర్తుంచుకోవాలి. బాబా సహాయం చేస్తారు కదా అని అసలు చదవకుండా పరీక్షకు వెళ్ళామనుకోండి అప్పుడు వచ్చేది సున్నా మార్కులే. యిక్కడ జ్యోతిగారికి ఆ అథ్యాయం లో ఉన్నది చదవగానే ధైర్యం వచ్చింది. కష్టపడి చదివారు. కాని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా చదవడం యెవరికీ సాథ్యం కాదు. ఆమె చదువుకున్నవే పరీక్షలో వచ్చేటట్లుగా బాబా గారు ఏర్పాటు చేసి ఉండవచ్చు. చదివినవి కూడా మరచిపోకుండా గుర్తుండేటట్లుగా చేసి ఉండవచ్చు. అందుచేత అచంచలమైన విశ్వాసంతో మనం కృషి చేస్తే బాబా తప్పకుండా సహాయం చేస్తారని దీనిని బట్టి మనకు తెలుస్తోంది. ప్రయత్నం చెయ్యి ఫలితాన్ని ఆయనకి వదలి వెయ్యి. నిశ్చింతగా ఉండు. ధైర్యంగా ఉండు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment