20.02.2012 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 31వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (31)
29.10.1994
నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో చెప్పబడే "ఆత్మ" గురించి తెలియచేయమని కోరుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు. ఆత్మకు రూపము లేదు. భగవంతునికి రూపము లేదు. అందుచేత ఆత్మ భగవత్ స్వరూపము. ఈ రూపము లేని భగవంతుని గురించి ఆలోచించటము, పూజించటము కష్టమైన పని. అందుచేత భగవంతునికి నీకు యిష్టమైన ఆకారము (నీ యిష్టదైవము) లో ఊహించుకొని పూజించటము ఉతమమైన పధ్ధతి. శ్రీ ఆంజనేయుడు తన గుండెలను చీల్చినపుడు అతని ఆత్మ అతని యిష్టదైవము అయిన శ్రీరామ చంద్రుని రూపములో కనిపించినది.
ఈ ఆత్మ శరీరాన్ని వదలినపుడు తన గురువు చేతిని పట్టుకొని పవిత్ర నదిపై (నీటిపై) నడవగలుగుతుంది. నీరు ఆ రూపానికి అంటుకోదు. ఆత్మ నీటిలో మునిగిపోదు.
ఆత్మ నీ గురువు సహాయముతో ఒక పెద్ద కొండ శిఖరము పైకి చేరుతుంది. అక్కడనుండి ఆత్మ తన గత జన్మలోని మనుషులను ప్రదేశాలను చూస్తుంది. ఆకొండ మీద నుండి ఆకాశము (విశ్వము) లోనికి నడవమని గురువు చెబుతారు. ఆపర్వతము పైనుండి ముందుకు ప్రయాణము చేయగలిగిన ఆత్మ పరమాత్మలో ఐక్యమగుతుంది. భయపడి వెనక్కి అడుగువేసినా తిరిగి పునర్జన్మ ఎత్తుతుంది. ఒక్కసారి నిద్రనుండి ములుకువ వచ్చినది. ఆలోచించినాను. జన్మ పునర్జన్మల్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఆత్మ యొక్క స్వరూపము శ్రీ సాయి కళ్ళకు కట్టినట్లుగా చూపించినారు. శ్రీ సాయికి నమస్కరించినాను.
30.10.1994
నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "మనసు" గురించి విషయాలు తెలియచేయమని కోరుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు. "నేను నా జీవిత యాత్ర కాకినాడ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించినాను. సర్పవరము స్టేషన్ లో రైలు ఆగినది. ఆ స్టేషన్ లో ఒక స్త్రీతో వివాహము జరిగినది. రైలు సామర్లకోట స్టేషనుకు వచ్చినది. కొంతమంది స్నేహితులు అఱచేతిలో స్వర్గము చూపించి నాద్గ్గర ఉన్న డబ్బు గుంజుకొనుచున్నారు. సామర్లకోట స్టేషన్లో ధనముతో అన్ని కోరికలు తీర్చుకోవటానికి చాలా దుకాణాలు ఉన్నాయి. నేను నాభార్య కలసి యింకొక రైలు ఎక్కవలసి యున్నది. నా భార్య యిప్పుడు ఆ రైలు ఎక్కవద్దు, యింకా నేను చాలా వస్తువులు యిక్కడ కొనాలి అని వచ్చిన రైలును ఎక్కనీయలేదు. ఆ రైలు వెళ్ళిపోయినది. నేను నాభార్య సామర్లకోట స్టేషన్ ప్లాట్ ఫారం మీద సామానులు కొంటూ రోజులు గడిపి వేయసాగినాము. ఆ ప్లాట్ ఫారం మీదనే మానసిక కోరికలు, శారీరక కోరికలు తీర్చుకొని ప్లాట్ ఫారం మీద బంజారా జాతి ప్రజలలాగ జీవితము గడపసాగినాము. ఈవిధమైన జీవితములో మేము యిద్దరము మాకు యిద్దరు అనే ఆలోచనలతో మాకు యిద్దరు పిల్లలు కలిగినారు. ఆప్లాట్ ఫారం మీద మా జీవితాన్ని దూరంగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహము చూస్తూ నవ్వుచున్నది. ఆ విగ్రహము నన్ను చూస్తూ నవ్వుతుంటే నాలో కోపము కలిగినది. ఉలిక్కిపడి నిద్రనుండి లేచినాను. ఈవిధమైన కలద్వారా శ్రీ సాయి యిచ్చిన సందేశము ఏమిటి అని ఆలోచించినాను. నాకు తోచిన ఆలోచనలు 1) జీవితము ఒక రైలు ప్రయాణము వంటిది. 2) మనసు ఈ ప్రయాణములో మనకు మనతోటి ప్రయాణీకుల మధ్య వారధిగా ఉంటుంది. 3) తోటి ప్రయాణీకులతో కలసిమెలసి యుండటానికి మనసు మనలను కోరికల సుడిగుండములో పడవేస్తుంది. 4) ఈ కోరికల సుడిగుండమునుండి బయట పడటానికి సాయి (పొట్టి శ్రీరాములు) సహాయము కోరాలి.
31.10.1994
నిన్నటిరోజున జీవితములో "మనసు" ను తెలుసుకొనే మార్గము గురించి ఆలోచించుతు రాత్రి నిద్ర పోయినాను. శ్రీ సాయి కలలో చూపించిన దృశ్యాల సారాంశము.
"మనసు కోరికల పుట్ట. మనసును విచ్చల విడిగా వదలరాదు. మనసును క్రమశిక్షణలోనే యుంచాలి. అపుడు అది సరీయిన మార్గములో ప్రయాణించుతుంది. మనసు గురించ్ తెలుసుకోవాలి అంటే జీవితములో ఎల్లపుడు మంచి ఆలోచనలను ఆహ్వానించుతు ఉండాలి. అటువంటి ఆలోచనలనుండి ఉన్నతమైన ఆలోచనలను మనము ఎన్నుకొని వాటిని మనజీవిత లక్ష్యముగా ఏర్పరుచుకోవాలి. ఈవిధమైన జీవిత లక్ష్యాన్ని సాధించటము అంటే మన "మనసును" మనము తెలుసుకోవటము.
నీ జీవిత లక్ష్యాన్ని సాధించటానికి నీ మనసులో క్రోధాన్ని రానీయవద్దు. మనసులో క్రోధము జనించితే నీ మనసు నిన్ను జీవిత లక్ష్యాన్నుండి ప్రక్కకు తొలగించి నిన్ను పాతాళములో త్రోసివేస్తుంది.
అందుచేత మనము మన మనసును మంచి మార్గములోనే యుంచాలి. ఆమార్గము గురించే తెలుసుకోవాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment